వంటకీయం “ (సింగిల్ పేజీ కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(31/7/2026 లహరి సాహితీవేదిక లో నా కథ )
అలివేణి వంటలు వండుతుంటే, ఏ పనీ లేని అప్పలరాజు వెనకే వేలాడుతూ ఉంటాడు. రిటైరయ్యాక అతనికి కాలక్షేపం అనే మాటే మాయమైంది.
“కాస్త అల్లం కూడా వేస్తే బాగుంటుంది. పోపులో ముక్కలు డైరెక్ట్‌గా వేయద్దు. ఉడికిన ముక్కల మీద చివర్లో పోపు వేస్తే కరకరలాడుతుంది. పచ్చిమిరపకాయలు కేజీ రెండొందలు! ఏరిపారేసేదే కదా… గ్రైండర్లో నూరేసి పోపులో వేసేయి. కారం సమంగా అంటుతుంది. వంట అందరూ చేస్తారు. రుచిగా, పొదుపుగా చేయగలగాలి…”అని సలహాల జల్లులు కురిపిస్తూ ఉంటే , అలివేణికి ఒళ్లంతా కారం రాసుకున్నట్టే ఉంటుంది.
“మహానుభావా! ఆ చిట్కాలన్నీ నాకు తెలియనివి కావు. రోజూ మీ కంచం దగ్గరకు అన్నీ వచ్చి చేరుతున్నాయంటే సంతోషించండి,”అని విసుక్కోవడం ఆమెకు కొత్త కాదు.
ఒక రోజు మాత్రం అదుపు తప్పింది.
“ఈ రోజు వంట నాకొదిలేయ్! ఎప్పుడైనా కొత్త రుచులు ట్రై చేద్దాం అనుకుంటే నువ్వు గబ్బిలంలా వంటింట్లోనే వేలాడుతుంటావు…”అంటూ అతని అసహనం బయటపడింది .
ఏం చేస్తాడు పాపం? పేపర్ చదవబుద్ధి కాదు. రాజకీయాలు చూస్తే బురదజల్లులే. టీవీలో అర్థంపర్ధం లేని సీరియల్స్. చివరికి వంటిల్లే అతని యుద్ధభూమి.
“నాకు కాలు విరిగినప్పుడు మీ చేత వండించి తిన్న వంటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఉప్పూ కారం లేని కూరలు, ఉడికీ ఉడకని ముక్కలు… అప్పుడు మంచంపై ఉన్నాను కాబట్టి జాలిపడ్డాను. ఇప్పుడు బాగున్నాను కదా. నేను చేసిన వంటలు ఎంజాయ్ చేస్తూ తినండి ..”
అంటూ అలివేణి అతన్ని వంటింట్లోకి రానీయకుండా చూస్తోంది.
అయినా అప్పలరాజు ఊరుకోడు. తనకూ పాకశాస్త్ర ప్రావీణ్యం ఉందని నిరూపించుకోవాలన్న తాపత్రయం అతన్ని వదలడం లేదు .
ఆ రోజు అనుకోకుండా అలివేణికి తీవ్రమైన నడుం నొప్పితో మంచమ్మీద నుండి లేవలేని పరిస్థితి. ఇదే అదనుగా అప్పలరాజు వంటింట్లోకి దూకాడు.
“అదెక్కడ పెట్టావ్? ఇది ఎక్కడుంది? ఏదీ కనపడనీయకుండా దాచేస్తావు!”
అంటూ వంటింట్లోంచి అరుపులు.
మంచం మీద నుంచే అలివేణి సహనంగా సమాధానాలు ఇస్తోంది.
దానికి ఊరుకోకుండా అప్పలరాజు వాక్భాణాలు విసరడం మొదలుపెట్టాడు.
“ఆడవాళ్లకు వంటగది గుండెకాయ అంటారు ఊరికే కాదు. అత్తాకోడళ్ల యుద్ధాలే కాదు… మొగుడు–పెళ్లాల మధ్య కూడా!”
“మొన్న మీరు తెచ్చిన పచ్చ బామ్ నడుంకి పట్టించాను. ఇప్పుడు కొంచెం సద్దుకుంది. మీకు ఏది ఎక్కడుందో చెప్పే కన్నా, ముక్కుతూ మూలుగుతూనైనా నా వంట నేనే చేసుకుంటా,”
అంటూ వెనక నిలబడిన భార్యను చూసి అప్పలరాజు ఉలిక్కిపడ్డాడు.
“చేయగలవా మరి? పోపు సామాన్లు ఒకే చోట ఉంటే ఈ పాటికి వంట అయిపోయేది,”
అని బలహీనంగా అంటున్న భర్తను చూసి, పోయిన తన రాజ్యాన్ని తిరిగి ఆక్రమించుకున్న రాణిలా, అలివేణి విజయగర్వంతో చూసింది *******