తత్వం బోధపడింది (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(28 జూలై 2026 ఉషా అంతర్జాల పత్రికలో ప్రచురించిన నా కథ )
శివకోటి- సుబ్బారావు భార్య తరపు దూరపు బంధువు అవుతాడు. ఆ ఊళ్లోనే ఏదో పెద్ద ఆసుపత్రిలో కాంపౌండర్గా పని చేస్తున్నాడుట . ఎలా తెలుసుకున్నాడో అడ్రసు పట్టుకుని ఇంటికి వచ్చాడు.
సుబ్బారావు భార్య కృష్ణవేణిని “అక్కయ్యా ” అంటూ చనువుగా పిలిచేవాడు. వాళ్లిద్దరికీ అప్పుడప్పుడు బీపీలు, షుగర్లు చూడటమే కాకుండా గాస్ట్రిక్ మాత్రలు, విటమిన్ టాబ్లెట్స్ లాంటివి తెచ్చి ఇస్తూ ఆ ఇంట్లో బాగా దగ్గర మనిషిగా అల్లుకు పోయాడు. .
సుబ్బారావు దంపతులకు యాత్రలు చేయడం అంటే పిచ్చి, వెర్రి కూడా. కొన్నేళ్ళ క్రితం ఆయన ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కొంతకాలం పని చేసి ఉండటం వల్ల ఆయనకు, ఆయన భార్య కృష్ణవేణికి కూడా ఆ విషపూరితం మోకాళ్ళలో చేరి మేట వేసుకుని పోవడంతో తీవ్రమైన కీళ్ల నొప్పులు ప్రారంభమయ్యి యాత్రలంటే తాత్కాలికంగా విరక్తి పెంచుకున్నారు. .
ఆశ్చర్యంగా శివకోటి ఏం మందులు తెచ్చి ఇచ్చాడో కానీ వాళ్ళ కాళ్ళు కొంతవరకు స్వాధీనంలోకి వచ్చి మళ్ళీ యాత్రలకు వెళ్లాలన్న యావ మొదలయ్యింది. . పక్కన తెలిసిన వాళ్ళు ఎవరేనా సహాయంగా ఉంటే యాత్ర సులువుగా పూర్తి అవుతుందని భావిస్తున్న సందర్భంలో “ మా తమ్ముడు ఉన్నాడు కదండీ. ఒకసారి అడిగి చూద్దాం . తను గతంలో ఉత్తర , దక్షిణ యాత్రలు చాలా చేశానని చెప్పాడు. ఆ అనుభవం మనకు పనికొస్తుంది. “ అంటూ భార్య కృష్ణవేణి పాదరసం లాంటి సలహా ఇవ్వడం , అది కార్య రూపం దాల్చేసరికి మరో వారం రోజులు పట్టింది.
శివకోటికి కొన్నాళ్లుగా అతని కుటుంబం ఏదో కారణాల వల్ల దూరంగా ఉండటం,అతనికి ఇప్పుడు ఏ బాదరబందీ లేకపోవడం కూడా సుబ్బారావుకు ప్లస్ పాయింట్ అయ్యింది. . శివకోటిని తమ ప్రయాణంలో కలుపుకుని వెళ్లాలని అనుకున్నాడే కానీ అతని ఆర్ధిక పరిస్థితి గురించి సుబ్బారావు ఆలోచించలేదు. అతి మోహమాటస్తుడైన శివకోటి ఒక బలహీన క్షణంలో వాళ్ళ మాటను కాదనలేక పోయాడు. పాపం ఎక్కడ అప్పు చేశాడో, ఎలా మేనేజ్ చేశాడో కానీ “ప్రస్తుతానికి ఈ డబ్బును మీ దగ్గర ఉంచండి బావగారు! తర్వాత లెక్కలు చూసుకున్నాక నాకు అయిన మిగిలిన సొమ్మును సద్దుతాను “ అంటూ ఒక కాయితంలో కట్టిన నోట్లను సుబ్బారావు చేతిలో పెట్టాడు.
పక్కా స్వార్ధపరుడైన సుబ్బారావు కేవలం తమ ప్రయాణంలో సహాయకారిగా ఉంటాడని శివకోటిని ఎన్నుకున్నాడే తప్ప అతని ఖర్చులు కూడా తనే భరించడం విధాయకం అని అనుకోవడం మానేసి అతను ఇచ్చిన డబ్బును మొహమాటం లేకుండా జేబులో పెట్టుకున్నాడు.
“ డబ్బు విషయం తర్వాత చూద్దాములే తమ్ముడూ !” అని కృష్ణవేణి అందాం అనుకుంది కానీ మొగుడి పద్దతి ముందు నుండి బాగా తెలిసిన ఆవిడ కిమ్మనకుండా ఊరుకుంది. తనకు ఇది అనవసర ప్రయాణం అని శివకోటికి మనసులో కొంత బాధ కలిగినా,ఒప్పుకున్నందుకు తప్పదు కాబట్టి కనీసం యాత్రలలో తనకయ్యే అనవసర ఖర్చులకైనా బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నాడు శివకోటి.
టూరిస్ట్ బస్ ఒక ప్రముఖ యాత్రా స్థలానికి చేరింది. అక్కడ ప్రాముఖ్యత కలిగిన ఐదారు పురాతన దేవాలయాలు ఉన్నాయని అందరూ చెప్పుకుంటూ ఉండటంతో బస్సు అక్కడ ఖాళీ అయ్యింది.
“బావగారూ నాకు ఇక్కడ బాగా తెలిసిన సత్రాలు ఉన్నాయి.నేను అందులో ఉంటాను. మీరు ఈ ఊళ్ళో ఏదైనా మంచి లాడ్జింగ్లో ఉండండి. నేను స్నానం వగైరా ముగించుకుని ముందే అనుకున్న చోట కలిసి అక్కడనుండి ఒక్కొక్క దేవాలయాన్ని దర్శించుకుందాం. అన్నట్టు బావగారు గుళ్ళకు వెళ్లేటప్పుడు వట్టి కడుపుతో వెళితేనే మన కోరికలు సిద్దిస్తాయి అని ప్రవక్తలు చెప్తూ ఉంటారు. మీకు షుగర్ , బీపీలు లాంటివి ఉన్నాయి కాబట్టి ఈ నిబంధనలు వర్తించవు లెండి. నేను మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరు ఏ లాడ్జింగ్లో రూమ్ తీసుకున్నారో మాత్రం ఫోన్ చేసి చెప్పండి. నేను వెతుక్కుంటూ వచ్చేస్తాను ..” అన్నాడు శివకోటి తన బ్యాగును చంకకు తగిలించుకుంటూ.
నిజానికి పెద్ద పెద్ద హోటళ్లలో అల్పాహారాలు, భోజనాలు చేస్తే తలకు మించిన ఖర్చు అవుతుందని ఆ ఖర్చులో తనకూ భాగం ఉంటుంది కనుక శివకోటి కావాలనే తన అభిప్రాయాన్ని సుబ్బారావు ముందుంచాడు.
“ఏడ్చినట్టుంది . నువ్వు ఎక్కడెక్కడ తిరిగి మా దగ్గరికి వస్తావో ఏమో ? నీ కోసం ఎదురుచూసేసరికే ఆ గుళ్ళు కాస్తా మూసేస్తారు. అసలు మేము వెళ్లలేకే నీ మీద ఆధార పడితే నువ్వేమో మా దారి మమ్మల్ని చూసుకోమంటావా ? అసలే ఈ బస్సులలో ప్రయాణం చేసి కాళ్ళ నొప్పులు మొదలు కొచ్చాయి ..” అంటూ శివకోటి మీద మండిపడ్డాడు సుబ్బారావు.
“పోనీ మనం కూడా తమ్ముడికి తెలిసిన సత్రంలోనే ఉంటే అందరమూ ఒక చోటే ఉన్నట్టుగా ఉంటుంది. అనవసరపు ఎదురుచూడటాలు ఈ టెన్షన్ లు తగ్గుతాయి. ..” అంది కృష్ణవేణి తమ్ముడి ఆలోచనకు మద్దతునిస్తూ.
సుబ్బారావుకు గతంలో విలాసవంతమైన హోటళ్లల్లో ఉండటం గుర్తొచ్చింది.
“ఏమిటో ఈ సత్రాలు ఎలా ఉంటాయో ఏమో” అని గొణుక్కుంటూ “ సరే పద. ఒకరి మీద ఆధారపడినప్పుడు ఇలాంటి సమస్యలు తప్పవు “ అనడంతో అందరూ ముందుకు కదిలారు.
యాత్రలు చేసినప్పుడల్లా హోటళ్లల్లో వేడి వేడి స్నానం, అంతకన్నా పొగలొచ్చే టిఫిన్లు ఇష్టారీతిగా ఆస్వాదిస్తూ ఫుల్ ఎంజాయ్ చేసిన సుబ్బారావు, కృష్ణవేణి - శివకోటి చూపించిన సత్రంలో ఐసు లాంటి నీళ్ళు వంటిమీద పోసుకుని స్నానం చేయాల్సి రావడం ,వెన్నులోంచి చలి పుట్టి ఒక అరగంట సేపు గడగడలాడిపోయి కుదేసినట్టు కూర్చుండి పోయారు. మరోపక్క ఎటూ ఆలోచించు కోవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో , అసలే షుగర్ వ్యాధిగ్రస్తులయిన ఆ దంపతులు అల్పాహారం విషయం మర్చిపోయారు. ఇప్పుడు ఆ దరిదాపుల్లో తినడానికి ఏమీ దొరక్క పోవడం వాళ్లిద్దరికీ నిలువెల్లా నీరసం ఆవరించడం , మనం ఆలస్యం చేస్తే గుడి కట్టేస్తారు అంటూ శివకోటి బలవంతం చేస్తూ ఉంటే రోబోలు లాగా అతని వెంట నడిచారు సుబ్బా రావు దంపతులు. వెళ్ళిన చోటకల్లా కనీసం వందా , నూటయాభై మెట్లు ఎక్కాల్సి రావడం, ఏ రోగం లేని వాడు, ఆత్మస్తైర్యం మెండుగా ఉన్న శివకోటి మాత్రం చకచకా మెట్లు ఎక్కేయడం చూస్తూ ఉంటే పది మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో శోష వచ్చి కిందే ఉండి పోయారు .
వాళ్ళ యాత్రలో ఇంకా ఎన్నో క్షేత్రాలు దర్శించుకోవాల్సిన పరిస్థితిలో సుబ్బారావు దంపతులకు హఠాత్తుగా వాతం కమ్మినట్టయ్యి అర్ధాంతరంగా యాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేసి బోలెడన్ని చేదు అనుభవాలను మూటగట్టుకుని ఇంటికి వచ్చి మొదలు నరికిన చెట్లులాగా మంచాలమీద వాలిపోయారు.
శివకోటి మాత్రం తనకు తెలిసిన వాళ్ళ సహాయంతో అక్కడ సత్రాలలోనే రెండు మూడు రోజులు ఉండి పోయాడు. ఒక గంట తర్వాత కొద్దిగా కోలుకున్న సుబ్బారావు వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేశాడు. “ డబ్బయి ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తి ఏదో ప్రపంచాన్నoతా చుట్టు ముట్టేసి ఏదో బావుకోవాలన్న విపరీత కోరికలు మానుకుని హాయిగా ఇంటి పట్టున కూర్చుని టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వార్తలు చూసుకుంటూ గడపడం అంత ఉత్తమమైన మార్గం ఇంకోటి లేదు “ అని ఎవరో ప్రవచనాకారుడు ఆవేశంగా చెపుతున్నాడు.
అదే సమయంలో ఫోన్ మోగింది.అవతల శివకోటి లైన్లో ఉన్నాడు.
“బావగారు నేనే మాట్లాడుతున్నాను. నేను ఇంకా రెండు మూడు క్షేత్రాలు చూసి మెల్లిగా వస్తాను. ఇక్కడి గుళ్ళల్లో మెట్లు ఎక్కాక నా మోకాళ్ళు చాలా బలంగా తయారయ్యాయి” అన్నాడు ఉత్సాహంగా.
సుబ్బారావు ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు .
“చూసారా ? భక్తికి మెట్లు అడ్డం కాదు . రుచికరమైన వేడి వేడి ఆహారాలు అవసరం లేదు. ఈ ఆనందాల కోసమే మనం పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నట్టుగా ఉంది. మనకు మనంగా సహాయం కోరిన మా తమ్ముడుకి మాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి మనసు రాలేదు. మనకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎక్కడికక్కడ తన ఖర్చు తగ్గించుకుంటూ,ఆ భగవంతుడి సాయంతో ముందుకు సాగిపోతున్నాడు. మనం దేవుళ్ళను చూడకుండానే కిందే కూలబడి పోయాం. ఇకనుండి ఈ వయసులో అంతంత దూరం ప్రయాణం చేసి ఇబ్బందులు పడటం మనవల్ల కాదు.. మనలాంటి వారికి టీవీలో ప్రవక్తగారు చెప్పిన వచనాలే నూటికి నూరు శాతం కరెక్ట్ ...” అని కృష్ణవేణి తాత్వికంగా చెపుతూంటే “ అవునవును. ..నాకు బోధపడింది “ అంటూ జేబులోంచి రెండు వేల రూపాయలు తీసి “మీ తమ్ముడు రాగానే ఈ డబ్బు కవర్లో పెట్టి ఇచ్చెయ్యి. పాపం అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమిటో?” అన్నాడు సుబ్బారావు పశ్చాతాప మనసుతో***