ఉత్కంఠా మజాకా
దమ్మవళం శ్రీనివాస్
9866534340
యాభై ఏళ్ళ జగ్గయ్య గత రెండేళ్ళుగా కథలు రాస్తున్నాడు. తనో అద్భుతమైన రచయితను అని యమ గాఢంగా నమ్ముతాడు. అయితే, అతడి దురదృష్టమో లేక పాఠకుల అదృష్టమో తేల్చి చెప్పడం కష్టం కానీ ఒక్క కథా అచ్చుకు నోచుకోలేదు. అయినా, బెట్టు వదలని బేతాళుడిలా ఎడాపెడా, ఛడామడా రాస్తూనే ఉన్నాడు.
“అద్భుత కథలు” అని ఓ వాట్సప్ గ్రూపు సృష్టించి, ఎడిటర్లు చిత్తుగా రిజెక్ట్ చేసిన తన కథలని ఆ గ్రూపులోకి రీరిలీజ్ చేయసాగాడు. గ్రూపులో కొంతమంది మొదట్లోనే ఎగ్జిట్ కు బుద్ధి చెబితే, మరికొంతమంది భయంతో మెసేజెస్ తెరవడం కూడా మానేసారు. కొద్దిమంది మాత్రం అతడి రచనలను “మహాద్భుతం” “భీబత్సం” అని అదేపనిగా పొగిడేవారు. వారంతా అతడి దగ్గర పనిచేసే ఉద్యోగులో లేక చిన్నా చితకా అప్పుచేసేవారో లేక మరో విధంగా అతడితో పని ఉన్నవారే!
ఓ రోజు అలా తన కథను గురించి పొగుడుతూ రాసిన మెసేజెస్ చదువుతూ పులకించిపోతున్న జగ్గయ్యను చూసి అతడి భార్య పంకజాక్షి “ఎందుకండీ ఆ పనికిమాలిన గ్రూపు చూసుకొని సంబరపడటం? మీ పేరుకు తగ్గట్టే మీరు రాసేవన్నీ పాతకాలపు రుబ్బురోలు కథల్లా ఉంటాయి. కొత్తగా ఏదైనా రాయండి అంటే వినరు. ఈమెయిలు చేస్తున్నారు కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే, మీ కథలన్నీ రోజూ తిరిగి పట్టుకు రాలేక పోస్ట్ మెన్ కూడా ఇంటికొచ్చి భోరుమనేవాడు.” అన్నది.
“అది కాదు జాక్షి, అసలు నేను పంపే కథలు ఎడిటర్లు ఓపిగ్గా చూడటం లేదని నా డౌటనుమానం. లేకపోతే, ఇంతమంది నా వాట్సప్ గ్రూపులో చేరి నా కథలు అద్భుతం అని మెచ్చుకోవడమేంటి?”
“మీ అద్భుత వాట్సప్ పాఠకులంతా మీతో అవసరం ఉన్నవారే. మిమ్మల్ని ఉబ్బేయడానికి తప్ప వారసలు మీ కథలు చదవను కూడా చదవరని నా అభిప్రాయం. నాకైతే మీరు రాసిన ఒక్క కథ కూడా నచ్చలేదు. ప్రతీ లైనూ ‘ఇక చాల్లే. పక్కన పడేద్దాం’ అనిపించేలా రాయడంలో మీది అందె వేసిన కలం… కథ మంచి సస్పెన్స్ తో ఉండి పాఠకుల్ని ఉర్రూతలూగించాలి. మీవన్నీ బోరుతో ఉర్రూతలూగించే కథలే.” సూటిగా చెప్పేసి అక్కడనుంచి వెళ్ళిపోయింది పంకజాక్షి.
సోఫాలో, ఆలోచనల్లో కూలబడ్డాడు జగ్గయ్య. తనకి కచ్చితంగా తెలుసు తన పాఠకులు తన రచనలని అత్యంత నిజాయితీతో పొగుడుతున్నారని. ఈ విషయంలో భార్య నోరు మూయించాలంటే ఈసారి ఓ సస్పెన్స్ కథ రాయాల్సిందే! ప్రతీ లైనూ ఉత్కంఠతో పిచ్చెక్కించేలా ఉండాలి. ఇలా అనుకొని, అదేపనిగా శ్రమించి మొత్తానికి ఓ కథను మూడు రోజుల్లో పూర్తిచేసాడు.
“ఇదిగో జాక్షి, ఇలా రా. సస్పెన్స్ కథ రాయమంటావుగా. రాసేసాను. పేరు ‘ఉత్కంఠ హత్య’. ఇప్పుడే దీన్ని పోస్ట్ చేసి అందరి అభిప్రాయం అడుగుతాను చూడు. ఇందులో వచ్చే చివరి ట్విస్ట్ కి ఒక్కొక్కరూ దిమ్మదిరిగి ఏమంటారో చూడు.” ఫోన్లో తన కథను భార్యకు చూపిస్తూ చెప్పాడు జగ్గయ్య గర్వంగా.
“అలాగే చూస్తాను కానీ, నేను చెప్పినట్టు రాయండి.” అని ఏం చేయాలో చెప్పింది.
పగలబడి నవ్వి, "మిత్రులారా, ఈసారి యమ సస్పెన్స్ కథ రాసాను. చదివి మీ అభిప్రాయాలు యమ నిజాయితీగా చెప్పండి.” అని భార్య చెప్పినట్టుగా కథను గ్రూపులో పోస్ట్ చేసాడు జగ్గయ్య.
తన అభిమాన పాఠకుల స్పందన కోసం ఉత్కంఠగా చూడసాగాడు జగ్గయ్య. పంకజాక్షి కూడా భర్త పక్కనే కూర్చొని ఫోన్ వైపు సరదాగా చూడసాగింది.
కథ పంపిన పదిహేను నిమిషాల తర్వాత, స్పందనలు వెల్లువెత్తినై.
“ఇది అద్భుతం కాదు. అంతకు మించి! చివరి ట్విస్ట్ పేలిపోయింది!”
“అదేమి సస్పెన్స్ అండీ బాబు.. వెర్రెక్కిపోయింది. మీకు నా జోహార్లు!”
“సర్, మీ ఇంటి పేరు మల్లాదో, యండమూరో అని మార్చుకోవాలేమో ఇక.”
“వావ్! ఉత్కంఠ భరించలేక చచ్చిపోదామనిపించింది! చివరి ట్విస్ట్ తెలిసాక ఎంతో శాంతి కలిగింది.”
అన్నీ ఇలాంటివే. మరికాసేపు చూసి, జేవురించిన మొహంతో కసిగా, విరక్తిగా, బాధగా, ఉన్నపళంగా వాట్సప్ గ్రూపు డిలీట్ చేసేసాడు జగ్గయ్య! పకపకా నవ్వుతూండిపోయింది పంకజాక్షి.
జరిగిందేంటంటే, “ఉత్కంఠ హత్య” కథ చివరి పేజీని తొలగించి, కావాలనే అసంపూర్ణంగా పంపాడు జగ్గయ్య. అలా చేయమని చెప్పి, ఎంతమంది ఆ విషయం కనుక్కుంటారో చూడమని సలహా ఇచ్చింది తెలివైన పంకజాక్షి.
****