*****
*సొమ్ములు పోయాయి*
== =============
(మినీ కథ)
(నేను రాసిన ఈ మినీ కథ తపస్వి మనోహరం అనే అంతర్జాల పత్రికలో
ది.11.02.2024న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"హలో.. హలో.. అమ్మా, నేనూ పద్మజని. ఎలా ఉన్నావు?"
"బాగానే ఉన్నానే. మీరెలా ఉన్నారు?"
"మేము బాగానే ఉన్నాము. తమ్ముడు విక్రమ్ కి ఏదైనా సంబంధం కుదిరిందా?"
"అప్పుడే చేసుకోనంటున్నాడే. అదిగో హైదరాబాద్ లో ఏదో సాప్ట్ వేర్ ఉద్యోగంలో కుదురుకున్నాడు. ముందు అక్కడ ఓ అపార్ట్మెంట్ కొనుక్కోవాలిట. తరువాతే పెళ్లి అంటున్నాడే"
"అంతేలే అమ్మా! ఈ కాలం పిల్లలు అలాగే ఉంటున్నారు. ఔనూ! ఈ నెల పెన్షన్ తీసుకోవడానికి బేంకుకు వెళ్లేవా?"
"ఇంకా వెళ్లలేదే. ఈరోజో రేపో వెళ్లాలి. ప్రతీసారీ బాంకుకి వెళ్లి రావడం ఇబ్బందిగా ఉందే. ఏదైనా మార్గం ఉంటే బాగుండును"
"అమ్మా! ఎమ్మార్వోగా చేసిన నాన్న బతికిఉన్నంత కాలమూ నువ్వు గుమ్మం దాటి బయటకు వెళ్లనేలేదు. అందుకే మరి నీకు కష్టం గానే ఉంటుంది. అమ్మా! ఓ పని చేస్తావా? నీది స్మార్ట్ ఫోన్. అందులో ఇంటర్నెట్ కూడా ఉంది. ఓసారి బేంకు మేనేజర్ కి ఫోన్ చేసి ఆన్లైన్ బేంకింగ్ సదుపాయం కల్పించమని అడుగు"
"ఔనా? ఎంత మంచి వార్త చెప్పావు తల్లీ. ఇప్పుడే బాంకు మేనేజర్ గారికి ఫోన్ చేస్తా"
***** ***** ***** *****
"హలో.. హలో.. బాంక్ మేనేజర్ గారా? సార్ నేనూ రుక్మిణి ని. రిటైర్డ్ ఎమ్మార్వో కృష్ణ మూర్తి గారి భార్యను. ప్రతీనెలా పెన్షన్ తీసుకోవడానికి మీ బేంకు కు వస్తూంటాను"
"అయ్యయ్యో, మీరు తెలుసమ్మా. నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా. అమ్మా మీ సేవింగ్ అకౌంట్ లో తొమ్మిది లక్షలు పైగా ఉన్నాయి. అందులోంచి తీసేసి, ఫిక్సెడ్ డిపాజిట్ లో వేయకూడదూ?"
"పది లక్షలు అయిన తర్వాత అది మా అబ్బాయి విక్రమ్ కి ఇద్దామనుకుంటున్నా సార్. వాడు హైదరాబాద్ లో ఓ అపార్ట్మెంట్ కొనే ఉద్దేశంలో ఉన్నాడు. అది సరే కానీ నా అకౌంట్ కి ఆన్లైన్ బాంక్ సదుపాయం కావాలి. ఏం చేయాలో చెప్పండి సార్"
"ఇప్పుడే మా బేంకు క్లర్క్ ని మీ ఇంటికి పంపుతున్నాను. అతను ఎలా చేయాలో అన్నీ చెబుతాడు. అయితే, ఆన్లైన్ బేంకింగ్ లో చాలా మోసాలు జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా"
"అలాగేనండీ. ముందు మీరు అతడిని పంపించండి"
***** ***** ***** *****
"హలో.. హలో..ఒరే విక్రమ్! నేనురా అమ్మని. ఓ ఘోరం జరిగిపోయిందిరా. సొమ్ములు పోయాయిరా"
"అయ్యయ్యో, ఏంటమ్మా! ఏం జరిగింది?"
"ఒరే ఓ రెండు నెలలు క్రితం నా ఫోన్ లో ఆన్లైన్ బేంకు సదుపాయం తీసుకున్నానురా. అయితే ఈ రోజు ఉదయం చూస్తే నా అకౌంట్ లో ఉండాల్సిన సుమారు పది లక్షలు మాయం అయిపోయాయి. అవి నీ ఇంటి కోసం దాచినవిరా"
"అమ్మా! బాధపడకు. అసలు నిన్న ఏం జరిగిందో చెప్పు"
"నిన్న సాయంత్రం, ఎవడో వచ్చీరాని తెలుగులో ఫోన్ చేసి ఈ నెల మీ అకౌంట్ లో పెన్షన్ పడిందా? చూసి చెప్పండి అన్నాడు. నేను పడలేదు అని చెప్పాను. అతను వెంటనే, మీరు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అందుకే పడలేదు. మీ బాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, తర్వాత మీకు ఓటీపీ అని ఓ నెంబర్ వస్తుంది అది చెప్పండి, మీ పెన్షన్ పడుతుంది అని చెప్పాడురా. వాడు చెప్పినట్లు చేసాను. పొద్దున్నే చూస్తే....."
"అమ్మా, బాధపడకు. ఈ విషయం అప్పుడే ఎవరికీ చెప్పకు. అలా చెబితే నీ తెలివి తక్కువ తనానికి నిన్నే తిడతారు. నేను రేపు బయలుదేరి వస్తున్నా. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం"
"అలాగే నాయనా! త్వరగా రా. ఆన్లైన్ బాంకింగ్ అనవసరంగా తీసుకున్నానేమో?"
***** ***** ***** *****
"హలో హలో బిస్వజిత్ భయ్యా! నేనూ విక్రమ్ ని మాట్లాడుతున్నా"
"చెప్పు భయ్యా. హేమిటి విషయం?"
"భయ్యా! అమ్మకి ఒంట్లో బాగాలేదుట. నేను ఈ జాబ్ మానేసి, మా ఊరు వెళ్లిపోతున్నా"
"హెందుకు భయ్యా! హింతవరకూ మనం చిన్న చిన్న పిట్టలనే పట్టాము. నిన్న రాత్రి నేను రుక్మిణి అనే ఓ పెద్ద పిట్టను పట్టి ఓ పది లక్షలు లాగేసానుగా. నీ వాటా ఐదు లక్షలు నీకు పంపించాను కదా?"
"ఆ డబ్బులు అందాయి భయ్యా. ఏదో నీతో చేయి కలిపి, సైబర్ నేరాలు చేసి ఇంతవరకు ఓ పది లక్షలు వరకూ సంపాదించాను. ఇప్పుడు డబ్బు సమస్య కాదు. అమ్మ ఆరోగ్యం ముఖ్యం"
"సరే భయ్యా! జాగ్రత్త. ఆ లాప్టాప్, ఫోన్, సిమ్ అన్నీ కాల్చిపడేయ్. ఏ ఆధారాలు వదలకు. నేను కూడా బాగానే సంపాదించాను. నేనూ త్వరలో ఈ నేరాలు మానేద్దాం అనుకుంటున్నా. ఓకే గుడ్ బై"
***** ***** ***** *****
"హలో... హలో.. అమ్మా! నేను విక్రమ్ ని. ఈరోజు బయలుదేరి వస్తున్నా. ఇక్కడ ఉద్యోగం మానేసా. హాయిగా మన ఊర్లో వ్యవసాయం చేసుకుంటా!"
"మంచి వార్త చెప్పావు నాయనా! మరి పోయిన ఆ డబ్బులు గురించి ఏంచేద్దాం?"
"ఎక్కడికీ పోలేదమ్మా! దొరికాయి. నేను అక్కడికి వచ్చి అన్ని డిటైల్స్ చెబుతాగా!"
"అలాగే! త్వరగా రా నాయనా!"
***** **శుభం** *****