*****
*వీర బాదుడు*
==========
(మినీ హాస్య కథ)
( ఐపీఎల్ క్రికెట్ నేపథ్యంలో నేను రాసిన ఈ కథ గోదారి ఊసులు అనే అంతర్జాల పత్రికలో ఫిబ్రవరి 2024 లో ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"హాయ్.. హలో...నమస్తే... 'వీరబాదుడు' టీవీ సమర్పించు 'కిరికిరిలాట-క్రికెట్టాట' కార్యక్రమానికి స్వాగతం. నా పేరు తోట పూబంతి. ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుతం జరుగుతున్న వి.పి.యల్. క్రికెట్, అదేనండీ..ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థానంలో వచ్చిన విలేజ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా, ఈరోజు మధ్యాహ్నం మాచవరం, సోమేశ్వరం జట్ల మధ్య మండపేటలో జరగబోయే క్రికెట్ ఆట గురించి మనతో విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రీడా విశ్లేషకులు శ్రీ పచ్చిపులుసు బాల్ రాజు గారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం.
"నమస్కారం బాల్ గారూ!"
"నమస్తే బంతి గారూ!"
"బాల్ గారూ! చెప్పండి గతంలో ఈ వి.పి.యల్. లో మీకు బీపీ తెచ్చిన సంఘటన ఏదైనా ఉందా?"
"పాపం, అలాంటి సంఘటన ఏదీ లేదు బంతి గారూ! "
"గతంలో జరిగిన విపియల్ లో మీ రోల్ ఏమిటి?"
"పాపం, కిందటేడాది విపియల్ జరిగిన తిప్పరాజుపాలెం, నూనాకులపాలెం మేచ్ లలో నేను బంతులు అందించే వారికి సహాయకుడుగా పనిచేసాను"
"గ్రేట్ జాబ్! సరేకానీ ఈ రోజు మేచ్ ఎవరు గెలిచే ఆవకాశం ఉంది, బాల్ గారూ?"
"ఖచ్చితంగా మాచవరం జట్టే బంతి గారూ. ఎందుకంటే పాపం వాళ్లకి మండపేట నేలతల్లి లాంటిది. అదే, మదర్ పిచ్ లాంటిది"
"సరే కానీ, మాచవరం జట్టు కెప్టెన్ కొల్లి విరాటరావు గురించి మీ అభిప్రాయం?"
"చెప్పడం మరిచాను. మాచవరం జట్టుకు ఈ మండపేట మదర్ పిచ్చే కాదు, మదరిన్లా పిచ్చి కూడానూ. ఎందుకంటే, కొల్లి విరాటరావు అత్తారిది మండపేటే. అందుకే పాపం అతను తప్పకుండా తన విరాట్ రూపం చూపిస్తాడు"
"కానీ, ఆ సోమేశ్వరం జట్టులో ఉన్న యాదాల సూరికొమరయ్య కూడా మంచి బేట్స్ మెన్ కదా?"
"కరెక్టేనమ్మా! కానీ ఆ సూరయ్య కి, విపరీతమైన టెన్షన్ వలన ఆరారా చూయింగ్ గమ్ నమిలే అలవాటు బాగా ఉంది. అలా విపరీతంగా నమలడం వలన పాపం అతను ప్రస్తుతం పిప్పి పళ్ళతో బాధ పడుతున్నాడు. అందుకే పరుగులు తీయడం చాలా కష్టం"
"మరి మాచవరం జట్టులో ఉన్న పూజారి గారి అబ్బాయి, అదే పురోహిత శర్మ గురించి మీ అభిప్రాయం?"
"పాపం ఈ సారి అతను తప్పకుండా సెంచరీ కొడతాడమ్మా!'
"అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలరు బాల్ గారూ?"
"పాపం వాళ్లావిడ ఊర్లో లేదు కాబట్టి బంతి గారూ!'
"మరి సోమేశ్వరం జట్టులో, అద్భుతమైన బౌలర్ జాసుపత్రి భూమరావ్ ఉన్నాడు కదా? అతను మాచవరం జట్టును గెలవనిస్తాడా?"
"మీరన్నది నిజమే. అయితే పాపం, మొన్ననే తొంభై ఏళ్ల వయసున్న అతని చిన్న బామ్మ చనిపోయింది. ఇంకా పక్షిణీ స్నానం కూడా కాలేదు. అతను ఆ బెంగలో ఉండి బౌలింగ్ మీద సరిగ్గా దృష్టి పెట్టలేడమ్మా!"
"సరేకానీ, మరి మాచవరం జట్టులో ఉన్న బౌలర్ రావి విష్ణయ్య ఆ సోమేశ్వరం జట్టు వికెట్లు పడగొట్టగలడా?"
"ఎందుకు పడగొట్టలేడమ్మా? ఈమధ్యనే పాపం అతనికి పెళ్లి సంబంధం కూడా కుదిరిందిట. ఆ సంతోషంలో వీజీగా వికెట్లు పడగొట్టేస్తాడు?"
"ఒక్క నిమిషం బాల్ గారూ, ఏదో ఫోన్ వస్తోంది......... ఆ..హలో... హలో... చెప్పండి...ఔనా... అలాగా?..."
"ఏమయ్యింది బంతి గారూ?"
"వర్షం కారణంగా ఈరోజు ఆట రద్దు అయ్యిందిట బాల్ గారూ! మళ్లీ ఎప్పుడు ప్రారంభం అయ్యేది వచ్చే సంవత్సరం చెబుతారుట"
"ఆ! అలాగా.. అయ్యో పాపం .......!!"
***** **శుభం** *****