*****
*సంక్రాంతి శోభ*
===========
(జ్ఞాపకాల పందిరి)
(నేను రాసిన ఈ కథ గోదారి ఊసులు అనే అంతర్జాల పత్రికలో జనవరి 2024 లో ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
అవి, తూర్పుగోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రం అయిన ద్రాక్షారామం దగ్గర ఉన్న మా స్వగ్రామం జగన్నాధగిరిలో నేను మూడవ తరగతి చదువుతున్న, 1966 కాలం నాటి రోజులు. ఓ వారం రోజులు ముందుగానే, ఆ రోజు నుంచి సంక్రాంతి శెలవులు ఇచ్చారు. ఆనందంగా గంతులేస్తూ, ఇంటికి వచ్చిన, మా అన్నదమ్ములు నలుగురమూ పుస్తకాలతో ఉన్న కాకీరంగు సంచీలు అలమారాలోకి విసిరేసి, దొడ్లో ఉన్న నూతి వద్దకు కాళ్లు కడుక్కోవడానికి వచ్చాము.
"కాంతమ్మ గారూ! మరి నేను వెళ్తాను. చెగోడీలు మెత్తబడకుండా చూసుకోండి..ఆ మిఠాయి బూందీ కొంచెం ఆరిన తర్వాత దానికి చీమలు పట్టకుండా ఓ గట్టి సీవెండి డబ్బాలో పెట్టి, ఆ డబ్బాను నీళ్లు పోసిన పళ్లెంలో ఉంచండమ్మా" చెప్పారు మా ఇంట్లో పిండివంటలు చేయడానికి వచ్చే వెంకమ్మ గారు.
"చీమలు మాట దేముడెరుగు. ముందు మా కోతి మూకల కంటపడకుండా చూడాలి" మా వైపు అనుమానంగా చూస్తూ, ఖాళీ స్టెన్స్ కాఫీ పౌడర్ డబ్బాల్లోకి ఆ బూందీ ఎత్తుతూ చెప్పింది అమ్మ.
"హహహహహహ. పోనీలెండమ్మా. అల్లరి వీళ్లు కాకపోతే నేనూ, మీరూ చెయ్యగలమా? ఇప్పుడే బడి నుంచి వచ్చినట్టున్నారు, పాపం, ఏదైనా పెట్టండి తింటారు" నెత్తిన ఉన్న తెల్లచీర ముసుగును సరిగ్గా సవరించుకుంటూ వెళ్లి పోయారు యాభై ఐదేళ్ళ వెంకమ్మ గారు.
అందరికీ ఓవల్టీన్ తాగడానికి ఇచ్చిన తర్వాత, వెంకమ్మ గారు చేసిన చెగోడీలు తలో మూడేసి ఇచ్చింది అమ్మ. వాటిలో రెండు చెగోడీలు రెండు చెవులకు పెట్టుకుని, మిగిలిన ఆ ఒక్కటీ తింటూ వీధి అరుగు మీదకు చేరుకున్నాము, స్తంబాలాట ఆడుకోవడానికి.
***** ***** ***** *****
మర్నాడు ఉదయం మమ్మల్ని నిద్ర లేపుతూ,
"ఇదిగో పిల్లలూ! ఈ పండుగ వారం రోజులూ మొహాలు అరుగు మీద కడగవద్దు, కింద వేసిన ముగ్గులు చెరిగిపోతాయి. దొడ్లో నూతి దగ్గర కడుక్కోండి" అంటూ ప్రభల కంపెనీ వారి గులాబీ రంగు పళ్లపొడి మా అందరి అరచేతుల్లో వేసి, నాలుక గీసుకోవడానికి వేళ్ల మధ్య తాటాకులు పెడుతూ చెప్పింది అమ్మ.
మా అన్నదమ్ములు అందరమూ నూతి దగ్గర ఆ కార్యక్రమం పూర్తి చేస్తూ ఉంటే,
"పండక్కి పాపలు ఎప్పుడు వత్తారు అమ్మగోరూ" ముక్కు నుంచి పెదవి మీదకు జారుతూన్న అడ్డ బాసర అటూఇటూ ఊగుతుండగా అడిగింది, మా ఇంట్లో పనులు చేసే అరవై ఏళ్ల అప్పలమ్మ.
"అమ్మాయిలు రేపు వస్తారే! వాళ్లను తీసుకుని రావడానికి ఈరోజు మా పెద్దోడు, చిన్నొడూ వెళ్తున్నారు. అల్లుళ్లు మటుకు పండుగ ముందు రోజు వస్తారుట" చెప్పింది అమ్మ, అప్పలమ్మ కడిగిన గిన్నెలు లోపలికి సర్దుకుంటూ.
అంతే, అక్కలు వస్తున్నారు అన్న మాట వినగానే మా ఆనందం వర్ణనాతీతం. అంతే వేగంగా మొహాలు కడుక్కుని, అమ్మ ఇచ్చిన బోర్నవిటా గ్లాసుల మీద పడ్డాము, రేపటి కోసం ఎదురుచూస్తూ.
"మరిహ, నే ఎల్తానండీ అమ్మగోరూ" ఆన్న అప్పలమ్మ పిలుపుతో, సామానుల గదిలోంచి బయటికి వచ్చిన అమ్మ
"ఇవిగో ఇవి తీసుకుని వెళ్లి మీ మనవళ్లకు పెట్టు" అంటూ చెగోడీలు, బూందీ కట్టిన పొట్లం అప్పలమ్మ చేతిలో పెట్టి,
"వెళుతూ వెళుతూ మన కొత్త దొడ్డిలో కొండమల్లి చెట్టు మీద, అలాగే ఆ గోడల మీద నువ్వు వేసిన బోగి పిడకలు ఎండాయో లేదో చూసి వెళ్లు" హుకుం జారీచేసింది అమ్మ.
***** ***** ***** *****
మర్నాడు ఉదయం
"అమ్మగోరూ! పిడకలు బానే ఎండాయి. అట్టుకొచ్చేమంటారా?" అడిగింది పనిలోకి వచ్చిన అప్పలమ్మ, అంతవరకూ అడ్డపొగ వేస్తూ కాల్చిన చుట్టను, అమ్మ చూడకుండా వీధిలోకి విసిరేస్తూ!
"వెళ్లేటప్పుడు తెద్దువుగానిలే!" అంటూ దీపావళి సామాన్లుతో తెచ్చిన ఓ నాలుగు ఖాళీ తాటాకు బుట్టలు అప్పలమ్మ చేతికి ఇస్తూ చెప్పింది అమ్మ.
ఈలోగా
"అమ్మగారూ! నీళ్లు తేడానికి కాలువకు ఎళ్తున్నాను" అంటూ నీళ్ల కావిడిలో రెండు ఇత్తడి బిందెలు పెట్టుకుని వచ్చి అడిగాడు మా ఇంట్లో ఆల్ ఇన్ ఆల్ లాంటి అరవై ఐదేళ్ల దొమ్మేటి గన్నెయ్య తాత.
"బాగానే జ్ఞాపకం చేసావు నాయనా! పిల్లలు వస్తున్నారు. ఓ రెండు కావిడలు ఎక్కువ వెయ్యి. కాలువ నీళ్లలో ఎర్రమట్టి వస్తోంది, అది పోవడానికి ఆ బూడిద తాతబ్బాయి కొట్లో ఓ డజను ఇండుపకాయి గింజలు తీసుకో, అదే చేత్తో ఓ డజను భోగి పిడకలు దండలుకు సరిపోయేలా పురికొస కూడా తీసుకో" అంటూ డబ్బులు ఇస్తూ చెప్పింది అమ్మ.
***** ***** ***** *****
సాయంత్రం నాలుగు అయ్యింది. అమ్మ పెట్టిన చెగోడీలను పెద్ద శబ్దం చేస్తూ నములుకుంటూ అరుగు మీదకు చేరుకున్నాము.
వీధిలో సైకిల్ మీద వెళ్తున్న పాములమ్మ గారి అల్లుడు సత్తిబాబు గారిని ఆపి
"యాండీ! అచ్యుతాపురం బస్సు వచ్చిందా?" అడిగాము ముక్తకంఠంతో.
"అప్పుడే ఎక్కడయ్యా బాబూ! రావడానికి చాలా టైముంది" చెప్పి, సైకిల్ బెల్ కొట్టుకుంటూ వెళ్లిపోయారు.
అక్కలు కోసం అరుగు మీద కూర్చుని ఓ గంట సేపు ఎదురుచూస్తూ, మేము వేసిన ఈ ప్రశ్నకు ఐసుఫ్రూట్లూ అమ్ముకునే సూరయ్య, మా నాన్న వద్ద నర్సుగా పనిచేసే అమ్మాజీ, కిరాణా కొట్టు తాతబ్బాయి కూడా బలైపొయారు.
కాసేపటి తరువాత,
మా ఇంటి ఎదురుగా పాకలో ఉండే ఆచంట సత్తెమ్మ బయటికి వచ్చి,
"ఏటీ రోడ్రు మీద ఎల్లేవోళ్లందర్నీ ఇసిగించేత్తున్నారు? ఏటీ పెళ్లోరు వోరైనా వత్తన్నారా?" నోట్లో ఉన్న అన్ని పళ్లు ఊడిపోగా, ముందు ఉన్న రెండు పళ్లూ బయటకు కనబడేలా నవ్వుతూ అడిగింది.
"ఏం కాదు.. మా అక్కలు వస్తున్నారు. కావాలంటే అదిగో చూడు" అంటూ అప్పుడే సందు చివరినుంచి వస్తున్న అక్కలు, అన్నయ్యలను చూపిస్తూ చెప్పి, గబగబా మెట్లు దిగి వాళ్లకు ఎదురెళ్లాము, ఆశ్చర్యపోయిన ఆచంట సత్తెమ్మ రెండు బుగ్గల మీద వేళ్లు వేసుకొని అబ్బురంగా చూస్తుండగా!
***** ***** ***** *****
అక్కలు, అన్నయ్యలతో ఓ నాలుగు రోజులు హాయిగా గడచిపోయాయి.
భోగి పండుగ ముందు రోజు సాయంత్రం,
"అక్కా! రేపు భోగి పండుగ కదా? వీధిలో ఏ ముగ్గు వేద్దాం?" అడిగింది చిన్నక్క.
"ఓ పని చేద్దామే! ముందు మనం పాములమ్మ గారి అమ్మాయిలు సత్యవతి, చిలకమ్మలను పలకరించి, అక్కడి నుంచి కరణం గారు అదేనే...పెరవలి సత్తిరాజు గారింట్లో వాళ్ల పిల్లలు అన్నపూర్ణ, కృష్ణవేణి లను చూసి, ఆ తరువాత పెండ్యాల వెంకటేశ్వర్లు గారి అమ్మాయిలు జగదాంబ, దేవిలను కూడా పలకరించి, పనిలో పనిగా వాళ్లందరినీ ఈరోజు ఏం ముగ్గులు వేస్తున్నారో వాకబు చేద్దాం. ఆ తరువాత మనం ఏం ముగ్గులు వేయాలో ఆలోచిద్దాం" ఉపాయం చెప్పింది పెద్దక్క, చిన్నక్క జడలో చేమంతిపూల దండ పెట్టి, ఓ దండ తన జడలో కూడా పెట్టుకుంటూ!
"అక్కడే బాతాఖానీ వేయకుండా, దీపాలు పెట్టే వేళకు త్వరగా తెముల్చుకుని రండి. ఈలోగా అప్పలమ్మ చేత వీధిలో కళ్లాపి జల్లించి ఉంచుతాను" హెచ్చరిక జారీ చేస్తున్నట్లు చెప్పింది అమ్మ.
"అలాగే వస్తాంలే" అంటూ బయలుదేరారు అక్కలు ఇద్దరూ, వెనకాల మా అన్నదమ్ములు నలుగురమూ సైనికుల్లా వెంటరాగా.
***** ***** ***** *****
రాత్రి భోజనాలు కానిచ్చి, అరుగు మీద ఉన్న కరెంటు బల్బు కాంతి సరిపోకపోవడంతో, ఓ రెండు హరికెన్ లాంతర్లు తీసుకుని, అలాగే రెండు ఖాళీ డాల్డా డబ్బాల నిండా ముగ్గు తీసుకుని ముగ్గులు వేయడానికి ముగ్గులోకి దిగారు అక్కలిద్దరూ, అరుగు మీద కూర్చున్న మేమందరమూ ముగ్దులై చూస్తుండగా!
వీధిగుమ్మం ఎదురుగా నెలపొడుపు ముగ్గు వేసిన తర్వాత మిగతా ముగ్గులు వేయడానికి సమాయత్తం అయ్యారు అక్కలిద్దరూ, మధ్య మధ్యలో దోమలు కుడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా.
పదహారు చుక్కలతో చిలుకల ముగ్గు పెద్దక్క వేస్తే, ఇరవై చుక్కలతో నెమళ్ల ముగ్గు వేసింది చిన్నక్క.
ఇది చూసిన నాకు కూడా ఎక్కడలేని ఉత్సాహం వచ్చి, వెంటనే లేచి, వెనుక వెంపు వసారాలో ముగ్గుతో ఉన్న రాతి చిప్పను తీసుకుని కదనరంగంలోకి దూకాను.
కాసేపటికి ముగ్గులు వేయడం పూర్తి అయిన అక్కలు ఇద్దరూ గెడ్డం కింద చెయ్యి పెట్టుకుని వాళ్లు వేసిన ముగ్గులను ఓసారి చూసుకుంటున్నారు, అప్పుడే రాజమండ్రి నుంచి, అమలాపురం నుంచి వచ్చి, వెనుక నిలబడిన పెద్ద, చిన్న బావలను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా!
కాసేపటి తర్వాత వెనక్కి తిరిగి బావలను చూసి సిగ్గు పడుతూ, ముగ్గు డబ్బాలతో సహా లోపలికి తుర్రుమని పారిపోయారు అక్కలిద్దరూ.
తరువాత, నేను కూడా ఓసారి నా ముగ్గురాజాన్ని తనివితీరా చూసుకుని అక్కల వెనుకే దారి తీసాను.
***** ***** ***** *****
మర్నాడు ఉదయాన్నే అందరమూ తలంటు పోసుకుని, కొత్త బట్టలు వేసుకుని, సందుచివర ఉన్న భోగి మంట వద్దకు చేరుకున్నాము. పిల్లలు అందరమూ భోగి దండలు మంటల్లో వేసి, ఆ బూడిద నుసిని కొంచెం తీసుకుని నుదుట బొట్టు పెట్టకుని ఇంటికి బయలుదేరాము.
తరువాత, అమ్మ పచ్చటి అరటి ఆకుల్లో పెట్టిన అల్లం, జీడిపప్పు వేసిన తెల్లటి వేడి వేడి ఉప్మా తింటూ ఉండగా,
"ఇక్ష్వాకు కుల తిలకా, ఇకనైనా పలుకరా రామచంద్రా" అంటూ దూరాన్నించి హరిదాసు పాట వినబడగానే వేడిగా ఉన్న ఆ ఉప్మాని గబగబా ఊదుకుంటూ ఆవురావురుమంటూ తినేసి వీధి అరుగు మీదకు చేరుకున్నాము.
అప్పటికే ఇంటి ముందు వేసిన నెలపొడుపు ముగ్గులో చందనం సువాసనలు ఘమఘుమలాడుతుండగా, రంగురంగుల పూలదండలు మెడలో వేసుకుని కూర్చున్న హరిదాసు, తన తల మీద ఉన్న నిగనిగలాడుతూ మెరిసిపోతున్న ఇత్తడి గిన్నెలో అమ్మ బియ్యం వేయగానే "శ్రీ మద్రమారమణ గోవిందో హరి" అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లాడు, వెళ్తూ వెళ్తూ నేను వేసిన ముగ్గువైపు ఓసారి అదోరకంగా చూస్తూ!
ఈలోగా ఇటువైపు నుంచి
"అయ్యగారికి దండంపెట్టు అమ్మగారికి దండం పెట్టు" అంటూ బసవన్నను తోలుకుంటూ, మధ్య మధ్యలో బూరాలాంటిది ఊదుకుంటూ వచ్చాడు గంగిరెద్దాయన.
అక్కలిద్దరూ ఇచ్చిన పాత, కొత్త చీరలు ఆ బసవన్న పై కప్పి, అమ్మ ఇచ్చిన బియ్యం తీసుకుని గంగెరెద్దును తోలుకుంటూ బయలుదేరాడు.
కాసేపటి తరువాత మరి పాపం, ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ, వెళ్తూ వెళ్తూ ఆ గంగిరెద్దు నా ముగ్గు మీద నిలబడి, ఓ రెండు కుంచాల మూత్రాన్ని అభిషేకం చేసింది. అదిగో నా ముగ్గు కళాఖండం, నేను పడిన కష్టం అలా వరద పాలైపోయింది.
కాసేపటికి
"డాట్టరు గారూ! మా సిన్నోడికి భోగి మంటల కాడ ఉన్న కట్టె గుచ్చుకుని రక్తం వస్తోంది, మందు ఏసి కట్టు కట్టండి బాబా!" అంటూ కాలు నుంచి రక్తం కారుతున్న పిల్లాడిని తీసుకుని వచ్చాడు కిరణా కొట్టు నడిపే ర్యాలి సూర్రావు.
ముందు దూదితో ఆ రక్తం పూర్తిగా తుడిచి, మందు వేయడం కోసం లోపలికి వచ్చిన నాన్న
"ఏమర్రోయ్! వెనుక వెంపు వసారాలో ఈ రాతిచిప్పలో పెట్టిన బోరిక్ పౌడర్ ఎవరు తీసార్రా ?" సింహంలా గట్టిగా కేకేసారు నాన్న.
పక్కనే వున్న గదిలో మా అన్నదమ్ములతో చింతపిక్కల ఆట ఆడుకుంటున్న నేను ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి, "ఒరే! నా పేరు చెప్పకండిరా అయ్యా, మీకు దణ్ణం పెడతాను" అన్నట్టు మా వాళ్ల వైపు జాలిగా చూసాను. ఈలోగా
"అయినా అది అక్కడ ఎందుకు పెట్టారు?" ఆరా తీసింది అమ్మ.
"ఆ మందు కొంచెం ఉండలు కడితే, ఎండకు ఎండుతుంది కదా అని అక్కడ పెట్టానే. అయినా పిల్లలకు అల్లరి ఎక్కవయ్యింది. ఎక్కడో పారబోసి ఉంటారు. సరేలే ఇంకో కొత్త పేకట్ ఇప్పుతా. పండుగ పూటే వాళ్లను ఏమీ అనకు" ఆ ఖాళీ రాతిచిప్ప తీసుకుంటూ చెప్పారు నాన్న.
పక్క గదిలో ఉండి, ఇదంతా చూసిన నేను
"హమ్మయ్యా! గండం తప్పింది" అని హాయిగా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా బయటకు వచ్చాను.
రాతిచిప్పలో ఉండి, తెల్లగా ఉంటే అది ముగ్గు అనుకున్నా కానీ, నాకేం తెలుసు, అది దెబ్బలకు వేసే బోరిక్ పౌడర్ అని!
ఇందులో నా తప్పు ఏమైనా ఉందా ?
ఏమండీ, న్యాయం మీరే చెప్పండి...
***** **శుభం** *****