మనలో ఒకరు (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(26/7/2026 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నా కథ )
“ ఇంట్లో వంట చేసుకోలేకపోతున్నానని రోజూ పోరుతున్నావుగా . ఈ అమ్మాయి మాకు దూరం బంధువు అవుతుంది. కావలసిన వాళ్ళు ఎవరూ లేరు.. మా పెద నాన్న గారి అబ్బాయి మొన్న మాటల సందర్భంలో చెప్పినప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే తనకీ జీవనాధారంగానూ, నీకూ వంటలో సహాయంగా ఉంటుందని పంపమని ఫోన్ చేసి చెప్పడంతో ఈ రోజు బస్సు ఎక్కి వచ్చింది. ...తనని రమ్మనే ముందు నీకు చెప్పాల్సింది. కానీ అవతల వాడు నన్ను ఎటూ ఆలోచించుకోనీయలేదు... అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు తనకి మన వెనక గది చూపించు. ఈ రోజే మొత్తం భారం మోపకుండా మెల్లి మెల్లిగా మన వంటలు ఒక్కటొక్కటే చెప్పు. ...” అంటూ భార్య రమణిని ఏమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా తను చెప్పేదేదో చెప్పేసి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు శ్రీకాంత్ .
ఆ వచ్చినమ్మాయికి సుమారు ముప్పై ఐదు నలభై మధ్య ఉంటాయి. తన దగ్గర బంధువులింటికి వచ్చినట్టు గలగలా మాట్లాడేస్తోంది. రమణి మాటవరసకు వంట చేసుకోలేకపోతున్నాను అంది కానీ అది మనసులో పెట్టుకుని ఊహించకుండా మొగుడు ఈవిడ గారిని వెంటపెట్టుకుని వస్తాడని అనుకోలేదు.ఇప్పుడు ఎంతైనా ఒక పరాయి ఆడది పర్మనెంట్ గా ఇంట్లో తిష్ట వెయ్యడానికి వచ్చిందంటే ఎంతైనా మగవాళ్ల నుండి కాపాడటం కష్టమే. ప్రతి క్షణమూ ఇక రోజూ ఇంట్లో ప్రమాద ఘంటికలే మోగుతాయి.
ఇంట్లో ఇంకో ఆడదాన్ని చూడాలంటే రమణికి ఏ మాత్రమూ నమస్కరించక పోయినా కొన్నాళ్ళు వేచి చూద్దాం అనే ధోరణిలో రాజీ పడింది రమణి .
“ మేడం గారు. నా స్నానం అయిపోయింది. వంట గది చూపించి ఈ రోజు ఏ కూర వండాలో చెపితే మొదలెట్టేస్తాను. మీరలా కూర్చుని ఎలా చెయ్యాలో చెప్పండి చాలు అల్లుకుని పోతాను . అయ్యగారు నామీద ఎంతో అభిమానంతో ఇక్కడికి తీసుకొచ్చారు. నా మర్యాద నేను నిలుపుకోవాలి కదా ..” అంటూ రత్నం వంట వండటానికి నడుం బిగించింది .
ఆ రోజు ఆదివారం అవడంతో మార్కెట్కెళ్ళి కూరలు తెచ్చి మండుటెండలో ఇంటికి వచ్చాడు శ్రీకాంత్.
“ అయ్యగారు . కూర్చోండి భోజనం వడ్డించేస్తాను” అంటూ ప్రిజ్జు తెరిచి నీళ్ళ బోటిల్ టేబుల్ మీద పెట్టింది రత్నం .
అప్పటికే టేబుల్ మీద దోసకాయ పప్పు , అరటికాయ వేపుడు ,ఒక రోటి పచ్చడి సిద్దంగా ఉన్నాయి.
“అసలు ఇలా ఎవరేనా వండి వడ్డించే వాళ్ళుంటే ఎంత హాయి ? “ అని ఆ క్షణంలో శ్రీకాంత్ , రమణి మనసులో అనుకుని ఉంటారు.
“వంటలు చాలా రుచిగా ఉన్నాయి. బాగా చెయ్యి తిరిగిన వాళ్ళే ఇలా చెయ్యగలరు. అన్నట్టు రత్నం ! నువ్వు బంగాళాదుంప ,టమోటా, ములక్కాడ కూర చెయ్యగలవా ? అందుకోసమే ఈ రోజు ములక్కాడలు తెచ్చాను ...” అన్నాడు శ్రీకాంత్ రత్నంతో మాటలు కలుపుతూ.
రమణి మొగుడితో దెబ్బలాట వేసుకునే రకం కాదు . మొగుడు తనకు చెప్పకుండా రత్నాన్ని ఇంట్లో పెట్టడం మరో ఆడదైతే రచ్చ రచ్చ చేసేది.
“ ఎప్పుడూ ములక్కాడల, బంగాళా దుంపల కూర తినని వాడిలా ఆయన నీ దగ్గర మొహమాచి పోతున్నారు కానీ మా ఇంట్లో నెలలో రెండు మూడు సార్లు ఆ కూర వండాల్సిందే. బహుశా నీకు పరీక్ష పెట్టాలని అలా అడిగి ఉంటారు. నువ్వేమీ కంగారు పడిపోయి ఆ కూరేమీ చెయ్యక్కరలేదు. ఏ కూరలు వండాలో ఈ ఇంట్లో నా డైరెక్షన్ ప్రకారం జరగాల్సిందే. ఆయనేదేనా అడిగితే వినీ విననట్టు ఊరుకో. నువ్విక్కడ కొంతకాలం ఉండాలంటే కొన్ని పద్ధతులు అలవాటు చేసుకోవాలి ...” అంటూ సున్నితంగానే వార్నింగ్ ఇచ్చింది రమణి.
ఆ రోజు ఆవకాయ కాయ కోసం బజారుకు బయలు దేరుతూ పెళ్ళాన్ని కూడా రమ్మన్నాడు శ్రీకాంత్.
“నాకు ఓపిక లేదు బాబూ . ఇంకా మామిడి కాయలు చాలా రోజులు దొరుకుతాయి. వచ్చే వారం వెళదాం లెండి. అసలే నాకు ఈ రోజు ఒంట్లో నలతగా అనిపిస్తోంది. ఆ మండుటెండలో బయలు దేరితే సోషవచ్చి పడిపోతాను మీ విషయం ఏమో కానీ ..” అని వాయిదా వేసే ప్రయత్నం చేసింది రమణి .
“అయ్యగారు . నేను ఆవకాయ పెట్టడంలో స్పెషలిస్ట్ అని మీకు తెలుసు కదా. నేను మీతో వచ్చి గట్టి మామిడికాయలు ఏరుతాను . నేను ఊరగాయ పెట్టాను అంటే సంవత్సరం వరకు ముక్క మెత్తపడదు ..” అంది రత్నం అతని వైపు చూసి చిరు నవ్వు నవ్వుతూ.
“ అదే నేను కూడా ఆలోచిస్తున్నాను రత్నం . మీ ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళు ఊరగాయలు నీచేతే పెట్టిన్చుకుంటారుటగా. నా స్కూటర్ మీద వెళదాములే. నువ్వేమీ నాకు తెలియని దానివా ? పైపెచ్చు చుట్టం కూడా అవుతావు. మీ అమ్మగారు కూడా ఏమీ అనుకునే రకం కాదు...” అని రత్నాన్ని వెంటనే తనతో రావడానికి తయారుకమ్మన్నాడు .
మొగుడు మరీ అంత చనువుగా ఆమెను రమ్మంటూ ఉంటే రమణిలో వాళ్ళిద్దరి మీద అనుమాన బీజం నాటుకుంది. ఈ మధ్య ఏదో విషయం మీద కలిపించుకుని ఆమెతో మాట్లాడుతూ ఉండటం తను చూస్తూనే ఉంది. కానీ తనే తేలిపోవడం ఇష్టం లేక కొన్నాళ్ళు తనే కంట్రోల్ లో ఉండి మెల్లిగా మొగుడికి నచ్చ చెప్పాలని ఆమె ఆలోచిస్తోంది.
“ అమ్మా ! అయ్యగారు ఆ వచ్చినావిడతో సరసాలాడుతూ ఉంటే మీరు ఏమీ పట్టించుకోకుండా అలా వదిలేస్తున్నారే ? మీకు తెలియదు బయట జనాలు ఏమనుకుంటున్నారో ? ఇంట్లో పెళ్ళాం ఉండగానే వేరే ఎవత్తెనో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని నోళ్ళు కొరుక్కుంటున్నారు. నువ్వు గానీ ఇలా అమాయకంగా ఉన్నావంటే ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ కలిసి నిన్ను బయటకు గెంటుతారు. మా ఇళ్ళల్లో ఇవే గొడవలతో రోజూ చస్తూ బ్రతుకుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెపుతున్నాను ...” అంటూ పనిమనిషి ఒకరోజు హెచ్చరిక చేసేసింది.
దానితో రమణి ఆలోచనలకు ఊపిరి పోసినట్లయ్యి ఏదో విధంగా రత్నాన్ని ఇంట్లోంచి సాగనంపడానికి నిర్ణయించుకుంది.
“ సార్! ఈమధ్య అమ్మగారు ప్రతి దానికీ నామీద కస్సు బుస్సు అంటూ లేస్తున్నారు. నేను చేసిన వంటలో ఏదో ఒక లోపాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. ఏదో ఇన్నాళ్ళూ పాపం మీరు నామీద జాలితో మీ ఇంట్లో ఉంచుకున్నారు. అందుకు మీకు నేను ఋణపడి ఉన్నాను. ఇక ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది . ఇక నా దారి నేను చూసుకుంటాను. రేపే నన్ను బస్సు ఎక్కించేయ్యండి. మీరు మీ కుటుంబం హాయిగా ఉండండి. నా పీడ వదులుతుంది ...” అంటూ రత్నం కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే శ్రీకాంత్ ఆమె తలపై చనువుగా చేయి వేసి “ ఇక్కడ నీకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది . అవసరమైతే నేను నీకోసం నా భార్యను కూడా ఎదిరించడానికి సిద్దం ..” అంటూ ఓదార్చసాగాడు శ్రీకాంత్ .
పక్క గదిలోంచి వాళ్ళ మాటలు వింటున్న రమణి గుండె జారిపోయింది. కాళ్ళకింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది.
“ఏమైందమ్మా . లేవండి. మంచి నీళ్ళు తాగండి. అయ్యయ్యో. అసలే బలహీనంగా ఉన్నారు. మందులు వేసుకుంటున్నారో లేదో ...?” అంటూ రమణిని తీసుకెళ్ళి మంచమ్మీద పడుకోబెట్టింది రత్నం.
కొద్ది సేపు తర్వాత నెమ్మదించిన రమణి చుట్టూ చూసింది. ఇంట్లో రత్నం , తను తప్ప ఎవరూ లేరు. భర్త పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళిపోయి ఇంకా రాలేదు. మరి ఇందాక రత్నం తన మొగుడితో అంటున్న మాటలు, మొగుడు ఆమెను బ్రతిమాలుతున్న వైనం నిజం కాదా ? అంతా తన ఊహా ?
రత్నం రమణి పాదాలు వత్తుతూ “ఉండండమ్మా . భోజనం తీసుకొచ్చి ముద్దలు కలిపి పెడతాను. మీరు అసలు కదలకండి. ఒక రెండు రోజుల పాటు పూర్తి రెస్ట్ తీసుకోండి. నేను కడుపులో పెట్టి చూసుకుంటాను ...” అంటూంటే రమణి పశ్చాతాప మనసుతో లోపల లోపల క్రుంగిపోయింది.
ఒక రెండు రోజుల తర్వాత శ్రీకాంత్ ఇంట్లో ఉన్నప్పుడు రత్నం అతని పక్కన రమణి ఉండగా ఇద్దరినీ ఉద్దేశించి అంది.
“ అయ్యగారు నేను వచ్చి చాలా రోజులయ్యింది.మీరు ఎంత బాగా చూసుకుంటున్నా కూడా నేను సిగ్గులేకుండా నెలల తరబడి ఇలా పాతుకుపోయి ఉండటం భావ్యం కాదు. మళ్ళీ ఎప్పుడైనా పిల్చినప్పుడు మీ దయా నా ప్రాప్తం. రేపు నన్ను బస్సు ఎక్కించేస్తే వెళ్లిపోతాను. ..” అంది ఒక మూలకు తలవంచుకుని నిలబడి .
‘ఏమో రత్నం . నాదేమీ లేదు. మీ అమ్మగారు వంట చేసుకోలేక పోతోంది అంటే నిన్ను పిలిపించాను. తన పర్మిషన్ తీసుకో. నేను నిన్ను ఇక్కడే శాశ్వతంగా ఉండమనడం నాకు మర్యాదగా ఉండదు. ..” అన్నాడు రమణి వైపు చూస్తూ.
“లేదు రత్నం ! నువ్వు అసలు వెళ్ళడానికి వీల్లేదు. నీకు మాత్రం ఆ ఊళ్ళో ఎదురు చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు ? మేమంతా నీ వంటకు అలవాటు పడిపోయాము. నిన్ను ఎప్పుడూ పరాయి దానిలా చూడటం లేదు. నువ్వూ ఈ ఇంట్లో మనిషివే. నేను ఎప్పుడైనా పొరపాటున నిన్ను అనుమానించి ఉంటే నన్ను క్షమించు. దాన్ని మనసులో పెట్టుకుని వెళ్లిపోవాలని చూస్తున్నావేమో ! అదేమీ కుదరదు...” అంటూ రమణి దాదాపు బ్రతిమిలాడినంత పని చేసింది.
“తనకు ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ? ముందు అవి కనుక్కో. ఎంత మటుకు మన స్వార్ధం కోసం ఆ అమ్మాయిని ఇక్కడ ఉండిపొమ్మంటే ఏం బాగుంటుంది ?అయినా తన మీద ఎన్నాళ్ళు ఆధారపడతావు? ఎప్పటికైనా తను వాళ్ళ ఊరు వెళ్లిపోవాల్సిందే కదా ! “ అన్నాడు శ్రీకాంత్ కలిపించుకుని.
ఆ రోజు రాత్రి మొగుడితో అంది రమణి..” చాలామంది ఆడవాళ్ళు అపార్థం చేసుకున్నట్టుగానే నేను కూడా మొదట్లో ఏదో ఊహించుకున్నాను. అందరూ అటువంటి వారు ఉండరని నీతిగా , నిజాయితీగా , నిలకడగా ఉండే వాళ్ళు కూడా ఉంటారని మొన్న నేను ఏదో డిప్రెషన్లో ఉండి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు తను చేసిన సేవలు గుర్తుతెచ్చుకున్నాక నాకు అర్ధమయ్యింది.. మిమ్మల్ని కూడా నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను.. ఎటువంటి ఏ ఆధారం లేకుండా ఉన్న వాళ్ళకు మీలా జీవనోపాధి ప్రతివారూ చూపితే మానవత్వం బ్రతుకుతుంది. ఇంత సోత్కర్ష ఎందుకు చెపుతున్నాను అంటే రత్నం అవసరం మనకు ఎంతో ఉంది. నాకు తోడబుట్టిన వాళ్ళు లేరన్న లోటు తనతో తీరింది. అందుకే తను వెనక్కి వెళ్లిపోయే ప్రతిపాదనకు స్వస్తి పలికించాను .. ...” అని భావగర్భితంగా అంటూ ఉంటే శ్రీకాంత్ “ అవును రమణీ ! నీ సహకారం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను ? మనకు ఉన్న దాంట్లో బాధాతప్త హృదయాలను కూడా ఆదుకుంటే ఈ జీవితాలకు అర్ధం , పరమార్థం అంటూ ఉంటుంది.చిన్నప్పుడే భర్తను పోగొట్టుకున్న రత్నానికి ఏదో విధంగా దారి చూపడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మంచి పనులలో నీకు కూడా ఎప్పుడూ భాగం ఉంటుంది . ముందు రత్నానికి ధైర్యం చెప్పి తను జీవించినంత కాలం మనం భరోసాగా ఉంటాం అని ఇంకోసారి నచ్చచెప్పు. ఎందుకో తను బట్టలు సద్దుకోవడం చూస్తూంటే అనుమానంగా ఉంది ..’ అన్నాడు శ్రీకాంత్.
“ఆ విషయం నాకు వదిలేయండి. ఇప్పుడు రత్నం మనలో ఒకరిగా మారిపోయింది. తిరిగి వెళ్లిపోవాలన్న నిర్ణయం నుండి ఎప్పుడో బయటకు వచ్చేసింది. ..” అని రమణి అంటూంటే పోనీలే. పాపం మళ్ళీ తను పాత జీవితం గడపాల్సి వస్తుందేమో అని భయపడ్డాను ..” అన్నాడు శ్రీకాంత్ గుండెలానిండా ఊపిరి పీల్చుకుంటూ *******