అపరేషన్ ఈగిల్

మా అసోసియేషన్ • 01 Mar 2025 • 👁 2 views
ఆపరేషన్ ఈగిల్.

***

హైదరాబాద్, అత్తాపూర్, ఎన్ సీ బీ ఆఫీస్ బిల్డింగ్. సమయం ఉదయం పది గంటలు.

పార్కింగ్ ఆవరణలో పోలీస్, ఎన్ సీబీ, నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్ వైజింగ్ వింగ్ మరియు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, వార్తాపత్రికల విలేఖరుల, టీవీ చానెల్స్ వాహనాలతో నిండి పోయింది.

భారత ప్రభుత్వం, దేశంలో పెరిగి పోతున్న డ్రగ్స్ కల్చర్ పై ఉక్కు పాదం మోపి, డ్రగ్ మాఫియాల ఆటకట్టియ్యాలని, దృఢనిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పర్యవసానమే ఎన్ సీ బీ ఆఫీస్ బిల్డింగ్ లో డైరెక్టర్ జనరల్ మల్హోత్రా అధ్యక్షతన జరగబోతున్న ఈ మీటింగ్.

పెద్ద హాల్ లో...

పోలీస్, ఎన్ సీబీ, నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్ వైజింగ్ వింగ్ మరియు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఉన్నతాధికారులు అందరూ ముందువరుసలో ఆసీనులై ఉన్నారు. ఒక పక్కన వార్తాపత్రికల విలేఖరులు కూర్చుని ఉన్నారు. వెనుక వరుసల్లో వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారులు కూర్చుని ఉన్నారు. హాల్ అంతా కోలాహలంగా ఉంది.

కొదమసింహంలా నడచి వస్తున్న ఆరడుగుల ఆజానుబాహుడిని చూసి, హాలు బయట పిన్ డ్రాప్ నిశ్శబ్దం ఆవహించడంతో, లోపల కూడా కోలాహలం సద్దుమణిగి పోయింది.

రాష్ట్ర డీజీపీ, ఎన్ సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వెంటరాగా, ఎన్ సీబీ డైరెక్టర్ జనరల్ మల్హోత్రా, ఆ హాలులో ప్రవేశించి డయాస్ పైకి చేరుకున్నాడు. డయాస్ పైనున్న ఉన్నతాసనంపై ఆసీనుడయ్యాడు. ఆయన పక్కన కుడి ఎడమల్లో ఉన్న ఉచితాసనాల్లో, రాష్ట్ర డీజీపీ రంజిత్ సింగ్, ఎన్ సీబీ డిప్యూటీ జనరల్ ప్రకాష్ చంద్రలు ఆసీనులయ్యారు.

మైక్ అందుకుని “డియర్ ఆఫీసర్స్ మరియు పత్రికావిలేఖరులకు నా హృదయ పూర్వక ఆహ్వానం పలుకుతూ సభను ప్రారంభిస్తున్నాను. (పాఠకుల సౌకర్యార్థం, ఆంగ్లం లో ఉన్న సంభాషణ తెలుగులోకి అనువదించి చెప్పటం జరిగింది.)

ఈ రోజుల్లో దేశంలో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఎక్కడ ఏ మూలన చూసినా, నేరాలూ, ఘోరాలూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడవారిపై లైంగిక దాడులు బాగా పెరిగి పోతున్నాయి. వీటి వెనుక పబ్ కల్చర్, డ్రగ్ కల్చర్ నీలి నీడలు దాగున్నాయని అర్థమౌతుంది. దేశ ప్రగతికి రథచక్రాల్లాంటి యువత మత్తుకు బానిసైతే, దేశం అభివృద్ధి పథంలో ఎలా పయనిస్తుంది? మూడు రోజుల క్రితం కేంద్ర హోమ్ మినిస్టర్ గారు నన్ను పిలిచి మాట్లాడారు. ఇద్దరం ఇదే విషయంపై చర్చించాము. 'మొక్కై వంగనిది, మ్రానై వంగునా?’ అన్న ప్రశ్న మా మనసులో కలిగింది. ఇప్పుడు మొక్కగా ఉన్న డ్రగ్ కల్చర్ ని, ఇప్పుడే నడుం విరగేలా వంచేయాలి, ఈ మత్తు కల్చర్ సమాజంలో వేళ్ళూనక ముందే మనం ఈ కలుపును కూకటివేళ్ళతో పీకేయాలని మేము నిర్ణయించుకున్నాము.

డ్రగ్స్ వల్ల సమాజంలో ఏం జరుగుతుందో, అవి మానవతావిలువల్ని ఎంతగా దిగజార్చుతున్నాయో, మీకు అర్థం కావడానికి ఒక వాస్తవ సంఘటన గురించి మీకు చెప్తాను వినండి.

డ్రగ్స్‌కు బానిసైన ఓ వ్యక్తి తన తండ్రికి నిప్పంటించి హత్య చేసిన ఘటన హైదరాబాద్ శివార్లలో ఏప్రిల్ మొదటివారంలో గురువారం నాడు జరిగింది.

'గంజాయి' మత్తుకి అలవాటు పడి మానసిక స్థిరత్వం కోల్పోయిన నిందితుడు, తనకు బైక్ కొనివ్వలేదని తండ్రి సురేంద్రతో వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరిగి, రెండు బాటిళ్ల పెట్రోలు ఇంట్లో నిల్వ ఉంచుకున్న ఆనంద్, ఆవేశంతో మధ్యాహ్న భోజనం చేస్తున్న సురేంద్రపై, ఒక బాటిల్‌ పెట్రోల్ పోసాడు, తనను తాను కాపాడుకునేందుకు మొదటి అంతస్తు నుంచి కిందకు పరుగెత్తాడు సురేంద్ర. ఆనంద్ మరో పెట్రోల్ బాటిల్ పట్టుకుని అతడిని వెంబడించాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో, ఆనంద్ తండ్రిని దొరకబుచ్చుకుని లైటర్‌తో నిప్పంటించాడు. సహాయం కోసం అరుస్తూ, సురేంద్ర ఇంటినుండి బయటకు పరుగెత్తాడు. కానీ, ఆనంద్ అతడిని వెంబడించాడు. ఇంటికి కొంత దూరంలో, ఒంట్లో ఓపిక నశించి కుప్పకూలాడు సురేంద్ర. తండ్రిపై మరో బాటిల్ పెట్రోల్ పోశాడు ఆనంద్. అంతటితో ఆగకుండా, రాయితో సురేంద్ర తల పగలగొట్టాడు. తల్లి సుధను ఓ గదిలో బంధించి, షర్ట్ మార్చుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ సంఘట జరగటానికి ముందే అంటే, ఆరునెలల క్రితం డ్రగ్స్‌కు బానిసై ఆనంద్ తన ఉద్యోగం కోల్పోయాడు. ఆనంద్ మత్తు పదార్థాలకు బానిసై, అతని తండ్రిని మాటలతో మరియు శారీరకంగా హింసించాడు. తల్లిదండ్రులతో, తమ్ముడు అవినాష్ తో తరచూ గొడవపడేవాడు. ఆనంద్ ఇప్పుడు పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు.

ఇప్పుడు చెప్పండి, ఈ దారుణం జరగడానికి కారణం ఎవరు? మన నిఘా విభాగాలు, ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ని కనిపెట్టలేకపోవడం కాదా? పబ్లిక్ ప్లేసెస్ లో సరుకు మార్పిడి జరుగుతున్నా, మనం కనిపెట్టలేక పోతున్నాం. కచ్చితంగా ఇది మన ఫెయిల్యూరే అని నేనంటాను.

ఆనంద్ జీవితం నాశనం అవ్వడానికి, సురేంద్ర మరణానికి, ఒక నిషేధిత మత్తుపదార్థం కారణమైంది. వీటి అమ్మకాలనీ, కొనుగోళ్ళనూ మనం అడ్డుకోగలిగితే, మన డ్యూటీని పరిపూర్ణంగా చేసిన వాళ్ళమే కాకుండా, సమాజాన్ని తప్పుదోవ పట్టకుండా కాపాడిన వాళ్ళం కూడా అవుతాం. సో... మై డియర్ ఆఫీసర్స్, అప్రమత్తం కండి, డ్రగ్స్ మాఫియాను కూకటి వేళ్ళతో పెకలిస్తామని ప్రతిన బూనండి. ఇప్పుడు మీలో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు" అని తన ప్రసంగాన్ని ముగించాడు డైరెక్టర్ జనరల్ మల్హోత్రా.

హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆయన ముందు నోరు తెరవడానికి చాలా మంది ఆఫీసర్స్ ఇబ్బంది పడుతుండగా, చరణ్ అనే ఇన్స్పెక్టర్ చెయ్యి పైకి లేపాడు.

"యస్... మీ అభిప్రాయాలని, డ్యూటీ నిర్వహణలో ఇబ్బందులను నిర్మొహమాటంగా చెప్పండి" అన్నాడు మల్హోత్రా.

"నమస్తే సార్! నా పేరు చరణ్, ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నాను. మీరు చెప్పిన సంఘటన, ప్రతి హృదయాన్ని కలచివేసేది. డ్రగ్స్ వల్ల మనుషుల్లో మానవతావిలువలు, సంబంధ, బాంధవ్యాల విలువలు నశించిపోతున్నాయని తెలిపే సంఘటన అది. ఈమధ్య యువతలో, అనేక రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి, అవి అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి. మన నిఘావిభాగాలు సరిగ్గానే పనిచేసి, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి కానీ, కొన్ని రాజకీయ ఒత్తిళ్లు, మా విధులను నెరవేర్చకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. అవి మామూలు ఒత్తిళ్లు కావు, అత్యంత ఉన్నత పదవుల్లో ఉన్న, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు. వాళ్ళ అనుయాయులతో, ఈ డ్రగ్స్ వ్యాపారాలు చేయిస్తూ, అందులో వాటాలు తీసుకుంటున్న నాయకులు చాలామంది ఉన్నారు. ఇది ఒక రకంగా అధికార దుర్వినియోగం, రాజకీయ అవినీతి. ఎవరైనా ఆఫీసర్ సిన్సియర్ గా ఉండి వాళ్ళ మాటలు పెడచెవిన పెడితే, వెంటనే వారిని, ప్రాధాన్యత లేని ఒక పోస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. దానివల్ల మన డిపార్ట్మెంట్ లో చాలామంది ఆఫీసర్స్, సబార్డినేట్స్, అభద్రతాభావంతో ఉన్నారు. మీకు నేను చేసుకునే మనవి ఏమిటంటే, బయట నుంచి మాకు ఎలాంటి ఒత్తిడులు లేకుండా చేయండి. మన డిపార్ట్మెంట్ సత్తా ఏంటో మీకు ఒక్క వారం రోజుల్లోనే తెలిసిపోతుంది. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు" అని సెల్యూట్ కొట్టి కూర్చున్నాడు చరణ్.

"ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి?" గంభీరమైన గొంతుతో అన్నాడు మల్హోత్రా.

సభలో గుండుసూది పడితే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. మాట్లాడటానికి ఎవరూ సిద్ధంగా లేరు.

"వెల్ మై డియర్ ఆఫీసర్స్! ఈరోజు నుంచీ మీపై ఎలాంటి ఒత్తిడులు, ఉండవని నేను హామీ ఇస్తున్నాను. ఎవరైనా మీపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తే, సాక్ష్యాలను భద్రపరిచి, మీ విధులను ఆటంకపరచినందుకు, వాళ్లపై కేసు పెట్టండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. నేను కూడా, బయట ఒత్తిళ్ళు మీపై రాకుండా ఏం చేయాలో ఆలోచించి, చర్యలు తీసుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ జోన్ లో, ఈ డ్రగ్ మాఫియాను, ఎలా కంట్రోల్ చేస్తారో, ఎలా నిర్మూలిస్తారో ఒక యాక్షన్ ప్లాన్ తీర్మానించమని కోరుతున్నాను." అన్నాడు మల్హోత్రా.

ఎన్ సీ బీ, హైదరాబాద్ జోన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ప్రకాష్ చంద్ర లేచి మైక్ అందుకున్నాడు.

"రెస్పెక్టెడ్ జనరల్ సర్! మీరు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం వల్ల, అన్ని డిపార్ట్మెంట్ క్యాడర్స్ కి, మానసిక స్థైర్యాన్ని బూస్టప్ చేశారు, ధన్యవాదాలు. మధ్యాహ్నం నా ఆఫీసర్స్ తో చర్చించి, ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ తయారుచేసి, ఈరోజే మీకు సబ్మిట్ చేస్తాను. ఈ యాక్షన్ ప్లాన్ పూర్తిగా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాము. లీక్ అయితే, డ్రగ్ పెడ్లర్స్, డిస్ట్రిబ్యూటర్స్, సెల్లర్స్, బయ్యర్స్ అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడలేను, థాంక్యూ!" అని కూర్చున్నాడు ప్రకాష్ చంద్ర.

"వెల్! ఈ మీటింగ్ ముగించే ముందు, నాదొక విన్నపం... ఇప్పుడు ఇక్కడున్న డిపార్ట్మెంట్స్ అన్నీ, పూర్తి కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ తో వ్యవహరించవలసిందిగా కోరుతూ, ఈ మీటింగ్ ను ముగిస్తున్నాను ధన్యవాదాలు." అని, వేగంగా నడుచుకుంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు మల్హోత్రా.

***

ఆ రోజు మధ్యాహ్నం తన సబార్డినేట్ ఆఫీసర్స్ అందరితో మీటింగ్ పెట్టుకుని, యాక్షన్ ప్లాన్ తయారు చేశాడు ప్రకాష్ చంద్ర.

పర్మిషన్ తీసుకొని తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ప్రకాష్ చంద్రను చూసి, "వెల్కమ్ ప్రకాష్! యాక్షన్ ప్లాన్ రెడీ చేసావా?"(ఆంగ్ల సంభాషణను తెలుగులో ఇవ్వడం జరిగింది)

"చేశాను సార్! ఇదిగో ఈ ఫైల్ లో వివరాలు ఉన్నాయి" అని ఒక ఫైల్ ను ఆయనకు అందజేశాడు. ఫైల్ ను ఓపెన్ చేసి చూశాడు మల్హోత్రా.

'ఆపరేషన్ ఈగిల్' హెడ్డింగ్ కింద, హైదరాబాద్ సిటీలో, ఎక్కడెక్కడ మాదకద్రవ్యాల వ్యాపారం సాగుతుందో, వివరంగా చెప్పబడింది.

ఒక్కొక్క అడ్డాకు మాఫియా నాయకుడెవరో కూడా పేర్కొనబడి ఉంది. ఆ అడ్డాలను టార్గెట్ చేసుకుంటూ, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ను ఏర్పాటు చేశాడు ప్రకాష్ చంద్ర.

ఫైల్ మొత్తం చదివి తలపంకించాడు మల్హోత్రా, "వెల్! యు కెన్ ప్రొసీడ్!" అని బొటన వేలు పైకెత్తి థమ్స్ అప్ చెప్పాడు.

లేచి సెల్యూట్ చేసి బయటికొచ్చాడు ప్రకాష్ చంద్ర.

***

'ఆపరేషన్ ఈగిల్'

బాలానగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ ఓ టీ ) ఇన్స్పెక్టర్ అర్జున్, కానిస్టేబుల్ లు పాషా, రాజయ్యలు మఫ్టీలో వెళ్లి మెట్రో స్టేషన్ వద్ద మాటు వేసి ఉన్నారు. అక్కడ ఒక ఆటో డ్రైవర్ దొంగలాగా వెళ్లి, టోపీ పెట్టుకున్న మరొకడి చెవిలో ఏదో చెప్పాడు. 500 రూపాయల నోటు వాడి చేతిలో పెట్టాడు.

వెంటనే పక్కకి వెళ్లి, పావు గంట తర్వాత వచ్చాడు టోపీవాడు. ఆటోవాడు వాడి దగ్గరకెళ్లి, వాడిచ్చిన చిన్న ప్యాకెట్ తీసుకున్నాడు. ఆటో నెంబర్ నోట్ చేసుకున్నాడు అర్జున్. యాప్ లో రిజిస్ట్రేషన్ పేరు చూసాడు. బాలానగర్ ఎస్ ఐ కి ఫోన్ చేసి, ఆటో నెంబర్ మెసేజ్ చేశాడు.

రాజయ్యను దగ్గరికి పిలిచి చెవిలో ఏదో చెప్పాడు అర్జున్. తలపంకించి, రాజయ్య ఆ టోపీ వాలా దగ్గరికి వెళ్ళాడు. వాడి చేతిలో 500 పెట్టి, “గంజాయి" అని వాడి చెవిలో చెప్పాడు.

రాజయ్యను అనుమానంగా చూసాడు టోపీ వాలా. "నయా కస్టమర్ భయ్యా, రంగాకీ దోస్త్" అని ఆటో వాడి పేరు చెప్పాడు.

వాడు పక్కకి వెళ్లి పోయాడు, కొంత దూరంలో ఉన్న వీధిలోకి వెళ్ళి నడవసాగాడు. టోపీ వాలాకు అనుమానం రాకుండా వాడిని దూరం నుంచీ ఫాలో అవుతున్నారు అర్జున్, పాషా, రాజయ్యలు.

ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాడు టోపీవాలా. అర్జున్ కూడా లోపలికి వెళ్లి వాచ్మెన్ ని పిలిచి
టోపీవాలా ఏ ఫ్లాట్ లోకి వెళ్ళాడో చెప్పమన్నాడు.

"మీరెవరు? అతన్ని నేను చూడలేదు సార్” అన్నాడు.

"మర్యాదగా చెప్తావా, బొక్కలో వేసి బొక్కలిరగ్గొట్టమంటావా?" కటువుగా అన్నాడు అర్జున్.

"అరే పాగల్ పోలీసోళ్ళంరా! వాడు గాని దొరక్కపోతే, నిన్ను లోపలేసి కుమ్ముతం. జల్దీ చెప్పు!" అన్నాడు పాషా.

"ఫ్లాట్ 304" పోలీసోళ్ళు అనగానే బెదిరిపోయి, ప్లాట్ నెంబర్ చెప్పేసాడు వాచ్మెన్.

అర్జున్ తో పాటు ఇద్దరు కానిస్టేబుల్ లు వెళ్లి, ఫ్లాట్ 304 ను రైడ్ చేశారు. టోపీ వాలాతో పాటు, మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి 29 ఏళ్ల కనగాల వినోద్ కుమార్, మల్కాజిగిరి వాసి. వృత్తి ఏంటని అడిగితే, కుక్కలను పెంచి అమ్ముతుంటానని చెప్పాడు. “ఆ ఆదాయం సరిపోక, ఇక్కడ ఫ్లాట్ కిరాయికి తీసుకొని గంజాయి అమ్ముతున్నాను” అని చెప్పాడు. హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించి, కాంట్రా బ్రాండ్ గంజాయి అమ్ముతుంటానని, ఈ కాంట్రా బ్రాండ్ గంజాయి ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, యువకులు, ఆటోవాలాలు కొంటుంటారని చెప్పాడు. అతని వద్ద 94 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఆ టాస్క్ ఫోర్స్ టీం. అతనితో పాటు టోపీ వాలాను కూడా అరెస్ట్ చేసి ఇద్దరినీ జీప్ ఎక్కించారు. బాలానగర్ ఎస్సై, ఆటోవాలాను అదుపులోకి తీసుకున్నాడు.

***

అదే రోజు ...

మాదాపూర్ ఎస్ ఓటీ, ఇన్స్పెక్టర్ కిషోర్ నేతృత్వంలో మరొక గంజాయి స్మగ్లర్ ని సనత్ నగర్ లోని ఒక పెద్ద కంపెనీ వద్ద గంజాయి అమ్ముతుండగా అరెస్ట్ చేసింది. రెండున్నర లక్షల విలువగల కాంట్రా బ్రాండ్ గంజాయిని అతనివద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలో ఉండే ఫ్యాబ్రికేషన్ పనివాడు, 24ఏళ్ల సూల సుభాష్, బీదర్ లోని జరీనా నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లుగా చెప్పాడు. అక్కడ నుంచి వచ్చిన గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా ప్యాక్ చేసి వాటిని స్టూడెంట్స్ కి, లేబర్ కి అమ్ముతున్నానని చెప్పాడు. సుభాష్ ని, అతని సహాయకుడు అహ్మద్ ని అరెస్ట్ చేసి సనత్ నగర్ పోలీస్ కి అప్పజెప్పాడు ఇన్స్పెక్టర్ కిషోర్. సనత్ నగర్ పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ఈ కేసులో డ్రగ్ పెడ్లర్ అయిన జరీనాను ఆమె అనుచరులను వెతకటానికి, అదుపులోకి తీసుకోవడానికి బీదర్ పోలీసులు సమాయత్తమయ్యారు.

***

అదే రోజు రాత్రి, నాంపల్లి అండ్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో...

ఇన్స్పెక్టర్ మహేష్ నేతృత్వంలో, నాంపల్లి ఎస్ఓటి ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్స్ ని అరెస్ట్ చేసింది. బంజారాహిల్స్ లో ఉండే జూనియర్ ఆర్టిస్టు మియ్యనోల కిషన్ ని, ఆటో డ్రైవర్ మహమ్మద్ రిజ్వాన్ ని, బాలాపూర్ లో ఉండే గ్యాస్ డెలివరీ బాయ్ రవికుమార్ ని అదుపులోకి తీసుకున్నారు.
వాళ్ల దగ్గర 255 మిల్లీ లీటర్ల హాష్ తైలం, 3 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేశారు.

వీళ్ళు ముగ్గురూ విశాఖపట్నంలోని రాజలింగం అనే డ్రగ్ పెడ్లర్ వద్ద నుంచి ఈ సరుకు కొనుగోలు చేశారని చెప్పారు.

నాంపల్లి, అసిఫ్ నగర్ పరిధిలో అమ్మకానికి ప్రయత్నం చేస్తూ ఎస్ ఓటీ కి దొరికిపోయారు.

ఇన్స్పెక్టర్ మహేష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో, విశాఖపట్నం పోలీస్ రాజలింగంని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.

***

అదే రోజు రాత్రి మరొక సంఘటనలో...

ఇన్స్పెక్టర్ రామకృష్ణ నేతృత్వంలో, సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ని ఆసిఫ్ నగర్ లోని చోటి మసీదు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

వాళ్ల వద్ద నుంచి 2.5 గ్రాముల ఎండిఎంఏ ను స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజ్, అరవింద్ , మన్సూర్ అలీ కలిసి, మహమ్మద్ మునావర్ కి అమ్ముతుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు.

***

సైబరాబాద్‌ పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో, పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, నలుగురు వ్యక్తులను మాదక ద్రవ్యాలతో అదుపులోకి తీసుకున్నారు.

అత్తాపూర్‌లోని కటాలాపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మొదటి ఆపరేషన్‌లో, గగన్ బహుమా, 1.9 కిలోల గంజాయిని కలిగి ఉన్నందుకు అరెస్టు చేయగా, మాదాపూర్‌లోని సిద్ధిక్‌నగర్‌లో, విశాల్ మరియు ధవళ్ లు 1.5 కిలోల గంజాయిని వెంట తీసుకువెళుతున్నందుకు అరెస్టు చేశారు.

బాలకంపేట్ ఎల్లమ్మ దేవాలయం సమీపంలో రెండవ దాడిలో, సనత్‌నగర్‌కు చెందిన కుమ్మరి సాయి అనే వ్యక్తిని ఎస్ ఒటీ బృందం పట్టుకొని, అతని నుండి ఐదు ఎల్ఎస్‌డి పేపర్లను స్వాధీనం చేసుకుంది.

అత్తాపూర్‌లోని డీమార్ట్ సర్వీస్ రోడ్డు సమీపంలో, వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, రాజేంద్రనగర్‌లో నివాసముంటున్న సయ్యద్ షకీల్, 210 గ్రాముల గంజాయిని కలిగి ఉన్నందుకు అరెస్టు చేశారు.

వీళ్లందరిపై, ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

***

పోలీసుల వరుస దాడులతో డ్రగ్ మాఫియా, కూసాలు కదిలి పోయాయి. దొంగచోటుగా ఈ డ్రగ్ పెడ్లర్ ల చాటున దాక్కుని వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకులకూ, రౌడీ షీటర్లకూ, వణుకు పుట్టసాగింది. అప్పటికే కొన్ని వర్గాల నుంచి రాష్ట్ర డిజిపికి ఫోన్లు వెళ్లాయి. ఆయన ఒక్క ఫోన్ కూడా రిసీవ్ చేసుకోలేదు.

టీవీలో 'ఫ్లాష్ న్యూస్' వార్తలు వస్తుంటే, చూడసాగాడు రాష్ట్ర డిజిపి రంజిత్ సింగ్.

"డ్రగ్ మాఫియాపై పోలీసుల ఉక్కు పాదం! ఈరోజు జరిగిన పోలీసు దాడుల్లో, ఇప్పటివరకూ
రాష్ట్రంలో 17 మందిని, ఇతర రాష్ట్రాల్లో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్ మాఫియాని, కూకటి వేళ్ళతో పెరకివేయాలని, పోలీస్ శాఖ నిశ్చయించుకుంది, అందుకుగాను, ఎన్ సీబీ, హైదరాబాద్ జోన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రకాష్ చంద్ర ఆధ్వర్యాన ప్రతిష్టాత్మకమైన 'ఆపరేషన్ ఈగిల్' రూపుదిద్దుకుంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పోలీస్ ఆఫీసర్లు, టాస్క్ ఫోర్స్ లుగా ఏర్పడి చేసిన సెర్చ్ ఆపరేషన్స్ లో, నమ్మలేని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్ని రోజులు చట్టం కళ్ళు కప్పి, మాదక ద్రవ్యాలతో, వ్యాపారాలు చేస్తూ, యువతలోని ప్రతిభను నిర్వీర్యం చేస్తున్న, డ్రగ్ మాఫియా తోకముడిచింది. పోలీసులు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని, ఈ దాడుల ద్వారా, అరెస్టుల ద్వారా నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రజలు పోలీసులకు, చెయ్యెత్తి సెల్యూట్ కొడుతున్నారు" అని స్పెషల్ బులెటిన్ చదవడం ముగించింది టీవీ న్యూస్ రీడర్.

***

(సమాప్తం)