ఉదర భార న్యాయం "

తపస్వీ మనోహరం • 29 Jan 2023 • 👁 4 views
ఉదర భార న్యాయం "
" ఉదర భార న్యాయం " (హాస్య కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
( 29/1/2023 తపస్వీ మనోహరం వార పత్రికలో ప్రచురితం )
"ఏమిటోయ్ సుబ్బూ అలా పొట్టను ఇష్టమొచ్చినట్టు పెంచేస్తున్నావు. క్రితం సారి కనపడినప్పుడు బాగానే ఉన్నావు కదా. అంతలోనే ఏమయ్యింది ?ఎందుకిలా నీ శరీరాన్ని క్షోభ పెట్టుకుంటున్నావు ? " అడిగాడు రామారావు సుబ్రమణ్యాన్ని పైనుండి కిందకు ఎగా దిగా చూస్తూ.
తన ప్రియమిత్రుడు రామారావు తేరుకోలేని కామెంట్ చేసేటప్పటికి సుబ్రమణ్యానికి తలకొట్టేసినట్టుగా అనిపించింది.
స్నానం చేసి వస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నప్పుడు కూడా సుబ్రమణ్యం అంత సీరియస్గా తీసుకోలేదు. టవల్ బిగించి కట్టుకోవడం వల్ల పొట్ట పైకి కనిపిస్తోందనో , బెల్ట్ టైట్ గా బిగించి కట్టుకున్నాననో సమయానుకూలంగా వాళ్ళకు ఏదో ఒకటి సద్ది చెప్పుకుంటూ వస్తు తనని తాను ఆత్మవంచన చేసుకుంటూ ఉండేవాడు. . కానీ లోలోపల మాత్రం తనకేదో పెద్ద అనారోగ్యం వచ్చినట్టుగానే తల్లడిల్లిపోయే వాడు. అప్పుడప్పుడు ఊపిరి లోపలకు పీల్చి కాసేపు పొట్టను అణచడానికి విశ్వ ప్రయత్నం కూడా చేసే వాడు. అబ్బే ఎక్కడా అది లొంగడం లేదు. కానీ అది ఇంకా ఇంకా ముందుకు తన్నుకుంటూ రావడం గమనించాడు. ఈ రోజు తన మిత్రుడు ఉన్న విషయాన్ని మోహమ్మీదే అనేసేసరికి సుబ్రమణ్యం డోలాయమాన స్తితిలో పడిపోయాడు. ఏదో ఒక పరిష్కార మార్గం అన్వేషించే పనిలో పడ్డాడు.
టీవీలో అప్పుడప్పుడు యోగా గురువు రాందేవ్ బాబా విన్యాసాలు చూస్తున్నప్పుడు అతనికి ఆశ్చర్య వేసేది . ఆయన పొట్టను విష్ణుచక్రంలా తిప్పేస్తూ అప్పడంలా లోపలకు లాగేసి అరగంటకు పైగా వీక్షకుల కళ్ళు తిప్పుకోలేని విధంగా యోగా చెయ్యడం అది నిజంగానా లేక ఫోటోగ్రఫి ట్రిక్కా అని కూడా ఆశ్చర్యపోని రోజు లేదు. రానూ రానూ నాలుగు అడుగులు వెయ్యాలంటే ఒక పది టన్నుల యంత్రాన్ని ఇనప వైరు కట్టి లాక్కు వెళ్తున్నట్టుగా అనిపించేది. తనలాగా పొట్టలున్న వాళ్ళు ఎవరేనా కనపడతారా అని బజారులో అటూ ఇటూ , నాలుగు మూలలా వెతికే వాడు. . చాలా మంది బానపొట్టలు వాళ్ళు తను రెగ్యులర్గా మార్కెట్ చేసే షాపులలో కనపడేసరికి "ఓహో . వాళ్ళ కన్నా తనే నయం . వాళ్ళు అలా గంటల కొద్దీ శరీరాలను కూర్చున్న చోటే కుదేయ్యడం వల్ల తమ శరీరాన్ని కొండలలాగా పెంచేస్తున్నారు. మరి తను అలా చెయ్యడం లేదు కదా. వాకింగ్ రోజుకు రెండు మూడు గంటలు గ్యారంటీగా చేస్తాడు. శరీరంలో కొవ్వు ఎంత కరుగుతోందో చూపించే వాచీ చేతికి పెట్టుకున్నాడు. ఏదైనా తీపి పదార్ధం తిన్నా, ఇష్టమైన అరటి పండు తిన్నా వెంటనే అప్పటికప్పుడు వాటి క్యాలరీలు కరిగిపోయేటట్టుగా వూరంతా పిచ్చి తిరుగుడు తిరిగేసి వస్తూ ఉంటాడు. అయినా కూడా అందరిచేత సూటీ పోటీ మాటలు తప్పడం లేదు. వాళ్ళల్లో ప్రమాద హెచ్చరికలు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అటువంటి సమయంలో అతని మొహంలో వున్న కొద్దిపాటి నవ్వు కూడా మాయమవుతుంది. ఆ స్తానంలో తీవ్రమైన దిగులు ఆవరించేస్తుంది.
ఇక ఇలా లాభం లేదనుకుని యూట్యూబులలో బెల్లీ ఫాట్ తగ్గడం గురించి ఆలోపతిక్, ఆయుర్వేద, హోమియో డాక్టర్లు నివారణోపాయాలు ఏం చెపుతున్నారో నని యూట్యూబులనంతా జల్లెడ పట్టడం మొదలు పెట్టాడు. ఒకటి తెరిస్తే వరసగా వందమంది పెద్ద పొట్టల గురించి ఎలా తగ్గించుకోవాలో సంజీవనీ లాంటి ఉపాయాలు చెప్పడం కనిపిస్తున్నాయి. అందరికీ దాదాపు వేలలో లైకులు, షేరులు, పిచ్చ రేటింగ్ ఉంది. ఎవరికి వారు తమకు తెలిసిన ఉపాయాలతో రెచ్చిపోతున్నారు. వైద్య శాస్త్రంలో ఆ .. ఆ .. లు రాని వాళ్ళు కూడా మగా, ఆడా అని తేడా లేకుండా అరచేతిలో వైకుంఠాన్ని చూపించేస్తున్నారు. ఇంకా కొందరైతే వైద్యానికి ఏ సంబంధం లేకుండా అప్పుడప్పుడు రాజకీయ సమీక్షలు చేసి గందరగోళం సృష్టించే వాళ్ళు కూడా టీవీలలో విచిత్రంగా ప్రత్యక్షమయ్యి యాంకర్లు అడిగిన ప్రశ్నలకు బానపొట్టలను సైతం వెన్నలాగా కరిగించగలిగే ట్రిక్కులను చెప్పేస్తూ ఆయా బాధితులను టీవీల దగ్గరా, కంప్యూటర్ల దగ్గరా కట్టిపడేస్తున్నారు. . ఇలా ఉంటే ఇంకొంతమంది ఏవేవో ఆకులు , కాయలు, పోపుల పెట్టెలో దొరికే వస్తువులను నీళ్ళల్లో మరిగించి ఒక రెండు మూడు నెలలు పాటు తాగితే ఎటువంటి పర్వతాలైనా ఇట్టే లొంగిపోతాయి అని ప్రాక్టికల్ గా టీవీ స్టూడియో లోనే చేసి చూపించేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ యాంకర్ కు , ఆ సలహాలు ఇచ్చే వాడికీ కూడా ఇద్దరికీ చొక్కాల్లోంచి తన్నుకొచ్చే పొట్టలు పెద్ద గుమ్మడికాయలుగా లాగా కనిపిస్తూనే ఉంటాయి. ఒక్క ఇంగ్లిష్ డాక్టర్లు మాత్రం మీకు పొట్ట ఉందా ? అయితే గుండె జబ్బు రావడం ఖాయం. దాన్ని కానీ కరిగించుకోకపోతే మీరు ఒక హార్ట్ పేషెంట్ కింద లెక్కే. ఎప్పటికైనా మీరు రెడీగా ఉండక తప్పదు అంటూ పది మంది ఇంగ్లిష్ డాక్టర్ల ఇంటర్వ్యూలు ఉంటే అందులో ఎనిమిది మంది భయపెట్టే వాళ్ళను రోజూ సుబ్రమణ్యం గమనిస్తూనే ఉన్నాడు. . ఆలోపతి వాళ్ళు తప్ప మిగిలిన మాయామచ్చీంద్రలు అందరూ యు ట్యూబులలో తమ రేటింగులు పెంచుకుంటూ ఆ చేత్తో, ఈ చేత్తో డబ్బులు సంపాదించేసుకుంటున్నారు తప్ప ఎవ్వరికీ కూడా ఒక్క ఇంచ్ కూడా పొట్ట తగ్గిందని చెప్పుకున్నట్టు సుబ్రమణ్యం వినలేదు. అప్పటికీ ఒంటిపూట అన్నం తినడం మొదలు పెట్టాడు. కానీ ఆయాసం తప్ప ఏమీ మార్పు కనపడటం లేదు.
ఇటువంటి ఇబ్బందికర పరిస్తితులలో కొట్టుమిట్టాడుతున్న సుబ్రమణ్యం ఇంటికి ఒకరోజు అతని దగ్గర బంధువులో ఎంబీబీఎస్ చదివి హైదరాబాద్లో చాలా కాలంగా ప్రాక్టీస్ నడుపుతున్న పరమేశం బాబాయి రావడం తటస్టించింది. అతను రాగానే సుబ్రమణ్యం భార్య తన భర్త రోజూ పడుతున్న వేదన గురించి చెప్పి భయపెట్టకుండా ఏదైనా ఆచరించదగ్గ ఉపాయం చెప్పి తన భర్తకు ప్రాణ బిక్ష పెట్టమని వేడుకున్న దరిమిలా పరమేశం " అమ్మాయి ! కంగారు పడొద్దు. నేను ఇక్కడికి రాగానే సుబ్రమణ్యం పరిస్తితిని గమనించాను. నో డౌట్ అతనికి ఇబ్బందికరమైన పెద్ద పొట్ట ఉంది . ఇది తగ్గడానికి అతని జీవన శైలిని పూర్తిగా మార్చుకోవాలి. ముందుగా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను . వాటికి సమాధానం చెప్పాక దానికి తగిన సలహాలు ఇస్తాను. మొదటి ప్రశ్న - మీ ఆయన కంప్యూటర్ దగ్గర రోజుకు ఎంతసేపు గడుపుతున్నాడు ? టిఫిన్లు, భోజనాలు అన్నీ కూర్చున్న చోటుకే తెప్పించుకుంటున్నాడా ? రెండవ ప్రశ్న : ఉదయం భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రలోకి జారుకుంటున్నాడా ? పడుకుంటే ఎంతసేపు పడుకుంటున్నాడు ? మూడవ ప్రశ్న కేవలం వాకింగ్ అంటూ బజారులలో ప్రతి షాపు దగ్గరా ఆగుతూ కాలక్షేపం చేస్తున్నాడా ? అప్పుడప్పుడు చిన్న చిన్న యోగాసనాలు వేస్తున్నాడా ? కంప్యూటర్ దగ్గర కూర్చున్నా ప్రతి ఐదు, పది నిమిషాలకు కుర్చీలోంచి లేచి అటూ ఇటూ కదులుతున్నాడా లేదా ?వైట్ రైస్ లంచ్ లో తక్కువ పరిమాణంలో తింటున్నాడా లేదా ? ఈ ప్రశ్నలు అన్నిటికీ మీ ఇద్దరూ కూడా బాగా సమాధానపరుచుకుని సరైన దారిలో నడవడానికి అతని వెన్నంటే ఉండి లొంగదీస్తే కానీ ఒంట్లో, ముఖ్యంగా పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరగడం అసాధ్యం. ఒక సారి పొట్టలో చేరిన కొవ్వు కరగడం ఎన్ని కాషాయాలు తాగినా, ఏం చేసినా తగ్గడం కష్టం. యూట్యూబులలో వీటి గురించి చెప్పే వాళ్ళు కూడా అవి చెపుతూనే చివరలో ప్రతి రోజూ వ్యాయామం కూడా చెయ్యమని చెప్తూ ఉంటారు. ఈ చిట్కాలన్నీ ఏదో ఆత్మ తృప్తి కోసం బాగున్నట్టు అనిపించవచ్చు కానీ, శాస్త్రీయంగా వీటితో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకున్నట్టు ఎక్కడా నిరూపణ కాలేదు. ఈ లోపల జరగాల్సిన దుష్పరిణామాలు జరిగిపోతూనే ఉంటాయి. . రేపటినుండి నేను చెప్పిన ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ కావాలంటే సెల్ ఫోన్లో పాటలు , న్యూస్ చెవిలో పెట్టుకుని వింటూనే అటూ ఇటూ ఒక ఆరేడువేల సార్లు ఇంట్లోనే తిరిగినా చాలా మార్పు వస్తుంది. దొడ్లో మొక్కలకు ట్యూబులతో నీళ్ళు పొయ్యడం మానేసి ప్రతి చెట్టుకూ , నీళ్ళ తోట్లోంచి చెంపులతోనో తీసుకుని వెళ్ళి పోస్తే శరీరంలో ప్రతి భాగం బాగా కదులుతుంది. ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్నానం చేసేటప్పుడు బకెట్ లోంచి ప్రతి మగ్ కు ఒళ్ళు వంచి నీళ్ళు తీసుకుని పోసుకుంటే అక్కడ సగం వ్యాయామం జరిగిపోతుంది . అంతే కానీ పంపు కింద కూర్చుని స్నానం చెయ్యడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఇవన్నీ వినడానికి సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఇవే ఫ్యాట్ తగ్గడానికి సరైన ఉపాయాలు. . మళ్ళీ నేను ఇటు వచ్చేసరికి సుబ్రమణ్యంలో ఆ మార్పు చూడగలనని ఆశిస్తున్నాను. అందుకు వాడి భార్యగా , వాడి క్షేమం కోరే దానిగా వాడి వెనకాల పడి పోరితే కానీ వాడిలో అంత తేలిగ్గా మార్పు రాదు. భయపెడుతున్నానని కాదు కానీ సుబ్బూలోనే కాదు ఇప్పుడు కంప్యూటర్ల దగ్గర కూర్చుని టైమ్ చూడకుండా గంటలు గంటలు గడిపే వాళ్ళకు నేను చెప్పింది ఒక భయంకరమైన హెచ్చరిక . వీటిమీద చాలా వ్యాసాలు కూడా రాశాను. మనం జీవనక్రమంలో ఆరోగ్యం విషయంలో ఆచరించాల్సినవి నెగ్లెక్ట్ చేస్తే చివరకు ఏ డాక్టర్లు ఏమీ చేయలేరు. అయినా కంగారు పడవలసిన అవసరం లేదు. అంతా మన చేతుల్లోనూ, మన చేతల్లోనూ ఉంది. ...సుబ్రమణ్యం తలుచుకుంటే నేను చెప్పిన విషయాలు ఆచరించగలడన్న నమ్మకం నాకుంది. చివరగా చెప్పేది ఏమిటంటే ఎక్కువగా ఆ యుట్యూబ్ల మీద ఆధారపడొద్దు. వాళ్ళు తప్పు దారి పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నేను వెళ్ళాలి. నేను చెప్పినవి మనసులో పెట్టుకుని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి . ఆల్ ది బెస్ట్ " అంటూ ఆగి ఉన్న క్యాబ్ లో ఎక్కి అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్లిపోయాడు డాక్టర్ పరమేశం .