సమయస్పూర్తి "

తపస్వీ మనోహరం • 01 Feb 2023 • 👁 7 views
సమయస్పూర్తి "
" సమయస్పూర్తి "
రచన: జీడిగుంట నరసింహ మూర్తి
(ఫిబ్రవరి 2023 తపస్వీ మనోహరం మాస పత్రికలో ప్రచురితం )
" ఏం కుమార్ ! డాక్టర్ గారు ఉన్నారా ?" అంటూ అడిగాడు సుధాకర్ ఆటోలో క్లినిక్ దగ్గర దిగుతూ. .
"లేరు సార్. వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలిసి నాగపూర్ వెళ్లారు. మళ్ళీ రావడానికి వారం పదిరోజులు పట్టొచ్చు " అన్నాడు కుమార్ లేచి నుంచుని .
"అయ్యో. అలాగా పాపం. మా కుటుంబం మొత్తం మొదటినుండి మన డాక్టర్ గారి దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకుంటామని మీకు కూడా తెలుసు కదా. ఆయన హస్త వాసి మంచిది అని మా అందరి నమ్మకం . ఇప్పుడేం చెయ్యడం ? " అంటూ గొణిగాడు సుధాకర్ చుట్టుపక్కలా పరికించి చూస్తూ .
"ఏమిటి సార్ ప్రాబ్లం ?" అడిగాడు కుమార్ సుధాకర్ తో పాటు నీరసంగా నిలబడి ఉన్న అతని అన్నగారిని చూసి .
"అదే కుమార్ . మా అన్నయ్యకు నిన్నటినుండి హై బీపీ . కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. తగ్గుతుందేమో అని నిన్నంతా చూశాం . సిస్టాలిక్ ప్రెషర్ రెండొందలు పైగా ఉంది. అపాయింట్మెంట్ తీసుకునే టైమ్ కూడా లేదు. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేశాము. పోనీ ఇక్కడ దగ్గరలో ఇంకెవరెనా పేరున్న డాక్టర్లు ఉంటే చెప్పండి కుమార్ . మాకు చాలా కంగారుగా ఉంది " అన్నాడు సుధాకర్ అయోమయంగా చూస్తూ. .
" అయ్యో. పేషెంట్ ను ముందు కంగారు పెట్టకండి. అలా కూర్చోండి. అసలు బీపీ ఎంత ఉందో చూస్తాను " అంటూ తన దగ్గరే ఉన్న బీపీ ఆపరేటర్ తో చూసి "పర్వాలేదు. అంత సీరియస్గా తీసుకోనవసరం లేదు. ఎందుకైనా మంచిది. మన ల్యాబ్లో టెస్టులు చేయిద్దాం. అక్కడే మన డాక్టర్ ఒకాయన ఉన్నారు. రిపోర్టులు ఆయన చూసి మందులు ఇస్తారు . పదండి ఇదే ఆటోలో నేను కూడా వస్తాను " అంటూ వాళ్ళను అనుసరించాడు కుమార్ .
మరో రెండు గంటల తర్వాత సుధాకర్ అతని అన్నయ్య డాక్టర్ వ్రాసిచ్చిన మందులు తీసుకుని మార్గ మధ్యంలో హోటల్లో టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు.
డాక్టర్ విశ్వనాధ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసే కుమార్ చాలా కాలంగా సుధాకర్ వాళ్ళ కుటుంబాన్ని చూస్తూనే ఉన్నాడు . ప్రతి చిన్న సమస్యకు డాక్టర్ గారిని కలవడానికి రావడం , టెస్టులు తర్వాత వాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్లిపోవడం మామూలే. ఎప్పటికప్పుడు ఇది గమనిస్తున్న కుమార్ సమయస్పూర్తితో తన బాస్ డాక్టర్ విశ్వనాధన్ లేకుండానే వాళ్ళ సమస్యను సునాయాసంగా పరిష్కారం చేసేశాడు . ఇప్పుడు ఆపత్కాలంలో కుమారే ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష అయ్యాడు. .