ద్వార పాలకులు (కథ )
(19/2/2023 తపస్వీ మనోహరం వార పత్రికలో నా కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
లక్ష్మణ రావుకు కూతురింట్లో ఒక వారం రోజులు పాటు అందరి ఆడ పిల్లల తల్లి తండ్రులు లాగానే గడపాలని అనిపిస్తూ ఉంటుంది. . కానీ అది సాధ్యం అయ్యేటట్టుగా కనిపించడం లేదు. పోనీ ఏదైనా శుభకార్యాలు ఉంటే ఆ పేరు చెప్పుకుని ఒక నాలుగు రోజులు తనివితీరా కష్టం,సుఖం కూతురితో చెప్పుకుని గడిపి వద్దాం అనుకుంటే అటువంటివి దగ్గరా దాపుల్లో ఏమి కనపడటం లేదు.
కావాలనే కూతురిని పెద్ద కుటుంబంలో ఇచ్చాడు లక్ష్మణ రావు. అదేమీ అనాలోచితంగా అతను చేయలేదు. ఆ కుటుంబం ఎంతో మంచి వాళ్ళు , సమాజంలో పేరూ, ప్రతిష్టా ఉన్నాయని తెలిసే కూతురిని వాళ్ళింట్లో పడేశాడు. పిల్లకు ఏ సమస్య వచ్చినా పెద్ద కుటుంబం అయితే అందరూ కలిసి కాపాడుకుంటారు అని కొంతమంది మిత్రులు, బంధువులు చెప్పడంతో అదే సరైనది అనుకుని ఇప్పుడు ప్రతివారూ ఆచరిస్తున్న దానికి భిన్నంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు.
కూతురు ఎప్పుడు చూసినా "మా అత్తగారి వేపు వాళ్ళు మాతో నాలుగు రోజులు సరదాగా గడపాలని వచ్చారు. ఇల్లంతా ఒకటే సందడి. పాపం వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వచ్చీ రాగానే నన్ను వాళ్ళతో షాపింగ్ చేయించి మంచి మంచి డ్రెస్సులు కొన్నారు. పిల్లలకు అయితే చెప్పక్కరలేదు. వాళ్ళకు ఏం కావాలంటే అవి కొని ఒకటే ముద్దు చేసేస్తున్నారు. నాన్నా ! నాకు వాళ్ళు అంతా వచ్చారని ఏ మాత్రమూ ఇబ్బంది అనిపించడం లేదు. వంటింట్లో వంతులు వేసుకుని దూరి ఇంటిల్లిపాదికీ వంటలు, పిండి వంటలు వాళ్ళే కలిపించుకుని చేసేస్తున్నారు . నాకు అసలు శ్రమ ఇవ్వడం లేదు. మంచి వాళ్ళ సంబంధం అని మీరు తీసుకొచ్చి నాకు పెళ్లి చేశారు కానీ మరీ ఇంత మంచి వాళ్ళేమిటి నాన్నా? ఇలాంటి వాళ్ళను గురించి నేను ఎక్కడా వినలేదు కనలేదు . వీళ్ళందరితో ఈ నెలాఖరి వరకు మా ఇంట్లో భలే సరదాగా గడిచిపోతుంది . ....అంటూ చెప్పుకు పోతోంది కూతురు ఒక రోజు ఫోనులో. ఏమిటో కూతురు వట్టి వెర్రిబాగులదిలా అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చి పడిపోతే ఆ ఇంట్లో ఇల్లాళ్లకు హిస్టీరియా వచ్చి పడిపోతారు కానీ ఇంత సంతోషంగా చెప్పుకుంటారా ? "
కూతురు మాటల్లో ఎంతమటుకు తన సోత్కర్షే కానీ "నాన్నా ! మీరంతా ఎలా వున్నారు ? ఒకసారి మిమ్మల్నందరినీ చూడాలని ఉంది. ఒక వారం రోజుల పాటు వచ్చి మాతో గడపండి . లేకపోతే మేమేనా వచ్చి మీతో గడపాలని అనుకుంటున్నాం " అని ఏమైనా అంటుందేమో అని లక్ష్మణ రావు చూశాడు కానీ అసలు ఆ ఊసే లేదు. ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసిన కొత్తగా పెళ్ళైన కూతుళ్ళు సగం రోజులు ఏదో వంక పెట్టుకుని పుట్టింట్లోనే గడుపుతూ అన్ని సరదాలు తీర్చుకుంటారు. . వాళ్ళ వెనక మొగుళ్లు కూడా తయారవుతారు. ఈ వర్క్ ఫ్రమ్ హోం ఒకటి వచ్చింది. ఏనాళ్ళు ఎవరు ఎక్కడున్నా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన వ్యవస్థలకు పొరపాటున కూడా తెలియదు. ఇకనేం హాయిగా అత్తగారింట్లో అరగంట అరగంటకు వేడి వేడి కాఫీలు , టీలు తాగుతూ వేళకు రోజూ నవకాయ పిండి వంటలు ఆరగిస్తూ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. కానీ అదెక్కడి ఖర్మో తన కూతురు , అల్లుడు పరిస్తితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది . పెళ్ళైన మూడేళ్ళల్లో మహా అయితే రెండు మూడు సార్లు వచ్చారేమో ? ఇక పిల్లాడు పుడితే పురుడు వాళ్ళ వూళ్లోనే పోసుకున్నారు. దానికి ఏదో ప్రపంచ వింత జరుగుతున్నట్టు మొత్తం మందీ మార్బలం అంతా వచ్చేశారు. తను, తన భార్య అటు హాస్పటలు కు వచ్చి చూసి వెళ్ళిపోయారు. సామాన్యంగా మొదటి పురుడు పుట్టింటి వాళ్ళే పోస్తారు. ఆ అదృష్టం కూడా లక్ష్మణ రావు వాళ్ళకు దొరకలేదు. వాళ్ళు ఒక పిల్లాడితోనే సరిపెట్టేసుకున్నారు.
ఇదంతా ఆలోచిస్తూంటే లక్ష్మణ రావుకు, అతని భార్య రమాదేవికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఉన్న ఒకే ఒక కూతురుని ,మనవడిని చూడాలంటే కూడా వాళ్ళకు అవకాశం దొరకడం లేదు.
" ఇప్పుడు బాధ పడితే ఏం లాభం ? మీరే కదా . బాగా మనుషులు ఉన్న పెద్ద కుటుంబంలో పిల్లను వేస్తే నలుగురూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ సరదాగా బాగుంటారు అంటూ పాత కాలపు ఆలోచనలతో అమ్మాయిని ఆ పెద్ద కుటుంబంలో పడేశారు. ఇప్పుడు చూడండి . వచ్చే వాళ్ళు, పోయే వాళ్ళతో ఎప్పుడూ ఇల్లు కిటకిట లాడిపోతూ ఉంటుంది. మన అమ్మాయి వచ్చిన వాళ్ళు నాకు ఎంతో సాయపడుతున్నారు అని అమాయకంగా చెప్పుకున్నా కూడా ఇక అదెప్పుడు జీవితంలో సుఖపడుతుందండీ ? మన లాంటి వాళ్ళం వెళ్ళి నాలుగు రోజులు ఉండి వాళ్ళ ఆలనా పాలనా చూసి ఇష్టమైనవి వండిపెట్టి వద్దామంటే ద్వార పాలకుల్లాగా ఎప్పుడూ దాని అత్తగారు, మామగారు, ఇతర బంధువులు ఇంటికి కాపలా. అసలు ఎప్పటికైనా వాళ్ళను దాటుకుని వెళ్ళడం సాధ్యమైనా పనేనా ? వాళ్ళ అనుమతి తీసుకోకుండా ఎప్పుడైనా వెళ్లగలిగే యోగ్యత మనకుందా? పోనీ వాళ్ళను అడగగలమా ? ఇక ఇంతేనండీ మన జీవితాలు. అది రాలేదు . మనం వెళ్లలేము. అంతా మన ఖర్మ . మీ ప్రయోజకత్వం ..." అంటూ అవకాశం దొరికినప్పుడల్లా మొగుడిని దెప్పి పొడుస్తూనే వుంది రమాదేవి.
" పొరపాటు పని చేశానంటావా ? నువ్వు చెప్పింది చూస్తూంటే నాకూ అలాగే అనిపిస్తోంది. ఇలా ఎన్నాళ్లు వాళ్లందరినీ గురించి ఆలోచించి మొహమాట పడిపోయి మన పిల్లను చూడకుండా ఉంటాం ? అయినా వాళ్ళకు ఆ మాత్రం తెలియదా ? మనకు కొడుకైనా,కూతురైనా అదే అని. వాళ్ళకు ఎంత అధికారం ఉంటుందో మనకు కూడా అంతే ఉంటుందని తెలియదా ? ఎప్పుడైనా ఒక్కసారైనా" బావగారూ, రెండు రోజులు వచ్చి మాతో గడపండి" అని దాని మామ గారు అంటాడేమో అని చూస్తాను. అబ్బే. ఎంతమటుకు వాళ్ళ వాళ్ళు తప్ప మనం పనికిరాము. అసలు ఆ ఆలోచన కూడా వాళ్ళకు రాదా ? పోనీ అల్లుడికైనా ఎప్పుడూ అనిపించదా ? పెళ్లాన్ని చూస్తే జాలెయ్యదా ? ఎంతమటుకు ఇంటికొచ్చిన చుట్టాలకు వండిపొయ్యడమేనా దాని పని? లేదు. మనం ఇలా గిరి గీసుకుని కూర్చుంటే లాభం లేదు. వాళ్ళకు చెప్పకుండా వెళ్ళిపోయి తలుపు తడదాం ..సిగ్గుతో తలవంచుకుంటారు " అన్నాడు లక్ష్మణ రావు కోపంగా . అలా అంటూంటే అతని మొహం ఎర్రగా జేవురించింది.
" ఆ .. ఆ...హటాత్తుగా వెళ్ళి తలుపు కొడదాం. అప్పుడు మాత్రం తలుపు తీసేది ఎవరు ? మీ వియ్యంకుడేగా ?అదే మీ భాషలో ద్వార పాలకుడు. మహా అయితే లోపలికి వెళ్ళి ముందు గదిలో ఉన్న సోఫాలో కూలబడాలి. మీ కూతురు ఇల్లే కదా అని వంటింట్లోకి డైరెక్ట్ గా వెళ్లగలరా ? మీ వియ్యపు రాలు ఇచ్చే కాఫీ కోసం , టిఫిన్ కోసం ఎదురు చూడాల్సిందేగా ?ఏవేవో ఊహించుకోకండి. మీ కూతురు , అల్లుడు విడిగా ఏదైనా ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు మాత్రమే మీ ఆటలు సాగుతాయి. అందుకే సంబంధాలు కుదుర్చుకునే టప్పుడు "అబ్బాయిది ట్రాన్స్ఫరబుల్ జాబేనా ?" అని అడిగి తెలుసుకుంటారు. మనకు ఆ ఛాన్స్ కూడా లేదు. అల్లుడు ఈ జాబ్ , ఈ వూరు వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లనని చెప్పేశాడు. పైగా అతనికి ఇంట్లో ఎప్పుడూ నిండుగా జనాలు ఉండాలిట. అదెక్కడి మనస్తత్వమో మన ప్రాణానికి. ..." అంటూ తలపట్టుకుంది రమాదేవి
" ఈ సమస్య మనం ఒక్కళ్ళమే కాదులేవోయ్. చాలా మంది అనుభవిస్తున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను. మనమే వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఎందుకు పట్టు పట్టాలి ? మన కూతురు , అల్లుడు, మనవడితో కొన్ని రోజులు గడపటమేగా మనకు కావలసింది ? అయితే అయ్యింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అల్లుడికి ఇప్పుడు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోం అని అమ్మాయి చెప్పింది. ఇక ప్రస్తుతం ఇంట్లో ఉన్నది ఎవరు ? దాని అత్తగారు, మామగారూ అంతేగా. మన అమ్మాయినిచ్చాక వాళ్ళు కూడా మన వాళ్లేగా? అందరినీ రేపు వచ్చే పండక్కి టిక్కెట్స్ మనమే కొని మన ఇంటికి రప్పిస్తాను. ఇక్కడ మన ఇంటిముందే ఒకావిడ క్యాటరింగ్ నడుపుతోంది. ఇంట్లో అన్నాలు వండుకున్నా టిఫిన్లు అవీ ఆవిడ సప్లయ్ చేస్తుంది. అలా చేస్తే అమ్మాయి అత్తగారు,మామగారు కూడా అభ్యంతరం చెప్పరని నా ఉద్దేశ్యం. ఇంతకన్నా ప్రస్తుతం నాకు వేరే ఉపాయం కనపడటం లేదు. తర్వాత తర్వాత వాళ్ళల్లో కూడా మార్పు వచ్చి మనల్ని సాదరంగా వాళ్ళింటికి ఆహ్వానిస్తారేమో ఏం చెప్పగలం? ఇక నేను ఇదే ప్లాన్ లో ఉంటాను. ..నీకు సమ్మతమేగా ? ఇక మనకు వేరే ఆప్షన్ లేదు మరి . .." అంటూ గుండెనిండా ఉత్సాహాన్ని నింపుకుని తన ప్రయత్నం బెడిసికొట్టకుండా చెయ్యమని పూజ గదిలో ఉన్న దేవుళ్ళకు దణ్ణం పెట్టుకున్నాడు సగటు ఆడపిల్లల తండ్రి లక్ష్మణ రావు .
సమాప్తం