"పొరపాటుకు ఫలితం"

తపస్వీ మనోహరం • 26 Feb 2023 • 👁 6 views
"పొరపాటుకు  ఫలితం"
"పొరపాటుకు ఫలితం"(సింగిల్ పేజీ కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(26/2/2023 తపస్వీ మనోహరం వార పత్రికలో ప్రచురితం )
సాంబ మూర్తి కి కడపలో ఒక ప్రైవేట్ కంపినీలో ఉద్యోగం వచ్చి వారం రోజులయ్యింది. ఎవరో సిఫార్స్ చెయ్యడం వల్ల కాదనలేక ఉద్యోగం ఎటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండానే చేరవలసి వచ్చింది.
త్వరగా ఆర్డర్ తెచ్చుకోవడం కోసం అనుక్షణం ఒళ్ళు వంచి పనిచేయడం మొదలుపెట్టాడు. సాంబమూర్తి. ఒక్క రోజు ఆఫీస్ మానినా ఆ రోజుకు జీతం కట్ అందుకే అతి తక్కువ సంపాదనతో ఎవరెవరినో బ్రతిమాలి వాళ్ళ రూములో స్థానం సంపాదించాడు.
ఇంతలో కర్నూల్ లో ఆఫీసర్గా పని చేస్తున్న అతని అన్నగారు ఒకరోజు "నేను మా ఆఫీసు స్టాఫ్ తో కలిసి తిరుపతి వెళ్తున్నాను. మార్గమధ్యంలో నిన్ను కూడా తీసుకువెళతాను" అని ఫోన్ చేసి చెప్పడంతో ఆ విషయాన్ని ఆఫీసులో చెప్పి తనకొక రోజు తిరుపతి వెళ్ళి రావడానికి పెర్మిషన్ ఇమ్మని కోరాడు. అప్పుడు వాళ్ళు ఒక లిటిగేషన్ పెట్టారు. ".నువ్వు కానీ తిరుపతి లడ్డూలు మా నలుగురికి తీసుకొస్తే నీకు ఈ రోజుకు పేమెంట్ కట్ కాకుండా చూస్తాం ఆలోచించుకో " అని అనడంతో చేసేది లేక ఒప్పుకుని అతని అన్నగారితో బాటు తిరుపతి బయలుదేరాడు.
తిరుమలలో దర్శనం అంతా అనుకున్నట్టు జరిగాక సాంబమూర్తి నాలుగు లడ్డూలు కొని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి తన సైకిల్ హాండిల్ కు తగిలించి స్పీడుగా ఆఫీసుకు బయలు దేరాడు. సాంబమూర్తిని చూసీ చూడగానే ఆ ఆఫీసులో సీనియర్ స్టాఫ్ "ఏవి మా లడ్డూలు ?"అంటూ ప్రశ్నార్ధకంగా చూశారు.
అప్పుడు గ్రహించాడు సాంబమూర్తి సైకిల్ హాండిల్ కు తగిలించిన లడ్డూల సంచీ తను ఎక్కడో బ్రేక్ వేసినప్పుడు కట్ అయ్యి పడిపోయి ఉంటాయని .
జరిగిన విషయాన్ని గురించి చెప్పాడు సాంబమూర్తి వెర్రి మొహం వేసుకుని.
"మేము ముందే అనుకున్నాంలే నువ్వు తేవని. ఎందుకంటే మేము నీకు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి పంపలేదుగా ? " అన్నారు వాళ్ళు కర్కశంగా.అతను ఏమి చెప్పినా వాళ్ళు నమ్మేటట్టు లేరు. అక్కడ పనిచేస్తున్నంత కాలం వాళ్ళకు అతని మీద దురభిప్రాయం మాత్రం పోలేదు. పైపెచ్చు అతన్ని అవకాశం ఉన్నప్పుడూ ఏదో ఒక పని చెప్తూ " ఆ లడ్డూలు లాగా చెయ్యాకే !" అంటూ దెప్పి పొడవడం చేస్తూండే వాళ్ళు.
"తను దేవుడి హుండీలో డబ్బు వేయాలని ఎన్నో సార్లు బయటకు తీసి బద్దకించేసి ఆ డబ్బుతోనే తన ఆఫీసులో స్టాఫ్ కు లడ్డూలు కొని వచ్చేయడం వల్ల ఇలా జరిగి ఉంటుందా? దాని ఫలితమే ఇదా ?" అని సాంబమూర్తి అనుకోని రోజు లేదు. ******
సమాప్తం