జీవిత చక్రం

తపస్వి మనోహరం • 17 Dec 2023 • 👁 6 views
జీవిత చక్రం
*****
*జీవిత చక్రం*
=========
(హాస్య కథ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

ఆ ఉదయం, పూణే లోని తన రూమ్ లో బెడ్ మీద అటూ ఇటూ బద్ధకంగా దొర్లుతున్నాడు గిన్నెల కిషోర్. ఈలోగా తండ్రి నుంచి ఫోన్ రావడంతో, ఇక తప్పించుకునే మార్గం లేక ఆయన అష్టోత్తరం వినడానికి చెవులను సంసిద్ధం చేసాడు.

"దొరగారు నిద్ర లేచారా? అబ్బే, ఊరికినే తెలుసుకుందామని! ఔనూ, మన ఊరు తమరు ఎప్పుడు తగలడుతున్నారో తెలుసుకోవచ్చా?" అష్టోత్తరం మొదలెట్టాడు భూపాలరావు.

"ఏంటి డాడీ! పొద్దున్నే ఈ వాయింపు?" ఒళ్లు విరుచుకుంటూ అడిగాడు గిన్నె.

"సూడొరే! ఇంకో నెల పోతే నీ జీవితంలో మూడవ వంతు పూర్తి అయిపోతోంది. నీకా పెళ్లి కుదరడం లేదు. రాక రాక వచ్చిన సంబంధాలేమో నువ్వు చెడగొడుతున్నావు. మరి, ఓ పాలి తమరు దయచేస్తే ఇక్కడో సంబంధం రెడీగా ఉంది....." చెప్పబోతున్న
తండ్రిని

"డాడీ, నీకో నమస్కారం. నీ డైలాగులతో నన్ను చంపమాకు. ఈ నెలలో తప్పకుండా వస్తా, ఇంక నన్ను వదిలేయ్" వేడుకున్నాడు
గిన్నెల కిషోర్.

"సరే, మరి దొరగారు అలా సెబితే ఎందుకు కాదంటాం? అయితే ఓ మాట మటుకు గుర్తెట్టుకోరోయ్. నువ్వు వచ్చే టయానికి ఓ రెండు పూలదండలు రెడీ చేస్తా. సంబంధం కుదిరితే ఆ దండలు మీ దంపతులకు, లేకపోతే మటుకు ఆ దండలు మా దంపతుల ఫొటోలకు ఏసేయరోయ్" ఉడికిపోతూ చెప్పాడు భూపాలరావు.

"ఊరుకో డాడీ? పొద్దున్నే ఎందుకు ఇలాంటి శుభవార్తలు చెబుతావ్?" నవ్వుతూ అడిగాడు గిన్నె.

"ఏంటి? ఫొటోలకు దండలు వేయడం శుభవార్తా? ఒరే నిన్ను తగలెయ్యా, నీకు యమార్జంటుగా తెలుగు కూడా నేర్పించాలి. తొందరగా తగలడు!" విసుక్కుంటూ ఫోన్ పెట్టాసాడు భూపాలరావు.

***** ***** ***** *****

తండ్రి దండకానికి భయపడో లేక ఆయన చెప్పిన దండలకు భయపడో ఓ రెండు నెలల తరువాత ఇంటికి వచ్చాడు గిన్నెల కిషోర్.

ఆ రోజు తల్లిదండ్రులతో కలిసి, పెళ్లి కూతురిని చూడడానికి టాక్సీలో బయలుదేరాడు గిన్నె.

"అమ్మా! నువ్వు పెళ్లి కూతురిని చూసావా? బాగుంటుందా?" తల్లి రోధిని ని ఆశగా అడిగాడు గిన్నె.

"అక్కడ తమరు నోరు విప్పకుండా ఉంటే ఇంకా బాగుంటుంది!" సమాధానం ఇచ్చాడు తండ్రి.

"ఊరుకుదురూ, మీరు మరీనూ! ఒరేయ్, అమ్మాయి చాలా బాగుంటుందిరా. ఆ అమ్మాయిని చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు"
సంతోషంగా చెప్పింది రోధిని.

కాసేపటికి కారు, పెళ్లి వారి ఇంటికి చేరుకుంది.

***** ***** ***** *****

తిండి కార్యక్రమాలు అయిన తరువాత పెళ్లి కూతురు భస్మికను తీసుకుని వచ్చారు ఆమె తల్లిదండ్రులు.

ఆమె వైపు ఓ సారి చూసి,

"అమ్మా! పెళ్లి కూతురికి రెండో పెళ్లా?" నెమ్మదిగా తల్లిని అడిగాడు, గిన్నెల కిషోర్.

"నోర్ముయ్ ముదనష్టపు వెధవా!" సున్నితంగా తిట్టింది రోధిని.

"ఏంటమ్మా? పెళ్లి కొడుకు అంటున్నాడు?" సందేహం వ్యక్తం చేసాడు భస్మిక తండ్రి, వికాసరాజ్, చెవులు సాగదీసుకుంటూ.

"అబ్బే ఏం లేదు అన్నగారూ! మీకు పెళ్లి కూతురు రెండో పిల్లా? అని అడుగుతున్నాడు" కవర్ చేసింది రోధిని.

"లేదమ్మా! నాకు ఒక్కతే కూతురు" చెప్పాడు
వికాసరాజ్.

"నో.." గట్టిగా అరిచాడు గిన్నె.

"లేదు బాబూ! నిజంగా చెబుతున్నా మాకు ఒక్కతే కూతురు!"

"నేను చెబుతున్న నో, మీ అమ్మాయి సంఖ్య గురించి కాదు, పెళ్లి గురించి"

"కొంచెం అర్థం అయ్యేలా మా బాషలో చెప్పు బాబూ!"

"చెబుతాను అంకుల్, చెబుతాను. మీ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్లి అయ్యింది. వాళ్లకు ఓ కూతురు కూడా ఉంది. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లి చూపులకు ఒప్పుకుంది, అంతే! నేను జీనియస్ కాబట్టే ముందుగా గ్రహించాను" కాలర్ సర్దుకుంటూ చెప్పాడు గిన్నెల కిషోర్.

"ఏం చెబుతున్నావు నువ్వు? మా అమ్మాయి నిప్పు. కాదని నీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పు"

"నిప్పా? తోటకూర పప్పా? ఆధారాలు లేకుండా ఎలా అంటాను డూడ్? నువ్వు చట్టాలను మోసం చేయగలవేమో కానీ, చుట్టాలని కాదు. కావాలంటే చూడు. ఈ మధ్య వైరల్ అవుతున్న ఫొటో" అంటూ ఓ అబ్బాయి సైకిల్ తొక్కుతోంటే వెనకాల కూర్చొన్న అమ్మాయి ఓ పిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఉన్న ఓ ఫొటో అందరికీ చూపించాడు.

"ఓరి దరిద్రుడా! ఈ ఫొటోలో అసలు అమ్మాయి మొహమే కనబడడం లేదు. ఈ పెళ్లి కూతురే ఆ అమ్మాయి అని ఎలా చెబుతావురా?" ఆవేశంగా అడిగాడు భూపాలరావు.

"యూ నో డాడ్, ఐ యామ్ ఏన్ ఇంటిలెజెంట్. నేను వెనుక నుండి చూసి, మొహం ఎలా ఉంటుందో కూడా చెప్పేయగలను. అంతెందుకు? ఆ పెళ్లి కూతురు కట్టుకున్న ఆ వైట్ శారీ మీద బ్లూ డాట్స్ చూస్తే తెలియడం లేదా డాడ్!"

ఈ సంభాషణలు అంతా విన్న పెళ్లి కూతురు
భస్మిక లేచి

"మిష్టర్ గిన్నెలా! నువ్వు అన్నది నిజమే. ఆ ఫొటోలో ఉన్నది నేనే. అయితే అది నేను జీవితచక్రం అనే టీవీ సీరియల్ లో నటిస్తున్నప్పుడు ప్రోమో కోసం తీసింది" అని విసురుగా చెప్పి లోపలికి వెళ్ళి పోయింది.

"ఏమిటీ? పెళ్లి కూతురు టీవీ సీరియల్స్ లో నటిస్తుందా? మరి చెప్పరేం! మరింకెందుకు ఆలస్యం? వెంటనే తాంబూలాలు మార్చేసుకుందాం" గంతులేస్తూ చెప్పాడు గిన్నె.

"బాబూ! ఒకసారి లేస్తావా?" గిన్నె ను అడిగాడు వికాసరాజ్.

"ఎందుకు అంకుల్? మీ అమ్మాయి కన్నా నేను పొడుగే!" సిగ్గు పడుతూ చెప్పాడు గిన్నెల కిషోర్.

"అది కాదు బాబూ! ఓ సారి బయటకు నడుస్తావా?

"ఎందుకంకుల్? నా నడక బాగానే ఉంటుంది. కావాలంటే చూడండి" అంటూ తన పాదాలను చూపించబోతున్న గిన్నె తో

"ఒరే సన్నాసీ! ఆయన నిన్ను బయటకు పొమ్మని అంత మర్యాదగా చెబుతోంటే నీ వెర్రి బుర్రకు అర్థం కావడం లేదా?" అంటూ భూపాలరావు, రోధినిలు ఇద్దరూ గిన్నె చెరో రెక్కా పట్టుకుని ఈడ్చుకుపోయి, టాక్సీలో కుదేసారు.

***** ***** ***** *****

టాక్సీ బయలుదేరిన కాసేపటికి,

"కొడకా! మంచి సంబంధాన్ని చేజేతులా జారవిడుచుకున్నావురా" రోదిస్తూ చెప్పింది రోధిని.

"మమ్మీ! ఆ అమ్మాయి టీవీ నటి అని ముందే చెప్పి చావొచ్చుగా!" విసుక్కున్నాడు గిన్నె.

"నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. అయినా, ఆ అమ్మాయిని చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావని, ఓ చిన్న హింట్ ముందే చెప్పి తగలడ్డాం కదురా"

"అమ్మా, నేను టీవీ సీరియల్స్ చూడనని తెలుసు కదా? ఔనూ! అసలు ఇంతకీ ఆమె చెప్పిన జీవితచక్రం సీరియల్ నిజంగా ఉందా?" అమాయకంగా అడిగాడు గిన్నెల కిషోర్.

"ఒరేయ్, ఆమె జీవితచక్రం ఉందో లేదో తరువాత, ముందు నీ జాతకచక్రంలో వివాహ యోగం ఉందో లేదో అది తేలాలి" అని పళ్లు నూరుతూ చెప్పి,

"ఇదిగో డ్రైవర్ బాబూ! ఆ పూలకొట్టు దగ్గర ఓ సారి ఆపు, రెండు దండలు తీసుకోవాలి" అంటూ డ్రైవర్ కు చెప్పాడు భూపాలరావు.

"పెళ్లి పెటాకులయ్యింది కదా? ఇప్పుడు దండలెందుకు దండగ?" అసహనంగా అడిగాడు గిన్నె.

"రేపు ఉదయం మా ఫొటోలకు వెయ్యాలి కదా బాబూ!" ఉక్రోషంతో చెప్పాడు భూపాలరావు.

"నాన్నోయ్! నన్ను ఇలా మాటలతో చంపేయకు. ఇంకో వారం ఇక్కడే ఉంటాను కదా. ఈసారి నువ్వు ఏ సంబంధం చూపించినా నోరు ఎత్తకుండా, మెడ వంచి తాళి కట్టేస్తాను. నన్ను నమ్ము"

"అలాగైతే సరే. ఇదిగో డ్రైవర్ బాబూ! దండలు ఆపనవసరం లేదు. ఇంటికి పోనీయ్" ఆనందంగా చెప్పాడు భూపాలరావు.

***** ***** ***** *****

ఓ పది నిమిషాలు ప్రయాణం తరువాత ఏదో అనుమానం వచ్చిన టాక్సీ డ్రైవర్

"సార్! అనుమానం వచ్చి అడుగుతున్నా. ఇంతకీ మీలో పెళ్లి కొడుకు ఎవరు?" అడిగాడు వెనక్కి తిరిగి.

"ఇదిగో వీడే. ఇంకో రెండేళ్లలో నలభైలో పడతాడు" అంటూ పళ్లు పిండుకుంటూ గిన్నెను చూపించాడు భూపాలరావు.

"సార్! ఏమీ అనుకోక పోతే మా అమ్మాయి కూడా థర్టీ ప్లస్సే. ఇలాగే ఏవో వంకలు పెట్టి చాలా సంబంధాలు వదులుకుంది. ఇప్పుడు సంబంధాలు రావడం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే..." చెబుతున్న డ్రైవర్ తో

"మావయ్య గారూ! మాటలు ఆపి ముందు మీ ఇంటికి అర్జంటుగా పోనీయండి మహాప్రభో! ఇదిగో నాన్నోయ్, నువ్వు ఓ రెండు దండలు రెడీ చేసుకో" అంటూ ఆనందంగా చెబుతున్న గిన్నెల కిషోర్ వంక విస్మయంగా చూస్తూ ఉండిపోయారు భూపాలరావు, రోధిని దంపతులు.

***** **శుభం** *****


(నేను రాసిన ఈ కథ, డిసెంబర్ 2023, తపస్వి మనోహరం అనే అంతర్జాల పత్రికలో
ప్రచురించబడినది)