*****
*మనసున ఉన్నదీ*
=============
(కథానిక)
(నేను రాసిన ఈ కథ తపస్వి మనోహరం అనే అంతర్జాల పత్రికలో డిసెంబర్ 2023 లో ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"బా....వా!
అక్షరాల మధ్య ఆ ఖాళీ ఎందుకు అని నీకు అనుమానం రావచ్చు. ఆ ఖాళీ ఎందుకంటే.... భగవంతుడు మన మనసులు కలిపాడు కానీ మన శరీరాలు దూరంగా ఉంచాడు కదా? అందుకే అలా రాసాను బావా!
సరేకానీ, నువ్వు ఎలా ఉన్నావు?
ఈరోజు ఉదయం టీవీలో 'మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ...' అనే పాట చూస్తుంటే నాకు ఎందుకో నా మనసులో భావాలను మరోసారి ఇలా ఉత్తరం రూపంలో నీకు పంపాలనిపించింది.
కొన్ని కొన్ని భావాలు ఇలా అక్షర రూపంలో పెడితేనే, జ్ఞాపకం వచ్చినప్పుడు చదువుకోడానికి వీలుగా ఉంటుంది కదా బావా! అందుకే ఈ ప్రయత్నం.
ఈరోజు ఎందుకో పాత సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయి. అవన్నీ ఒకసారి నీకు కూడా జ్ఞాపకం చేద్దామని వాటిని గుదిగుచ్చి పంపుతున్నాను.
ఆ రోజు నాకు బాగా గుర్తు.
మూడు సంవత్సరాల క్రితం ఆ రోజున..
***** ***** ***** *****
మా ఇంట్లో నా గదిలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాను. ఈలోగా
మా నాన్న మొహం వేలాడేసుకుని ఇంటికి వచ్చాడు. ఆయన చెప్పిన సంగతులు విని అమ్మ ఆశ్చర్యపోయింది.
ఆ తరువాత నాకు అమ్మ ద్వారా తెలిసింది ఏమిటంటే..
"ఏమండీ! మన పిల్లకి పెళ్లి వయస్సు వచ్చింది. ఓ సారి వెళ్లి మీ చెల్లాయిని అడగకూడదూ, వాళ్ళ అబ్బాయికి చేసుకోమని!" అని నాన్నని మీ ఇంటికి పంపించిందిట మా అమ్మ.
ఆమె మాట ప్రకారం ఆనందంగా మీ ఇంటికి వెళ్లిన నాన్న అవమాన భారంతో తిరిగొచ్చాడు.
"ఏమయ్యిందండీ, అలా ఉన్నారు? ఏమందీ మీ చెల్లాయ్?" ఆందోళనగా అడిగిందిట అమ్మ.
"ఏమంటారు? వాళ్లకు ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పేసారు" ఆవేదనగా చెప్పాడుట నాన్న.
"మరి ఆ కుర్రాడు ఏమంటాడు? దీనిని చేసుకోనంటాడా?" నా గది వైపు చూస్తూ అడిగిందిట అమ్మ.
"వాడికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా?" భుజం మీద తువ్వాలు విసిరి కొడుతూ చెప్పాడుట నాన్న.
అమ్మ ద్వారా అంతా విన్న నాకు చెప్పకపోవడమే, నీమీద చాలా అసహ్యం వేసింది. నువ్వు ఇంత మోసగాడివి అనుకోలేదు.
ఒకే రక్తం పంచుకుని పుట్టకపోయినా, ఎటువంటి బంధుత్వం లేకపోయినా, చిన్నతనం నుంచీ పక్క పక్కనే ఉన్న ఇళ్లల్లో ఉండి పెరిగిన మనం మేనత్త, మేనమామ పిల్లల్లా కలసిపోయాం.
ఊరంతా ఒక దోవ, ఉలిపికట్టేది ఒక దోవ అన్నట్టు మన వయసు పిల్లలు అందరూ ఆడుతూ పాడుతూ తిరుగుతోంటే, మనం మాత్రం ఓ కొబ్బరి చెట్టు క్రింద కూర్చుని, వాటి మట్టలతో బండి ఆట ఆడుకోవడం, అలాగే ఆ కొబ్బరి ఆకులతో బూరాలు చేసుకుని బిగ్గరగా ఊదడం చేసేవాళ్లం.
"ఏంటర్రా! మీ బూరాలగోల ? బుర్రలు పగిలిపోతున్నాయి!" అని పిల్లలు వచ్చి గోలపెట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా వాయింపు కొనసాగించేవాళ్లం. చేసేదేమీ లేక వాళ్లు నవ్వుకుంటూ పోయేవారు.
ఇక సాయంత్రం అయితే చాలు, కోవెల వద్దకు వెళ్లి, పూజారి గారు ప్రసాదం పెట్టేవరకూ గుడిలోని గంట ఆపకుండా కొట్టేవాళ్లం. పాపం పూజారి గారు వచ్చి,
"ఏవర్రా పిల్లలూ! ప్రసాదం కోసమేనా ఈ అల్లరి? అలా అంతసేపు గంట కొడితే ఆ దేముడు కూడా పారిపోతాడురా మీ అల్లరి చూసి" అని నవ్వుతూ ప్రసాదం చేతిలో పెట్టేవారు.
అలా గడిచింది మన బాల్యం.
అంతెందుకు? ఆమధ్య మనం కోనేరు గట్టున కూర్చుని, బోలెడు కబుర్లు చెప్పుకున్న తరువాత, నువ్వు నా కుడి అరచెయ్యిని ఆప్యాయంగా తీసుకుని, 'ఐ లవ్ యూ' అని రాసావు. నేను వెంటనే ఆ అరచేతిని ముద్దు పెట్టుకున్నాను.
అప్పుడు నువ్వు నీ అరచేయి నా ముందు పెట్టావు. దాని మీద 'నేను కూడా' అని రాసాను. ఆ అరచేతిని నువ్వు ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నావు.
అలాంటిది ఒక్క వారం రోజుల్లో నీలో ఏం మార్పు వచ్చింది? నిన్ను ఎవరు మార్చారు? నేనెందుకు నచ్చలేదు? అన్న ఆలోచనలతో ఆ రోజు సాయంత్రం వరకూ అలా మౌనంగా ఉండి పోయాను.
అయితే నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఆ రోజు రాత్రి జరిగింది.
ఆ రాత్రి మా ఇంటికి వచ్చిన మీ నాన్న "బావా! ఉదయం మీ అమ్మాయిని మా వాడికి చేసుకోవడం ఇష్టం లేదన్నది, మీ అమ్మాయి అంటే ఇష్టం లేక కాదు. మా వాడికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు కదా? ఇప్పుడు పెళ్లి చేస్తే ఇబ్బంది పడతారని. అంతే! మీకు అభ్యంతరం లేకపోతే ముహూర్తాలు పెట్టేసుకుందాం!" అంటూ మా నాన్నతో చెప్పడంతో మళ్లీ మా ఇంట్లో పండుగ వాతావరణం వచ్చింది.
ఆ తర్వాత, ఓ పది రోజుల తర్వాత తెలిసింది ఏమిటంటే...
ఆ రోజు రాత్రి మీ నాన్న మా ఇంటికి వచ్చి చెప్పిందంతా అబద్ధం అనీ, మీ నాన్నకే ఈ పెళ్లి చేయడం అసలు ఇష్టం లేదనీ, నువ్వే పట్టుబట్టి ఈ పెళ్లికి ఒప్పించావనీ, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించావనీ ... అదిగో అప్పటి నుంచి నీ మీద ప్రేమ రెట్టింపయ్యింది.
ఆ తరువాత ఆరు నెలలకే ఓ మంచి ముహూర్తంలో మన పెళ్లి జరిగిపోయింది.
పెళ్లి అయ్యి ఆరు నెలలైనా, నీకు ఇక్కడ ఏ ఉద్యోగం రాకపోవడంతో నీ స్నేహితుడు నిన్ను రెండు సంవత్సరాల కాంట్రాక్టు మీద తనతో పాటు జెడ్డా తీసుకుని వెళ్లి అక్కడ ఉద్యోగం ఇప్పించాడు.
మనల్ని కలిపిన భగవంతుడు మళ్లీ ఇంత తొందరగా విడదీస్తాడనుకోలేదు. ఈ రెండేళ్లూ ఎలా గడిపానో ఆ దేవునికే తెలియాలి.
***** ***** ***** *****
సరే, ఇక గత స్మృతులు వదిలి ప్రస్తుతానికి వస్తున్నా!
నువ్వు వెళ్లిన ఆరు నెలలకే మనకు కవలలు జన్మించడం, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వలన నువ్వు వాళ్లను చూసుకోవడానికి ఈరోజు వరకూ రాకపోవడం లాంటివన్నీ, విధి మనతో ఆడుకున్న నాటకం అనుకుని వాటిని మరచిపోయి, రాబోయే రోజులు మంచివన్న ఆశతో బతుకుదాం బావా!
ఔనూ..
ఇంకో పది రోజుల్లో నీ కాంట్రాక్టు సమయం అయిపోయి బయలుదేరి వచ్చేస్తున్నావు కదా!
అన్నట్టు నీకు ఓ రెండు శుభవార్తలు.
మొదటిది, నువ్వు తిరిగి రాగానే నీకోసం ఓ ఉద్యోగం ఎదురుచూస్తోంది బావోయ్! నీకే కాదు ఉద్యోగం, నాకు కూడా! మన గురించి తెలిసిన ఓ స్వచ్ఛంద సంస్థ మనకు ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసింది. మనం చేరటమే తరువాయి.
రెండవది, మన అబ్బాయిలు ఇద్దరూ ఇప్పుడిప్పుడే తాతా అమ్మా అంటున్నారుట. అయితే పిల్లల శ్రేయస్సు దృష్ట్యా వాళ్లని కొన్నాళ్ళు మన తల్లిదండ్రుల వద్ద ఉంచమంటున్నారు.
అందుచేత నువ్వు రాగానే, పిల్లలను మన పెద్దల దగ్గర వదిలి, రోజూ వెళ్లి హాయిగా ఉద్యోగాలు చేసుకుని రావచ్చు. ఈ వంకనైనా ఆ పాత రోజులు మళ్లీ జ్ఞాపకం తెచ్చుకోవచ్చు.
ఇప్పటికైనా అర్థమయ్యిందా బావా? నేను ఎందుకు ఈ లేఖ రాసానో?
ఎందుకంటే
ఇద్దరి వద్దా ఫోన్లు ఉన్నా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీలు లేకుండా.... నిశ్శబ్దంగా నా ఫోన్ లో ఇవతల నేను,
నీ ఫోన్ లో నిశ్శబ్దంగా అవతల నువ్వు.
మనలోని భావాలను మాటలతో చెప్పుకోలేని మూగవాళ్లం కదా మనం! మూగప్రేమ మనది.
అందుకే ఈ మూగ సందేశం.
నీ సందేశం కోసం, నీ రాక కోసం ఎదురుచూస్తూ...
పేరు ఉన్నా, అది నా నోటితో చెప్పుకోలేని
నీ భార్యామణి
*బా* లామణీ *వా* సుదేవ్.
***** **శుభం** *****
*****