కామాక్షి క్యారేజీ కథనం
కనక దుర్గ లక్ష్మీ రత్న
విశ్వం రిటైర్ అయ్యేక ఇంట్లో ఖాళీగా ఉండలేక ఒక కంపెనీలో కన్సల్టెంట్ గా జేరేడు. రోజూ ఆఫీస్ కి రావాలనే నియమం పెట్టేరు.
“ కామాక్షి ! పొద్దున్నే క్యారేజీ ఏమిస్తావులే! అక్కడ కాంటీన్ లో తినేస్తాను”అన్నాడు పెళ్ళానికి పని పెట్టడం ఎందుకన్నట్లుగా. అసలు నిజానికి అతనికి కాంటీన్ లో తినడం ఇష్టం. ఈ విషయం కామాక్షికి తెలుసు.” నేనెలాగూ పొద్దున్నే లేస్తాను. పైగా పట్టూ కి క్యారేజీ ఎలాగు ఇస్తున్నాను . అప్పుడే మీకు కూడా చేసేసి ఇస్తాను. ఈ వయసులో రోజూ బైట ఫుడ్ తింటే ఆరోగ్యం ఏమి కాను?” అంది. అనడానికైతే అంది కానీ పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా రెండు బ్రేక్ ఫాస్టులు, లంచ్ కి రెండుక్యారేజీలు కట్టి ఇవ్వాలి. ఆహార విషయంలో తండ్రి కొడుకులు ఉత్తర దక్షిణ ధృవాలు. కామన్ గా తినే పదార్ధం ఒక్కటీ ఉండదు.పట్టూకి రోజుకొక రకం కావాలి. విశ్వం అన్నప్రియుడు. పప్పు, కూర పెట్టాలి. ఇప్పుడు వయస్సు కూడా వచ్చి పడడంతో బాగానే చాదస్తం, తినే విషయంలో భీష్మించుకోవడాలు, ససేమిరాలు.... వగైరాలు కూడా వచ్చేయి. కాలం కూడా కామాక్షి అంటే ఏ మాత్రం మొహమాటం పడకుండా తీసుకెళ్లి ఏభయ్యవ పడిలో పడేసింది. ఆ వయస్సులో శరీరానికి ఉండే సహాయ నిరాకరణాలు కొద్దో, గొప్పో వున్నా ఉత్సాహం మాత్రం తగ్గకుండా చూసుకుంది. కొంచెం పొద్దున్నే లేస్తే సంబాళించుకోవచ్చులే అనుకుంది.
“రేపు క్యారేజీ లోకి ఏమి ఇవ్వను?”అడిగింది విశ్వాన్ని.
. "ఏమిటీ! నేను ఇప్పుడే వార్తలు చూడటం మొదలు పెట్టేను. నీకు జవాబు చెప్పాలంటే ఆ వార్త కాస్తా మిస్ అయిపోతాను" అని చిరాకు పడ్డాడు. ఇంతా చెస్తే అక్కడెక్కడో దిగుడు బావిలో యువతి ఆత్మహత్య, మరెక్కడో హాస్టల్ భోజనంలో బయటపడిన బొద్దింక ... ఇదే ఆ మిస్ అయిపోయే వార్త . “సరే! పొండి”! అని, పట్టూ! నీకు ఏమి కావలిరా లంచ్ కి అంది ఆత్రంగా. ‘తను ఎప్పుడూ యుట్యూబ్ లో చూసే ఒక జబ్బలు లేని బనీను వేసుకుని ఒంటి నిండా పచ్చబొట్లు పొడిపించుకునే విదేశీయుడి, బండ వంకాయ మొదలైనవి కాల్చి చేసిన వంటని గుర్తు చేస్తూ,అదివ్వు ‘అన్నాడు.
“ఓ ! అదా! అది మన శుద్ధ సాంప్రదాయపు వంకాయ బండపచ్చడికి కొంచెం విదీశీ తళుకులు అద్దేరు అంతే! నాకేమీ రాని విద్య కాదు” అంది ధీమాగా!
మరుసటి రోజుకి ఇద్దరికీ క్యారేజీల్లోకి పెట్టడానికి అన్ని తరుక్కుని సిద్ధం చేసుకుంది.
ప్రొద్దున్నే ఉత్సాహంతో లేచింది కామాక్షి. కాలకృత్యాలు తీర్చుకున్నాక అలవాటుగా తనకు స్ట్రాంగ్ కాఫీ కలుపుకుందామనుకుంది. అమ్మో! క్యారేజీ సర్దద్దూ! అనుకుంది. ముందుగా కుక్కర్లో అన్నం పెట్టింది. పక్క స్టవ్ మీద పప్పు పెట్టింది. ఇంకో దాని మీద బండ వంకాయ, బజ్జీ మిర్చీ, టొమేటాలు ఒకదాని తరువాత ఒకటి కాలుస్తూ, ఇంకో పక్క చకచకా కూరలోకి వంకాయ ముక్కలు తరుక్కుంది. నాలుగవ దాని మీద పాలు కాస్తోంది. ఇద్దరికీ స్నానాలకి గీజర్లు ఆన్ చేసింది. ఈలోగా పట్టూ లేచేడు. నెమ్మదిగా తయారవుతున్నాడు. బ్రేక్ ఫాస్ట్ కి దోసల పిండి తీసింది. విశ్వానికి దోసెల్లోకి పచ్చడి, నల్ల కారం ఉండాలి. పట్టూ పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి కలిపిన పొడితో తప్పా తినడు. పెద్దాయనకి దోసెలు ముందుగా వేసి హాట్ బాక్స్ లో పెట్టినా పేచీ లేదు. పిల్లవాడికి మాత్రం పెనం మీద నుండి ప్లేట్ లోకి రావాలి. పొయ్యి మీద పెనం పడేసి, చేతిలో గరిటె పట్టుకుని కామాక్షి వంటింట్లోంచి పట్టూ గదికి మాటి మాటికీ వెళ్లడం, తలుపు కొట్టి
“పట్టూ! దోసెలు వేయమంటావా”! అని చీటికీ మాటికీ అడుగుతోంది. ఇంక వాడికి విసుగు పుట్టి, "నాకు పొద్దున్నే ఆయిలీ దోసెలు వద్దు మమ్మీ! ఓట్స్ తింటాను" అన్నాడు.
మొత్తానికి ఇద్దరి వంటలు పూర్తి అయ్యేయి. వాడు ఓట్స్ తిని ఆఫీస్ కు బయలుదేరేడు.వాడడిగిన కొత్త వంట చేసేనని గర్వంగా క్యారేజి వాడి చేతికి అందించింది.
ఇక విశ్వం లేస్తూనే కాఫీ! అన్నాడు. తను కూడా ఇంత వరకు కాఫీ తాగనే లేదు. విశ్వంతో పాటు తనకి కూడా కలుపుకుందామనుకుంది. కానీ అతని క్యారేజీ సర్దనే లేదు. హడావిడిగా నాలుగు గుటకలు మ్రింగుతూ కాఫీని ఆస్వాదించలేము. దాని మర్యాద దానికి ఇవ్వాల్సిందే! విశ్వానికి కాఫీ ఇచ్చి, క్యారెజీ సర్ది అమ్మయ్య అనుకుంది.
ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళేక, చిక్కగా, వేడిగా కాఫీ కలుపుకుని, పైనుండి నురగ వచ్చేలా గ్లాసులో పోసుకుని హాల్లో టీపాయ్ మీద కాళ్లు జాపుకుని కూర్చుని ప్రశాంతంగా తాగింది. కామాక్షి మద్యాహ్నం ఎప్పుడవుతుందా అని మాటి మాటికీ గడియారం కేసి చూసుకుంటోంది. ఒకటిన్నర అయ్యింది. లంచ్ బాగుంది అని తండ్రి కొడుకుల నుండి ఏవైనా మెస్సేజులు వస్తాయేమోనని మధ్య మధ్యలో ఫోన్ చూస్తోంది. విశ్వం నుండి పెద్దగా ఆశించకూడదు అని కామాక్షికి తెలుసు. “పట్టుగాడి నుండైనా రావాలి కదా! అందునా వాడు అడిగిన విదేశీ వంటకం కూడా చేశానాయే” ఉండబట్టలేక తనే మెస్సేజ్ చేసింది పట్టూకి, లంచ్ తిన్నావా అని. వాడు S అని ఒక్క అక్షరం జవాబు ఇచ్చేడు. మళ్ళీ తనే అడిగింది ఎలా ఉందీ అని.
“ఏదో వియర్డ్ స్మెల్ వచ్చింది మమ్మీ”! అని పెట్టేడు. ఎదో ఆశించిన కామాక్షికి ఆశాభంగం అయింది.
“ వియర్డ్ స్మెల్ ఏమిటీ! స్టవ్ మీద కాల్చేను కదా! స్మోకీ ఫ్లేవర్ అయ్యుంటుంది” అంది.
వాడు No అని రాసేడు.
"నువ్వు అదేదో ఫెటా చీజ్ వేయమన్నావు కదా! మూత తియ్యగానే బహుశా దాని వాసన వచ్చి ఉంటుంది” తడుముకోకుండా అంది కామాక్షి.
”ఇట్స్ ఓకే. ఐ ఫినిష్డ్ ఇట్” … అని రాసేడు, ఏదో పెద్ధ ఓదార్పుగ. కామక్షికి అసంతృప్తిగా అనిపించింది.
సాయంత్రం ఏడవుతుండగా విశ్వం వచ్చేడు. పట్టుగాడితో రిటైర్మెంట్ తరువాత తన మొదటి రోజు ఆఫీస్ అనుభవం గురించిచెబుతున్నాడు. ఇద్దరూ క్యారేజీలు ఖాళీ చేసినందుకు ఆనందించింది . వారం రోజులు ఓపిగ్గా ఇద్దరికీ క్యారేజీలు కట్టి ఇచ్చింది. ఎవ్వరికి తగ్గట్లు వాళ్లకి. నెమ్మది నెమ్మదిగా హైరానా అయిపోతున్నట్లు అనిపించింది కామాక్షికి.
రాత్రి భోజనాల వేళ “ఇద్దరికీ వేరువేరుగా చెయ్యాలంటే నాకు హైరానా అయిపోతోంది. రెండు రోజులు రైస్, రెండు రోజులు చపాతీ, ఐదవ రోజు కాంటీన్ లో తినండి” అంది . తండ్రి,కొడుకులు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఒక వారం రోజులు ఆ ముచ్చట సాగింది.
ఒక రోజు ఆఫీస్ నుంచి వస్తూనే పట్టూ “మమ్మీ! ఇవాళ పప్పు, అన్నం ఏమీ బాలేదు. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా బలవంతంగా ఇచ్చేస్తున్నావు”అన్నాడు.
“ అన్నం,పప్పు కూడా అలవాటు చేసుకోవాలి గా. ఎప్పుడూ చపాతీలు, మసాలా కూరలేనా “ అంది.
“ఏమో ! నాకిష్టమైనది నన్ను తిననివ్వచ్చుగా. మా కాంటీన్ లో ఫుడ్ బాగుండదు.లేకపోతే అక్కడే తినేవాడిని” అన్నాడు.
“అయినా రేపు నీ రోజు. చపాతీ ఇస్తాను” అంది.
మరునాడు లంచ్ టైం లో విశ్వం ఫోన్ చేసేడు. కామాక్షికి అర్ధమైపోయింది భోజనంలో ఎదో పట్టింపు వచ్చిఉంటుందని. ఫోన్ ఎత్తగానే విశ్వం అందుకున్నాడు
“ఏభైయేళ్ళగా హాయిగా అన్నం, పప్పు తింటూ పెరిగిన వాడిని. నా ఒంటికి అవే సరిపడతాయి. ఈ వయసులో నాకు ఈ రొట్టెలు, పాలక్కులు, పన్నీర్లు తినడం అవసరమా! పట్టుగాడి కోసం నా పద్ధతులు మార్చుకోవాలా? రేపటినుండి నాకు అలవాటైన అన్నం, పప్పునే పెట్టు. పోనీ నీకు రెండు వేర్వేరు వంటలు హైరానా అవుతుంటే, నేను ఇక్కడ మా ఆఫీసు కాంటీన్లో సుబ్బరంగా తాలీ భోజనం తినేస్తాను” అని ఫోన్ పెట్టేసేడు.
“అయినా తండ్రీ కొడుక్కి తిండి దగ్గర అంత పేచీ ఏమిటో? మనం ఎప్పుడైనా తిండి దగ్గర ఇంత గోల చేశామా? అమ్మ ఏది వండి పెడితే అది నోర్మూసుకుని తినేసేవాళ్ళం. పట్టు గాడు ఈ కాలం వాడు అనుకో. ఈ పెద్ద మనిషి మన కాలం వాడే కదా! ‘మా ఇంట్లో ఆవ పెట్టిన కూరలు చేయరు,మేము పచ్చిమిర్చి పప్పులో వేసుకోము, పచ్చళ్ళలోనే వాడుతాం. పచ్చిపులుసు మా ఇంటికి శత్రువులు వచ్చినప్పుడే చేస్తారు’ అంటూ ఆక్షేపణలు” తన ఉక్రోషం అంతా అక్క విశాలాక్షి కి ఫోన్ చేసి వెళ్లగక్కింది.
“పొద్దున్నే నీకు ఇద్దరికీ వేరువేరు వంటలు చేయడం కష్టమైపోతుంటే పోనీ కాంటీన్ లో తింటానంటే ఊరుకోవచ్చు కదా” అంది విశాలాక్షి.
“నీకు తెలీదు అక్కయ్య! ఒక రోజు తింటే పర్వాలేదు .రోజూ బైట ఫుడ్ తింటే విశ్వానికి పడదు. జిహ్వ చాపల్యం కొద్దీ తినడం,ఇంటికొచ్చి యాంటాసిడ్ తాగేయడం. ఈ వయసులో తను ఇబ్బంది పడడం ఎందుకని నేనే ఇస్తానన్నాను. సరేలే ! ఎదో చేస్తాను” అని ఫోన్ పెట్టేసింది.
ఇదివరకు ఇద్దరికీ మూడు గిన్నెలు క్యారెజీ ఇచ్చేది.ఇప్పుడు దాన్ని ఒకటికి తగ్గించి, ఎవరికిష్టమైన వంట వారికి చేసి ఇవ్వడం మొదలెట్టింది.
ఒకరోజు పట్టూ ఇవాళ మాకు టీం లంచ్ వుంది. క్యారేజీ లో లంచ్ రాత్రి ఇంటికి వచ్చి తింటానని మెసేజ్ పెట్టేడు.సరేనంది. రాత్రి భోజనాల వేళ “మమ్మీ! లంచ్ హెవీ అయ్యింది .నాకు ఆకలి లేదు. డిన్నర్ కి ఏమీ వద్దు” అన్నాడు . బాక్స్ లో లంచ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక కామాక్షి వేడి చేసుకుని తింది. ఇంకోరోజు విశ్వం” కాంటీన్ లో బిసిబేళాబాత్ పొగలు గక్కుతూ ఉంటే తినాలనిపించింది. ఎక్కువ తిన్నాను ఆయాసంగా వుంది,డిన్నర్ తినలేను అన్నాడు. ఇలా వారానికి రెండు సార్లైనా ఇద్దరూ లంచ్ తినకుండా ఇంటికి తెచ్చయ్యడం, రాత్రి తింటాననడం ,తినకపోవడం, అది తను వెచ్చ బెట్టుకుని తినడం అవుతోంది.
ఆ రోజు ఇద్దరూ తినకుండా తెచ్చేసేరు. కామాక్షి కి ఒళ్ళు మండిపోయింది. “ఇద్దరి క్యారేజీ లు నేనెలా తినేది?” అనుకుని ఎవరి బాక్స్ వాళ్లకి వెచ్చబెట్టి డిన్నర్ కి అదే ఇచ్చింది.
“ఏమిటీ ! పొద్దున్నది ఇచ్చేవా? డిన్నర్ కి ఏమీ వండలేదా “అన్నాడు విశ్వం.
పట్టూ “మమ్మీ పొద్దున్న చేసిన రోటీ వెచ్చబెడితే సాగీ గా అయిపొయింది” అన్నాడు.
“ఏ ! మీరు ఇద్దరూ లంచ్ తినకుండా తెచ్చేస్తే నేను వేడి చేసుకుని తినడం లేదు? బైట ఫుడ్ రోజూ తింటే మీ ఆరోగ్యాలు పాడవుతాయని పోనీ కదా అని పొద్దున్నే లేచి మీకు క్యారేజీ కట్టి ఇస్తుంటే , ఏదో వంక పెట్టి తెచ్చేస్తున్నారు. మీకు టీం లంచులు, ఫెస్టివల్ స్పెషల్స్ ఉంటే ముందే చెప్పండి. అప్పుడు నేను చేయను.రోజూ డిన్నర్ మాత్రం ఇద్దరికీ ఇష్టమైనట్లు చేస్తాను. రేపటి నుండీ క్యారేజీ ఇవ్వను. కాంటీన్ లో తినాలనిపిస్తే తినండి. బైట ఫుడ్ బోర్ కొట్టి ఇంటినుండి క్యారేజీ తీసుకెళ్లాలనిపించినప్పుడు ముందు రోజు రాత్రి చెబితే మీ ఇద్దరికీ నచ్చినవి చేస్తాను” అని కోపంగా వంటిట్లో కి వెళ్ళిపోయింది.
“మరి నువ్వు డిన్నర్ కి ఏమీ చేసుకోలేదా” అడిగాడు విశ్వం.
“నేను ఉప్మా చేసుకున్నాను” అని ప్లేటులో పెట్టుకుంది.
ఉప్మా నా ! నాకిష్టం. నాకు కూడా కొంచెం పెట్టు” అన్నాడు.
“నేను ఎప్పుడైనా నాకొక్కర్తికే చేసుకున్నానా! తినండి” అని ఇద్దరికీ వడ్డించింది.
“ మరి నంచుకోవడానికి పచ్చడి చేయలేదా” అడిగేడు విశ్వం.
“పచ్చడి లేదు గిచ్చడి లేదు. పొడి చల్లుకుని తినండి” అంది వ్యంగ్యంగా
“