నిజమైన వాడు ఎవరు

సహరి • 23 May 2025 • 👁 1 views

కథ పేరు: "నిజమైన వాడు ఎవరు?"

పాపులర్ హోటల్‌లో ఎప్పటిలాగే ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారు.

రఘు – కోపంగా ఉన్న వ్యక్తి (ఎర్ర కోట్, టోపీ).

బాబు – ఆశ్చర్యపోతున్న వ్యక్తి (పింక్ కోట్, క్యాప్).

కిషోర్ – సందేహంతో ఉన్న వ్యక్తి (చొక్కా వేసుకున్నవాడు).


రఘు మొహం మునుపెన్నడూ అంత కోపంగా కనిపించలేదు. అతను చెమటలు తుడుచుకుంటూ, మౌనంగా కూర్చున్నాడు.

"ఏమైంది రఘూ? వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా కోపంగా ఉన్నావు. ఏదైనా జరిగిందా?" అని బాబు ఆరా తీశాడు.

రఘు తన జేబులోంచి ఓ ఫోటో తీసి, కోపంగా చూపిస్తూ...
"ఇదిగో! ఈ ఫోటోలో ఉన్న వాడే మోసగాడు! నన్నే మోసం చేశాడు!" అంటూ ఆగ్రహంగా అరవసాగాడు.

బాబు, కిషోర్ ఆ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
ఏంటి రఘు మాతో జోక్ చేస్తున్నావా? అని అడిగారు.
మీతో నేనెందుకు జోక్ చేస్తాను నేను నిజమే చెప్తున్నాను అన్నాడు రఘు.

బాబు: "ఏం రఘూ! ఇది నీ ఫోటోనే కదా? మరి నువ్వే నిన్ను మోసం చేసుకోవడం ఏంటి?"

కిషోర్: "నువ్వే నీ మీద ఆరోపణలు వేసుకోవడం ఏమిట్రా?" అని ఆశ్చర్యంగా అడిగారు.

రఘు అతని తలపైన ఉన్న టోపీని తీసి, ఊపిరి పీల్చుకున్నాడు.
"ఇది నా ఫోటో కాదు! ఇది నా జతీర్ ఫోటో! అతను నా రూపాన్ని వాడుకొని, నా పేరు మీద మోసాలు చేస్తున్నాడు!" అని చిరుస్నేహం నిండిన కోపంతో అన్నాడు.

బాబు: "జతీర్? నీకు ట్విన్ బ్రదర్ ఉన్నాడా?" అని అడిగాడు.

రఘు: "తెలీదు! కానీ చూసేందుకు అచ్చం నన్నే పోలి ఉన్నాడు. మా చిన్నప్పటి నుంచీ మా కుటుంబం అతన్ని ఎందుకు వదిలేసిందో నాకు తెలియదు. కొద్దిరోజుల కిందట అతను నన్ను కలిశాడు. మేమిద్దరం ఒకే రోజు పుట్టామని హాస్పిటల్ రికార్డులు చూపించాడు. ఎవరో మా తల్లిదండ్రుల నుంచి అతన్ని దూరం చేశారని చెబుతున్నాడు."

కిషోర్: "ఇప్పుడు ఎందుకు వచ్చాడంట?"

రఘు: "ఇంకెందుకు? ఆస్తిలో వాటా కావాలి అని అడుగుతున్నాడు. నేను ఒప్పుకోలేదు. మా అమ్మానాన్నలు ఎప్పుడూ నాకు కవల తమ్ముడు ఉన్నాడని చెప్పలేదు. అందుకే నేను అతడు చెప్పిన కథను నమ్మలేదు. ఆస్తి ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. అందుకే అతను నా రూపాన్ని వాడుకుంటూ, నా పేరుతో మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు!" అని చెప్పాడు.

కిషోర్: "ఇలా ఎవరైనా ఉంటారా? నీలా కాపీగా ఉండేవాడు? ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండొచ్చు." అన్నాడు.

బాబు: "లేదూ... నిజంగా మీ అమ్మకు కవలలు పుడితే హాస్పిటల్‌లో ఎవరో ఒకరు మార్చి వుండొచ్చు!" అని చెప్పాడు.

అంతా ఇంకా అయోమయంలో ఉండగానే...

హోటల్ తలుపులు తెరచుకుని లోపలికి ఓ వ్యక్తి అడుగు పెట్టాడు.

ఆ వ్యక్తిని చూసిన బాబు, కిషోర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

"అరే! ఇదేం మ్యాజిక్! అచ్చం రఘూలా ఉన్నాడు" అని అనుకున్నారు.

ఆ వ్యక్తి నవ్వుతూ, "హహహ! రఘూ! నువ్వు నన్ను తప్పుడు ఆరోపణలతో ఇరికిస్తున్నావా?" అని అన్నాడు.

రఘు ఒక్కసారిగా లేచి: "జతీర్! నీ ఆటలు చాలించు! నువ్వు నా పేరుతో మా కంపెనీ నుండి 10 లక్షలు తీసుకున్నావు.ఇంకా నాకు తెలియకుండా ఏమేమి గోరాలు చేస్తున్నావో!" అని గట్టిగా అరిచాడు.

జతీర్: "అది నేనే అని ఎలా నిరూపిస్తావ్ ? కంపెనీ సీసీటీవీ వీడియోలో చూస్తే నీ ముఖమే కనిపిస్తాది.మరి నువ్వు నన్ను మోసగాడని ఎలా నిరూపిస్తావు?" అని నవ్వాడు.
ఇంతలో రఘుకి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఫోను ఎత్తి "ఆ సార్ మేము ఇక్కడే ఉన్నాం" త్వరగా రండి అన్నాడు.
కాసేపటికి అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ఇన్స్పెక్టర్ రమేష్.
కొద్దిరోజుల కిందట రఘు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
కానీ సాక్షాదారాలు లేకుండా ఏమి చేయలేనని ఇన్స్పెక్టర్ రమేష్ చెప్పడంతో పథకం ప్రకారం జతీర్నీ పట్టించడం కోసం
హోటల్కి వచ్చేలా చేసాడు రఘు.

ఇన్‌స్పెక్టర్ రమేష్: "ఇదేంట్రా! ఇద్దరూ ఒక్కలానే ఉన్నారు! అసలు నిజమైన రఘు ఎవరు?" అని ఆశ్చర్యంగా చూశాడు.

రఘు:** "సార్! నిజమైన రఘు నేనే. అతను నా రూపాన్ని వాడుకుని నన్ను మోసం చేస్తున్నాడు." అని చెప్పాడు.

జతీర్ నవ్వుతూ, "ఇదే నేను చెప్పాలి సార్. నిజమైన రఘు నేనే!"
అని అన్నాడు.

పోలీసు ఇద్దరినీ బాగా గమనించాడు.

"ఇదొక క్లిష్టమైన కేసు… కానీ నిజాన్ని కనిపెట్టడం అంత కష్టం కాదు!" అంటూ ఇన్‌స్పెక్టర్ తన జేబులోంచి ఓ పాత ఫోటో తీసి చూపించాడు.

"ఈ ఫోటోను చూస్తే… నిజమైన రఘు ఎవరో తేలిపోతుంది!"అన్నాడు ఇన్స్పెక్టర్.

రఘు చిన్నప్పుడు మేడ పై నుంచి పడిపోయాడు. అప్పుడు అతని ముక్కు పగిలి, కాస్త వంపుగా మారింది.


"నిజమైన రఘు ముక్కు కాస్త వంపుగా ఉంటుంది. ఆ ముక్కు వంపు క్షుణంగా చూస్తే తప్ప కనిపెట్టడం కష్టం.
కానీ ఈ నకిలీ వ్యక్తికి అది లేదు!" ఈ ఫోటో ద్వారా అసలైన రఘుని ఇన్స్పెక్టర్ కనిపెట్టేసాడు.ఇక అంతా అందరికీ అర్థమైపోయింది.

ఇన్‌స్పెక్టర్: "జతీర్! నీ ఆటలు చాలించు! నిజమైన రఘు ఇతనే!"
అని చెప్పి జతీర్‌ను అరెస్ట్ చేశాడు.

"ఇప్పుడే ఒప్పుకో! ఎందుకు రఘు రూపాన్ని వాడుకున్నావు?" అని అడిగాడు.

జతీర్:** "నేను చిన్నప్పటి నుంచీ ఓ అనాధగా పెరిగాను. నన్ను పెంచిన తల్లి పేదరాలు. నా పదో ఏటా ఆమె చనిపోయింది. అప్పటినుంచి దొంగతనాలు చేసుకుంటూ బతికాను. ఒక రోజు రఘుని రైల్వే స్టేషన్లో చూశాను. అచ్చం నన్నే పోలి ఉన్నాడు. మొదట చూసి ఆశ్చర్యపోయాను. అతన్ని ఫాలో అయ్యాను. అతను బాగా డబ్బున్నవాడు అని తెలిసింది. మా ఇద్దరికీ ఏదైనా సంబంధం ఉందేమో అని హాస్పిటల్ రికార్డులు వెతికాను. అప్పుడే తెలిసింది మేమిద్దరం కవలలమని. కానీ నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు. నేనెలా జీవించాలి? అందుకే అతని రూపాన్ని వాడుకున్నాను."**అని చెప్పాడు.

ఇన్‌స్పెక్టర్: "నీ జీవితంలో ఏం జరిగిందో పక్కనపెడితే, నువ్వు మోసం చేయడం మాత్రం తప్పు!"అని చెప్పి
జతీర్‌ను పోలీసులు తీసుకెళ్లారు.

బాబు, కిషోర్, రఘు ఊపిరి పీల్చుకున్నారు.

బాబు: "హఫ్ఫ్… ఎట్టకేలకు అసలు రఘు ఎవరో తేలింది!"

కిషోర్: "రఘూ! నీ రూపాన్ని వాడుకుని మోసం చేసిన అతడు నీ తమ్ముడే కదా?"అని అన్నాడు.

రఘు: "అవును! కానీ నిజమా కాదా తెలుసుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. నిజంగా నా తమ్ముడే అయితే, అతన్ని జైలు నుంచి విడిపించి కొంత ఆస్తి ఇస్తాను. కానీ మోసగాడే అయితే, మరింత గుణపాఠం నేర్పించాలి."అందుకే ఇలా చేశానని చెప్పాడు.

బాబు, కిషోర్ రఘుని అభినందిస్తూ…
"నువ్వు నిజంగా మంచి వాడివి రఘు!" అని స్నేహితుడిని ఆకాశానికి ఎత్తేశారు.

రఘు కొద్ది రోజుల తర్వాత డీఎన్ఏ టెస్ట్ చేయించాడు. ఫలితాల్లో జతీర్ నిజంగానే తన కవల తమ్ముడేనని తేలింది.

అదే రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లి, జతీర్‌ను విడుదల చేయించేందుకు కావలసిన ఏర్పాట్లు చేశాడు.

"నన్ను మోసం చేసినా, నువ్వు నా సొంత రక్తమే. తల్లి తండ్రుల ప్రేమ లేని జీవితాన్ని మోస్తూ బాధపడతావనిపించింది. కానీ మనం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం. నువ్వు నీ తప్పు తెలుసుకుని మారిపోతే, నేను నీకు సాయపడతా!" అని చెప్పాడు రఘు.

జతీర్ నిశ్శబ్దంగా రఘుని చూసాడు.

"నిన్ను మోసం చేసినా, నువ్వు నన్ను క్షమిస్తున్నావా?" అని అతని గొంతు ఆవేదనతో నిండిపోయింది.

"నిజమైన బంధం అనేది దూరమైనా మారదు. ఆస్తికంటే ఎక్కువగా నువ్వు మారిపోవడమే నాకు కావాలి."అన్నాడు రఘు.

ఈ మాటలు విని జతీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

"నేను తప్పు చేసాను అన్నయ్య! నాకెవరూ లేరని భావించా. అందుకే ఆస్తికోసం, డబ్బు కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నా. నన్ను క్షమించు!" అని క్షమాపణలు చెప్పాడు.

రఘు అతని భుజం మీద చెయ్యి వేసి, "ఇక నుంచి మనిద్దరం కలిసే ఉండాలి." అన్నాడు.

ఆరోజు నుండి రఘు, జతీర్ ఇద్దరూ కలిసి ఓ వ్యాపారం ప్రారంభించారు.

ఆస్తి కోసం పోరాడకుండా, తనను తానే నిలబెట్టుకోవాలనే కొత్త ఆలోచనతో జతీర్ మారిపోయాడు.

అలా ఇద్దరూ నిజమైన సోదరులుగా జీవితం మొదలుపెట్టారు.


-- జ్యోతి మువ్వల
9008083344