పంచభూతాలు
కనకదుర్గా లక్ష్మీరత్న
ఊతప్పం కాలుస్తూ వాట్సాప్ లో పరంపరగా వస్తున్న మెస్సేజీలు చూస్తోంది సుమిత్ర.
“ ఆ మెస్సేజ్లు మీ పంచభూతాల గ్రూప్ నుండా? ఏమిటి విషయం” అడిగేడు భర్త ఆనంద్.
“ వచ్చే నెల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అన్నదాని మీద ఈ డిస్కషన్స్” అంది
“ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా”?ఎన్నాళ్ళయింది మీరు కలుసుకుని?”
“ఐదేళ్లైయింది. లలిత కొడుకు పెళ్లి కుదిరిందిట. పెళ్ళిలో కలుస్తాము కానీ ఆ హడావిడిలో గడిపినట్లు ఉండదని, పెళ్ళికొడుకు చేసుకుంటున్నట్లే మనం కూడా బాచిలర్స్ పార్టీ చేసుకుందామంటోంది. వీలయితే నాక్కూడా వెళదామనే వుంది. ఇది పనివేళ, రాత్రి పదికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుందామని మెసేజ్ చేసేను” అంది.
సుమిత్ర, లలిత, అమృత, విమల, మాధవి ఆరవ తరగతి నుండి ఫ్రెండ్స్. ఇంటర్లో అందరివీ వేర్వేరు గ్రూప్స్ అయినప్పటికీ ఒకటే కాలేజీలో చదవాలనుకున్నారు. లలితకి డిగ్రీ అవగానే పెళ్ళి అయ్యి చెన్నై వెళ్ళిపోయింది. వెనువెంటనే పిల్లలు పుట్టేరు, పెళ్లీడుకి వచ్చేరు. సుమిత్ర హైదరాబాద్ లోను, అమృత పూణే, విమల బెంగుళూర్, మాధవి వైజాగ్ లోను స్థిరపడ్డారు. సుమిత్ర కొడుకు, విమల కూతురు ఉద్యోగంలో చేరేరు. అమృత కూతురు MS అబ్రాడ్ లోను, మాధవి కొడుకు MBA చేస్తున్నారు. పెళ్లిళ్లయ్యి వెళ్లిపోయేక “పంచభూతాలు” అని వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. సంఖ్య కోసం ఆ పేరు పెట్టినా నిజానికి ఒక్కొక్కరికి పంచభూతాల లక్షణాలను ఆపాదించవచ్చు.
సుమిత్రకు భూదేవంత సహనం.
ఆకాశమంత విశాలమైనది లలిత హృదయం.
గలగల పారే నీరులాగా అమృత గలగలా మాట్లాడుతుంది, కిలకిలా నవ్వుతుంది.
విమలకు గాలిలాగా నిరంతరం సంచరించడం అంటే ఎంతో ఆసక్తి.
మాధవి నిప్పురవ్వలాగా చిటపటలాడుతూ ఉంటుంది. ఇట్టే కోపం,ఉద్రేకానికి లోనవుతుంటుంది.
రాత్రి పది దాటేక పంచభూతాలూ కాన్ఫరెన్స్ కాల్ లో జేరేరు.
“అందరికీ రావడం సమ్మతమేనా” అడిగింది లలిత.
“ ఓ ! బేషుగ్గా! నాకు కొత్త ప్రదేశాలు తిరగడం ఎలాగూ సరదానే కదా!” అంది విమల.
సుమిత్ర, అమృత కూడా రావడానికి ఆయత్తంగా వున్నామన్నారు.
“మీకే! పెట్టి పుట్టేరు. ఏ బాధ్యతలు లేవు. నాకు ఇంట్లో పెద్ద వాళ్ళ బాధ్యత వుంది. మా వారు బిజినెస్ వ్యవహారాల్లో పీకల్లోతు మునిగివుంటారు. ఇంటి బాధ్యతలు పట్టవు. నాక్కూడా అన్ని చోట్లకి వెళ్లాలని ఉంటుంది. కుదిరితేగా?” ఉడుకుమోత్తనంగా అంది మాధవి.
“ నాలుగు రోజులేగా! వంటకి ఎవరినైనా ఏర్పాటు చేసుకో! అయినా మీ వైజాగ్ లో కారియర్ సర్వీస్ కి కొరతేముంది” అంది అమృత.
“ఎవరకు లేవు పెద్దవాళ్ళ బాధ్యతలు? మా అమ్మా నాన్నకు, మా అన్నయ్య దగ్గర సెట్ కాలేదు. వూళ్ళో పెద్దవాళ్ళు ఒకళ్ళు వుండలేరని, నా దగ్గరకి రమ్మన్నాను. వాళ్ళ పనులు చూడటానికి ఒక మనిషిని పెట్టేను. అలాగే ఎదో ఏర్పాటు చేసుకుని రావాలి” అంది విమల.
“ఏమో! ఇప్పుడే ఏమీ చెప్పేలేను. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నాము?” అడిగింది మాధవి.
“అథిరాపల్లి వాటర్ ఫాల్స్ అనుకుంటున్నాను. అందరం కొచ్చి ఎయిర్పోర్ట్ లో కలుసుకుందాము. మొదటి రోజు కొచ్చిలో స్టే చేసి రెండవరోజు వాటర్ఫాల్స్ కి వెళదాము. అక్కడే రిసార్ట్ తీసుకుని రెండు రోజులు హాయిగా గడుపుదాం. నాల్గవ రోజు కొచ్చికి వచ్చి ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరుగు ప్రయాణమే! మా అబ్బాయి పెళ్లి కుదిరిన శుభ సందర్భంలో అథిరాపల్లిలో రిసార్ట్, అక్కడ రెండు రోజుల ఖర్చు నేను స్పాన్సర్ చేస్తాను. సరేనా! “ అంది లలిత.
మాధవి “నాకు కొంత సమయం కావాలి” అంది
“మనమంతా తప్పక వెళుతున్నాము. ఎవ్వరూ ఏ వంకలు పెట్టి తప్పించుకోవద్దు” అమృత గట్టిగా చెప్పింది.
అంతా సరేఅన్నారు.
-------------------
వెళ్లే రోజు వచ్చింది. కొచ్చి ఎయిర్పోర్ట్ లో అందరూ వచ్చేదాకా ఆగి, కలుసుకుని హోటల్ కి వెళ్ళేరు.
“నా మాటను మన్నించి మీరంతా వచ్చినందుకు నాకెంతో సంతోషంగా వుంది” అంది లలిత.
“పెళ్లి కూతురు ఎవరు, వివరాలు ఏమిటి? పెళ్లి ఎప్పుడనుకుంటున్నారు? అరేంజ్డ్ ఆర్ లవ్వా?” స్నేహితురాళ్లు ప్రశ్నలు గుప్పించేరు.
“మా బంధువులకి తెలిసినవాళ్ళు. పెళ్ళికి నాలుగైదు నెలలు టైముంది” అంది.
భోజనాలయ్యేక కొంత సేపు సేద తీరి చేరయ్ బీచ్ కి వెళ్ళేరు. మాధవి ఇంటి వద్ద పరిస్థితి కనుక్కోవడానికి ఫోన్ తీసింది.
“ అబ్బా! అన్ని ఏర్పాట్లు చేసే వచ్చేవుగా! మీ ఆయనక్కూడా కొంచెం బాధ్యత అప్పజెప్పవచ్చు. ఇక్కడ నుండి నువ్వే కనుక్కోవక్కర్లేదు” విసుక్కుంది విమల.
“ మీకు తెలియదు. నేను ఫోన్ చేయకపోతే మా అత్తగారు, మావగారితో ‘చూసేరా! స్నేహితులను చూసేక, వారితో మమేకమైపోయి, మనం తిన్నామా? మందులేసుకున్నామా, నిద్ర పట్టిందా అనే మాటే లేదూ!’ అంటారు. ఈ మాట నా వద్దకి వచ్చి చేరితే నాకు చిర్రెత్తుకొస్తుంది” అంది.
“సరే! ఫోన్ చేసుకో కానీ ఆ పైన నీ మనసులో ఏ గునుపులు పెట్టుకోకుండా మాతో సంతోషంగా గడుపు. ఈ ట్రిప్ మనకందరికీ మెమరబుల్ గా ఉండాలి. ఈ సారి మనం వాటర్ బాడీస్ మన రీయూనిన్ కి ఎంచుకున్నాం. ఈ సముద్రం, అలలను చూసి మన మనస్సుల్లోను, జీవితాల్లోను వున్న చీకూ చింతలను మర్చిపోవాలి. పదండి నీళ్ళల్లోకి వెళదాం” అంది అమృత
.
నీళ్ళల్లో చాలా సేపు గడిపారు. కాల్చిన మొక్క జొన్నపొత్తులు, ఉప్పు కారం రాసిన మామిడి, కీరా ముక్కలు, పీచు మిఠాయి ఆనందంగా తిన్నారు అప్పటి ఆరవ తరగతి పిల్లల్లా. అమృత మాత్రం “నాకు కారం, బైట ఫుడ్ పడటంలేదు” అని తినలేదు. కెమెరాలో దృశ్యాలను అందంగా బంధించే నేర్పరి అయిన విమల బోలెడన్ని ఫోటోలు తీసింది. అలసిపోయేంతవరకు నీళ్ళల్లో గడిపి హోటల్ కి జేరేరు.
మర్నాడు టాక్సీ లో అథిరాపల్లి వాటర్ ఫాల్స్ కి బయలు దేరేరు. లలిత చెప్పినట్లుగా మంచి రిసార్ట్ బుక్ చేసింది. విమల అందరికీ ఒకే కలర్ లో ఒకేలా వుండే దుపట్టాలు తీసుకొచ్చింది. సుమిత్ర అందరికీ ముత్యాల హారాలు, మాధవి హ్యాండ్ బాగ్స్, అమృత స్కార్ఫ్స్ తెచ్చింది. అన్నీ వేసుకుని రాంప్ వాక్ చేసేరు. పాడేరు. ఆడారు. “మేము పంచభూతాలం. ఈ సృష్టికి మేమే ఆధారం” అంటూ రీల్స్ చేసేరు. కొంచెం సేపయ్యేక అమృత “నాకు అలసటగా వుంది. కొంచెం సేపు నడుం వాలుస్తాను. మీరంతా నా పక్కన కూర్చుని కబుర్లు చెప్పండి” అంది.
సుమిత్ర ” అమ్మూ! నిన్న కూడా గమనించాను. నువ్వు బీచ్ దగ్గర ఏమీ తినలేదు. నువ్వు ఇంటి నుండి తెచ్చుకున్న డ్రై ఫ్రూప్ట్స్ తిన్నావు. నీకు ఒంట్లో బాగానే ఉందా? అడిగింది.
“ అవును. స్కూల్ లోను, కాలేజీ లోను మనకంటే అమ్మూనే ఎక్కువ తినేది. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడా” మాధవి విస్తుపోయింది.
“ఇప్పుడు పెద్దతనం రావడం లేదూ! కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని” నవ్వుతూ అంది అమృత.
“నువ్వు పెద్దదానివి అనుకుంటే అనుకున్నావు కానీ మమ్మల్ని చేయకు తల్లీ” అంది విమల .
“మన లలిత అత్తగారు అవుతోంది కదా! తన్ని కూడా పెద్దవాళ్ళ కోవలోకి వేస్తే సరి” నవ్వింది సుమిత్ర. అందరూ కిలకిలా నవ్వేరు.
------------------
అథిరాపల్లి వాటర్ఫాల్స్ ముగ్ధమనోహరంగా వుంది. 80 అడుగుల ఎత్తు మీంచి నీళ్లు తెల్లగా పాలపుంతలాగా పడుతుంటే ఆ ఐదుగురు దానికేసే చూస్తూ మౌనంగా ఆ ప్రక్రుతి శోభను ఆస్వాదిస్తూ తన్మయత్వానికి లోనయ్యేరు. మాధవితో సహా వారి మొహాలు నిర్మలంగాను , ప్రశాంతంగానూ వున్నాయి. చీకూ, చింతకి తావు ఇవ్వలేదు. ఆ పచ్చని చెట్లు, పాల ధారలా పడుతున్న నీళ్లు, స్వచ్ఛమైన గాలి ….ఆ అందమైన ప్రకృతిలో పరవశించిపోయారు.
ఆ ప్రక్రుతి శోభని విమల తన కెమెరా లో బంధించింది. వీడియో కవరేజ్ చేసింది. అక్కడ చదునుగా వున్న రాయి మీద అందరూ కూర్చున్నారు. అమృత కింద కూర్చోవడం కష్టమని పక్కనే వున్న ఒక ఎత్తు రాయి మీద కూర్చుంది. కొంచెం సేపు మౌనంగా కూర్చున్నాక అమృత “మీ అందరికి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను” అంది. ఏమిటన్నట్లు ఆశ్చర్యంగా చూసేరు.
“రెండు నెలల క్రితం గైనిక్ ప్రాబ్లెమ్ వస్తే టెస్ట్స్ చేయించుకున్నాను. యుటిరస్ కి కాన్సర్ అని చెప్పేరు. సర్జరీ చేసి తీసేసేరు. నెక్స్ట్ మంత్ కీమో స్టార్ట్ అవుతుంది. సిక్స్ సిట్టింగ్స్” అని ఆగింది.
అందరూ మౌనంగా వున్నారు. ఎవరికీ మాట పెగలలేదు. కొద్ది సేపటి క్రితమే వారికి అందంగా కనిపించిన ఆ జలపాతం ,ఇప్పుడు ఒక భూతంలా వారి మీదకి వచ్చి లాక్కుపోతున్నట్లు అనిపిస్తోంది.
అమృత అందరికేసి ఒకసారి చూసి “ఎంతో సంతోషంగా గడుస్తున్న ఈ ట్రిప్ లో ఇలాంటి వార్త చెప్పి మిమ్మల్ని బాధపెట్టేను. లలిత వాళ్ళ అబ్బాయి పెళ్లి కుదిరిందని మనకి చెప్పినప్పుడు, కీమో స్టార్ట్ అవుతుందని, పెళ్ళికి రాలేనని లలితకి ఫోన్ చేసి చెప్పేను. మీ అందరికీ ఫోన్ లో చెప్పాలంటే కష్టంగా అనిపించింది. ట్రీట్మెంట్ మొదలయ్యే ముందే మిమ్మల్ని కలుసుకుందామని, అందరితో ఆనందంగా గడపాలని, ఏదైనా ప్రశాంత వాతావరణానికి వెళదామని, అందరికీ అక్కడే చెబుతానని చెప్పేను. అప్పుడు లలిత అథిరాపల్లి సజెస్ట్ చేసింది. మధు అవీ ఇవీ సాకులు చెప్పి రానంటుందేమోనని భయపడ్డాను. అందుకే అందరూ తప్పక రావాలని, మనం ఆనందంగా గడపాలని చెప్పేను”.
అవును.“అమ్మూ పెళ్ళికి రాలేనని ఈ విషయం చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అందుకే తను ట్రీట్మెంట్ ముందే మనందరమూ కలవాలని చెప్పినప్పుడు, నాకు బాచిలర్స్ పార్టీ ఐడియా వచ్చి ఈ రీయూనియన్ ప్లాన్ చేసెను “ అంది లలిత.
“ఓ ! ఇదా సంగతీ! మా అత్తగారు అన్నారు కూడా! ‘పెళ్ళికి వెళతావు కదా! మళ్ళీ ఈ రీయూనియన్ దేనికీ అని’
అసలు ఈ విషయం బైట పడినప్పుడే మా కెందుకు చెప్పలేదు?” కోపగించుకుంది మాధవి.
“చెబితే ఏమి చేస్తారు? ‘అయ్యో! నీకే ఎందుకొచ్చిందీ? అసలు ఎలా వచ్చిందీ’ అని వాపోతారు. ఆ మాటలు నన్ను ఇంకా బాధిస్తాయి. తెలిసిన వెంటనే నేను కృంగిపోయేను. పిల్ల పెళ్ళికి ఎదిగి వుంది, ఇంకా చదువుకుంటోంది, బాధ్యతలు ఇంకా తీరనే లేదు అని. మా ఆయన, అమ్మాయే నాకు ధైర్యం చెప్పేరు. వారి మాటలే నాకు గుండె నిబ్బరాన్ని ఇచ్చేయి. ఎదో కర్మ క్షయం చేసుకోవలసింది వుంది. అంతే! . ఇనీషియల్ స్టేజ్ కాబట్టి భయం లేదు. మీరు బేలగా మొహాలు పెడితే నాకు నచ్చదు. ఇంక మామూలు అవ్వండి” అంది .
సుమిత్ర తేరుకుని “అవును. జీవితంలో ఆటుపోటులు సహజమే. కాకపొతే కష్టం కొందరికి చిన్నగాను, కొందరికి పెద్దగానూ వస్తుంది. కష్టంలో కుంగిపోకుండా నిలదొక్కుకుని పైకి లేవడమే గెలుపు. అమ్మూ !నీ స్ట్రాంగ్ విల్ పవర్ తో తొందరగా రికవర్ అవుతావని మా అందరికీ గట్టి నమ్మకం” అంది .
‘”ఎప్పుడూ కొత్త ప్రదేశాలు అంటూ తిరిగే ఈ విమలకి వేదాంతమేమిటీ ?అనుకోకపోతే నా మనసులో మాట చెబుతాను. ఊర్లు తిరుగుతుంటాను కాబట్టే ఈ వేదాంతం అబ్బింది” అంది విమల. చెప్పమన్నట్లు చూసారు.
“నాకు ఎందుకో జీవితం రైలు ప్రయాణంలా అనిపిస్తుంటుంది. కొందరు ఎక్కుతుంటారు. కొందరు దిగుతుంటారు. మనం ఈ ప్రపంచంలోకి వస్తాము, ఎదో ఒక రోజు వెళతాము. ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఒకసారి పచ్చని పొలాలు, అందమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇంకో సారి చీకటి టన్నెల్ లోంచి వెళుతుంటుంది. అవే సంతోషాలు, కష్టాలు. సంతోషాలు ఎప్పుడూ వెల్లి విరియవు. అలాగే కష్టాలూ కలకాలం నిలిచిపోవు. మన జీవన ప్రయాణం ఎంత పొడవుగా సాగిందీ కాదు. ఎలా సాగిందీ ముఖ్యం. మనవారితో పంచుకున్న మధురమైన జ్ఞాపకాలు మనకి ఎప్పటికీ నిలిచిపోవాలి. భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని ఆనందంగానూ, అర్ధవంతంగాను గడపడం నేర్చుకోవాలి” అంది. స్నేహితురాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.
“మీ అందరి మాటలు వింటుంటే నాకు కనువిప్పు అయ్యింది. మీరు ఎప్పుడూ’ నేను ప్రతివిషయానికి ఓవర్ గా రియాక్ట్ అవుతానని, క్షణికావేశానికి లోనవుతానని, నన్ను నేను విక్టిమ్ లాగా వూహించుకుంటానని’ అంటుంటారు నిజమేనేమో! చిన్న చిన్న విషయాలకి చలించిపోయి, దాని నుండి టెన్షన్ తెచ్చుకుని,అసహనానికి లోనై, చిన్న చిన్న విమర్శలను కూడా తీసుకోలేక, కోపంతో అరుస్తుంటాను.నేను తప్పా, ప్రపంచం అంతా సంతోషంగా ఉంది
అనిపించేది. నిజానికి అమ్మూ కి వచ్చిన కష్టంలో నావేపాటివి? సంతోషంగా కనిపించే వాళ్లకి కూడా ఏవో సమస్యలు ఉండనే ఉంటాయి. ఇప్పుడనిపిస్తోంది అన్ని అనుభవాల సమ్మేళనమే జీవితమని”అంది మాధవి. సుమిత్ర చిన్నగా నవ్వుతూ “పోనీలే ! మన ఈ రీయూనియన్ వలన మధూకి మానసిక పరిపక్వత, జీవితమంటే అవగాహన వచ్చేయన్న మాట “ అంది. మాధవి “అమ్మూ! కీమో సిట్టింగ్స్ కి మనిషి అవసరం పడుతుంది. ఆ టైములో మాలో ఎవరికి కుదిరితే వాళ్ళం వస్తాం. దయచేసి వద్దనకు” అభ్యర్ధించింది.
“నీకు మరి పెద్ద వాళ్ళ బాధ్యత ఉందిగా ? ఎలా వస్తావు ?” ఆటపట్టించింది అమృత.
“అప్పుడు మా ఆయన్ని చూసుకోమని చెబుతాలే” నవ్వింది మాధవి.
“నా కొచ్చిన కష్టాన్ని మీతో మనసు విప్పి చెప్పుకున్నాను. ఇప్పుడు నా మనసు తేలిక పడింది . మీ మంచి మాటలతో నాకు స్వాన్తన కలిగించారు. నా ఫామిలీతో పాటు మీరంతా నాతొ ఉన్నారనే భావన నాకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది .ఆ ధైర్యమే ఎంతటి కష్టాన్నైనా దాటిస్తుంది. శుభవార్తలు ఒక్కటే కాకుండా మనలో ఎవరికీ ఏ చిన్న సమస్య వచ్చిన దాచకుండా చెప్పాలి. మనం ఒకరికొకరం తోడుగా ఉంటూ విజయవంతంగా ముందుకు సాగిపోవాలి” అంటూ అమృత చెమర్చిన కళ్ళను తుడుచుకుంది.
“మన స్నేహం ఈ పంచభూతాలులా కలకాలం వర్ధిల్లాలి” అన్నారు అందరూ.
ఆ ఐదుగురు స్నేహితురాళ్లు చేతులు గట్టిగా పట్టుకుని వాటర్ఫాల్స్ దగ్గర ఫోటో తీయించుకున్నారు. వెంటనే విమల ఆ పిక్చర్ ని “పంచభూతాల “ వాట్సాప్ గ్రూప్ కి డిస్ప్లే పిక్చర్ గా పెట్టింది. దానిని వారంతా ఆనందంగా చూస్తూవున్నారు.