విఘ్నేష్
“అరె మాధవ, చింటూ కి మూడో సంవత్సరం వచ్చింది, పంతులు గారికి చెప్పి అక్షరాభ్యాసానికి ముహూర్తo పెట్టించు.” అంది మా బామ్మ దీర్ఘం తీస్తూ.
“ఒసేయ్ నానమ్మా! నిన్నే కదా నాకు రెండు వెళ్లి మూడు వచ్చాయి. హాయిగా ఆడుకోనీయకుండా ఎందుకే నీకు అంత తొందర”
“ మధు, మంచి స్కూల్లో సీటు దొరకటం చాలా కష్టంగా ఉంది. అసలే పోటి ప్రపంచం, మన చింటూ, టాప్ ర్యాంక్ లతో హైఎండ్ లో వుండాలంటే, మనం తొందర పడాల్సిందే.” అంది అమ్మ. బొమ్మలన్నీ ముందేసుకుని ఆడుకుంటున్న నన్ను చూస్తూ.
“ అల్లుడుగారు, మన చింటూ గాడు అన్నప్రాసన రోజున ముందు పుస్తకం, తరువాత పెన్ పట్టుకున్నాడు. వాడు సరస్వతి పుత్రుడు. ఇప్పటి నుంచే వాడిని మంచి స్టాండర్డ్స్ వున్న స్కూల్ లో వేయాలి,” అని వంత పాడింది అమ్మమ్మ.
“వామ్మో! అమ్మమ్మో నేను కావాలని పుస్తకం, పెన్ పట్టుకోలేదు. మీరే వాటిని నా ముందు పెట్టారు. వెనక వరసలో నిగనిగలాడుతున్న బందరు లడ్డు నోరూరిస్తుంటే, గబగబా వెళ్ళి పట్టుకోబోయి పుస్తకము, పెన్ మీద చేయి వేసాను అంతే.”
ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా, వీళ్ళందరూ ఐఏఎస్, ఐపీఎస్ కాదుకాదు ఇంకా ఎదోదో చేసేయాలని మాట్లాడుకునేది నాకోసమే,
ముద్దుగా చింటూ అని పిలుచుకునే నా అసలు పేరు విఘ్నేష్.
వినాయకచవితి రోజున పుట్టాను అని విఘ్నేష్ అని పేరు పెట్టి, ఏ విఘ్నాలు లేకుండా చదువుకుంటాడు అని తెగ సంబరపడిపోయారు. అలా ఉయ్యాలలో వేసిన రోజు నుంచే నా మీద తెగ ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయ మా వాళ్లకు.
దానికి కూడా ఓ కారణం వుంది అండోయ్. మా పక్కింటి జున్నుగాడిని వాళ్ళ నాన్న టాప్ టెన్ లో వున్న స్కూల్లో వేసి లక్షల్లో ఫీజులు కడుతున్నాడు.
రోజు వనజ ఆంటీ మా ఇంటికి వచ్చి,
“వాళ్ళు కట్టిన లక్షల ఫీజు గురించి, జున్నుగాడు ఇరగతీసేస్తున్న ఇంగ్లీష్ గురించి,
“ మా జున్నుగాడు అరటిపండును బనానా అంటున్నాడు.జామపండును గోవా అంటున్నాడు.” అని తెగ గొప్పలు చెప్తూఉంటుంది.
ఆమె గొప్పలకు మా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ నన్ను జున్ను గాడి స్కూల్ కoటే రెండు రెట్లు ఎక్కువ వున్న పెద్ద స్కూల్లో వేసి ఆవిడ పొగరు అణచాలని మంచి కసి మీద ఉన్నారు.
అంతే కాదు ముగ్గురు కలిసి మన విఘ్నేష్ను ఆ వనజ కొడుకు కన్నా గొప్పగొప్ప చదువులతో పాటు మిగిలిన యాక్టివిటీస్ వున్న స్కూల్ లోనే వేయాలని ముగ్గురు కలిసి ప్రతిజ్ఞ కూడా చేసుకున్నారు.
అందుకే రోజు నాన్నని ఒప్పించటానికి ఎవరి వoతు వాళ్ళు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
……………….
“వదినా” అంటూ లోపలికి వచ్చింది వనజ.
అదిగో వచ్చేసింది “గొప్పల ఆంటీ.”
“సరే ఏదో ఒకటి చేయండి” అని చెప్పి లాప్టాప్ బ్యాగ్ తీసుకుని నెమ్మదిగా ఆవిడ గొప్పలనుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు నాన్న.
“హాయ్ చింటూ.” అని నా దగ్గరకి వచ్చి బుగ్గ సాగలాగింది.
“అబ్బా, నొప్పి” ఎంత గట్టిగా లాగావు ఆంటీ ఇది నా మీద ప్రేమ, కోపమా?” గొల్లుమన్నాను.
“రా వనజా! మా చింటూని టాప్ స్కూల్ లో జాయిన్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నాము.” అని చెప్పింది నానమ్మ గర్వంగా.
“సంతోషం పిన్నిగారు, పొయ్యి మీద కూర పెట్టాను మాడిపోతుందేమో చూసి వస్తాను” అని అక్కడ నుంచి జారుకుంది.” వనజ ఆంటీ.
ఆవిడ జారిపోవడం చూసి ఒకరి చెయ్యి ఒకరు కలిపి నవ్వుకున్నారు ఆనందంగా.
…………….
ఒక మంచి ముహూర్తం చూసి, గణపతి ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, అక్షరాభ్యాసం కూడా అక్కడే చేయించారు. మా వాళ్లకు వినాయకుడు అంటే వీరలెవెల్లో అభిమానం మరి.
“హమ్మయ్య! అక్షరాభ్యాసo కూడా అయిపోయింది. మంచి స్కూల్ సెలెక్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవటమే తరువాయి.” అంది అమ్మమ్మ ఆనందంగా.
ఇక్కడ మళ్ళీ ఒక చిక్కొచ్చిపడింది.
నాన్నకు డిఫెన్స్ అంటే ఇష్టం. నాన్న ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కి సెలెక్ట్ అయితే వాళ్ళ తాత ఒప్పుకోలేదంట.
‘కొడితే…. కుంభస్థలాన్నే కొట్టాలి’ ఇలా చిన్న చితకా ఉద్యోగాలు కాదు అన్నాడంట.
పాపం నాన్న, కుంభస్థలం కోసం వెతుకుతూ…. ఏదో చేయబోయి ఏదో చేసి, చివరకు సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఇష్టం లేని జాబ్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు.
సైనిక్ స్కూల్లో జాయిన్ చేసి మిలటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇలా ఏదో ఒక ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ లో ఆఫీసర్ గా, నన్ను చూసుకుని, ఆయన కోరికను నా ద్వారా తీర్చుకుని మురిసిపోవాలని నాన్న ఆకాంక్ష.
………………
“ఇదిగో మాధవ మా మనవడు కలెక్టర్ అవ్వాలి దానికి తగ్గ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్ సెలెక్ట్ చేయాలి.” అంది నానమ్మ.
“అత్తయ్య నా కొడుకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఆస్ట్రోనాట్ అయి అంతరిక్షయానం చేయాలి.” అంది అమ్మ
“అమ్మాయి, ఇవన్నీ కాదు మీ నాన్న సరైన వైద్యం అందక చనిపోయాడు. నా మనవడు పెద్ద డాక్టర్ అయి అందరికీ సేవ చేయాలి.” అంది అమ్మమ్మ.
“ ఇవేమీ వద్దు, వాడు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ లో ఆఫీసర్. అది చాలా గౌరవప్రదమైన జాబ్,” అన్నాడు నాన్న.
“కాదు నా మనవడు కలెక్టర్, కాదు నా కొడుకు ఆస్ట్రోనాట్, కాదు వాడు డాక్టర్ అవుతాడు.” అని గొడవ మొదలుపెట్టారు.
అసలు నేనేం అవ్వాలో డిసైడ్ చేయవలసింది నేను కదా, వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో నా చిట్టి బుర్రకు అర్థం కాక.
వాళ్ళ అరుపులకు కేకలకు బుర్ర గిర్రున తిరిగి కళ్ళు తిరిగి నేల మీద పడి గిలగిలా కొట్టుకోవటం మొదలు పెట్టాను.
అందరు కంగారుపడి నా చేతిలో తాళంచెవి పెట్టి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు.
“మీ బాబుకు ఫిట్స్ వచ్చాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి.” అని మందులు రాసి ఇచ్చారు డాక్టర్.
వీళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్లు అయ్యి స్తబ్దుగా వుండిపోయారు.
“హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నాను.
అలా నా చదువు టాపిక్ ఆరునెలలు వాయిదా పడింది.
కానీ, వనజా ఆంటీ మాత్రం ఊరుకోలేదు, ఆవిడ కొడుకు స్కూల్, చదువు, ర్యాంక్ ల గురించి చెప్పే గొప్పలతో పాటు,
“అయ్యో పాపం విఘ్నేష్ “ అని నా మీద జాలి కూడా చూపించటం మొదలు పెట్టింది. దానితో మా వాళ్లకు పుండు మీద కారం చల్లినట్లయి మంటతో రగిలిపోయారు.
ఇంకో ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి.
వనజ ఆంటీ జాలి చూపులు వెటకారపు మాటలకు ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడికినట్లు ఉడికిపోతూ ఎప్పుడు పేలిపోతామా అన్నట్లు వున్నారు మా వాళ్ళు.
“చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్లినప్పుడు,
డాక్టర్ పరవాలేదు స్కూల్లో జాయిన్ చేయండి.” అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మళ్లీ ప్రహసనం మొదలయ్యింది.
భవిష్యత్తులో చింటూ గాడిని ఏం చేయాలి అనేది పక్కన పెట్టి, ముందు ఒక టాప్ టెన్ లో వున్న స్కూల్లో జాయిన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు.
అలా, నా నెత్తిన పుస్తకాల బండ వేయటానికి అందరూ సిద్ధమై పోయారు,
……………
ఎక్కడి నుంచి మొదలుపెట్టాలా అని ఆలోచించుకుని, అన్ని సమస్యలకూ పరీష్కారి మన గూగుల్ తల్లి వుండగా ఇంకేమి బెంగ అనుకుని.
వారం పది రోజులు గూగుల్ తల్లిని రకరకాల ప్రశ్నలతో విసిగించి, వేదించి, రకరకాల కుస్తీ పట్లు పట్టి, హాట్ హాట్ డిస్కషన్ల అనంతరం జన్నుగాడి స్కూల్ కంటే రెండు మెట్లు ఎక్కువే వున్న స్కూల్ ను సెలెక్ట్ చేయాలి అని నిర్ణయించుకుని.
మొబైల్ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి ఠపాఠపా, స్కూళ్లు వాటి రాంక్ లు, స్కూల్ లో పిల్లల రాంక్ లు, వాళ్ళ తల్లిదండ్రుల రాంక్లు, టీచర్లు వాళ్ళ క్వాలిఫికేషన్ లిస్ట్ తీసి,
నిమిషం కూడా పిల్లల్ని ఊపిరి సలపకుండా చేసి, అన్నింటిలో నెంబర్ వన్ అనిపించుకునే బడా స్కూల్ను వెతికిపారేసి, ఒలింపిక్ లో కప్ సాదించినంత సంబరపడిపోయారు.
బడా స్కూల్ అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు ఇద్దరు డిగ్రీ ఉత్తీర్ణులై వుండాలి. ముందు తల్లిదండ్రులు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితేనే, పిల్లలకు అడ్మిషన్ అని మా ‘రూల్’ అన్నారు.
మళ్లీ ప్రహసనo మొదలు, లోపల పెట్టిన పుస్తకాలను బయటకి తీసి దుమ్ముదులిపి, ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లల్లా సిన్సియర్గా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదవి, బడాస్కూల్లో ఇంటర్వ్యూ కి వెళ్ళారు అమ్మా నాన్న.
……………….
ఇంత కష్టపడి చదువుకుని వెళితే,
తెలుగు ఆవు ఏమి అంటుంది, ఇంగ్లీష్ ఆవు ఏమి అంటుoది అని చిలిపి ప్రశ్నలు వేశారు. వీళ్ళ మోహలు మండ తెలుగు లో ఆవు ’అంభ’ అన్నా ఇంగ్లీష్ లో ’మూల్’ అన్నా , పిలిచే భావం ఒకటే కద.
వాళ్లు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ మా వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ఠపీఠపీ మని సమాధానాలు చెప్పి ఇంటర్వ్యూలో విజయం సాధించారు.
ఇంటర్వ్యూ పాస్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు.
………………
ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది ఇంటర్వ్యు లో సెలెక్ట్ అవటం వలన సెలెక్ట్ అయిన వాళ్లందరినీ మళ్లీ లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేస్తాము అని చావు కబురు చల్లగా చెప్పారు బడా స్కూల్ మేనేజ్మెంట్.
కోరుకున్న స్కూల్ లో సీట్ వస్తుందో రాదో అని మళ్ళీ గుండెల్లో రైళ్ళు, బస్సులు, కార్లు అన్ని పరిగెత్తాయి.
“మూషిక వాహనుడు గజాననుడా! ఆ అదృష్టమేదో మాకే దక్కి మా చింటూ గాడికి స్కూల్లో సీట్ రావాలి స్వామి” అలా వస్తే వచ్చే వినాయక చవితి రోజు జరిగే సంబరాల్లో నీకు విగ్రహం పెట్టి పూజాచేస్తాము.” అని వినాయకునికి పూజలు ముడుపులు కట్టేశారు.
వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆ లంబోధరుడు “తధాస్తు!” అన్నాడు.
ఇంక ఆలస్యం చేయకుండా,
ఒక మంచి ముహూర్తం చూసి, నన్ను చక్కగా ముస్తాబు చేసి, ముద్దులతో ముంచెత్తి,
తీసుకుని వెళ్లి బడా స్కూల్ అనే పద్మవ్యూహంలో కి నెట్టారు.
వామ్మో! అయిపోయింది అంతా అయిపోయింది,
నా బాల్యం పోయింది. వీళ్ళ ఎక్స్పెక్టేషన్కు నా బాల్యం బలైపోయింది.
ఆరోజు వినాయక చవితి, మా కాలనీ వాసులు అంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగ.
మా వాళ్ళు వినాయకుడికి మాటిచ్చినట్లే, వినాయకుడి భారీ విగ్రహం పెట్టించి, ఆ సంవత్సరం చేయవలసిన పూజలన్నీ దగ్గరవుండి భక్తిశ్రద్ధలతో, భజనలతో, ఆటపాటలతో చేస్తూ… అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు.
………శుభం……….