[Image 2052.jpg]
కథా శీర్షిక: చిట్టి మనసుల గట్టి సంకల్పం
(మట్టూరి కమలమ్మ స్మారక జాతీయస్థాయి దీపావళి కథల
పోటీలో బహుమతి పొందిన కథ)
విశాలమైన హాలులో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు సాహిత్. ఆఫీస్ కి టైమ్ అవుతుంది,
డ్రైవర్ ఇంకా రాలేదు.
సాహిత్ డ్రైవర్ ఒకడు ఊరెళతున్నానని సెలవు పెట్టాడు. మరొక డ్రైవర్ ఫోన్ సిగ్నల్ కవరేజ్ లో లేదు. పది నిముషాల నుంచీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నాడు. చిరాకు తీవ్రస్థాయికెళుతుందనగా గుమ్మం బయటకు చూపు మళ్ళింది. హాలు బయట కొడుకు కోసం కొన్న కొత్త బుల్లెట్ కనిపించింది. కాబ్ బుక్ చేసుకోవచ్చు, కానీ సాహసం చేయాలనిపించింది సాహిత్ కి. మరో ఆలోచన లేకుండా అదే బుల్లెట్ పైన బయలుదేరాడు ఆఫీసుకు.
"సార్! సార్! ఇది మా అమ్మ వ్రాసిన కవితల పుస్తకం
యాభై పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం సార్.
మీరీ పుస్తకం కొంటే మీరిచ్చే డబ్బులు కోస్తా తుఫాను బాధితులనాదుకుంటాయి ప్లీజ్ ఒక్కటి కొనండి, ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సార్, ప్లీజ్!"
సికింద్రాబాద్ సంగీత్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆపి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న సాహిత్ ని స్కూల్ యూనిఫాంలో వున్న ఒక పన్నెండేళ్ళ బాలుడు ప్రాధేయ పడుతున్నాడు.
వాడి వైపు ఒకింత ఆశ్చర్యంగా చూసాడు సాహిత్. సాధారణంగా ఒక డబ్బాకి తెల్లకాగితం చుట్టేసి దాని మీద
వరద బాధితులకు సహాయం చేయండి అని వ్రాసి వివిధ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడిగే వాళ్ళను చూసాడు కానీ
అమ్మ రచించిన పుస్తకాలనమ్మి ఆపన్నులనాదుకోవాలనుకునే ఆలోచన కొత్తగా అనిపించింది సాహిత్ కి. 'ఎంత గొప్ప ఆలోచన! అదీ ఇంత చిన్న వయసులో!' అనుకున్నాడు మనసులో.
"నీ పేరేంటి? ఏంచదువుతున్నావు?"అడిగాడు సాహిత్.
"బాలరాజ్ సార్ !.ఇక్కడే స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్నా సార్! ప్లీజ్ సార్ ఒక్కటైనా కొనండి"ప్రాధేయ
పడుతున్నాడా బాలుడు.
జేబులోంచి వంద రూపాయల నోటు తీసిచ్చి రెండు పుస్తకాలు కొన్నాడు సాహిత్. వాడి చేతిలో ఇంకా దాదాపుగా ఇరవై పుస్తకాలు వున్నాయి. జేబులోంచి తన విజిటింగ్ కార్డ్ తీసి ఆ బాలుడికి ఇచ్చి,మధ్యాహ్నం మా ఆఫీసుకి యాభై పుస్తకాలు తీసుకొనిరా అడ్రస్ అందులో వుంది".అని చెబుతుండగానే గ్రీన్ సిగ్నల్ పడింది. వెంటనే బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు సాహిత్.
*****
ఆఫీసుకొచ్చి తన రూంలో రివాల్వింగ్ చైర్ లో వాలిపోయాడు సాహిత్. కళ్ళముందు బాలరాజ్ రూపమే మెదుల్తుంది. అసలు ఈ రోజంతా కొత్తగా వుంది సాహిత్ కి
"పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ చైర్మన్ అయిన నేను బైక్ మీద రావాల్సి రావడమేమిటి?.ఆ బాలుడు తనకు తారసపడటమేమిటీ?, భగవత్సంకల్పమంటే ఇదే కామోసు!
కోట్ల ఆస్తులున్న తను వరదల గురించిన వార్తలు టీవీలో చూడ్డమే తప్ప బాధితుల బాధలు చూసి తన మనసు స్పందించలేదెందుకు? బాధితులనాదుకోవాలనే ఆలోచన ఏనాడూ తట్ట లేదెందుకు?. చేతిలో డబ్బులు లేకపోయినా అమ్మ రచనలను అమ్మి వచ్చిన డబ్బుని వరద బాధితులకు పంచాలని ఆలోచించిన ఆ చిన్నారి పెద్దమనసు ముందు చిన్నబోయింది కదా నా మనసు" అనుకున్నాడు రోహిత్.
బాలరాజ్ ఇచ్చిన పుస్తకం తీసి చూసాడు.మంచి ముఖపత్రంతో "మానవత్వం"టైటిల్ కనిపించింది. ఆఫీసు పని పక్కన పెట్టి పుస్తకం చదివాక అర్థమైంది ఆ పిల్లవాడిలో మానవత్వం ఎందుకు పరిమళించిందో. వాళ్ళమ్మగారిలో మూర్తీభవించిన మానవత్వం ఈ పిల్లవాడి రూపంలో పరిమళించిందనిపించింది.
సమయం ఒంటిగంట కావస్తుంది ఆఫీస్ స్టాఫ్ అంతా లంచ్ కి ఉపక్రమించారు. సాహిత్ కూడా లంచ్ బాక్స్ తెరిచాడు.
అటెండర్ వచ్చి బాక్స్ లోనుంచి రెండు రొట్టెలు తీసి
ప్లేట్ లో పెట్టాడు,పప్పు,కూర వడ్డించాడు. అంతలో మరో అటెండర్ లోనికివచ్చి "సార్! ఎవరో కుర్రాడు మిమ్మల్ని కలవాలని వచ్చాడు.లంచ్ చేస్తున్నారు కూర్చోమని చెప్పా" అన్నాడు. బాలరాజ్ వచ్చాడని అర్థమైంది సాహిత్ కి.
" పర్వాలేదు రమ్మను" అన్నాడు.రెండు నిముషాల తరువాత బాలరాజ్ తనతో పాటూ మరో బాలిక లోపలికి వచ్చారు. ఇద్దరు చిన్నారులనూ చూసి ముచ్చటేసింది సాహిత్ కి.
"రావోయ్ హీరో! లంచ్ చేసారా?,ఈ పాపెవరూ?"అడిగాడు సాహిత్.
"మేం తిన్నాం సార్!, ఇది నా చెల్లి శ్రీనిధి సార్!ఈ పక్కనే ప్యారడైజ్ సెంటర్ లో అమ్ముతుంది బుక్స్". లంచ్ చేయకపోయినా తిన్నామని అబద్దం చెప్పాడు బాలరాజ్.
నీరసించిన వాళ్ళ ముఖాలను బట్టి బాలరాజ్ అబద్దం చెబుతున్నాడని అర్థం అయింది సాహిత్ కి.
"తింటే తిన్నారులే నాతో కలిసి తినండి కూర్చోండి"అని ఎదురుగా వున్న కుర్చీలు చూపించాడు. అటెండర్ కి కనులతోటే సైగ చేసాడు.
అటెండర్ బయటకి వెళ్ళి మరోరెండు ప్లేట్లు తెచ్చి రొట్టెలు పప్పు మరో కూరా వడ్డించాడు ,వద్దువద్దంటూనే రొట్టెలూ
భోజనం లాగించేసారిద్దరూ, వారితోపాటూ సాహిత్ కూడా
భోజనం చేసి చేయి కడుక్కోటానికి అటాచ్డ్ బాత్ రూంలోకి వెళ్ళి చెయ్యికడుక్కుని వచ్చాడు.బాలరాజ్,శ్రీనిధి
కూడా చేతులు కడుక్కుని వచ్చారు.
టైమ్ చూసుకున్నాడు సాహిత్, మధ్యాహ్నం ఒంటిగంట దాటి ముప్పై నిముషాలైంది. అటెండర్ ని పిలిచి "పదినిముషాల్లో సిబ్బంది అందరినీ సమావేశ మందిరంలో హాజరవ్వమన్నాననని అందరికీ చెప్పు"అన్నాడు.
పదినిముషాలల్లో ఆఫీస్ సిబ్బంది మొత్తం పాతిక మంది
సమావేశ మందిరంలో హాజరయ్యారు. అందరూ లోనికి రాగానే సాహిత్ ఉదయం నించీ జరిగిందంతా వారికి వివరించి, "ఫ్రండ్స్! ఈ సమావేశం ఉద్ధేశ్యమేమంటే, మనలో నిద్రిస్తున్న మానవత్వాన్ని నిద్రలేపటం. మన రోజువారీ యాంత్రిక జీవనం వల్ల మనం మన కుటుంబానికి మాత్రమే పరిమితమౌతున్నాం. "సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్!"అన్న గురజాడ గారి సందేశాన్ని
మరచిపోయాము. ఈ రోజు ఈ చిన్నారుల వల్ల నాకు జ్ఞానోదయమైంది. మనం సంపాదించే దాంట్లో కొంతైనా పొరుగు వాడికి దానం చేస్తే ఆపదల్లో ఆదుకుంటేనే మన జన్మకు సార్థకత. ప్రకృతి వైపరీత్యాలకు బలియయ్యే బతుకులెన్నో! నా అన్నవాళ్ళని కోల్పోయిన వాళ్ళెందరో!
గూడు కూలి నీడలేక, కడుపుకింత కూడులేక 'అన్నమోరామచంద్రా' అని అలమటించే బతుకులెన్నో!
ఇలాంటి బాధితులను ఆదుకోవటానికి చిన్న మొత్తంలోనైనా నిధిని విరాళంగా ఇవ్వటానికి బయలుదేరారీ చిన్నారులు.
అదీ డొనేషన్లను అడిగి కాదు,అమ్మ వ్రాసిన పుస్తకాలను అమ్మి వచ్చిన డబ్బంతా తుఫాను బాధితులకిస్తున్నారు.
మనం కూడా ఈ చిన్నారుల సంకల్పానికి ఈ పుస్తకాలను కొనటం ద్వారా ఊతమిద్దాము. మీరందరూ ఈ సత్కార్యంలో భాగస్వాములవ్వండి.నా వంతుగా తుఫాను బాధితుల కోసం లక్షరూపాయల విరాళం ప్రకటిస్తున్నా!,మీరూ మీ వంతు విరాళం ప్రకటిస్తే మొత్తం సొమ్ము తుఫాను ఉపశమన నిధికి పంపించేస్తా!"అని తన ప్రసంగాన్ని ముగించాడు సాహిత్.
సిబ్బంది అందరూ రెండేసి పుస్తకాలు కొనటమే కాకుండా
విరాళాలూ ఇచ్చారు. ఆ ఇద్దరు పిల్లలనూ అందరూ అభినందించారు. అనుకోకుండా అన్ని పుస్తకాలూ అమ్ముడు పోయి ట్రాఫిక్ కూడళ్ళలో తిరిగే పని తప్పినందుకూ తమ సంకల్పం నెరవేరినందుకూ చాలా సంతోషించారు పిల్లలిద్దరూ. సాహిత్ కి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయారు.
తను ప్రకటించిన లక్షకు తోడుగా సిబ్బంది ఇచ్చిన యాభైవేలు కూడా తుఫాను ఉపశమన నిధికి పంపించాడు సాహిత్.