అమ్మకు మాత్రం……….

మనతెలుగుకథలు.కామ్ • 30 Jun 2026 • 👁 2 views
అమ్మకు మాత్రం……….
“అమ్మకు మాత్రం…….”
కనకదుర్గా లక్ష్మీరత్న

చూస్తుండగానే అగస్త్య ఉద్యోగస్తుడయ్యేడు. పిల్లలు పెద్దయ్యేక వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు, అభిరుచులు ఏర్పడతాయి. పిల్లలుగా వున్నప్పుడు, వాళ్ళకు సొంత అభిప్రాయాలు వున్నా పెద్దవాళ్ళు సాగనివ్వరు. పిల్లలు……పైగా పెద్ద వాళ్ళ మీద ఆధారపడి వుంటారు కాబట్టి వాళ్లకి, పెద్దవాళ్ళకి తలవంచక తప్పదు.

దాశరధి, రమల ఏకైక సంతానం అగస్త్య. ఉన్న ఊర్లోనే వాడికి వుద్యోగం వచ్చినందుకు,కొడుకు తమ కళ్ళ ముందే ఉంటాడు కదా అని రమ తెగ సంబరపడిపోయింది. వాడు చంటిపిల్లాడప్పటినుండి “వీడు తొందరగా పెద్దవాడయితే బాగుండును” అని రమ అనుకోని రోజు లేదు. ఇప్పుడు నిజంగానే పెద్దవాడు అయ్యేడు. ప్రతి తల్లికీ, పిల్లలు ప్రాణం అయినట్లే రమకి, అగస్త్య అంటే పంచప్రాణాలు. కళ్ళల్లో పెట్టుకు పెంచింది. బోర్లా పడే వయసులో రమ ఏమరుపాటుగా వున్నప్పుడు మంచంమీద నుండి పడి వాడు ఏడ్చినప్పుడు రమ విలవిలలాడిపోయి
“అయ్యో! పిల్లవాడు అవటంతో మంచం అంచు తెలియలేదు. పెద్దవాడై ఉంటే జాగ్రత్త పడేవాడు కదా!” అనేది.
“బోర్లా పడుతున్నప్పుడు నువ్వు దిళ్లు అడ్డం పెట్టాలి. లేదా కింద పడుకోబెట్టాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే క్రమంలో పడడటం, లేవడం సహజమే. దానికింత చలించిపోకు” అని దాశరధి కోప్పడేవాడు.
చిన్నప్పుడు వాడికి జ్వరం వచ్చిందంటే 104 కి తక్కువ వచ్చేది కాదు. రాత్రి తెల్లవార్లూ వాడికి తడి గుడ్డ వేసి తుడుస్తూ ఉండేది.
“పిల్లలకి అలాగే హై ఫీవర్లు వస్తుంటాయి.పెద్దయ్యేక ఇంతింత రావు” అనేవారు అత్తగారు.
“ వీడు తొందరగా పెద్దవాడవ్వాలి దేవుడా” అని దణ్ణం పెట్టుకునేది. తోటి పిల్లలతో ఆటలాడుకుంటూ పడినప్పుడు, ఒకొక్కసారి పళ్ళు విరిగేవి. కాళ్ళకి, చేతులకి దెబ్బలు తగిలించుకునేవాడు. “పెద్దవాడైయుంటే తగిలేదీ, తప్పేదీ తెలిసేది. చిన్నవాడైపోయేడు పాపం!“ అని రమ వాపోయేది.
“నేను చిన్నప్పుడు ఎంత దుందుడుకుగా వుండేవాడినో తెలుసా! చెట్లెక్కి పడి కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకునే వాడిని. ఒకసారి సీసా పగలగొడితే నా చేయి కోసుకుని ఎంత రక్తం కారిందో! మా అమ్మ నీలా బెంబేలుపడిపోయేది కాదు. ఇంత పసుపు వేసి రిక్షాలో కూర్చోబెట్టుకుని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లింది. నాతొ పోలిస్తే పాపం వీడు చాలా మెతకవాడు”! అనేవాడు దాశరధి.
“ఏమో బాబు! వీడు పెద్దయ్యేంతవరకు నాకు టెన్షన్ గానే ఉంటుంది” అనేది.
బట్టలైనా, బొమ్మలైనా, తినుబండారాలైనా అగస్త్య చేయి ఖరీదైన వాటి మీదకే వెళ్ళేది.
“అవన్నీ నువ్వు పెద్దయ్యేక కొనుక్కుందువుగానిలే! ఇప్పుడు అమ్మా, నాన్నా కొనిపెట్టినవి తీసుకో” అనేది. వాడికి నెల నెలా జుట్టు పొట్టిగా క్రాఫ్ చేయిన్చేవారు. జుట్టు మొహం మీద పడేలా పెంచుకుంటానని మారాం చేసేవాడు. “పెద్దయ్యేక నీ ఇష్టం. క్రాఫ్ చేయించకపోతే డైరీ లో రిమార్కు వస్తుంది” అనేది.
వేసవి సెలవల్లో వెకేషన్ కి తీసుకెళ్లినప్పుడు “ మా ఫ్రెండ్స్ అంతా ఫారెన్ కంట్రీస్ కి వెళుతున్నారు. మనమూ వెళదాం” అనేవాడు.
“నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగస్తుడయ్యేక ఆ దేశాలు వెళుదువు గాని. ఇప్పుడు అమ్మా, నాన్న ఎక్కడికి తీసుకెళితే అక్కడికి రావాలి.సరేనా!” అనేది.
“ఎప్పుడూ ఏది అడిగినా పెద్దయ్యేక, పెద్దయ్యేక అంటావు. పో !” అని కోపంగా వాడి గదిలోకి పరిగెత్తేవాడు.
అగస్త్య ఏడెనిమిది తరగతుల్లో వున్నప్పుడు రమకి హిస్ట్రెక్టమీ చేయాల్సివచ్చింది. “ నాకు ఈ అనారోగ్యం ఎదో వీడు కొంచెం పెద్దయ్యేక రాకూడదూ! మరీ చిన్నపిల్లాడైపోయేడు. ఇప్పుడు నేను ఆసుపత్రిలో ఉండాలంటే పిల్లాడు బెంగ పెట్టుకుంటాడో ఏమిటో” గాభరా పడింది.
” అనారోగ్యాలు చెప్పి వస్తాయిటే ? ఇలాంటివి ఆడవాళ్ళకి పరిపాటే! రేపు సర్జరీ అయ్యేక కొన్నాళ్ళు బెడ్రెస్ట్ తీసుంటే సుబ్బరంగా తిప్పుకోవూ!” అత్తగారు ధైర్యం చెప్పేరు.
“ఏమో అత్తయ్య! వీడు పెద్దవాడయ్యుంటే నాకు సర్జరీ అయినా, బెడ్రెస్ట్ అయినా వాడి పనులు వాడు చేసుకునేవాడు. ఇప్పుడు పిల్లవాడు, నా పైన ఆధారపడినవాడు. వాడికి చేయాల్సిందిపోయి బెడ్రెస్ట్ అని నేను మంచానికి అతుక్కుపోయి ఉంటే నాకు మనసులో గునుపుగా ఉంటుంది”.
“మేమంతా లేమూ వాడిని చూసుకోవడానికి. అనవసరపు దిగుళ్ళు పెట్టుకోకు” మందలించేరు.

పెద్దవాడైతే బాగుండునని రమ అనుకోవడం ఎలా వున్నా, సృష్టి ధర్మానుసారం అగస్త్య పెద్దవాడవుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేసేడు. “అమ్మయ్య! వీడు డిగ్రీలోకి వచ్చేడు. అంటే పెద్దవాడన్న మాటే” ! అనుకుంది.
“ నాకు కాలేజీలోకి జేరడానికి ఇంకా నెల టైముంది మా ఫ్రెండ్స్ అంతా కలిసి కొడైకెనాల్ వెల్దామనుకుంటున్నాము” అన్నాడు అగస్త్య. ఒక క్షణం క్రితమే పిల్లాడు పెద్దవాడయ్యేడని ఊపిరి పీల్చుకున్న రమ గుండెల్లో రాయి పడింది
“ అమ్మో ! కొడైకెనాల్ వెళతారా! మీరింకా పిల్లలే! పెద్దవాళ్లమైపోయేము అనుకుంటున్నారా” అని దీర్గాలు తీసింది.
“నువ్వేగా పెద్దయ్యేక వెళ్ళమన్నావు. నాకు ఎయిటీన్ ఇప్పుడు. అంటే పెద్దేగా!”
ఇప్పుడు పిల్లాడే పెద్దవాడ్ని అయ్యేనంటే జీర్ణించుకోలేకపోతోంది.
“భలే వాడివిరా నువ్వు. పెద్దవ్వడమంటే ఈ పెద్ద కాదు. అసలు పెద్ద. అంటే వుద్యోగం వచ్చే వయస్సు అన్నమాట. ఎయిటీన్ అంటే ఇంకా చిన్న వాడి కిందే లెక్క. అలా పిల్లలు ఒక్కళ్ళే వెళ్లకూడదు” నిఖార్సుగా చెప్పింది . అగస్త్యకి ఒళ్ళు మండిపోయింది. “చూడు నాన్న! అమ్మ ఎలా చీట్ చేస్తోందో! పెద్దయ్యేక పంపిస్తానని ఇప్పుడు జాబ్ వచ్చేక అంటోంది” అని తండ్రికి ఫిర్యాదు చేసేడు.
“ ఫ్రెండ్స్ తో కలిసి వెళుతున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళే. బైటకి వెళ్ళితే లోకజ్ఞానం వస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ రేపు వాడికి ఇంజనీరింగ్ వేరే వూర్లో వస్తే రాక పోకలు ఒక్కడే గా చేయవలసింది“ నచ్చచెప్పేడు రమకి. వాడి ఫ్రెండ్స్ తల్లులు కూడా పంపడానికి ఒప్పుకోవడంతో రమకి తలూపక తప్పింది కాదు.
కాలేజీలో జేరేముందు ఒకరోజు గుడికి వెళదాం, రమ్మని అగస్త్యని అడిగింది. రోడ్ బాగా రష్ గా వుండటంచేత క్రాస్ చేసేటప్పుడు అగస్త్య చేయి పట్టుకుంది. “ అమ్మా ! చిన్నప్పుడు చెయ్యి పట్టుకుని రోడ్డు క్రాస్ చేయించినట్లు ఇప్పుడు కూడా అలా పట్టుకుంటే నాకు ఎంబరాస్సింగ్ గా ఉంటుంది. నేను ఇప్పుడు పెద్దవాడినే” అన్నాడు.
“ఓరినీ! నాకు క్రాస్ చేయడం భయం వేసి నిన్ను పట్టుకుంటే, సిగ్గు పడిపోయేంత పెద్దవాడివైపోయేవన్నమాట” అంది.
అగస్త్యకి ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. కాలేజీ దూరమవడం చేత హాస్టల్ లో ఉండాల్సి వచ్చింది.
“అమ్మా ! కాలేజీ కి నాకు కొన్ని మంచి షర్ట్స్ కావాలి” అడిగేడు అగస్త్య. షాప్ లో బట్టల సెలక్షన్ లో తల్లికి కొడుక్కి, బేదాభిప్రాయాలు వచ్చేయి. రమ సెలెక్ట్ చేసిన షర్ట్ ను చూసి” ఇది స్కూల్ పిల్లలు వేసుకునే డిజైన్. కాలేజీ స్టూడెంట్స్ వేసుకోరు” అన్నాడు“.
“కాలెజీకి వెళుతున్నావు. నీటుగా క్రాఫ్ చేయించుకో “అంది రమ.
“కాలేజీ కి అలా పొట్టి క్రాఫ్ తో వెళితే బాగుండదు. నేను కొంచెం పొడుగు పెంచుకుంటాను” అన్నాడు. హాస్టల్ కి వెళ్లేముందు రమ చిన్నపిల్లాడికి చెప్పినట్లు జాగ్రత్తలు చెప్పింది. “నేనిప్పుడు అడల్ట్ ని. నన్ను కిడ్ లా ట్రీట్ చేయకు” అన్నాడు.
“నువ్వు పెద్దయ్యేవని అనుకుంటున్నావు కానీ నాకు మాత్రం చిన్నవాడివే” అంది.
దాశరధి “ ఏంటమ్మా! వాడి చిన్నప్పుడంతా తొందరగా పెద్దవాడైతే బాగుండును అని పదే పదే అంటుండేది, ఇప్పుడు పెద్దవాడయ్యేక ఇంకా చిన్నవాడివే అంటుందేమిటి?” ఆశ్చర్యపోతూ తల్లిని అడిగేడు.
“ మరదే అమ్మ ప్రేమంటే! పిల్లలు ఎంత పెద్దైనా అమ్మకు ఎప్పటికీ చిన్న పిల్లలే! నువ్వు ఇప్పటికీ నా కళ్ళకి చిన్నవాడివే” అన్నారు.
అగస్త్య పదిహేను రోజులు లేదా నెలకొకసారి ఇంటికి వస్తుండేవాడు. ఒకొక్కసారి స్నేహితులతో కలిసి తిరగడానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడల్లా రమ జాగ్రత్తలు చెప్పడం, వాడు ‘నేను పెద్దావాడినే ,పిల్లలకు చెప్పినట్లు చెప్పకు’ అనడం, “చిన్నప్పుడే నయం. పెద్దవాళ్ళ మాట వినేవాడు” అని రమ అనుకోవడం పరిపాటైపోయింది.
అగస్త్య ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ ఊర్లోనే ఉద్యోగం సంపాదించేడు.రమ ఆనందానికి అవధులు లేవు.
అత్తగారు” పొనీలేవే! పిల్లాడు నీ కళ్ళ ముందే తిరుగుతుంటాడు అన్నారు”.రమ లంచ్ బాక్స్ కొత్తది కొనుక్కొచ్చి “రేపు లంచ్ కి బాక్స్ లో ఏమివ్వను” అంది ఉత్సాహంగా.
“అమ్మా! కొద్ది రోజులు నన్ను కాంటీన్ ఫుడ్ ఎంజాయ్ చేయనీ” అన్నాడు.
“సరే! వారానికి మూడు రోజులు ఇంటినుండి, రెండు రోజులు ఆఫీస్ కాంటీన్,సరేనా” అంది. తలూపేడు.
వీక్ ఎండ్స్ అగస్త్య ఎక్కువగా ఫ్రెండ్స్ తో ట్రెక్కింగ్ కో, రాక్ క్లైమ్బింగ్ కో, మారథాన్ రన్ కో, బౌలింగ్ అనో, క్రికెట్ మ్యాచులు చూడటానికో, గో కార్టింగ్ అనో వెళుతున్నాడు. రమ “మాతో కన్నా మీ ఫ్రెండ్స్ తోనే ఎక్కువ గడుపుతున్నావు”అంది అసంతృప్తిగా. “మీరు వెళ్లే ప్లేసుల్లో నాకు చేయడానికి ఏమీ ఉండదు.నేను వెళ్ళేవి మీరు చేయలేరు” అన్నాడు.
ఒకసారి క్రిస్మస్ కి వారం రోజులు సెలవులొస్తే అగస్త్య, స్నేహితులు కలిసి జపాన్ ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నారు. ఇది విని రమ ఆకాశం కిందపడినట్లు మొహం పెట్టి, కళ్ళు వెడల్పు చేసి “అమ్మో! జపానా? పైగా చలికాలంలో! మన ఫుడ్డు కూడా దొరకదు. అసలు ఇండియాలోనే చూడవలసిన ప్రదేశాలు బోలెడన్ని ఉంటే ఫారెన్ ట్రిప్ ఎందుకు?. అయినా ఈ ఫారెన్ ట్రిప్పులు పెళ్లెయ్యేక పెట్టుకుంటే, ఇటు నీ భార్యని కూడా తిప్పినట్లు ఉంటుంది” అంది.
“ చిన్నప్పుడేమో ఫారెన్ ట్రిప్ కి వెళదామంటే వుద్యోగం వచ్చేక అన్నావు. ఇప్పుడు వుద్యోగం వచ్చేక వెళతానంటే పెళ్లయ్యేక అంటున్నావు. అసలు నేను ఎప్పుడు బైటకి వెళతానన్నా ఎదో అనాలి అన్నట్టుగా నెగిటీవ్ గా మాట్లాడుతావు. నాకు ఇప్పుడు ట్వంటీ త్రి. అంటే పెద్దవాడినే. ఉద్యోగస్తుడినే. మా ఫ్రెండ్స్ ఇంకా చిన్న వయసులోనే సోలో ట్రిప్స్ కి వెళ్ళేరు. నేను అందరితో కలిసే వెళుతున్నానుగా. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యి అని నువ్వే నన్ను సంతోషంగా పంపాలి. అయినా నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. పర్మిషన్ తీసుకోవడం లేదు” అని తన గదిలోకి వెళ్ళిపోయేడు. ఈ చోద్యం అంతా చూస్తున్న దాశరథి, అత్తగారితో “చూసేరా! ఎలా మాట్లాడుతున్నాడో! చిన్నప్పుడే నయం. భయం, భక్తి ఉండేవి. నేను వాడి మాట ఎప్పుడు కాదన్నాను? పరాయి దేశం అనేసరికి ఎదో తల్లిగా నా భయాలు, ఆందోళనలు కొద్దీ వద్దన్నాను” అంది.
అత్తగారు ” దాశరధి కూడా కాలేజీ చదువులు కాగానే స్నేహితులతో కలిసి ట్రిప్పులకి వెళ్ళేవాడు. నేను కూడా నీలానే భయం కొద్దీ వద్దనేదాన్ని. నా కొడుకు కూడా నీ కొడుకు లాగానే మాట్లాడేవాడు. “నీ భయాలతో మమ్మల్ని కట్టిపడేస్తావా” అనే వాడు.ఎదో ఆ రోజులు కాబట్టి ఇక్కడిక్కడికే వెళ్ళేవాడు. ఇప్పుడు కాలం మారింది. జీవన స్థాయిలు కూడా పెరగడంతో ఏకంగా ఫారెన్ ట్రిప్పులంటే మక్కువైపోయింది” అన్నారు.
“కుర్రకారుకి కొత్త ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయాలనుంటుంది. ప్రపంచాన్ని చూస్తే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. మన బాధ్యతగా వారికి జాగ్రత్తలు, వారికున్న పరిధులు చెప్పాలి. మన భయాలతో వారి ఉత్సాహం మీద నీళ్లు చిమ్మకూడదు” అన్నాడు.
అగస్త్య స్నేహితులతో కలిసి జపాన్ వెళ్ళేడు. అక్కడ వింతలూ, విశేషాలు ఇంటిల్లిపాదికీ వీడియో కాల్లో చూపిస్తున్నాడు. అంతా అబ్బురపడుతూ చూసేరు.
ఒక రోజు సాయంత్రం అపార్ట్మెంట్లో రమ వాకింగ్ చేస్తుంటే పై ఫ్లోర్లో వుండే కుసుమ, ఆరునెలల చంటిపిల్లాడిని స్ట్రోలర్ లో తిప్పుతోంది. వాడిని చూడగానే రమకి చటుక్కున చిన్నప్పటి అగస్త్య గుర్తుకువచ్చేడు. ఇంక ఒక్కసారిగా అగస్త్య చిన్నప్పటి స్మృతుల్లోకి వెళ్ళిపోయింది. వాడి చిన్నప్పటి రోజులు అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మెదిలి, మళ్ళీ వాడు పిల్లాడైపోతే బాగుండుననిపించింది. రాత్రి భోజనాల వేళ ఇదే విషయం దాశరధి, అత్తగారితో చెప్పి “అగస్త్య చిన్నప్పుడు నేనంటే ప్రాణంగా ఉండేవాడు. నేను ఏది వండిపెట్టినా బావుందనే వాడు.పప్పులో నెయ్యి వేసి పెడితే ఎంత ఇష్టంగా తినేవాడూ? ఇప్పుడేమో పీజాలు, పాస్తాలు. ఇప్పుడు పెద్దవాడవడం వలన ప్రేమని వ్యక్తపరచడానికి సిగ్గు అడ్డొస్తోందనుకుంటా. చిన్నప్పుడు వాడిని మందలించాల్సి వస్తే స్వతంత్రంగా అనేదాన్ని. ఇప్పుడు పెద్దవాడవడం వలన ఏదైనా చెప్పాలన్న సంకోచంగా ఉంటుంది. చెబితే చిన్నబుచ్చుకుంటున్నాడు. ఏదైనా చిన్నప్పుడే ఇద్దరమూ చొరవగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరి మధ్య సంకోచం అనే తెర అడ్డొచ్చేసింది” అంది.
“ చూడు రమా ! పిల్లల మీద ఎంత ప్రేమైనా పెంచుకోవచ్చు. కానీ అది మోహానికి దారి తీయకూడదు. ‘అతి ప్రేమః పాపశంకీ’ అనే ఆర్యోక్తి లాగా నువ్వు మొదటినుంచీ వాడికి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా, లేదా వస్తుందేమోనని ఊహించుకుని ఎదో చెడు జరగబోతుందని భయపడిపోవడం అలవాటైపోయింది. అది ప్రేమ అనిపించుకోదు. అబ్సెషన్ లా అనిపిస్తుంది. పిల్లలను ప్రేమించడం హర్షనీయమే.కానీ ఆ ప్రేమతో వారి జీవితంలోకి చొరబడితే అది ఆక్షేపణీయం. చిన్నప్పుడు ఇద్దరి మధ్య చనువు ఉండేది,పెద్దయ్యేక సంకోచం వచ్చింది అన్నావు. పుట్టిన మనిషి ఎప్పుడూ ఒకలా ఉండడు. పసికందు నుండి పెద్దవాడయ్యేంత వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండటం సృష్టి ధర్మం . ఆ ఎదుగుదలలో వచ్చే మార్పులు కూడా సృష్టి సహజమే. మనమంతా అలా ఎదిగినవాళ్ళమే. ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో నడుచుకోవడమే అందం. చిన్నప్పుడు ముద్దుముద్దుగా మాట్లాడితే ముచ్చటగా ఉంటుంది. పెద్దయ్యేక కూడా అలా మాట్లాడితే వింతగా ఉంటుంది. పిల్లలు ఎదిగే క్రమంలో వచ్చే మార్పులను సహజంగా తీసుకుని మనం అంగీకరించాలి. చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు తమకు భద్రత కల్పించేవారనే భావం కలిగివుంటారు. వారితో ఎక్కువగా గడపటానికి ఇష్టపడతారు. యుక్తవయస్సు వచ్చేక స్నేహితుల సహచర్యం కోసం చూస్తారు. కొన్ని విషయాలు తల్లిదండ్రుల వద్ద కన్నా, తమ సమవయస్సు వాళ్ళతో సంకోచం లేకుండా పంచుకుంటారు. పెళ్లయ్యేక భార్య, పిల్లలు, సంసారం, తల్లీ,తండ్రి తమ ప్రపంచంగా భావిస్తారు. ఆ యా వయస్సుకు తగ్గట్టు వారికి స్వేచ్ఛ నివ్వాలి. అప్పుడే కొత్త విషయాలు నేర్చుకుంటారు . మంచి,చెడు తారతమ్యం, వాళ్ళ పరిధులు ఎక్కడ అతిక్రమించకూడదో జీవితమే నేర్పిస్తుంది. ఒకొక్కసారి వారి ఊహ తప్పయినా అనుభవం ద్వారా పొరపాట్లు సరిదిద్దుకుంటారు. జీవితం మనిషిని మలిచినట్లు మనం మలచలేము. పిల్లల చిన్నతనాన్ని మధురస్మృతుల్లా భద్రపరచుకోవాలి. పడుచుతనంలోకి అడుగుపెట్టేక హుందాగా చూడాలి”
అని దాశరథి హితబోధ చేసేడు.
అగస్త్య జపాన్ ట్రిప్ ముగించుకుని వచ్చేడు. అక్కడి విశేషాలన్నీ ఎక్సయిటెడ్ గా చెప్పేడు. బామ్మకి, అమ్మకి షాల్స్ తెచ్చేడు. తండ్రికి స్వెట్టెర్, ఇంట్లోకి కొన్ని డెకొరేటివ్ ఐటమ్స్ తెచ్చేడు. రమ,అత్తగారు తమ గిఫ్ట్స్ చూసి “మా నాయనే! పెద్దవాడివైపోయేవురా” అని అక్కున జేర్చుకున్నారు.
“అగస్త్యా! నువ్వు ట్రిప్ నుండి వచ్చేక గుడికి వస్తాననుకున్నాను. నాకు తోడు రా” అంది రమ. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అగస్త్య రమ చేయిపట్టుకుని దాటించేడు. “చేయి పట్టుకుంటే నీకు సిగ్గుగా “ అంది.
“మరి నీకు క్రాస్ చేయడం భయంగా “ అని నవ్వేడు. గుడి నుండి వస్తున్నప్పుడు రమ “చిన్నప్పుడు నువ్వు బీచ్ లో నీళ్ళల్లో చాలా సేపు ఆడుకుంటూ రాకపోతుంటే నీ మీద అతిప్రేమతో అలలు లాక్కుపోతాయేమోనని భయంతో ఎక్కువ సేపు నీళ్ళల్లో ఉండనిచ్చేదాన్ని కాదు. జైంట్ వీల్ ఎక్కినప్పుడు కూడా గొడవపెట్టి మధ్యలో ఆపించేసెను. ఏమిటో నా పిచ్చి భయాలతో నీ బాల్యాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయనీయలేదేమోనని చాలా గిల్టీ గా అనిపిస్తుంటుంది”అంది
“నువ్వేమీ ఫీల్ అవ్వకు. మా ఫ్రెండ్స్ అమ్మలు కూడా ఇలాగే చేస్తారని వాళ్ళు కూడా అంటుంటారు. ప్రేమకొద్దే అలా చేస్తారని మాకు కూడా తెలుసు. కాకపొతే లేనిపోనివి ఊహించుకుని భయపడటం మానేసేయి. దాని వలన నీకు ప్రశాంతత ఉండదు. ఆరోగ్యానికీ మంచిది కాదు” అని వీపు మీద చరిచేడు.
“తల్లులు పిల్లల మీద మమకారం కొద్దీ వాళ్లకి ఎలాంటి కష్టం కలగకూడదని వారికోసం తాపత్రయ పడిపోతుంటారు. బామ్మ చెప్పినట్లు పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా అమ్మకు మాత్రం ఎప్పుడూ చిన్నవాళ్ళే” అంది.