అతను ఎవరు

తపస్వి మనోహరం • 01 Oct 2023 • 👁 5 views
అతను ఎవరు
*****

*అతను ఎవరు?*
============
(హాస్య కథానిక)

రచన::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.


ఇది, 1986 కాలం నాటి సంఘటన.
ఆ రోజు సాయంత్రం ..
వైజాగ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో పని ముగించుకుని తిరిగి రామచంద్రపురం రావడానికి బస్సులో కూర్చున్నాను. బస్సు ద్వారకా బస్సు స్టాండ్ నుంచి బయలుదేరి గురుద్వారా దగ్గర హైవే ఎక్కింది. పొద్దుటనుంచీ అలసిపోయి ఉన్నానేమో నన్ను నిద్రాదేవి ఆవరించింది.

మూడు గంటలు పాటు ఒళ్ళు మరచి నిద్రపోయిన నాకు "అన్నవరం దిగండి..., అన్నవరం...." అన్న కండక్టర్ పిలుపుతో ఉలిక్కిపడి లేచాను.

ఈలోగా వెనక సీట్ల నుంచి వచ్చిన ఓ వ్యక్తి
నా దగ్గరకు వచ్చి,

"సార్! ఇంటికేనాండీ?" అని పలకరించాడు. నేను "ఔను!..., నువ్వూ..మీరూ...?" అని నేను అడిగేలోగానే "బేగా దిగాలి, వెనకాల ట్రాఫిక్ ఆగిపోతోంది" అన్న డ్రైవర్ కేకతో అతను గబగబా దిగిపోయి, చీకట్లో కలసి పోయాడు.

అంతే......,

ఆయన ఎవరు? ఎక్కడో బాగా చూసిన మొహంలా ఉంది. నా చిన్ననాటి స్నేహితుడా? వైజాగ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసు లోనా? కాకినాడ ఆడిట్ ఆఫీసులోనా? పోనీ మా కంపెనీలో పనిచేసే అతనా? మా ఆఫీసులున్న విజయవాడ, హైదరాబాద్, మద్రాస్ లలో పనిచేసేవారు ఎవరైనా? ఊహూ ....వీళ్లెవరూ కారు.

ఇలా ఆలోచనలతో మూడు గంటలు వృధా అయిపోయాయి. ఈలోగా నేను చేయవలసిన గమ్యం రావడంతో, బస్సు దిగి ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి వెళ్లి ఇదే విషయం మా ఆవిడతో చెబుతూ, "అంతే కాదు, అతడిని బాగా దగ్గరగా చూసినట్టు అనిపిస్తోందే" అని చెప్పగానే, వెంటనే వాళ్ళ వంశవృక్షం చెప్పడం మొదలెట్టింది.

అంతా విని, "హూ కాదే ! మీ వాళ్లెవరూ కాదు" అన్నాను.

"ఏదో నా పిచ్చి కానీ మా వాళ్లతో మీరు అంత క్లోజ్ గా ఎప్పడు మాట్లాడి తగలడ్డారు?" వంక దొరికింది కదా అని నిష్టూరమాడింది.

వారం రోజుల నుంచి... ఆఫీసులో పని చేస్తున్నా, రోడ్డు మీద నడుస్తున్నా, మంచం మీద పడుకున్నా‌, భోజనం చేస్తున్నా, ఒకటే నా ఆలోచన , ఆ అగంతకుడు ఎవరా అనేదే? ఏ పని మీదా కూడా సరిగ్గా దృష్టి పెట్టలేక పోతున్నాను. కొంపతీసి నా జ్ఞాపకశక్తి నెమ్మదిగా నశించి పోతోందేమో అన్న అనుమానం కూడా నన్ను వేధించసాగింది.

ఓ రోజు, నా మానసిక బాధను చూడలేక
"ఇంతకీ అతను మీకు దగ్గరయ్యింది శారీరకంగానా ? మానసికంగానా?" అనుమానంగా అడిగింది మా ఆవిడ. "శారీరకంగానే" చెప్పాను మామూలుగా.

"ఛీ దరిద్రం. వినడానికే అసహ్యంగా ఉంది. సరేకానీ, పది రోజుల నుంచి అదే విషయాన్ని ఆలోచించి, ఆలోచించి గెడ్డం గీసుకోవడం కూడా మరచిపోయారు. వెళ్లి షేవింగ్ చేయించుకుని రండి. ఛస్తున్నా చూడలేక. మొహం తేటబడితే ఆలోచనలు కూడా మెరుగు పడతాయి" అని ఓ ఉచిత సలహా పడేసింది. ఇదేదో బాగానే ఉంది అని బయలుదేరా.

ఒంటినిండా తెల్లగుడ్డ కప్పి, పాలనురగ మొహానికి దట్టించి, కత్తి పీకమీద పెట్టి,

"సార్! రెండు వారాల క్రితం దర్శనానికి సింహాచలం వెళ్లి, రిటర్న్ లో ఎన్ఏడీ కొత్త రోడ్డు దగ్గర బస్సు ఎక్కి అన్నవరం లో దిగాను. ఆ రోజు మీరు ఏదో అడగబోయారు. ఈలోగా బస్సు కదుల్తూంటే బస్సు దిగిపోయా. ఏమీ అనుకోకండి సార్....."చెప్పుకుపోతున్నాడు బాలకృష్ణ, బి.కే.సెలూన్ ఓనర్.

కేవలం ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నాను, ఎందుకంటే.....,
ఈ రెండు వారాల నుంచి నేను పడిన యాతన గురించి చెబితే
"భలేవారే సార్! నన్ను గుర్తు పట్టలేదా" అని బిగ్గరగా నవ్వుతూ, పొరపాటున పీకమీద ఎక్కడ గాటు పెట్టేస్తాడో అన్న భయంతో.

***** **శుభం** *****

(నేను రాసిన ఈ కథ *గోదారి ఊసులు* అనే అంతర్జాల పత్రికలో అక్టోబర్ 2023న ప్రచురితమైనది)