*****
*ముసురు పట్టిన రోజు*
===============
(సామాజిక కథ)
(నేను రాసిన ఈ కథ, గోదారి ఊసులు అనే అంతర్జాల మాస పత్రికలో ఆగష్టు 2023 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"థూ..దీనమ్మా జీవితం. రెండు రోజుల నుంచి ఈ ముసురు ఏటో? అసలు ఇది ఎప్పటికి తగ్గుద్దో? " ఈదురుగాలితో వచ్చిన వర్షం జల్లుపడి ఆరిపోయిన బీడీని, తిరిగి వెలిగించుకుంటూ విసుక్కున్నాడు బాలరాజు.
ఉదయం పదకొండు అయినా దట్టమైన మబ్బులు మూలంగా సాయంత్రం ఆరు అయినట్లు ఉంది వాతావరణం.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు రోజుల నుంచి విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి.
రోడ్డు మీద నరసంచారం లేదు. అప్పడప్పుడు కాకినాడ పోర్టు నుంచి వెళుతున్న లారీలు తప్ప. తుఫాను కారణంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసారు.
వర్షం కారణంగా ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాలడం లేదు. దూరంగా ఉన్న కొబ్బరి చెట్టు మీద ఓ కాకి వర్షంలో తను తడుస్తూ, పిల్లలు తడవకుండా తన రెక్కలు విప్పి, గొడుగు పడుతోంది.
వర్షపు జల్లుకు రిక్షా టాపు మీద పడుతున్న చినుకులు టపటపమని వింత శబ్దాలు చేస్తున్నాయి. అవి అక్కడ నుండి నెమ్మదిగా జారి బాలరాజు కాళ్ల మీద పడుతున్నాయి. కాళ్లు పైకి తీసుకుని, రిక్షా సీట్లో మునగదీసుకుని కూర్చొని పొద్దున్న ఇంట్లో జరిగిన సంఘటన జ్ఞాపకం తెచ్చుకున్నాడు.
***** ***** ***** *****
"మావా! ముసురు అని సెప్పి, రెండు రోజుల నుంచి, రిచ్చా తీయకుండా ఇంటికాడే కూకున్నావ్. ఇంట్లో గంజికి కూడా డబ్బులు లేవు. ఇక, ఈ సంటిదానికి సూత్తే ఈ జొరం తగ్గడం లేదు. ఇదేమో మూసిన కన్ను తెరవడం లేదు. నిన్ననే ఆచారి డాట్టారు పిల్ల పరిస్థితి బాగా లేదూ ఏదైనా పెద్ద డాట్టరుకి సూపించమని సేతులెత్తేసాడు. ముసురు అని సూడకుండా ఈ రోజైనా రిచ్చా తీయిమావా! ఏవైనా ఓ నాలుగు డబ్బులు వస్తే ఏ ప్రైవేటు డాట్టరు గారికైనా సూపిద్దారి, ఆ ప్రభుత్వ ఆసుపత్రి కాడ జాగరం చేయడం నా వల్ల కాదు" భర్త బాలరాజును వేడుకుంది మంగ.
"ఆ సంటిదానిని సూస్తే నాకూ కడుపు తరుక్కుపోతోందే. ఏటి సేసేది సెప్పు. నిన్న వర్షంలో తడుసుకుంటూ ఎల్లి అప్పు కోసం పెయత్నించా. కానీ ఈ దిక్కుమాలిన ముసురు వలన మనోళ్లు ఎవరూ రిచ్చాలు తీయకపోవడంతో అప్పు పుట్టనేదు. సరే నీ మాట కాదనడం ఎందుకు? ఓ పాలి రిచ్చా తీస్తా. అన్నమ్మ ఘాటీ కాడ ఉంటా. ఏదైనా మంచి బేరం తగిలితే మధ్యాహ్నం సంటిదాన్ని డాట్టరు కాడికి తీసుకెళ్దారి" భార్యకు చెప్పి రిచ్చా తీసుకుని బయలుదేరాడు బాలరాజు.
***** ***** ***** *****
"ఇదిగో అబ్బాయ్, ఆ పక్క సందులో ఉన్న ఇంటినుంచి, పాత బస్టాండ్ దగ్గర ఉన్న కామేశ్వరమ్మ గారి హాస్పిటల్ కి వస్తావా?" జోరుగా కొడుతున్న గాలికి ఊగి పోతున్న గొడుగును అదుపు చేసుకుంటూ అడిగింది ఓ యాభై ఏళ్లావిడ.
ఉదయం సంఘటన నెమరు వేసుకుంటున్న బాలరాజు ఉలిక్కిపడి, వాస్తవంలోకి వచ్చి
"అబ్బే! ఈ వర్సంలో బండి కట్టడం సానా కట్టమమ్మా" ఎక్కువ డబ్బులు గుంజడం కోసం కొంచెం బెట్టు చేసాడు బాలరాజు.
"అలా అనకు బాబూ! నెలలు నిండిన మా అమ్మాయికి అనుకోకుండా పురిటి నెప్పులు మొదలయ్యాయి. అల్లుడు గారు లారీ డ్రైవర్. ఏదో బేరం తగిలితే, మొన్ననే విజయనగరం వెళ్లారు. ఈ ముసురు వలన అక్కడ ఇరుక్కుపోయారు. నీకు దండం పెడతాను" బాలరాజును బతిమాలింది ఆ పెద్దావిడ.
"సూడండమ్మా! మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఓ వంద రూపాయలు ఇవ్వండి, లేదా ఇంకో రిచ్చా సూసుకోండి" నిక్కచ్చిగా చెప్పాడు బాలరాజు.
"చూడు బాబూ! ఆశకు అంతు ఉండాలి. ఇరవై రూపాయలు దానికి వంద రూపాయలు ఇవ్వాలా? సరే ఏం చేస్తాం, అవకాశం మీది, అవసరం మాది. నడు..." గొడుగు మడిచి రిక్షాలో కూర్చుంది పెద్దావిడ.
ఆవిడ చెప్పిన ఇంటి వైపు బయలుదేరింది బాలరాజు రిక్షా.
***** ***** ***** *****
రిక్షా చుట్టూ టార్పాలిన్ గుడ్డ కట్టి, ఆ గర్భిణీ స్తీని, పెద్దావిడని లోపల కూర్చోబెట్టి కుండపోతగా కురుస్తున్న వర్షంలో, ఈదురు గాలిని తోసుకుంటూ, మధ్య మధ్యలో మొహం మీద, మైకా గుడ్డతో కుట్టించుకున్న రెయిన్ కోటు మీద, పడుతున్న వర్షపు చినుకులను తుడుచుకుంటూ రిక్షా తొక్కుతున్నాడు బాలరాజు. లోపల ఉన్న గర్భిణీ స్త్రీ బాధతో చేస్తున్న అరుపులు, అంత వర్షం హోరులోనూ కూడా వినిపిస్తున్నాయి బాలరాజుకు.
"బాబూ! ఒక్కసారి రిక్షా పక్కకు తీసుకుని ఆపు" రిక్షా జగన్నాధపురం బ్రిడ్జి దాటి, పుల్లల అడితీ పక్కకు రాగానే దిక్కులు పెక్కటిల్లేలా అరచింది పెద్దావిడ.
ఆ పిలుపుకు ఉలిక్కిపడిన బాలరాజు రిక్షా పక్కకు తీసి ఆపేలోగానే లోపలినుంచి కేర్ కేర్ మని అరుపు వినబడింది. లోపలి నుంచి తల బయటకు పెట్టిన పెద్దావిడ
"ఆడపిల్ల పుట్టింది బాబూ. ఇద్దరూ కూడా బాగున్నారు. వేగంగా ఆసుపత్రికి పోనీయ్ బాబూ" సంతోషంగా చెప్పింది.
మళ్లీ వర్షంతో యుద్ధం చేస్తూ ఓ ఐదు నిమిషాల్లో ఆ ముగ్గురినీ ఆసుపత్రికి చేర్చాడు బాలరాజు.
"నీ మేలు మరవలేను బాబూ! ఇవిగో నువ్వు అడిగిన డబ్బులు" అంటూ ఓ వందనోటు సంతోషంగా బాలరాజు చేతిలో పెట్టింది ఆ పెద్దావిడ.
ఆ నోటు తీసుకుని తడవకుండా దానిని సీటుకింద పెట్టి, రిక్షాను ఓ సారి శుభ్రం చేసి, చంటిదానిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లడానికి, తిరిగి వేగంగా ఇంటివైపు బయలుదేరాడు బాలరాజు, పడుతున్న భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా!
***** ***** ***** *****
"లెగవే మంగీ! సంటిదాన్ని ఎత్తుకో. డబ్బులు దొరికాయి, డాట్టరు గారి దగ్గరికి పోదారి" తడిసిన బట్టలు పిండుకుంటూ గుడిసెలోకి వస్తూ చెప్పాడు బాలరాజు.
"ఏడకి పోయావ్ మావా? సంటిదాన్ని సూడు, ఉలుకూపలుకు లేదు. బేగా రిచ్చా తియ్ మావా!" ఆందోళనగా చెప్పింది మంగ.
"ఔనే, బేగా రా!" సంటిదాన్ని చెయ్యి పట్టుకుని చూసి, ఒక్కసారిగా ఉలిక్కిపడి చెప్పాడు బాలరాజు.
మళ్లీ రిక్షాకు టార్పాలిన్ కప్పి, భార్యను, పిల్లను లోపల కూర్చోబెట్టి, వర్షానికి ఎదురీదుతూ రిక్షా తొక్కుతున్నాడు బాలరాజు.
"మావా మావా ఓ పాలి రిచ్చా ఆపు. ఈ సంటిదాన్ని సూడు" మంగ అరుపులతో రిక్షా ఆపి సంటిదాన్ని పట్టుకుని చూసిన బాలరాజు,
"మంగీ ఓ పది నిమిసాలు ఓపిక పట్టే. దగ్గరకు వచ్చేసాం" అంటూ మంగకు ధైర్యం చెప్పి తిరిగి రిక్షా తొక్కడంలో నిమగ్నమయ్యాడు బాలరాజు.
***** ***** ***** *****
కొంచెం దూరం ప్రయాణం తర్వాత,
"ఏటి మావా? ఏటిగట్టుకు తీసుకు పోతున్నావ్? ఆసుపత్రికి కాకుండా?" అనుమానంగా అడిగింది మంగ, టార్పాలిన్ కన్నంలోంచి బయటకు చూస్తూ.
ఏటిగట్టున రిక్షా ఆపి, మంగను కిందకి దింపి,
"సంటిది దగా సేసేసిందే మంగీ. సచ్చిపోయింది" చంటిదానిని రెండు చేతులతో ఎత్తుకుని రిక్షాలోంచి కిందకు దింపుతూ బావురుమన్నాడు బాలరాజు.
"సి...ట్టీ...." అంటూ చంటిదానిని పట్టుకుని ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది మంగి, భోరున కురుస్తున్న ఆ వర్షంలో.
కాసేపటి తర్వాత మంగమీద కొన్ని నీళ్లు చల్లి,
"లేయే మంగీ, గుండె రాయి సేసుకో. దాని కరమ కాలి మన కడుపున పుట్టింది. ఇప్పుడు దీనిని పూడ్చాలన్నా, కాల్చాలన్నా వందలతో ఎవహారం. మన దగ్గర అంత మొత్తం లేదు. అందుకే దీని సావుకు కారణమైన ఆ గంగమ్మ తల్లి వద్దకే దీనిని పంపేద్దాం" అంటూ, వర్షంలో తడుస్తూ అచేతనంగా ఉండిపోయిన మంగ వైపు చూస్తూ, భోరున కురుస్తున్న వర్షం సాక్షిగా చంటిదానిని ఆ ఏటిలో కలిపేసాడు బాలరాజు.
***** ***** ***** *****
కాసేపటికి స్పృహలోకి వచ్చిన మంగను రిక్షాలో కూర్చోబెట్టి ఇంటి దోవ పట్టాడు బాలరాజు.
"ఏమిటో ఈ రోజు? ఉదయం ఇద్దరిని ఈ రిక్షాలో ఎక్కించుకొని బయలుదేరిన నేను, ముగ్గురిని గమ్యానికి చేర్చాను. మధ్యాహ్నం ఇంటినుంచి ఇద్దర్ని ఎక్కించుకొని బయలుదేరిన నేను ఇప్పుడు ఒక్కరినే ఇంటికి చేరుస్తున్నాను. అంటే... ఈ ముసురు ఈ రోజు ఒకరికి ఉసురు పోసింది. ఇంకొకరి ఉసురు తీసింది....." ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ రిక్షా తొక్కుతున్న బాలరాజు గుండె కరిగి ఉబికివస్తున్న ఆ నీళ్లు, కంటి ద్వారా బయటకు వచ్చి భోరున కురుస్తున్న ఆ వర్షంలో కలసిపోతున్నాయి.
***** **సమాప్తము** *****