వెంకమ్మ గారి వంట

తపస్వి మనోహరం • 01 Sep 2023 • 👁 6 views
వెంకమ్మ గారి వంట
*****
*వెంకమ్మ గారి వంట*
==============
(జ్ఞాపకాల పందిరి)

(నేను రాసిన ఈ కథ తపస్వి మనోహరం అంతర్జాల పత్రికలో, సెప్టెంబర్ 2023 లో ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

అవి, మా స్వగ్రామం, తూర్పుగోదావరి జిల్లాలోని జగన్నాధగిరిలో, నేను నాలుగో తరగతి చదువుతున్న 1966 కాలం నాటి రోజులు. బడికి వేసవి శెలవులు ఇచ్చారు. పొద్దున్న పదకొండు గంటలకే అమ్మ వండిన కందిపప్పు మామిడికాయ గట్టి పప్పును, నెయ్యితో రంగరించి దానికి మొన్ననే పెట్టిన వెల్లుల్లి ఆవకాయ కొద్దిగా తగిలించి, లొట్టలు వేసుకుంటూ తిని, ఆ ఆవకాయ పెచ్చుకు కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టి, ఆ తరువాత కేవలం చింతపండు, బెల్లం వేసి చేసిన వేడిచారుతో కూడా ఓ నాలుగు ముద్దలు తిని ఇక చివర్లో వెచ్చటి పెరుగులో మామడి పండు, ఆవకాయ పెచ్చు నంచుకుంటూ తిని, ఆ పూట భోజనం కానిచ్చాము, మా సోదరులు అందరమూ.

"ముద్ద మింగడం అయ్యింది కాబట్టి, వెళ్లి వీధిగదిలో పడుకోండి. ఎండలో ఆడడానికి వెళ్లినట్లు తెలిస్తే లెంపకాయలు పడతాయి" సున్నితంగా హెచ్చరించింది అమ్మ.

కాసేపటికి, నాన్న భోజనం కానిచ్చి, ఆఫీసు గదిలో మడతమంచం వేసుకుని గుర్రు పెడుతూ నిద్రపోయారు. అమ్మ కూడా ఆఖరి వాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి, వాడి పై వాడిని తన పక్కనే పడుకోబెట్టుకోడానికి ప్రయత్నం చేస్తోంది, ఏవో పాటలు నెమ్మదిగా పాడుతూ.

మిగతా మా ఐదుగురు సోదరులమూ, అమ్మ ఎప్పుడు పడుకుంటుందా? ఎప్పుడు బయటకు పోయి ఆడుకుంటామా? అని ఎదురుచూస్తూ అమ్మ పడుకున్న పడక గది వైపే చూస్తూ, పడుకున్నట్టు నటిస్తున్నాం.

ఎదురుగా ఉన్న టికుటికుల రాజుగారి దొడ్లో ఉన్న కొబ్బరి చెట్టు మీద ఉన్న బొంతకాకి దాహం వేసి కాబోలు కావ్ కావ్ అని అరుస్తోంది బొంగురు గొంతుతో.

ఎక్కల వీర్రాజు ఇంటి వద్ద అనుకుంటా, "ఐస్.. కూల్ ఐస్ ...కేక్ అద్దణా, కేక్ అణా" అంటూ అరుస్తున్నాడు అంత ఎర్రటి ఎండలో తాను మాడిపోతూ జనాల్ని చల్లబరిచేందుకే ఐసుప్రూట్లు అమ్ముతున్న ఓ అబ్బాయి.

కాసేపటికి అందరూ పడుకున్నారు అని నిర్ధారించుకుని, మేము ఐదుగురం చప్పుడు కాకుండా వీధి తలుపు తీసి అరుగుమీదకు వచ్చాం, బస్సు ఆట ఆడుకోవడానికి.

బస్సు ఆట అంటే పెద్దగా ఏమీ కాదు. మా అన్నయ్య ఒకడు గుమ్మం వద్ద కూర్చుని టికెట్స్ ఇస్తూ ఉంటాడు కండక్టర్ లా. అవి తీసుకుని మిగతా నలుగురమూ అరుగుమీద ఉన్న నాలుగు కిటికీల్లోనూ కూర్చోవడమే, బస్సులో విండో సైడ్ సీట్లో కూర్చున్న మాదిరిగా అన్నమాట.

ఎవరికి వాళ్లం డుర్ డుర్ మంటూ నోటితో నెమ్మదిగా శబ్ధం చేస్తూ బస్సు ప్రయాణం చేస్తున్నట్లు ఫీలవుతూ కిటికీ ఊచలు పట్టుకున్నాము.

***** ***** ***** *****

ఈలోగా మా సందు చివర ఉన్న అమలకంటి సుబ్బాయమ్మ గారి పాక పక్కనుంచి తెల్లటి చీర కట్టుకున్న వెంకమ్మ గారు రావడం నా కళ్ల బడింది. వెంకమ్మ గారు మా అమ్మకు కుడి భుజం లాంటి వారు. ముఖ్యంగా పిండి వంటలు చేసే సమయంలో ఆవిడ సహకారం లేనిదే అమ్మ పొయ్యి కూడా వెలిగించేది కాదు.

అలాంటి వెంకమ్మ గారు ఈ సమయంలో వస్తున్నారంటే, తప్పకుండా ఏదో పిండివంటల కార్యక్రమం ఉందన్నమాటే అనుకుంటూ నోట్లో నీళ్లు ఊరుతుండగా ఆలోచనలో పడిపోయాను.

***** ***** ***** *****

ఇక్కడ వెంకమ్మ గారి గురించి కొంచెం చెప్పుకోవాలి. అల్లంరాజు వెంకమ్మ గారికి ఏడేళ్ల వయసులో వివాహం అయ్యింది. ఆవిడకు ఇరవై ఏళ్లు వచ్చేటప్పటికే ఒక కొడుకు పుట్టడమూ, ఆ మరుసటి సంవత్సరమే భర్త పోవడం జరిగింది. ఆ నాటి సాంప్రదాయం ప్రకారం ఆవిడకు శిరోముండనం చేయించి, ముతక తెల్ల చీర కట్టుకోవాలని పట్టుబట్టారుట అత్తింటి వారు. అంతే ఆ రోజు నుంచి చనిపోయే వరకూ కూడా అదే పద్ధతి కొనసాగించారు వెంకమ్మ గారు.

ఆ తరువాత రోజుల్లో కొడుకు కొండయ్యకు చింతలూరు ఆయుర్వేదం ఫార్మసీలో ఉద్యోగం రావడం, పెళ్లి చేసుకుని భార్యతో వెళ్లిపోవడమూ జరగడంతో పాపం వెంకమ్మ గారు ఉన్న అరెకరం భూమి కౌలుకు ఇచ్చి, భర్త ఉండగా వేసుకున్న ఆ పాకలోనే ఉంటూ ఇదిగో ఇలా తెలిసిన ఓ నాలుగు ఇళ్లలో వంట పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.

***** ***** ***** *****

"ఏవర్రా పిల్లలూ, అమ్మ పడుకున్నారా?" అన్న వెంకమ్మ గారి పిలుపుతో ఈ లోకం లోనికి వచ్చిన నేను, "ఔనండీ" అని చెప్పి
"అమ్మా, వెంకమ్మ గారు వచ్చారు" అంటూ ఆవిడతో పాటు, అందరమూ ఏమీ ఎరుగనట్లు లోపలికి వెళ్ళి పోయాము, బయట ఉన్నట్లు తెలిస్తే అమ్మ తిడుతుందని.

ఆవిడను చూసిన అమ్మ,
"వెంకమ్మ గారూ! వచ్చారా? ఆ చివరి వాడు బాగానే పడుకున్నాడు. ఇదిగో వీడే ఇంకా పడుకోలేదు. వీడిని పడుకోబెట్టి వస్తాను" అని ఆవిడకు చెప్పి, మాతో

"ఇంట్లో అల్లరి చేయకుండా, బయటకు పోయి ఆడుకోండి, వెంకమ్మ గారి పనికి అడ్డురాకండి" అని అమ్మ హుకుం జారీ చేయడంతో లైసెన్స్ పొందిన స్వేచ్ఛా జీవుల్లా మళ్లీ అరుగులు మీదికి వచ్చాము, ఆడుకోవడానికి.

ఆడుతున్నానన్న మాటే కానీ నా మనసంతా వెంకమ్మ గారు చేయబోయే వంట మీదే ఉంది. ఏ పిండి వంట చేయడానికి వచ్చి ఉంటారు అని ఆలోచిస్తూనే, అన్యమనస్కంగానే బస్సు ఆట ఆడుతున్నాను, ఓ చెవి మటుకు లోపలి గదిలోంచి వినబడబోయే మాటల మీద పడేసి.

కాసేపటికి

"మీరు పడుకోండి కాంతమ్మగారూ! నేను చేసుకుంటాను. ఔనూ, ఇంతకీ వాటిని బాగా నాన బెట్టారా మరి?" అడిగారు వెంకమ్మ గారు.

"ఆ పొద్దున్నే నానబెట్టాను. దొడ్లో రుబ్బురోలు దగ్గరే పెట్టాను. కొంచెం రుబ్బేయండి. కాసేపట్లో నేనూ వస్తా" అమ్మ సమాధానం వినబడింది.

'రుబ్బుడు వ్యవహారం అంటే, ఏవో గారెలు కానీ బొబ్బట్లు కానీ వేస్తారేమో? ఎందుకంటే వేసవి శెలవులకి అక్కలు, బావలు, వేరే ఊర్లలో చదువుతున్న పెద్దన్నయ్య, చిన్నన్నయ్యలు వస్తారు కదా?' ఇలా ఆలోచిస్తూ ఉండగానే లోపలి నుంచి ఏదో రుబ్బుతున్న శబ్ధం వినబడింది.

ఇంకాసేపటి తరువాత

"కాంతమ్మగారూ! ఓ గిన్నె, అలాగే కొన్ని మెంతులు ఇస్తారా?" వెంకమ్మ గారి గొంతు.

"వంటింట్లో పోపుల పెట్టిలో మెంతులు ఉన్నాయి, సామానుల గదిలో పెద్ద ఇత్తడి గిన్నె ఉంది తీస్కోండి" అమ్మ సమాధానం.

'గిన్నె సరే, కానీ మెంతులు దేనికి? కొంపతీసి మెంతి గారెలు కానీ, చిట్టి గారెలు కానీ. వేస్తున్నారా?' ఇలా నా ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి.

పోనీ లోపలికి వెళ్లి చూద్దామా అంటే అమ్మ కాళ్లు విరగ్గొట్టేస్తుందేమోనన్న భయం.

ఓ గంట తరువాత

"కాంతమ్మగారూ, వెళ్తున్నాను. పని అయిపోయింది. పాళ్లు అన్నీ బాగానే కుదిరాయి. తలుపు వేసుకోండి. పిల్లలు బయట ఆడుతున్నారు కామోలు" అన్న వెంకమ్మ గారి పిలుపుతో అమ్మ లేచి వచ్చి ఆవిడను సాగనంపి మమ్మల్ని,

"ఇంక ఆడిన ఆటలు ఇంక చాలు. లోపలికి రండి. ఏదైనా మింగుదురుగాని" అని పిలవడంతో, మిగిలిన వారంతా మామూలుగా వస్తే, నేను మాత్రం లొట్టలు వేసుకుంటూ లోపలికి వచ్చాను.

లోపలికి వచ్చిన అమ్మ ఖాళీ గ్లాస్కో పాలపొడి డబ్బా ఓపెన్ చేసి, అందులోంచి నిమ్మతొన బిల్లలు తీసి అందరికీ తలా ఒకటి ఇస్తూంటే మిగతా అందరూ ఆనందంగా తీసుకుంటున్నారు నేను తప్ప.

"నీకేం రోగం వచ్చింది తీసుకోవడానికి డిప్పకాయ్ వెధవా?" కసురుకుంది అమ్మ.

"నాకు ఇవి వద్దు. వెంకమ్మ గారు చేసినవి కావాలి" అన్నాను బొత్తిగా భయం లేకుండా.

"ఒహో, అది కావాలా? మరి చెప్పావు కావేం. ఉండు లోపలికి వెళ్లి తెస్తా" సామానుల గదిలోకి వెడుతూ చెప్పింది అమ్మ.

కాసేపటికి
ఎవరైనా తిరుపతి వెళ్లి గుండు చేయించుకుని వచ్చి, ఆ గుండు మీద గంధం రాసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఓ ఇత్తడి గిన్నె తీసుకుని వచ్చింది అమ్మ.

"ఇదేంటి? నాకు కావలసింది ఇది కాదు, వెంకమ్మ గారు చేసింది" భయంతో చూస్తూ అడిగాను.

"ఇదే ఈరోజు వెంకమ్మ గారు చేసింది. ఆదే కదా కావాలన్నావు. ఇదిగో మింగు" అంటూ ఆ గిన్నె నా మొహం వద్ద పెట్టింది.

అది చూసి, భయపడి పోయిన నేను,
"ఇదేందీ? ఇలా ఉంది" భయంభయంగా చూస్తూ అడిగాను.

"వెర్రి పీనుగా, ఇది తినే వస్తువు కాదు. కాగితాలు బాగా నానబెట్టి, వాటిని రుబ్బి, పురుగు పట్టకుండా మెంతులు వేసి ఆ పిండిని ఇలా బోర్లించిన గిన్నె మీద అచ్చు కింద పోసి ఓ రెండు రోజులు ఉంచితే అది బాగా గట్టి పడి ఒక బుట్టలా తయారవుతుంది. దానిలో కూరగాయలు అవీ వేసుకోవచ్చు...." అమ్మ ఇంకా ఏదో చెబుతూనే ఉంది, వెర్రి మొహం వేసుకుని వింటున్న నా వైపు చూస్తూ.

ఆ తరువాత రోజు.....

అమ్మ తయారు చేసి ఇచ్చిన అరటి దూట ఆవపచ్చడి తీసుకుని వెంకమ్మ గారికి ఇంటికి వెళ్లాను, అది ఇవ్వడానికి.

మా అమ్మ ద్వారా నిన్నటి విషయం తెలుసుకున్న వెంకమ్మ గారు, నన్ను చూసి భళ్ళున నవ్వి,

"అయ్యో వెర్రి నాగన్నా ! అలా అనుకున్నావుట్రా? పోనీలే, ఈ సారి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారికి తెలియకుండా నీకు బొబ్బట్లు చేసి పెడతాను, సరేనా ??" అని ఓదార్చడం నాకు ఇంకా గుర్తు.

ఆ తరువాత ఓ ఓ ఐదు సంవత్సరాలకే మేము ఆ జగన్నాధగిరి ఊరు వదిలి వచ్చేయడమూ, ఇంకో రెండు సంవత్సరాలు తరువాత వెంకమ్మ గారు మరణించారు అని మా ఊరు వాళ్ల ద్వారా తెలవడం జరిగింది.

ఇప్పటికీ ఎవరి ఇంట్లో అయినా అలాంటి కాగితం గుజ్జుతో చేసిన బుట్ట లాంటిది కనబడితే నాకు ఈ సంఘటనే జ్ఞాపకం వస్తుంది.

***** **శుభం** *****