*****
*మిత్రునికి ఓ ఉత్తరం*
===============
(కథానిక)
(తపస్వి మనోహరం పత్రిక కోసం నేను రాసిన ఈ కథ, ఆ పత్రికలో ది.06.08.2023 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
***** ***** ***** *****
ది:: 28.07. 2023
మియాపూర్, హైదరాబాద్
మిత్రుడు బంగారం గాడికి,
నీ ఫ్రెండ్ కామేషుగాడిని రాస్తున్న ఉత్తరం.
ఒరే సన్నాసీ
నేను జ్ఞాపకం ఉన్నానా ? లేక ఎప్పుడో మరచిపోయావా ?
పదవ తరగతి నుంచి డిగ్రీ వరకూ, అంటే 1972 నుంచి 1978 వరకూ మనం నలుగురమూ ....అంటే పుట్రేవు బంగార్రాజు అనే నువ్వు, విస్సాప్రగడ పల్లంరాజు, బాలాంత్రపు గంగరాజు అనే వాళ్లిద్దరూ మరియు బుద్ధవరపు కామేశ్వరరావు అనే నేను, ఒకే ప్రాణంగా తిరిగేవాళ్లం, జ్ఞాపకం ఉందా?
సరే
ఇప్పుడు నీకు, మనం డిగ్రీ చదువుతున్న సమయంలో జరిగిన ఓ రెండు సంఘటనలు జ్ఞాపకం చేస్తాను.
అవి 1975౼78 మధ్య రోజులు. మన ఊరు రామచంద్రపురం వీ.యస్.యమ్. కాలేజీలో మనం మరీ రికామీగానూ అలాగని మరీ బీకామ్ గానూ ఉండకుండా బీకామ్ చదువు నెట్టుకొస్తున్న రోజులు.
ఆరోజు...
పేపర్ బాయ్ లా ఎప్పుడూ కరెక్ట్ గా టైం కి వచ్చే నువ్వు ఆరోజు ఓ పది నిమిషాలు ముందుగానే మా ఇంటి ముందు సైకిల్ ఆపి, బెల్ కొట్టడం విన్న మా అమ్మ,
"ఈరోజు అప్పుడే వచ్చాడేం, నీ చెలికాడు బంగారం గాడు? హేమిటీ ఇదంతా చదువు మీద శ్రద్ధే?" ఆశ్చర్యంగా అడిగింది, బుగ్గలు నొక్కుకుంటూ.
వంటింట్లో పని చేసుకుంటూ కూడా, ఇంటి ముందు ఎవరైనా బెల్ కొడితే అది పాలవాడిదా, పూలవాడిదా, వెన్న షావుకారు దా అని చెప్పేసే ప్రజ్ఞ, ఆవిడకు దేవుడిచ్చిన వరం.
కాసేపటికి బయటకు వచ్చిన నాతో,
"తొందరగా రారా కామేషూ! ఓ సర్ప్రైజ్ చూపిస్తాను. ఆల్రెడీ ఆ బాలాంత్రపు గంగరాజు గాడినీ, విస్సాప్రగడ పల్లంరాజు గాడిని రెడీ చేసి ఉంచాను. నువ్వు వస్తే ఆ సర్ప్రైజ్ చూసి కాలేజీకి వెళ్దాం" సైకిల్ దిగకుండానే దడదడా చెప్పేసావు.
***** ***** ***** *****
అందరమూ సైకిల్ పందేలలో పాల్గొనే వాళ్లలా వేగంగా సైకిళ్లు తొక్కుకుంటూ, మన ఊరి ట్రావెలర్స్ బంగ్లా ముందు ఆగాము.
"వీడెప్పుడూ ఇంతే! సర్ప్రైజ్ అంటాడు. తీరా చూస్తే ఇక్కడ ఏమీ ఉండదు" స్పీడ్ గా సైకిల్ తొక్కడం వలన వచ్చిన ఆయాసంతో రొప్పుతూ అన్నాడు గంగరాజు, సైకిల్ స్టాండ్ వేస్తూ.
"ఏడిసావులే సన్నాసీ! ముందు నా వెనకాల రండి" అని బంగ్లా వెనుక వైపుకి తీసుకుని వెళ్లావు, నీ వెనకాలే కుక్క పిల్లల్లా మేము బయలుదేరాము.
"ఏరా గోల్డ్ కింగూ! కొంపదీసి ఎవరైనా ఢమాలా?" నిన్ను అడిగాడు మనం వాటర్ కింగ్ అని పిలుచుకునే గంగరాజు. వాళ్ళ నాన్న కరణం కావడంతో ఇలాంటి శవ పంచాయతీలు వాడికి కొట్టిన పిండే.
"అయ్యబాబోయ్. శవాలంటే నాకు భయం. నేను రాను" భయపడుతూ చెప్పాడు
లో కింగ్ అని మనం ముద్దుగా పిలుచుకునే పల్లంరాజు.
నా పేరు కామరాజు కాదు కాబట్టి, ఒకవేళ అలా పిలిచినా మీ ముగ్గురికి గోల్డ్ కింగ్, లో కింగ్, వాటర్ కింగ్ పేర్లు సూట్ అయినట్టు నాకు సూటవ్వదు కాబట్టి, సూటయినా పిలవడానికి బాగుండదు కాబట్టి నన్ను మాత్రం చచ్చినట్టు ,కామేషూ అనే పిలిచేవారు మీరందరూ.
అప్పటికే అక్కడ జనం పోగవ్వడం మొదలైంది.
"ఛస్, నోరు మూసుకుని ఆ కిటికీ లోంచి చూడండెహే. ఏం కనపడుతోందో అప్పుడు తెలుస్తుంది?" అన్నావు కింద నిలబడి.
ముగ్గురమూ లోపల ఏం ఉందో అన్న ఆతృతతో చూసాం. అది చూసి దిగిపోతే బాగుండేది కానీ, ఈలోగా మన పల్లంరాజు గాడు, ఆంబోతు రంకె వేసినట్లు గట్టిగా,
"ఒరే, సినీ హీరో చలం గాడురా!" అన్నాడు తన చత్వారం కళ్లజోడు సవరించుకుంటూ.
అది విని, మేకప్ వేయించుకుంటున్న చలం,
"ఏం చూస్తార్రా! ఏం ఉంది ఇక్కడ? వెళ్లి పని చూసుకోండి" సీరియస్ గా అని, పక్కనే ఉన్న తన అసిస్టెంట్ తో
"ఆ కిటికీలు కూడా మూసేయండ్రా" అన్నాడు దేవదాసు సినిమాలో సీ.యస్స్. ఆర్ లా.
కిటికీ మూయడానికి వస్తున్న ఆ బండ అతన్ని చూసి మేము గబగబా కిందకు దిగి పోయాము.
"ఒరే , వీడి సినిమాలు మనం ఇంక చూడొద్దురా!" అన్నాడు మన గంగరాజు గాడు ఉక్రోషంగా.
"ఒరే, పదిహేను రోజుల క్రితం ఈ తోట రాముడు సినిమా పాట షూటింగ్ చూడడానికి మనం పసలపూడి వెళ్లాం, జ్ఞాపకం ఉందా? అప్పుడు ఈ చలం లేడు. ఈరోజు ఇక్కడ ఉన్నాడని తెలిసి, నేను పొద్దున్నే వచ్చి చూసాను. మీకు చూపిద్దామని తీసుకుని వచ్చా. ఇదిగో ఈ పల్లం గాడి ఓవర్ యాక్షన్ వల్లే ఇలా జరిగింది" సంజాయిషీ ఇస్తున్నట్లు చెప్పావు.
తర్వాత ఏడుపు మొహాలతో, అవమాన భారంతో బరువుగా కాలేజీ వైపు బయలుదేరాం.
అయితే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మటుకు అందరమూ మూడేసి సార్లు చూసాము.
ఎందుకంటే....
ఆ సినిమా వలన పాపం ఆయన ఆర్ధికంగా చాలా నష్టపోయారనీ, చాలా కష్టాల్లో ఉన్నారని పేపర్లో చదివి, మనకు జరిగిన అవమానం మరచిపోయి, ఏదో మన వంతుగా సాయం చేద్దామని!
***** ***** ***** *****
అయితే కొన్నాళ్ళ తరువాత ఓ రోజు
మన కాలేజీలో, చెట్టు కింద ఓ ఖరీదైన కారు ఆగి ఉండడం చూసి, సైకిళ్ళు స్టాండు లో పెట్టి అక్కడికి వెళ్లాం. లోపల పుట్టపర్తి సాయిబాబా గారికి ఉన్నంత జుట్టుతో ఒకాయన కార్లో కూర్చున్నాడు.
వెంటనే ఆయన్ని గుర్తు పట్టేసిన నేను,
"సిరిసిరి మవ్వ షూటింగ్ కి వచ్చారాండీ? మా కాలేజీలో తీస్తారాండీ?" అన్నాను ఆనందంగా.
"ఒరే తమ్మళ్లూ! ముందు శ్రద్ధగా చదువుకోండిరా. ఈ సినిమాలు గురించి తర్వాత ఆలోచిద్దురు గాని. ఇక, షూటింగ్ ఎక్కడో నాకూ తెలియదు" చెప్పారు చంద్రమోహన్ కార్లో కూర్చుని.
ఈలోగా మన వైస్ ప్రిన్సిపాల్ శ్రీ గరిగపాటి రుద్రయ్య చౌదరి గారు ఆ కారు వైపు రావడం చూసి, చంద్రమోహన్ గారి చేతిని ఓ సారి ఆప్యాయంగా తడిమి, అక్కడనుండి దౌడు తీసాం, మన వీపీ గారి కంట్లో పడకుండా.
ఆ విధంగా చలం గారి చేత చివాట్లు తిన్న మనం చంద్రం గారి చల్లని కబుర్లతో తృప్తి పడ్డాము.
ఇలా మన కాలేజీ జ్ఞాపకాల గురించి చెప్పాలంటే..ఇంకా.. ఎన్నో.. ఎన్నెన్నో!!
సరే, ఆ తరువాత మన మిత్రులిద్దరూ ఉద్యోగాలు వచ్చి ఒకడు బొంబాయి, ఇంకొకడు తెనాలి వెళ్లిపోయారు.
***** ***** ***** *****
ఇక, మన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు కానీ రహస్యాలు కానీ ఉండేవి కావు. అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకునేవాళ్లం.
అయితే నీ ఉద్యోగం విషయంలో మటుకు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఓ విషయాన్ని మాత్రం నీకు తెలియనీకుండా ఉంచాను.
ఆ విషయాన్ని నీకు చెప్పాలని నలభై మూడేళ్ల నా ప్రయత్నం ఇన్నాళ్లకు, ఇదిగో ఈ విధంగా తీరింది.
***** ***** ***** *****
1980 లో అనుకుంటా అప్పటికి, నేను ఉద్యోగంలో చేరి రెండేళ్లు, నువ్వు సి.ఏ. లో చేరి సంవత్సరం అయ్యింది. ఆ రోజు సాయంత్రం మన ఊరి పార్కులో కూర్చున్నప్పుడు నువ్వు
"ఒరే! కామేషూ, నాకు ఇష్టం లేకపోయినా మా డాడీ బలవంతంగా నన్ను సి.ఏ.లో జాయిన్ చేసారు. ప్రస్తుతం మీ కంపెనీలో ఓ ఉద్యోగం ఖాళీగా ఉందిట. ఎలాగైనా మా డాడీకి నచ్చచెప్పి, ఆ ఉద్యోగం వేయించరా. నేను చెబితే ఆయన వినరు" అని బతిమాలావు.
"సరేరా, మీ డాడీ కి చెప్పి చూస్తాను" అని చెప్పి ఆ సంభాషణ అక్కడితో ముగించాను.
మళ్ళీ రెండు రోజుల తర్వాత, అదే పార్కులో "ఏమయ్యిందిరా? డాడీతో చెప్పావా?" అని అడిగావు. దానికి నేను,
"ఒరే సిగ్గులేదురా? మీ డాడీ కష్టపడి చదివిస్తోంటే, చదవడానికి ఏం రోగం? శుభ్రంగా చదువుకో. ఇంతకన్నా మంచి ఉద్యోగం తెచ్చుకో" అన్నాను.
వెంటనే నువ్వు
"ఒరే, కామేషూ! నువ్వింత స్వార్ధపరుడవని అనుకోలేదురా! నేను ఆ ఉద్యోగంలో చేరితే, ఆ కంపెనీ సెక్రటరీ కొడుకుగా అందరూ నన్ను గౌరవిస్తారు, నీ వైపు ఎవరూ చూడరనే కదా? నన్ను ఉద్యోగంలో చేరవద్దంటున్నావు" అని నిష్టూరమాడావు.
"సరే! అలాగే అనుకో" అని నేను అక్కడి నుండి లేచి వెళ్లిపోయాను.
ఆ తర్వాత రోజుల్లో రామచంద్రపురం లో ఉంటే పాడైపోతున్నావని నిన్ను మీ డాడీ చెన్నైలోని ఛార్టర్డ్ అకౌంట్స్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ చేయడం, అక్కడ నీకు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఈలోగా నాకు ఏలూరు, చిత్తూరు, హైదరాబాద్ లాంటి చోట్లకు బదిలీ కావడం, మీ డాడీ రిటైర్ అవ్వడం, కంపెనీ మేనేజ్మెంట్ మారడంతో మీ నాన్న గారి ప్రాభవం తగ్గిపోవడం, నీకు మేరేజ్ అయ్యి, ఓ అబ్బాయి పుట్టడం, ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వకపోవడంతో సి.ఏ. వదిలేయడం, మీ మావగారు చూసిన ఏదో చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవడం, మీ డాడీ మరణించడం,....ఇవన్నీ ఆ తర్వాత సంవత్సరాలలో వేగంగా జరిగిన పరిణామాలు.
అయితే నీకు చెప్పాలనుకున్న ఆ విషయం ఏమిటంటే..
ఆ రోజు పార్కులో మన సంభాషణ అవ్వగానే, మర్నాడు నేను కంపెనీలో మీ నాన్న గారిని కలిసి,
"మావయ్య గారూ! బంగారం గాడికి సిఏ మీద ఇంట్రస్ట్ లేదుట. పోనీ మన దాంట్లో ఏదైనా....?" చెప్పబోయిన నన్ను
"ఏం ఫ్రెండు వయ్యా నువ్వు? ఎవడైనా స్నేహితుని ఉన్నతి కోరుకుంటాడు. నువ్వేంటీ ఇలా మాట్లాడుతున్నావు? అంటే, వాడు కూడా నీకు లాగే గుమాస్తాలా ఉండిపోవాలా? లేకపోతే, పెద్ద చదువు చదివితే నీకు బాస్ గా వస్తాడని భయమా? వీలైతే వాడిని చదువుకొమ్మని ఎంకరేజ్ చెయ్యి. అంతే తప్ప వాడికి ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్ళకు. అంతే కాదు, ఇవన్నీ వాడితో చెప్పి, వాడి మనసు పాడుచేయకు" అని నన్ను కించపరిచేలా మాట్లాడారు.
ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను కానీ మీ తండ్రీకొడుకుల మధ్య వైరం సృష్టించడం, అలాగే నీకు మీ నాన్నగారి మీద ద్వేషభావం ఏర్పరచడం ఇష్టంలేకే ఇన్నాళ్లూ ఇదిగో ఇలా మౌనంగా ఉండిపోయి, ఇప్పుడు ఈ ఉత్తరం రాసుకుంటున్నా.
పోనీ, ఇప్పుడు నేనే వ్యక్తిగతంగా వచ్చి నీకు చెబుదాం అనుకున్నా, నువ్వు పైకి వెళ్లి పోయి అప్పుడే ఆరేళ్లు అవుతోంది.
సరే ఏం చేస్తాం, ఎప్పటికైనా నేను నీ దగ్గరికి వస్తా కదా ? అప్పుడు మళ్లీ అన్నీ వివరంగా చెబుతా!
ప్రస్తుతానికి శెలవు.
నీ
కామేష్ గాడు.
***** **సమాప్తము** *****