*****
*వ్యసనం*
=========
(కథానిక)
(నేను రాసిన ఈ బాలల కథ తపస్వి మనోహరం అనే అంతర్జాల పత్రికలో ది.24.09.2023 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
సుబ్బారావు, శ్రీలక్ష్మి దంపతుల ఏకైక సంతానం తొమ్మిదేళ్ల గౌరి. కూతురంటే ప్రాణం సుబ్బారావుకు.
ఓ రైస్ మిల్లులో పని చేస్తున్న సుబ్బారావుకు, సారాయి తాగడం వ్యసనంగా మారిపోయింది.
సాయంత్రం ఇంటికి వస్తూనే భార్యతో గొడవ పెట్టుకుంటాడు. తరువాత భోజనం చేసి, కాసేపటికి నిద్రపోతాడు. ఇదే నిత్యకృత్యం అయిపోయింది సుబ్బారావుకు.
ఓ రోజు ఉదయాన్నే డ్యూటీ కి వెళ్తున్న తండ్రిని ఆపి,
"నాన్నా! నువ్వు రోజూ తాగి రావడం చూస్తే, నాకు భయమేస్తోంది. అసలు తాగడం ఎందుకు?" సూటిగా ప్రశ్నించింది గౌరి.
"అలా తాగితే మనసు కాస్త కుదుటపడుతుంది తల్లీ. అయినా నీకెందుకమ్మా ఇలాంటి విషయాలు?" కూతురుని దగ్గరకు తీసుకుని చెప్పాడు సుబ్బారావు.
తండ్రి మాటలు విని, మౌనంగా ఉండిపోయిన గౌరి, కాసేపటికి తేరుకుని బడికి బయలుదేరింది.
***** ***** ***** *****
ఓ వారం రోజులు తరువాత ఆ సాయంత్రం తండ్రికి తెలియకుండా అతని వెనకాలే సారాయి దుకాణం లోపలికి చేరుకుంది గౌరి.
"ఏయ్ పిల్లా! ఎవరు నువ్వు? పిల్లలు ఇక్కడికి రాకూడదు. బయటకు నడు" గౌరిని గట్టిగా గద్దించింది సారాకొట్టు సత్తెమ్మ.
"నా మనసు ఏమీ బాగాలేదు. కావాలంటే ఈ గాజు తీసుకుని ఓ గ్లాసు సారా ఇయ్యి అత్తా!" చేతి గాజు ఇస్తూ చెప్పింది గౌరి.
తన కూతురు వయసు గల ఈ పిల్ల ఇలా మాట్లాడడం చూసి, ఆశ్చర్యపోయి, ఆ పిల్లను దగ్గరకు తీసుకుని
"మనసు బాగా లేకపోతే సారా తాగాలని నీకు ఎవరు చెప్పారే పిల్లా?" అడిగింది సత్తెమ్మ.
"మా నాన్న చెప్పాడు" ఠక్కున చెప్పింది గౌరి.
"ఔనా? సరేకానీ నీకు అంత కష్టం ఏమొచ్చిందే?" సందేహంగా అడిగింది.
"మా నాన్న రోజూ తాగి వచ్చి మా అమ్మతో గొడవ పెట్టుకుంటాడు. మత్తులో మా నాన్నా, ఆ తరువాత ఏడుస్తూ మా అమ్మా పడుకుంటారు. నేను మాత్రం రాత్రి అంతా బాధపడుతూ జాగరం చేస్తాను" చెబుతున్న గౌరిని బుజ్జగించి, ఓ రెండు జంతికలు చేతిలో పెట్టి పంపించింది సత్తెమ్మ.
***** ***** ***** *****
ఓ రెండు రోజుల తర్వాత, డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన సుబ్బారావు,
"అమ్మాయ్ గౌరీ! నీ చేత హోంవర్క్ చేయిస్తా త్వరగా రా తల్లీ!" అంటున్న భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది శ్రీలక్ష్మి.
"అలాగే నాన్నా, ఔనూ! ఈవేళ ఏమిటి ఇంత పెందరాళే వచ్చావు?" వస్తున్న నవ్వును ఆపుకుంటూ అడిగింది గౌరి.
"ఇంట్లో ఉంటేనే మనసు బాగుంటుందని తెలుసుకున్నానమ్మా!" చెప్పాడు సుబ్బారావు.
***** ***** ***** *****
ఓ వారం రోజుల తరువాత
"మాష్టారూ! మీరు చెప్పినట్టే చేసాను. మా నాన్న తాగడం మానేసాడు" తన క్లాసు టీచర్ కి ఆనందంగా చెప్పింది గౌరి.
"నేను చెప్పాను కదమ్మా! ఇష్టమైన వాళ్లు చెబితే ఎంత కష్టమైనా పాటిస్తారని" గౌరి తల నిమురుతూ చెప్పారు చందర్రావు మాష్టారు.
***** **శుభం** *****