*****
(నేను జ్ఞాపకాల పందిరి శీర్షికన రాసిన ఈ కథ తపస్వి మనోహరం అనే అంతర్జాల పత్రికలో
ది.27.08.2023న ప్రచురితమైనది)
*సలాం తాత*
==========
(జ్ఞాపకాల పందిరి)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
అది 1966 వ సంవత్సరం. నేను తూ.గో. జిల్లా ద్రాక్షారామం సమీపంలో ఉన్న మా జగన్నాధగిరిలో 4 వ తరగతి చదువుకుంటున్న రోజులు. ఉదయం బడిగంట కొట్టగానే తప్పదురా దేవుడా అనుకుంటూ కాళ్లీడ్చుకుంటూ తరగతి గదిలోకి వెళ్లి కూర్చున్నాము.
"ఇదిగో బుద్ధవరపూ! ఔట్ బెల్ లో సలాం తాతను చూడడానికి బయటకు వెళ్లినప్పుడు పప్పలు తెచ్చాను. తిందారేం!" అన్నాడు నా ఫ్రెండ్ అమలకంటి కొండబాబు గాడు.
"పప్పలేంట్రా బాబూ? ఆ పేరు ఎప్పుడూ వినలేదు?" విసుక్కుంటూ అడిగాను.
"మీ బేమ్మర్లకు ఏమీ తెలియదు. పప్పలంటే అప్పచ్చులు. మా అప్పని ఈయాళ మా బావ దగ్గరకు పంపుతున్నారు. అందుకే చలిమిడితో పప్పలు చేసారు" అంటూ లాగు జేబులో ఉన్న ఉండలు చూపించాడు.
"వార్నీ! పోకుండలా? అలాగే తిందాంలే" అంటూ బిగ్గరగా నవ్వాను. అంతే ఆ నవ్వు ఎవరికి వినపడకూడదో ఆయనకే వినబడింది. అంతే, వెంటనే
"ఒరే అమలకంటీ, బుద్ధవరపూ ఇలా రండిరా!" టేబుల్ లో ఉన్న పేకబెత్తాన్ని పైకి తీసి, మా వైపు చూపిస్తూ కోపంగా చెప్పారు, నక్కమాష్టారు అని ముద్దుగా పిలుచుకునే నారాయణ మాష్టారు.
"అయిపోయాంరా భగవంతుడా! ఈ రోజు వీపు మీద పేకబెత్తంతో ప్రైవేటు తప్పదన్న మాట" అని మనసులో అనుకుంటూ లేచి
భయంభయంగా ఆయన వద్దకు చేరుకున్నాము.
"ఏమిట్రా ? ఏమిటా మర్మరింగ్ సౌండూ?" బెత్తం పైకి లేపుతూ అడిగారు.
"అదండీ.. అది..అది....మరి...ఈ అమలకంటి గాడు పోకుండలు తెచ్చాడుటండీ, ఔట్ బెల్లులో తిందామంటున్నాడండీ!" అంటూ, కసిదీరా కొట్టుకోండి మీ ఇష్టం అన్నట్టు చేతులు మందుకు చాచి అసలు విషయం చెప్పేసాను సత్యహరిశ్చంద్రుని తోడల్లుడులా.
"ఔనా? ఏవీ?..... అవి ఈ టేబుల్ మీద పెట్టి, వెళ్లి బుద్ధిగా కూర్చోండి" మాష్టారు చెప్పడంతో చేసేదేమీ లేక అవి టేబుల్ మీద పెట్టేసాడు మా అమలకంటి గాడు, నోటి కాడ కూడు పాడుచేసావురా తింగరోడా అన్నట్టు నా వైపు తినేసాలా చూస్తూ.
నేను మాత్రం పోకుండలు పోతే పోయాయి కానీ, ప్రైవేటు నుంచి తప్పించుకున్నాం అని బోలెడు ఆనందపడిపోయి నా నేలబల్ల వద్దకు చేరుకున్నాను, సంతోషంగా.
వెంటనే నక్కమాష్టారు వాటిని టేబుల్ సొరుగులోకి పంపేసారు. తరువాత అవి ఏమయ్యాయి అని దయచేసి మీరు మాత్రం నన్ను అడగవద్దు.
***** ***** ***** *****
ప్రతీరోజూ బడిలో ఉదయం 10.00 గంటలకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఓ పది నిమిషాలు ఔట్ బెల్ ఇచ్చేవారు. మేమందరం ఆ సమయం కోసమే ఎదురు చూసేవాళ్ళం.
దేనికంటే..
మీరనుకున్నట్టు మూత్ర విసర్జన కోసమే కాదు. సలాం తాత బస్సు కోసం కూడా.
ఆ రోజుల్లో కాకినాడ నుంచి మా ఊరు మీదుగా కపిళేశ్వరపురం, అచ్యుతాపురం, కోటిపల్లి, సఖినేటిపల్లి, గోగన్నమఠం, బెండముర్లంక లాంటి ఊర్లకు SRMT, SRKMT మరియు అరుణా మోటార్ సర్వీసు బస్సులు తిరిగేవి. అప్పట్లో బస్సులకి ఇంజన్, ముందు భాగంలో ఉండేది. మూతి ముందుకు పొడుచుకున్నట్లు ఉండడం వలన వాటిని "పంది మూతి బస్సులు" అనేవాళ్ళం.
అంతేకాదు, పెద్దక్క వాళ్ళు రాజమండ్రి నుంచి రావాలన్నా, చిన్నక్క వాళ్ళు గూడాల నుంచి రావాలన్నా రామచంద్రపురం వరకూ వేరే బస్సులో వచ్చి అక్కడనుండి ఈ అచ్యుతాపురం బస్సులో జగన్నాధగిరి వచ్చేవారు.
అందులో, కోటిపల్లి బస్సు నడిపే డ్రైవర్నే అందరూ 'సలాం తాత' అనేవాళ్లం. కోటిపల్లి నుంచి బయలుదేరిన ఆ బస్సు, సరిగ్గా మా ఔట్ బెల్ సమయానికి కొంచెం అటూ ఇటూగా , రోడ్డు పక్కనే ఉన్న మా బడి వద్దకు, ఎర్రటి రబ్బరు బుడగలా ఉండే హారన్ బొయ్ బొయ్ మని మోగించుకుంటూ వచ్చేది.
అంతే, పిల్లలందరమూ పెద్ద గొంతుతో "సలాం తాతా" అంటూ చేతులు ఊపుతూ సలాం చేసేవాళ్ళం. ఖాకీ చొక్కా, నెరిసిన జుట్టు, దాని పైన తెల్లటి లేసు టోపీ పెట్టుకుని, డ్రైవర్ సీట్లో కూర్చున్న తాత కూడా చెయ్యి బైటపెట్టి "సలాం బేటా" అంటూ టాటా చెప్పేవాడు. అంతే... తాత నాకు చెప్పేడంటే నాకు చెప్పేడనీ ఒకళ్ళకొకళ్లం వాదులాడుకునేవాళ్ళం.
ఆ తరువాత రోజుల్లో నాకు తెలిసిన విషయం ఏమిటంటే...
చదువుకుంటున్న పిల్లలు అంటే ఆయనకు చాలా ఇష్టం అనీ అందుకే అలా చెబుతున్నాడని! అంత పెద్ద బస్సును నడిపే ఆయన మాకు సలాం భేటా అని చెబుతున్నాడంటే మాకెందుకో చాలా గర్వంగా, ఆనందంగా ఉండేది.
***** ***** ***** *****
ఆ రోజు కూడా ఔట్ బెల్ లో అందరమూ సలాం తాత బస్సు కోసం ఎదురు చూస్తున్నాం.
మేమందరం తాతకు సలాం చెప్పే లోపు
ఆ బస్సు మీదకు మా ఫ్రెండ్ బొండా సూర్య భగవాన్ గాడు ఓ రాయి విసిరాడు. అది బస్సు వెనుక భాగానికి తగిలింది. అంతే, బస్సును రోడ్డు మీంచి పక్కకు తీసి ఆపుచేసి కిందకు దిగాడు సలాం తాత, కండక్టర్ అప్పారావుతో కలిసి.
అంతే పిల్లకాయలు అందరం, భయంతో బడి లోపలకి పరుగులు పెట్టి, గోడమీద నుంచి ఏం జరుగుతోందో అని చూస్తున్నాం. కిందకు దిగిన సలాం తాత ఓ సారి మా బడి వైపు అనుమానంగా చూసి, రోడ్డు అటువైపు ఉన్న చలివేంద్రం వద్దకు వెళ్లి రెండు సీవెండి గ్లాసుల చల్ల (మజ్జిగ) తాగి, తిరిగి బస్సు స్టార్ట్ చేసాడు.
అయితే... సలాం తాత బస్సు ఆపింది రాయి విసిరినందుకూ, అలాగే బడిలోకి వచ్చి హెడ్ మాష్టారుకి కంప్లైంట్ ఇవ్వడానికి కాదన్న మాట అని తెలిసి, వెంటనే బిలబిలమంటూ మళ్లీ బయటకు వచ్చి సలాం తాతా అంటూ బిగ్గరగా అరవడం మొదలెట్టాం. ఆ అరుపులు విన్న సలాం తాత మళ్ళీ ఆనందంగా మా వైపు సలాం బేటా అని చేతులు ఊపుతూ బస్సు కదిలించాడు.
కొద్ది క్షణాలకు తేరుకుని
"హడలిపోయాన్రా బుద్ధవరపూ!" అన్నాడు అమలకంటి గాడు, నా చేతిలో రెండు పోకుండలు పెడుతూ.
"ఎక్కడివి రా బాబూ ఇవి ? కొంపతీసి మాష్టారు టేబుల్ లోంచి దొబ్బుకొచ్చేసావా?" అడిగాను వాడివైపు అనుమానంగా చూస్తూ.
"లేదెహే! మాయమ్మ ఇచ్చినవి నా లాగు జేబులో ఏసుకున్నా. అది తెలియని మా యప్ప ఇంకో నాలుగు పప్పలు ఇస్తే వాటిని నా పుస్తకాల సంచీలో యేసా. అవే ఇవి. భయపడమాకు తిను" అంటూ ఓ రెండు పోకుండలు నా చేతిలో పెట్టాడు.
"పప్పలు పేరు బాగాలేదు కానీ, రుచి బాగానే ఉందిరోయ్ అమలకంటీ!" ఓ పోకుండ నోట్లో వేసుకుని పరపరలాడిస్తూ చెప్పాను.
"ఎప్పడూ నేను తేవడమే గానీ, నువ్వు ఓ పాలి కూడా తేవేంట్రా బుద్ధవరపూ?" అనుమానంగా అడిగాడు.
"నీకు తెలుసు కదా? మా ఇంట్లో జనాభా ఎక్కువనీ. ఒకరు పట్టుకుని వెళ్తే మిగతావారు కూడా మేమూ పట్టుకెళ్తాం అని పేచీ పెడతారని మా అమ్మ ఎవర్ని బయటకు పట్టుకెళ్లనీయదు" అసలు విషయం చెప్పాను.
ఈలోగా లోపలి బెల్లు కొట్టడంతో లోపలికి పరుగులు తీసాము.
***** ***** ***** *****
రోజులు వేగంగా కదిలాయి. సంక్రాంతి శెలవులు అయిన తరువాత ఆ రోజు బడి తిరిగి ప్రారంభం అయ్యింది.
"ఇదిగో అమలకంటీ! ఎప్పుడూ నేను తినడానికి ఏమీ తేను అని అంటావు కదా? ఇదిగో ఈ రోజు మా చిన్న బావ గూడాల నుంచి తెచ్చిన మల్లారం మిఠాయి ఉండ దొంగతనంగా తెచ్చాను. సలాం తాతకు సలాం చెబుతూ తిందాం సరేనా?" అంటూ ఆ ఉండ వాడికి చూపించి, ముందు జాగ్రత్త చర్యగా దానిని నా కాకీరంగు పుస్తకాలు సంచీలో పెట్టేసాను.
కాసేపటికి ఔట్ బెల్ కొట్టడంతో అందరమూ బడి బయటకు వచ్చాము. ఈ లోగా దూరం నుంచి బస్సు హారన్ వినబడడంతో
"ఒరే అమలకంటీ, ఇదిగో తిను" అంటూ గట్టిగా ఉన్న ఆ మల్లారం మిఠాయి ఉండని చొక్కా చివర చుట్టి, దానిని నోట్లో పెట్టుకుని పటుక్కుమని కొరికి, కాకి ఎంగిలి చేసిన ఆ ముక్కని వాడి చేతిలో పెట్టాను.
పంది మూతి బస్సు దగ్గరకు రావడం చూసి,
ఇద్దరమూ ఆ ఉండ నమలుతూ "సలాం తాతా, సలాం!" అంటూ చేతులు ఊపుతూ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాం. కానీ సలాం తాత "సలాం బేటా" అనలేదు. ఎందుకంటే
అసలు ఆ రోజు ఆ బస్సు నడుపుతున్నది మా సలాం తాత కాదు.
ఆ రోజే కాదు తరువాత ఇంక ఏ రోజు కూడా మాకు సలాం తాత కనపడలేదు.
***** ***** ***** *****
అయితే, కొన్ని కుటుంబ పరిస్థితులు వలన నేను 5వ తరగతి సీలేరు లోనూ, 6 రౌతులపూడిలోనూ, 7 రాజమండ్రి లోనూ చదవటంవల్ల ఓ మూడు సంవత్సరాలు పాటు నేను, మా ఊరికి దూరమయ్యేను.
ఆ తరువాత, నా స్నేహితుడు అమలకంటి ద్వారా తెలిసిన షాకింగ్ వార్త ఏమిటంటే
1967 లో సంక్రాంతి రోజునే సలాంతాత చనిపోయాడనీ, అది కూడా, కొడుకు వలన పోయాడనీ. ...
అదెలాగంటే...
ఆ రోజు మొదటి ట్రిప్ గా ఉదయం 5 గంటలకు కాకినాడ నుంచి బయలు దేరేందుకు, చదువు లేకుండా ఖాళీగా ఉన్న తన కొడుకుని క్లీనర్ గా పెట్టుకున్న సలాంతాత, అతనితో కలిసి సైకిల్ పై ఇంటి నుండి బయలుదేరి పాత బస్టాండ్ కు వచ్చాడుట.
బస్సు వెనుక టైరు ఫంచర్ అయిన సంగతి గ్రహించి, కొడుకుని పైన టాప్ మీదకు వెళ్లి, స్టెఫినీ టైర్ కిందకు దింపమన్నాడుట.
అయితే, పైకి ఎక్కిన కొడుకు అనుభవం లేకపోవడంతో, ఆ టైర్ ఒక్కసారిగా కిందకు జారవిడిచేసాడుట. సరిగ్గా అదే సమయానికి పనిముట్లు తీసుకుని వస్తున్న సలాంతాత మీద ఆ టైర్ పడి తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడి కక్కడే ప్రాణాలు విడిచేడుట.
తను నమ్ముకున్న బస్సు వద్దనే, అది కూడా తన కన్న కొడుకు చేతులలోనే సలాం తాత తనువు చాలించడం అనే ఈ సంఘటన నాకు చాలా బాధ అనిపించింది.
మళ్లీ చాలా దశాబ్దాల తర్వాత...
'మహానటి' సినిమాలో జూనియర్ ఆర్టిస్టులకు కాంట్రాక్టర్ భోజనం పెట్టే సన్నివేశంలో "ఇది మనుషులు తినే అన్నమేనా?" అని ప్రశ్నించే నెరిసిన గెడ్డం, మీసాలు ఉన్న ఆ పెద్దాయనను చూడగానే, అదే పోలికలతో ఉండే మా సలాం తాత జ్ఞాపకం వచ్చాడు.
అన్నట్టు చెప్పడం మరిచాను. ఆ సలాం తాత అసలు పేరు ఏమిటో ఇప్పటికీ నాకు తెలవదు.
***** **సమాప్తము** *****