కలర్ ఫొటో

తపస్వి మనోహరం • 06 Jul 2023 • 👁 5 views
కలర్ ఫొటో
*****

*కలర్ ఫొటో*
=========
(మినీ కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.

"విశాల్, ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నాం. ఇంతవరకూ నీ నిర్ణయం ఏమిటో చెప్పటం లేదు" తన ప్రియుడిని అడిగింది అనూష.

"నీకు తెలియంది ఏముంది? మా నాన్న పెద్ద మోతుబరి. ఆయనను ఒప్పించడమే కొంచెం కష్టంగా ఉంది" చెప్పాడు విశాల్.

"సరే నీ నిర్ణయం చెప్పేముందు నిన్ను ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్తాను. నాతో రా!" అంటూ ఓ బీచ్ వద్దకు తీసుకొచ్చింది అనూష.

***** ***** ***** *****

అక్కడ ఉన్న ఓ బెంచి మీద కూర్చుంటూ, తన సెల్ ఫోన్ లో ఉన్న ఓ ఫొటో చూపించింది అనూష.

"ఈ ముసలాళ్లు ఇద్దరూ ఎవరూ? మీ తాత బామ్మానా ?" అడిగాడు విశాల్.

"ఆయన మా తాత గోపాలం, అయితే ఆవిడ మా బామ్మ కాదు. మా తాత ప్రియురాలు, రాధ. ఆ రోజుల్లో వాళ్ల ప్రేమను ఇరు కుటుంబాల వారు ఒప్పుకోక పోవడంతో, వేరే వాళ్లను వివాహాలు చేసుకుని, జీవితాలలో స్థిరపడ్డారు"

"మరి ఇలా ఎప్పుడు కలుసుకున్నారు?"

"ఓ పదేళ్ల క్రితం ఓ సాయంత్రం, నన్ను మా తాత ఇదిగో ఈ బీచ్ కి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఈ బెంచి మీద ఒంటరిగా కూర్చున్న ఈ రాధ గారిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత కాసేపటికి తేరుకుని, యవ్వనంలో తమ ప్రేమ గురించి వాళ్లిద్దరూ చర్చించుకున్నారు"

"తరువాత ఏమయ్యింది?"

"నన్ను ఓ ఫొటో తీయమన్నారు. ఇదిగో అదే ఈ ఫొటో. ఆ తరువాత, ఐదేళ్ల క్రితం మా తాత చనిపోయేవరకూ కూడా, ప్రతీరోజూ సాయంత్రం ఈ బెంచి మీదే కూర్చుని, స్నేహితులుగా కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు చెప్పు, మనం కూడా ఆ వృద్ధ జంటలాగ కలకాలం స్నేహితులుగా ఉండిపోదామా?"

"నో, నేను మీ తాతలాగ మనసు చంపుకుని వేరొకరితో సంసారం చేయలేను. ఈరోజు మా నాన్నతో చెబుతాను. వింటాడా సరే లేకపోతే రేపు ఉదయం, మీ వాళ్లతో రిజిష్ట్రార్ ఆఫీసుకు వచ్చెయ్. అక్కడే నిన్ను వివాహం చేసుకుంటాను" అనూషను దగ్గరకు తీసుకుని చెప్పాడు విశాల్.

***** ***** ***** *****

రెండు రోజుల క్రితం ఇదే బీచ్ లో, పొరుగూరు నుంచి సరదాగా బీచ్ చూడడానికి వచ్చిన ఓ వృద్ధ జంటకు తాను తీసిన ఈ కలర్ ఫొటో, దానికి తాను చెప్పిన కట్టుకథ తన ప్రియుడిలో ఇంత మార్పు తెస్తుందని ఊహించని అనూష ఆ ఫొటోను ఓసారి తనివితీరా ముద్దాడింది.

***** **శుభం** *****

( *చిత్రానికి కథ* శీర్షికన నేను రాసిన ఈ *కలర్ ఫొటో* అనే కథ తపస్వి మనోహరం అనే పత్రికలో ది.06.07.2023 న ప్రచురితమైనది).