మెలకువగా ఉంటున్నారా

ఈనాడు దినపత్రిక • 05 Jul 2026 • 👁 13 views
మెలకువగా ఉంటున్నారా ?
( ఈనాడు దినపత్రిక 5/7/2026 అంతర్యామిలో నా వ్యాసం)
రామాయణంలో కుంభకర్ణుడు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది అతడి దీర్ఘ నిద్ర .పై పైన చూస్తే ఆ పాత్ర బల వంతుడు, రాక్షసుడు నిద్రకు బానిసన్నట్టుగానే కనిపిస్తుంది .కానీ లోతుగా ఆలోచిస్తే ఆధునిక జీవనశైలి గురించి ఏదో హెచ్చరిస్తున్నట్టే అనిపిస్తుంది.
ఒకసారి నేటి మనిషి పరిస్థితిని గమనిస్తే శరీరం మేల్కొని ఉన్నా, మనసు మాత్రం ఒక రకమైన నిద్రలోనే ఉంటుంది. మొబైల్ ఫోను, సామాజిక మాధ్యమాలు, నిరంతర సమాచారం _ ఇవన్నీ మనల్ని ఒక మాయాజాలంలో పడేసి నిజమైన జీవిత విలువలను మరిపిస్తున్నాయి. చైతన్యాన్ని మాయం చేస్తున్నాయి. అక్కడ నిద్ర శాపం వల్ల వస్తే ఇక్కడ అలవాట్ల వల్ల వస్తోంది .ఇదే అసలు తేడా ఈ అలవాట్లకు బానిసైన మనిషి తన జీవితాన్ని తానే నియంత్రిస్తున్నానని అనుకుంటాడు కానీ వాస్తవానికి అవే అతన్ని నడిపిస్తున్నాయి. మెలకువగా ఉన్న సమయంలో అతడికి మంచీ , చెడు తెలుసుకోగల జ్ఞానం ఉంటుంది .సత్యం వైపు నడవాలని ప్రయత్నిస్తాడు. అంటే లోపల ధర్మబుద్ధి ఉంది. కానీ సంబంధాలు, విధేయత, పరిస్థితులు ఇవే అతన్ని తన నిర్ణయానికి విరుద్ధంగా నడిపిస్తాయి .మనకు సరైన మార్గం తెలిసినా, అనేకసార్లు ప్రయోజనాల కోసం, సంబంధాల కోసం మనసుకు వ్యతిరేకంగా నడుస్తాం. ఈ అంతః సంఘర్షనే మన అసలైన బలహీనతగా మారుతుంది .
జీవితంలో నిజంగా మేల్కొని పనిచేసే సమయం చాలా తక్కువ .మూడోవంతు నిద్రకు పోగా మిగిలిన కాలం అలసత్వం, నిరర్ధక వినోదం పనికిరాని అలవాట్ల లోనే గడుస్తోంది .అర్థమంతమైన పనులన్నీ పక్కన పడుతున్నాయి. అందుకే మన జీవితంలో ఎంత భాగం నిజంగా జాగృతమైనది ? ఎంత భాగం అలవాట్ల గాఢ నిద్రలో గడుస్తోంది?. ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మెలకువగా ఉన్న మనిషిలో అపారమైన శక్తి ,సామర్థ్యాలు ఉంటాయి .అలవాట్లకు బానిసవడం వల్ల ఆ సామర్ధ్యాలను వినియోగించే అవగాహన, క్రమశిక్షణ లోపిస్తున్నాయి. దాంతో ఉన్నవాటిని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఎందరో జీవితాలను నిరర్థకం చేసుకుంటున్నారు. తలుపు తట్టిన అవకాశాలనూ గుర్తించలేకపోతున్నారు.
అందుకే కుంభకర్ణుడి కథ మన కో హెచ్చరిక .ఇది మనలోని అలసత్వం, అజ్ఞానం, అవగాహన లేములను గుర్తుచేస్తుంది .ఇక్కడ మేల్కొన డం అంటే కళ్ళు తెరిచి చూడడమే కాదు_ మనసును ,ఆలోచనలను, బాధ్యతలను మేల్కొల్పటం. మన పనుల్లో స్పష్టత లక్ష్యాలలో స్థిరత్వం వచ్చినప్పుడే జీవితానికి ఒక దిశ దశ అలవడతాయి. మనం గ్రహించాల్సిన సత్యం ఒకటే. మనలోని ప్రతిభ తో సమయాన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యక్తిగత ప్రయోజనాలను దాటి సామాజిక శ్రేయస్సు వేపు అడుగులు వేయాలి. ప్రయాణకులు తమ గమ్యాలకు చేరగానే ఓడను వదిలి వెళ్ళిపోయినట్లు ,మనిషి కూడా కొన్నాళ్ళకు తన సంపదలన్నిటితో పాటు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాడు. మిగిలేది కీర్తి మాత్రమే అంటారు గుర్రం జాషువా. అలా మనం ఏమైనా మిగులుస్తున్నామా అన్నదే ఆలోచించాల్సిన విషయం ***
_ జీడిగుంట నరసింహమూర్తి