ఆధునిక ఆలోచన

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)16 వ రాష్ట్ర మహాసభలు • 15 Nov 2025 • 👁 12 views
ఆధునిక ఆలోచన
ఆధునిక ఆలోచన
లత హడావిడిగా పనులన్నీ చక్కపెట్టుకోసాగింది. భర్తకు ఆఫీస్ కి వెళ్లడానికి డ్రెస్ ఐరన్ చేసి, షూ పాలిష్ చేసి, టిఫిన్, వంట మధ్యలో కాఫీలు,పిల్లలకు బూస్ట్, పాప స్రవంతికి జడలు వేసి రిబ్బన్లు కట్టడం వగైరా. ఇంక ఆఫీస్ కి బయలుదేరడానికి రెడీ అవుతోంది. లత భర్త రమేష్ తాపీగా కూర్చుని పేపర్ చదువుతున్నాడు.అతడు గవర్నమెంట్ ఉద్యోగం, పదిన్నరకు ఆఫీసు. లత జాబ్ చేసేది ప్రైవేట్ ఫార్మా కంపెనీలో! అక్కడ టైం కు రిజిస్టర్ లో సైన్ చేయకపోతే కొన్నిసార్లు జీతం కూడా కట్ చేస్తారు. ఇద్దరు పిల్లలు సంతోష్, స్రవంతి స్కూల్ బస్సు రావడంతో తండ్రికి ‘టాటా’ చెప్పి బయలుదేరాడు. రెడీ అయ్యి బయటకు రాగానే అత్తగారు కోమలమ్మ లత వంక వింతగా చూసింది.
“బయలుదేరుతున్నాను! మీరూ,అత్తగారూ టిఫిన్ చేయండి” అని బయలుదేరింది లత.
ఇంకో అరగంట పేపర్ చూసి, బద్దకంగా లేచి వాళ్ళు విరుచుకొని, ఒక పది నిమిషాలు పడుకుని మళ్ళీ తొమ్మిది గంటలకు స్నానం చేసి రెడీ అయ్యి “అమ్మా! రా టిఫిన్ తిందాం” అని పిలిచాడు.
ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళ అమ్మ ప్లేట్లో దోశలు పెట్టి, చట్నీ వడ్డించాడు. తనూ వడ్డించుకుని తినసాగాడు.
కోమలమ్మ మొహం చిట్లించి “ఏందయ్యా ఇది? చల్లారిన దోశలు! నాకేం సహించడం లేదు!” అంది.
“ హాట్ ప్యాక్ లో నుంచే కదమ్మా పెట్టాను!” అన్నాడు రమేష్ ఆశ్చర్యంగా
“అలా కాదురా! దోశలు అంటే వేడివేడిగా తినాలి. అలా పెనం మీద నుంచి ప్లేట్లోకి! చిన్నప్పటి నుంచి అలాగే కదరా నేను అలవాటు చేసింది. కానీ, నీ కర్మ నా కర్మ చల్లారిన దోసలే తినాలి ఇప్పుడు!” అంది ఛీత్కరంగా కోమలమ్మ పరోక్షంగా లతని తిడుతోందని తెలుసినా రమేష్ ఏమీ మాట్లాడకుండా టిఫిన్ చేసి ఆఫీస్ కు బయలుదేరారు.
***
“ఏం లతా! బ్రేక్ ఫాస్ట్ ఏమి తెచ్చావు? అంది వాణి ఆఫీస్ క్యాంటీన్ లో
“ఏం తేలేదు వాణీ! ఉన్న దోస పిండిలో అత్తయ్యకూ, ఆయనకూ పిల్లలకు దోశలు వేసి పెట్టాను. నాకు వేరే టిఫిన్ చేసుకునే టైం, తీరికా లేదు” అంది లత
“ సరే ఇక్కడ తీసుకుందాం” అంది వాణి
“ వద్దు వాణీ! ఎందుకు డబ్బులు దండగ, టీ తాగితే సరిపోతుంది కదా” అంది లత.
“దండగా? నీ తిండికి నువ్వు ఖర్చు పెట్టడం దండగెలా అవుతుంది?నువ్వు సంపాదిస్తున్నావుగా?” అంది వాణి ఆశ్చర్యంగా.
దానికి లత కళ్ళ నీళ్లు పెట్టుకుని “సంపాదించేది మాత్రమే నేను, కానీ ఆయన నా జీతం లో నుండి నాకు ఇచ్చే 1000 లేదా 2000 తప్ప మొత్తం ఇంటి ఖర్చులకు తీసుకుంటారు! మన ఆడవాళ్లకు నెల తిరిగేసరికి ఎన్నో పర్సనల్ ఖర్చులు ఉంటాయిగా! అందుకే నేను జాగ్రత్తగా చూసి ఖర్చు పెడుతుంటాను” అంది లత
వాణి “అదేంటే మీ ఆయన గవర్నమెంట్ జాబ్ కదా! పైగా మీ మామగారి పెన్షన్ అత్తగారికి వస్తుందిగా!” అంది ఆశ్చర్యంగా
“ మా ఆయన ఆడపడుచుల పెళ్లిళ్లకు లోన్ తీసుకున్నారు! ఆయన జీతం దానికి సరిపోతుంది.మామగారి పెన్షన్ అత్తయ్య మాకు ఇవ్వరు. అప్పుడప్పుడు కొంత ఆడపడుచులకు ఇస్తారు. నా సంపాదనతోనే ఇంటి ఖర్చులూ వగైరా..” అని చెప్పి కళ్ళు మూసుకుంది.
దాంతో బాధపడిన వాణి కానీ కౌంటర్ దగ్గరికి వెళ్లి “రెండు ప్లేట్లు దోస, ఒక ప్లేట్ పూరి” అని చెప్పి లత దగ్గరకు వచ్చి కూర్చుంది.
“లతా” అని ప్రేమగా పిలిచింది.
“ సారీ వాణీ! నా కష్టాలు చెప్పి బాధ పెట్టాను” అని కళ్ళు తుడుచుకుంది లత
“ లతా నీకు ఇలా కష్టాలు భరించడం ఎవరు నేర్పారు?”అని అడిగింది వాణి.
“ మా అమ్మే వాణీ” అంది లత నిర్లప్తంగానే నవ్వుతూ
“మీ అమ్మ నా?” అడిగింది వాణి.
“ అవును లతా! మా అమ్మ పెద్దగా చదివలేదు. 15 ఏళ్లకే మా నాన్నతో పెళ్లి జరిగింది! మా నాన్న వాళ్ళది చాలా బీద కుటుంబం, ఆస్తిపాస్తులు లేవు గానీ, గొప్పలకూ, చాకిరీలకూ తక్కువ లేదు! ఇద్దరు ఆడపడుచులూ మరుదులూ,వారి చదువులు, పెళ్లిళ్లు, పురుడులూ, ఇంటికి వచ్చే చుట్టాలు ఇలా చాకిరీలతో మా అమ్మకు గడిచిపోయేది! నా ఇద్దరు అన్నయ్యలనూ పెద్ద చదువులు చదివించినా, నన్ను మాత్రం ఇంటర్ వరకే చదివించారు. అదీ మా అమ్మ పంతంతో! అందుకే నాకు తగ్గట్టే ఈ ఉద్యోగం, పెళ్లి, పిల్లలు! ఇలా చిన్నతనం నుంచి అమ్మ కష్టం చూసి కష్టాన్ని ఎలా ఓర్చుకోవాలో తెలుసుకున్నాను!” అంది లత.
అంతలో టిఫిన్ టేబుల్ మీద పెట్టారు.
“ తిను” అంది వాణి.
“వాణీ!...” అంది లత ఆశ్చర్యంగా. వాణి తినమన్నట్లుగా సైగ చేసింది. లత ఆవురావురుమంటూ టిఫిన్ తినడం చూసి వాణి కళ్ళు చెమ్మగిల్లాయి
ఇద్దరూ టిఫిన్ తిని టీ తాగడం పూర్తయింది.
“లతా మనము ఒక హాఫ్ డే సెలవు తీసుకొని నా కజిన్ డాక్టర్ సుప్రజ, సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్తున్నాం” అంది వాణి
“ఇప్పటికిప్పుడు ఎలా? పని?” అంది లత అయోమయంగా
“అదంతా నేను చూసుకుంటాను! నువ్వు బయలుదేరు” అని తనతో పాటు ఆటోలో డాక్టర్ సుప్రజ దగ్గర కు తీసుకెళ్ళింది.
అక్కడున్న ఆయాతో చెప్పి ఐదు నిమిషాల్లో లోపలికి వెళ్లారు.
డాక్టర్ సుప్రజ “వాణీ! రా, నీకు ఆరోగ్యం బానే ఉందిగా?”అంది ఆశ్చర్యంగా
“నాకు బాగానే ఉందక్కా! నా ఫ్రెండ్ లత, మా కజిన్ సుప్రజా” అని పరిచయం చేసింది వాణి
“రండి కూర్చోండి” అంది డాక్టర్ సుప్రజ నవ్వుతూ సుప్రజకు లత పరిస్థితిని పూర్తిగా వివరించింది వాణి. “అందుకే అక్కా! నాకంటే నువ్వు బాగా చెప్తావని తీసుకొచ్చాను” అంది
సుప్రజ ఒక సారి నిట్టూర్చి “ ఓకే వాణి! నేను తనను కౌన్సిలింగ్ చేస్తాను, బట్ పర్సనల్గా” అంది
దాంతో వాణి “సరే లతా! నేను ఆఫీస్ కి వెళ్తాను, నీ వర్క్ ఏమన్నా ఉన్నా నేను చూసుకుంటాను! నువ్వు నిదానంగా రా” అంటూ “బాయ్ అక్కా” అని బయలుదేరింది.
“ లతా!చిన్నప్పటినుంచి మీ అమ్మ కష్టాలను చూసి పెరిగానన్నావు! మరి మీ పిల్లలు కూడా అంతేగా! నీ కష్టాలను చూసి పెరుగుతున్నారు, అంటే వారు కూడా నీలాగే కష్టాలు పడాలనా లేక నీ లాగానే కష్టపడతారనా? లేక ఆ కష్టాలకు ఓర్చుకుంటారనా?” అంది డాక్టర్ సుప్రజ
ఆ మాటలు పదునైన కత్తిలా గుచ్చుకుంది లతకు.
“ అయ్యో అలా ఎందుకు అనుకుంటాను మేడం, నాలాగా వాళ్ళు కష్టపడకూడదు అని కదా నేను ఈరోజు కష్టపడేది” అంది లత బాధగా
“ మరి మీ అమ్మ కూడా అలాగే అనుకొని ఉంటుంది కదా! ప్రపంచంలో ఏ అమ్మైనా అలాగే భావిస్తుంది” అని ఆపింది డాక్టర్ సుప్రజ.
ప్రశ్నార్థకంగా చూసింది లత
“ లతా! మీ అమ్మ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే ఆవిడ మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది కాబట్టి! అందువల్లనే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి, పెళ్ళిళ్ళు చేసి పురుడు పోయగలిగింది. కానీ నువ్వు చేసేదేమిటి? మీ కుటుంబం కోసం త్యాగం చేస్తున్నానన్న పేరుతో నీ ఆరోగ్యాన్నీ,తిండినీ, నిద్రనూ నిర్లక్ష్యం చేస్తున్నావు.
నీ సంపాదన లేకుండా నీ ఇల్లుఞగడుస్తుందో లేదో నేను చెప్పలేను కానీ నువ్వు లేకుండా మాత్రం నీ కుటుంబం విలవిలలాడిపోతుంది. నువ్వు ఆధునిక మహిళవు! మీ అమ్మలా కాదు! ఆ కష్టాన్ని గెలిచే ప్రయత్నం చెయ్యి. నీ సంపాదన నీ ఇంటిల్లపాదికీ ఉపయోగపడుతున్నప్పుడు, నీ పనుల్లో కూడా మీ ఆయనకూ, అత్తగారికీ భాగాన్నివ్వు! అది వారి శరీరాలనూ, మెదడునూ ఉత్తేజం చేస్తాయి. మోయలేనంత భారం మోస్తూ ఒకసారి గా కుప్పకూలడం కంటే, భారాన్ని పంచి జీవితంలో అందరూ ముందుకు వెళ్ళడం మంచిది. డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీకి అప్లై చెయ్యి. దాని ద్వారా ప్రమోషన్ లేదా మెరుగైన ఉద్యోగం నీకు కలగవచ్చు.అలా నీ కుటుంబాన్ని ఇంకొంక మెట్టు పైకి తీసుకుని వెళ్లవచ్చు. మీ అత్తగారికీ, మీ ఆయనకూ ఈ విషయాన్ని వివరించు. ముందు వాళ్ళు వ్యతిరేకించినా వాళ్ళకు లాభం చేకూర్చేది కావడం వల్ల ఒప్పుకుంటారు. మీ అమ్మ చరిత్రనే నువ్వు పునావృత్తం చేయనవసరం లేదు, తరతరాలగా వస్తున్న చరిత్రను తిరగరాయాలి” అంది డా. సుప్రజ ధీటుగా.
ముందుగా లత భయపడినా, క్రమేపీ రెండు మూడు సార్లు డాక్టర్ సుప్రజ చేసిన కౌన్సిలింగ్ తో ధైర్యంగా ఇంట్లో వాతావరణాన్ని చక్కబెట్టసాగింది.
అత్తగారు నసిగినా, భర్త కోపం చూపినా,లత పట్టుదలగా ఉండడం చూసి వారిద్దరూ దిగిరాక తప్పలేదు.
దాంతో ఇన్ని రోజులూ ఒంటెద్దులా కష్టపడే లతకు కొంత ఊరట లభించింది. మూడేళ్లలో డిగ్రీ పాసై మంచి సంస్థలో టీచర్ ఉద్యోగం సంపాదించింది.
ఒక రోజు స్వీట్స్, పండ్లూ తీసుకుని డాక్టర్ సుప్రజ దగ్గరికి వెళ్లింది లత.
లత పురోగతిని చూసి సంతోషించిన సుప్రజ “ లతా! ఇది నీతో, ఇంతటితో ఆగకూడదు! ఒకప్పుడు నీలా ఉన్నవాళ్ళకు వారి శక్తి ఏమిటో తెలియజేయి! ప్రతి ఆధునిక మహిళా తన చరిత్రను తిరగరాసేందుకు అవకాశం కల్పించు” అంది గంభీరంగా