సుద్ధముక్క

ఆదర్శ ఉపధ్యాయుల స్పూర్తి గాథలు - 8 వ సంకలనం • 29 Mar 2026 • 👁 25 views
సుద్ధముక్క
సమయం మూడున్నర గంటలు.అది ఒక ఎల్కేజీ క్లాస్ ఆ క్లాస్ అంతా కోలాహలంగా ఉంది.పిల్లలందరూ ఎగురుతూ, దూకుతూ, కొంచెం అరుస్తూ బ్యాక్ తగిలించుకొని అటూ ఇటూ తిరుగుతున్నారు. వారి సంతోషానికి కారణం: అప్పుడే మోగిన లాంగ్ బెల్. ఇంటికి వెళ్లిపోవచ్చని ఆనందం.అప్పుడే ఒక్కొక్కరి తల్లిదండ్రులు వస్తున్నారు. తల్లినో,తండ్రినో చూసేసరికి వాళ్ళకు చాలా సంతోషం వేస్తోంది. ఎల్కేజీ టీచర్ జాగ్రత్తగా పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి, వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం రెండు జడలు వేసుకుని కంటికి కాటుక పెట్టుకుని అందర్నీ చూస్తోంది. అంతవరకు పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పజెప్పడం, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పి అలసిపోయిన ఎల్కేజీ టీచర్ తన కుర్చీలో కూర్చుని ఆ కాటుక కళ్ళ అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయి కూడా టీచర్ను అలాగే చూసింది. ఆ టీచర్ తన చేతిలోని చాక్ పీస్ (సుద్దముక్క) ను ఆ అమ్మాయిని తీసుకోమన్నట్లుగా చూపించింది. అది చూసి సంతోషంతో ఆ కాటుక కళ్ళ అమ్మాయి కళ్ళు మరింత పెద్దది అవ్వగా “థాంక్యూ మిస్” అంటూ తీసుకుంది. ఇంతలో అదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేసే ఆ అమ్మాయి తల్లి రావడంతో ఇంటికి వెళ్ళింది.
అలా రోజు ఎల్కేజీ మిస్ కాటుక కళ్ళ అమ్మాయికి చాక్పీస్ ఇచ్చేది. ఆ అమ్మాయికి ఆ చాక్పీస్ అంటే చాక్లెట్ కన్నా ఇష్టం. దాంతో తన తండ్రిని అడిగి ఒక నల్ల హ్యంగింగ్ బ్లాక్ బోర్డు కొనిపించుకుంది. రోజూ స్కూల్ నుండి ఇంటికి రాగానే, ఆ బోర్డులో తన టీచర్ ను అనుకరిస్తూ రాసేది. ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా, ఆనందంగా చూసేవారు. తన తల్లి కూడా ఉపాధ్యాయురాలు కావడంతో ఆ అమ్మాయి నైపుణ్యాన్ని ఇంకా చక్కదిద్దేది. అలా క్రమేపీ ఆ అమ్మాయి బడి పరీక్షల్లోనూ, జీవితం పెట్టిన పరీక్షల్లోనూ నెగ్గుతూ ఈరోజు ఈ రచన చేయగలిగింది.
భౌతిక శాస్త్రంలో బంగారు పతాకం అందుకుని, డాక్టరేట్ పట్టాను పొంది,ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకుని, సహప్రాచార్యురాలుగా అందరి మన్ననలను పొందుతున్నాను.
ఇంతకీ ఆ రోజు ఆ ఎల్కేజీ మిస్ కు నా భవిష్యత్తు కనబడిందో లేదా నన్ను అధ్యాపకురాలుగా తీర్చిదిద్దాలనుకుందో తెలియదు కానీ ఆ రోజు టీచర్ నుండి సుద్దముక్క తీసుకోవడంతో నా అధ్యాపక వ్రృత్తికి బీజం పడిందని భావిస్తున్నాను. దాన్ని సంరక్షించి ప్రోత్సహించిన తల్లిదండ్రులకూ, గురువులకూ ఈ వ్యాసం అంకితం.