ఒంటరి గంటలు

అక్షరాలతోవ • 01 Mar 2026 • 👁 19 views
ఒంటరి గంటలు
ఒంటరి గంటలు
“వస్తానమ్మా” చెప్పింది లక్ష్మమ్మ
“సరే, రేపు పెందలాడే రా లక్ష్మమ్మా!!కర్టెన్స్, దుప్పట్లు అన్నీ మిషన్ కి వేయాలి!” అంది రాజేశ్వరి.
“సరే అమ్మగారూ!” అని లక్ష్మమ్మ బయలుదేరింది. ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించింది రాజేశ్వరికి!! రోజూ ఉదయం 10 గంటలకు లక్ష్మమ్మ వచ్చి ఇల్లంతా ఊడ్చి, తుడిచి, మిషన్లో బట్టలేసి,సామాన్లు తోమి, ఆ పనుల్లో భాగంగా కాఫీ టిఫిన్లు చేసి, ఆ మాటా, ఈ మాటా కలుపుతూ 12 గంటల వరకు ఇంట్లోనే గడుపుతుంది. అప్పుడప్పుడు లంచ్ కు పప్పు, పులుసు, కూర కూడా లక్ష్మమ్మకు సమకూర్చేది రాజేశ్వరి. లక్ష్మమ్మ వెళ్ళిన తర్వాత నుండి సాయంకాలం ఆరు గంటల వరకు గల ఆ ఒంటరితనం అనుభవించడానికి కష్టంగా ఉంది రాజేశ్వరికి. సాయంత్రం 5:00కు కాపీ, స్నాక్స్ తిని పెయింటింగ్ అండ్ టైలరింగ్ క్లాస్ అటెండ్ అయ్యే సరికి 8 గంటలవుతుంది. ఇంక అప్పుడు తనకూ, తన భర్త రాజేష్ కు వేడివేడిగా వంట వండేస్తుంది. రాజేష్ రావడానికి సుమారు 9-9:30 అవుతుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. మళ్ళీ, కొంతసేపు తమతమ అభిరుచులకు అనుగుణంగా టీవీ చూసి ఆస్వాదిస్తూ, ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇక పొద్దున్న ఆరు గంటలకు రాజేశ్వరి లేచి స్నానపానాదులు ముగించుకొని,పూజ చేసి,కాఫీ టిఫిన్ రెడీ చేసి, ఎనిమిదిన్నర గంటలకు భర్తను ఆఫీసుకు సాగనంపుతుంది. ఆ తరువాత అపార్ట్మెంట్ కింద స్పేస్ లో బాగా ఒక గంట సేపు వాక్ చేసి, మళ్లీ ఫ్రెష్ అయి టిఫిన్ తిని తదితర పనులు చేస్తుంది. కానీ రాజేశ్వరి కి ఆ మధ్యాహ్నం ఖాళీని ఎలా పూరించాలో అర్థం కావడం లేదు. అలా అని నిద్రపోదామా అంటే, ఒక గంట సేపు కంటే ఎక్కువ నిద్ర రాదు. మధ్యాహ్నాలు రాను రాను ఆ ఒంటరితనాన్ని భరించలేకపోతోంది రాజేశ్వరి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో అంతు చిక్కడం లేదు. ఎవరికైనా చెబుదామంటే నవ్వి పోతారేమోనని భయం. లక్షలు సంపాదించే మొగుడు, సొంత ఫ్లాట్, కారు, పనిమనిషి!! ఇంకా కావాలంటే వంట మనిషిని కూడా ఏర్పాటు చేస్తానన్నాడు రాజేష్. ‘వద్దు!! మీకు ప్రేమగా నేను వండుతాను!! ఈ వ్యాపకం కూడా లేకపోతే ఎలా ?’అని తను వారించింది. ఇంతటి సౌకర్యాలు ఉన్నా, ఐదు గంటల ఒంటరితనం తనను వెక్కిరిస్తున్నట్లుగా భావిస్తుంది రాజేశ్వరి.
అలా ఆలోచిస్తూ మొబైల్ నొక్కింది. వెంటనే ఎఫ్ బి లో తన స్నేహితురాలు విమల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. విమల పేరు చూడగానే చాలా సంతోషం అనిపించింది రాజేశ్వరికి!! వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేసింది. ఎలా ఉన్నావు?ఎక్కడున్నావు? నుంచి ప్రస్తుతం ఏం చేస్తున్నావ్? వరకు ఆ విషయాలు మొత్తం మెసేజ్ రూపంలో బదిలీలయ్యాయి. ఈసారి విశాఖపట్నం వచ్చేటప్పుడు తప్పకుండా ఇంటికి రావాలని స్ట్రాంగ్ గా మెసేజ్ చేసింది రాజేశ్వరి. దానికి విమల నవ్వుతూ ‘ఎమోజీ పెట్టి, సరే’ అంది. అలా ఒక గంట సేపు చాటింగ్ చేసిన తర్వాత కొంత నిద్ర వస్తున్నట్లు అనిపించి, సోఫాలోనే నిద్రపోయింది. ఏవో
అరుపులు కేకలు వినపడడంతో, ఉలిక్కిపడి లేచి గబగబా బాల్కనీకి వెళ్ళింది రాజేశ్వరి. ఒక దృశ్యాన్ని చూసి హతాసురాలయింది. సెకండ్ ఫ్లోర్లో లోని అంకుల్ గారు సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి. భోరున ఏడుస్తున్నారు!! అందరూ ఓదారుస్తున్నారు. పోలీసులు అంతా చుట్టూ గుమిగూడారు. రాజేశ్వరికి ఆందోళన ఎక్కువైనందున, వెంటనే మొబైల్ తీసుకొని ఇంటికి తాళం వేసి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. తాను ఉండేది ఎనిమిదవ ఫ్లోర్లో, లిఫ్టు ఎక్కి రెండు ఫ్లోర్ కి వెళ్ళింది అక్కడ అంకుల్ గారి వంట మనిషిని “ఏమైంది కాంతమ్మా?” అని అడిగింది
“ఏం చెప్పమంటారు అమ్మగారూ!!ఎవరో అపరిచితుడు తాతగారిని ఫోన్ లో బెదిరించి బ్యాంకు బాలన్స్ ఖాళీ చేశాడట” అంది తనకి తెలిసీ తెలియని పరిజ్ఞానంతో.
విషయం అర్థం అవ్వక రాజేశ్వరి, పక్కనే బొచ్చు కుక్కను చేతిలో పట్టుకుని, స్కర్ట్ వేసుకుని సింపతితో ఆ సీను చూస్తున్న మిస్సెస్ వర్మను “హలో” అని పలకరించింది.
మిస్సెస్ వర్మ “హాయ్ రాజేశ్వరీ! ఏంటీ, ఈ సీన్ చూడడానికి ఎయిత్ ఫ్లోర్ నుంచి ఇక్కడికి వచ్చావా?” అంది ఆశ్చర్యంగా తన బొచ్చు కుక్క తల దువ్వుతూ “అంటే అంకుల్ గారు నాకు వాకింగ్ లో బాగా పరిచయం” అంటూ జనం వైపు చూసింది.ఇంకా అక్కడ నుంచి ఎవరూ కదల్లేదు. అందరూ చుట్టూరా చేరి ఏవో ప్రశ్నలు వేస్తున్నారు.
రాజేశ్వరి “డు యు నో వాట్ హప్పెన్డ్?” అని అడిగింది మిస్సెస్ వర్మను.
“ సో పిటీ! ఎవరో అంకుల్ గారిని డిజిటల్ అరెస్ట్ చేసి, ఫోన్ ని హ్యాక్ చేసి బ్యాంక్ లోని అమౌంట్ మొత్తం ఐదు లక్షలు దోచేశారు. అది ఈరోజు పొద్దున్న పక్క ఫ్లాట్ లోని అబ్బాయి జోసెఫ్ చెప్తే కానీ తెలియదు” అంది విచార వదనంతో మిసెస్ వర్మ. “ ఓ మై గాడ్!! 5 లక్షలా?” అంది రాజేశ్వరి “అవును, అంత కాష్ ఇంట్లో పెట్టుకోవడం సేఫ్ కాదు కాబట్టి అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు, పెద్దవారు కాబట్టి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుందని అమౌంట్ ఉంచుతున్నాడు వాళ్ళ అబ్బాయి, పక్కింటి జోసెఫ్ అన్ని ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ ఉంటాడు" అంది మిస్సెస్ వర్మ.
చాలా బాధేసింది రాజేశ్వరికి. పాపం పెద్దాయన!! తను ఈ అపార్ట్మెంట్ కి వచ్చి కొన్నాళ్ళే అయినా, అంకుల్ ముందు నుంచి ఉంటున్నారు. వాకింగ్లో పరిచయం! వాళ్ళవిడ కొన్నేళ్ళ కిందట చనిపోయిందంట! ఒకగానొక్క కొడుకు!! అప్పటినుంచి ఒంటరితనాన్ని భరిస్తూ, తన కొడుకు పిలిచినా వెళ్ళకుండా, ఆమెతో ఆ ఇంట్లో ఉండే జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, కాలం గడుపుతున్నాడు.
అప్పుడే అందరూ అన్ని ప్రశ్నలు వేసేసి ఏమి చేయలేక ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరసాగారు. అంకుల్ గారి మొహం కొంచెం కొంచెం కనబడసాగింది.
ఆ రోజు అంకుల్ చెప్పిన మాటలు చెవిలో రింగుమనగా రాజేశ్వరి ఒక్కసారిగా ఆ రోజుకి ప్రయాణం చేసింది. ఎప్పటిలాగే ఆరోజు కూడా మార్నింగ్ వాకింగ్లో ఉంది రాజేశ్వరి. అలా వాక్ చేస్తుండగా, అప్పటికే రొప్పుతూ బెంచ్ మీద కూర్చున్న ఒక సీనియర్ సిటిజన్ కనపడ్డాడు. రాజేశ్వరి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి, “ కొంచెం వాటర్ తాగుతారా అంకుల్?” అని అడిగింది.
అతడు ఆ ఆప్యాయతకు చిరునవ్వు నవ్వి “థాంక్యూ బేటా” అంటూ మంచినీళ్ళు తాగి ఆ బెంచిపైన కూర్చుని స్థిమితపడ్డాడు. రాజేశ్వరి “ఏ ఫ్లోర్ అంకుల్ మీది?” అంది. “సెకండ్ ఫ్లోర్ బేటా! నువ్వు కొత్తగా వచ్చావా అపార్ట్మెంట్ కి?” అన్నారు
“ఔను అంకుల్, బి బ్లాక్ లోనే ఉంటాము”అంది
“అవునా!!మీ ఆయన..” అంటూ ఆగాడు.
“డిక్సర్ కంపెనీలో అసిస్టెంట్ సీఈఓ గా ఉన్నారు. త్వరలో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి” రాజేశ్వరి ధీమాగా
“నాకు ఒక కొడుకు యూఎస్ లో స్థిరపడ్డారు.మా కోడలు కూడా అక్కడే జాబ్ చేస్తుంది. మనవడు మనవరాలు చదువులు అక్కడే!! రోజూ గంట వీడియో కాల్!” అన్నాడు శూన్యంలోకి చూస్తూ.
అది చూసి రాజేశ్వరి “మరి ఆంటీ?” అంది
దానికి అతను వెంటనే తేరుకొని “ఆంటీ కాలం చేసి మూడేళ్ళవుతోంది బేటా!! ఇంట్లో తన జ్ఞాపకాలు ఉన్నాయి, అందుకే ఇక్కడే ఉన్నాను!!” అని “ మీకు ఎంతమంది పిల్లలు?” అన్నారు.
వెంటనే రాజేశ్వరి మొహం వాడిపోయింది. వెంటనే తన తప్పు తెలుసుకుని “నా పేరు అశోక్ చంద్ర! రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. తప్పుగా అనుకోవద్దు బేటా, ఏదో నా కూతురు లాంటిదానివనుకుని అలా అడిగాను” అన్నాడు.
“అంకుల్ నా పేరు రాజేశ్వరి. నాకు పెళ్ళయి పదేళ్లు అవుతోంది. తిరగని గుడి లేదు, తీసుకోని ట్రీట్మెంట్ లేదు. కానీ ఫలితం శూన్యం!! మేమిద్దరం ఇంక ఆశలు వదిలేసుకున్నాము. ఆయనింట్లో, మా ఇంట్లో చాలా ఒత్తిడి చేస్తున్నారని, కొంతకాలం హైదరాబాద్ నుండి ఇలా ఇక్కడికి వచ్చేశాము. మిమ్మల్ని చూస్తే మా డాడీ ని చూసినట్లు అనిపిస్తోంది!! ఏదో మాటపట్టింపులు, మా డాడీ తో మాట్లాడి చాలా రోజులైంది” అని కళ్ళు తుడుచుకుంది రాజేశ్వరి.
అశోక్ చంద్ర ఏదో మాట్లాడేలోపు “వాట్ అశోక్, వాకింగ్ అయిందా?” అని ఇంకో సీనియర్ సిటిజన్ అడిగాడు. హా, ఈవిడ రాజేశ్వరి, మన అపార్ట్మెంట్లో బీ బ్లాక్లో 8 th ఫ్లోర్ లో ఉంటారు” అంటూ రాజేశ్వరిని ప్రశాంత్ కి పరిచయం చేశాడు.
“హాయ్ అమ్మా, ఏం చదువుకున్నారు?” అని అడిగాడు ప్రశాంత్.
“ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి, ఎం బి. ఏ చేశాను అంకుల్” అంది రాజేశ్వరి.
“ వెరీ నైస్!!జాబ్ చేయడం లేదా?” అడిగాడు ప్రశాంత్ వెంటనే అశోక్ చంద్ర కల్పించుకొని”లేదు” అన్నాడు.
“ఓ!నా పేరు ప్రశాంత్!! సిక్స్త్ ఫ్లోర్ లో ఉంటాం నేనూ ఆంటీ. చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఇన్ జర్మన్ మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వీడియో కాల్ లో టాకింగ్ !!”అంటూ పెద్దగా నవ్వాడు ప్రశాంత్. చంద్రా, రాజేశ్వరి కూడా నవ్వేశారు.
ప్రశాంత్ సెల్ కు నోటిఫికేషన్ రావడంతో ఫోన్ తీసి చూసాడు. “ఏదో మెసేజెస్ వస్తాయి, నాకు ఏమీ అర్థం కాదు, పక్కింటి చారుశీల బీటెక్ చదువుతోంది!! ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే ఆన్లైన్ పేమెంట్స్ చేస్తుంది” అన్నాడు.
దానికి రాజేశ్వరి ఆశ్చర్యంగా చూస్తూ “ దీనికి ఎందుకు వాళ్ళని అడగడం” అని ఏదో అడగబోయింది.
“నాకు రాదమ్మా, ఆంటీకసలు రాదు. మేము క్యాష్ యూస్ చేసిన వాళ్ళము. కరెంటు, మెయిన్టెనెన్స్, రెంటు, గ్రోసరీస్ వగైరా వగైరా. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మారాలంటే కష్టంగా ఉంది” అని “సరే మా!! నైస్ మీటింగ్ యు వస్తా! బాయ్ అశోక్” అనేసి బయలుదేరాడు ప్రశాంత్.
రాజేశ్వరి ఏదో ఆలోచిస్తుండగా “ఇది బేటా మా సీనియర్ సిటిజన్స్ పరిస్థితి!! మాకు టెక్నాలజీ వాడకం రాదు!! అలా అని మాకు ఓపిగ్గా నేర్పించేవారు లేరు! మా పిల్లలు మాతో లేరు! ఒకవేళ పక్కింటి పిల్లలు అడిగినా, వాళ్ళు చదువులు, జాబులు, ఫ్రెండ్షిప్లు వగైరాలతో బిజీ కాబట్టి, వాళ్ళకున్న టైం లో మా పని అయితే చేస్తారు గానీ, మాకు నేర్పించే ఓపికా, తీరికా వాళ్లకు ఉండదు” అన్నాడు అశోక్ చంద్ర.
తన తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు, కానీ పిల్లలైన తాము దగ్గర ఉండడం వలన కొంత డిజిటల్ టెక్నాలజీ నేర్పించారు. ఇప్పుడు ఏదో అడపా దడపా చిన్నపాటి విషయాలు అడిగి తెలుసుకుంటారు.
“ మన ప్లాట్స్ లో దాదాపు 30 నుంచి 50 మంది వరకు సీనియర్ సిటిజన్స్ ఉన్నారమ్మా, వారిలో ఎంత లేదన్నా 50% మందికి ఈ టెక్నాలజీ వాడకాలు తెలియవు! వివరణ చెప్తే నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు” అన్నాడు సాలోచనగా.
ఇంతలో రాజేశ్వరి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో “ఓకే అంకుల్, టేక్ కేర్, మళ్లీ వాకింగ్లో కలుద్దాం” అని వెళ్ళబోతూ, అశోక్ చంద్ర ముఖం చూసింది. ‘ఏదో నేర్చుకోవాలి తనకు ఎవరూ నేర్పించేవాళ్ళు లేరన్న’ బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.
రాజేశ్వరి వర్తమానంలోకి వచ్చింది. అంకుల్ని జోసఫ్ లోపలికి తీసుకెళ్లాడు. పోలీసులు స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు. మిసెస్ వర్మ “బాయ్ రాజీ” అంటూ వెళ్ళిపోయింది. ఒంటరిగా ఆ ఫ్లోర్ లో రాజేశ్వరి మిగిలింది. టైం చూస్తే మధ్యాహ్నం రెండు గంటలు అవుతోంది తన ఒంటరి గంటలు ప్రారంభమయ్యాయి. నిదానంగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. లిఫ్ట్ ఎక్కి తన ఇంటి డోర్ ఓపెన్ చేసి సోఫాలో పడిపోయింది. భర్త నుంచి మెసేజ్ “లంచ్ చేశావా?” అని. చాలామంది ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు ఏదీ చూడాలనిపించలేదు. భర్తకు మాత్రం ‘నేను ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను! నాకు మీ సహాయం కావాలి’ అని మెసేజ్ చేసింది.
“ఆల్వేస్ ఫర్ యు” అని రిప్లై ఇచ్చాడు భర్త.
చాలా సంతోషం వేసింది రాజేశ్వరికి, తన భర్తకు తన పైన ఉన్న నమ్మకానికి. ఫ్రెష్ అయ్యి, తృప్తిగా భోంచేసి కింద వాచ్ మాన్ దగ్గరికి వెళ్లి తన కావాల్సిన డీటెయిల్స్ అడిగింది. అతను రాజేశ్వరిని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. రాజేశ్వరి తనను పరిచయం చేసుకొని “సార్, ఈరోజు అశోక్ చంద్ర అంకుల్ కి జరిగిన సైబర్ మోసం గురించి మీకు తెలిసి ఉంటుంది!!ఇలా ఎంతమంది జరుగుతుందో మనకు తెలియదు! మన అపార్ట్మెంట్స్ లో ఉన్న సీనియర్ సిటిజన్ కు ఎవరికైతే టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందో వారికి నా వంతు బాధ్యతగా ఒక నెల రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించి, వారి వద్ద ప్రాక్టీస్ చేయించాలనేది నా సంకల్పం, ఇది పూర్తిగా నా ఇంట్రెస్ట్ తో చేస్తున్నాను కాబట్టి దీనికి ఎటువంటి ఫీజూ ఉండదు! పైగా ఇది నా పనులు చేసే సమయంలో కాకుండా నాకంటూ ఉండే ఒంటరిగంటల్లో మాత్రమే చేస్తున్నాను. కానీ రోజుకు ఒక గంట మన సెమినార్ హాల్ కావాలి! అక్కడ నేను లాప్టాప్ ద్వారా ప్రొజెక్టర్ కనెక్ట్ చేసుకుని, రకరకాల వీడియోలు, ఆడియోలు, పిపిటి ద్వారా వాళ్లకి అర్థమయ్యే రీతిలో, డిజిటల్ టెక్నాలజీ సైబర్ క్రైమ్ గురించి వివరించుదామని అనుకుంటున్నాను. ఎక్కడో ఫారెన్ లో స్థిరపడ్డ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇది చేయలేకపోవచ్చు!! కానీ మన చుట్టూ ఉండే మనుషులకు ఇలా సహాయం చేయడం మన కర్తవ్యం!! అది నా కర్తవ్యం గా భావిస్తున్నాను! దయచేసి మీ అభిప్రాయం తెలియజేసి, సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను” అని గుక్క తిప్పకుండా మాట్లాడుతున్న రాజేశ్వరి వంక ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో చూస్తున్న ప్రెసిడెంట్ “తప్పకుండా తల్లి!! నీ సంకల్పం ముందు,నేను చేసే సహాయము ఎంత? కానీ నాదొక మనవి! నేను కూడా నీ శిక్షణ తరగతులకు తరగతులకు వస్తాను, నాకు కూడా నేర్పించమ్మా!!” అన్నాడు ప్రెసిడెంట్.
“ష్యూర్ అంకుల్ రండి, డీటెయిల్స్ వాచ్మెన్ దగ్గర ఇప్పించండి” అని ఇంటికి వెళ్ళింది రాజేశ్వరి.
సమయం మూడు గంటలు కావస్తోంది.
‘ఇప్పుడు తను ఒంటరిగా లేదు!! తన మనసూ, మెదడూ ఖాళీగా లేవు! ఎప్పటినుంచి, ఎక్కడి నుంచి, ఎలా మొదలు పెట్టాలని ఒక ప్రణాళిక వేస్తోంది. కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంది.
కొంత విరామం ఇవ్వాలని బెడ్ పైన పడుకుంది. ఈసారి ఆ ఒంటరిగంటలు రాజేశ్వరిని ఏమీ చేయలేక నిద్ర దేవికి దారి ఇచ్చింది.
ప్రశాంతంగా నిద్రపోయింది రాజేశ్వరి ఎంతో మందిని మేలుకొల్పడానికి!!!