జాలి గుండె

తపస్వి మనోహరం • 12 Jul 2023 • 👁 4 views
జాలి గుండె
*****

(నేను రాసిన ఈ మినీ కథ తపస్వి మనోహరం అనే పత్రికలో ది 12.07.2023 న ప్రచురితమైనది )

*జాలి గుండె*
=========
(మినీ కథ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"ఏంటే సుజీ! ఇంతసేపు ఆటలా? హోమ్ వర్క్ ఎప్పుడు చేసుకుంటావ్?" ఇంట్లోకి వస్తున్న కూతురిని అడిగింది తల్లి, ఇందిర.

"అలా తిట్టకమ్మా. నా మనసు ఏమీ బాగాలేదు!" విచారంగా చెప్పింది సుజి.

"ఏం జరిగిందే? ఎందుకు అదోలా ఉన్నావు?"
ఆందోళనగా అడిగింది ఇందిర.

"ఇందాకా ఆటల్లో ఓ చిన్న పొరపాటు జరిగిందమ్మా!" విచారంగా చెప్పింది సుజి.

"ఏం జరిగిందే. తొందరగా చెప్పు. టెన్షన్ తో చస్తున్నా!" కుతూహలంగా అడిగింది తల్లి.

"ఇందాకా పరుగు పందెం ఆట ఆడుతోంటే తొందరలో చూసుకోకుండా, సుజీ కాలు తొక్కేసానమ్మా!" అసలు విషయం చెప్పింది సుజి.

"సుజీ అంటే... మన ఎదుట అపార్ట్మెంట్లో ఉన్న...." అనుమానంగా అడిగింది ఇందిర.

"ఔనమ్మా, అదే!" చెప్పింది సుజి.

"అలాంటప్పుడు వాళ్లకో లేదా నాకో వచ్చి చెప్పలేకపోయావా?" కొంచెం కోపంగా అడిగింది ఇందిర.

"అంత టైం లేదమ్మా! అప్పటికే బాధతో అది గిలగిలా కొట్టుకుంటుంటే, వెంటనే మన సందు చివర్లో ఉన్న హాస్పటల్ కి తీసుకెళ్లా"
జరిగిన విషయం చెప్పింది సుజి.

"మంచి పని చేసావు. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు?" ఆదుర్దాగా అడిగింది ఇందిర, కూతురికి పాల గ్లాసు అందిస్తూ.

"కాలు విరిగిందని కట్టు వేసారు. మందులు రాసిచ్చారు. దానిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి, ఆ తరువాత కాసేపు మా ఫ్రెండ్ రమ్య వాళ్లింట్లో కూర్చుని రావడం వలన లేటు అయ్యిందంతే" పాలు తాగుతూ చెప్పింది సుజి.

"అయితే ఓ సారి ఆంటీకి ఫోన్ చేసి ఇప్పుడు సుజీ ఎలా ఉందో అడగలేకపోయావా?"

"ఇందాకానే అడిగానమ్మా! అది కూడా పాలు తాగిందిట. బాధ తగ్గింది కాబోలు, తోక ఊపుతూ 'కుయ్ కుయ్' అని కూడా అరుస్తోందిట" సంతోషంగా చెప్పింది సుజి.

"పోనీలే మంచి పని చేసావు. మానవత్వం చూపించావు. నీది ఎలాగైనా జాలి గుండే! "
కూతురి తల నిమురుతూ చెప్పింది ఇందిర.

"ఔనమ్మా! మరి, నాది అంతా నీ పోలికేగా" తల్లిని అల్లుకుపోతూ చెప్పింది సుజి.

***** **శుభం** *****