*****
*కూరలబ్బి*
=========
(మినీ కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
రోజూలాగే నాలుగుచక్రాల బండి మీద కూరగాయలు అమ్మడానికి బయలుదేరిన సుబ్బయ్యను ఓ వీధిలోకి రాగానే ఓ నలుగురు అమ్మలక్కలు వచ్చి, రేటు తగ్గించమని బేరాలకు దిగారు. గిట్టుబాటు కాదని అతను చెప్పడంతో, ఈ ముసలాయనతో బేరం తెగదని, ఈ మధ్యనే వెనుక వీధిలో కొత్తగా పెట్టిన సూపర్ బజార్ లో కూరలు బాగున్నాయిటని, ఇంక అక్కడే కొనాలని నిశ్చయించుకున్నారు, తన కడుపు కొట్టవద్దని పాపం సుబ్బయ్య ఎంత వేడుకున్నా వినకుండా!
ఓ పది రోజుల తరువాత మనసు చంపుకుని మళ్లీ ఆ వీధిలోకి వచ్చాడు సుబ్బయ్య. కాసేపటికి ఆ నలుగురూ వచ్చి, కిక్కురుమనకుండా కూరలు తీసుకుని వెళ్లడం చూసిన సుబ్బయ్య ఏమాత్రం ఆశ్చర్య పోలేదు. ఎందుకంటే.. ప్రతీ సాయంత్రం తాను అమ్మగా మిగిలిన కూరలు, అతను సప్లయ్ చేసేది ఆ సూపర్ బజారుకే, ఆ షాపు సుబ్బయ్య అల్లుడిదే!
***** **శుభం** *****
(తపస్వి మనోహరం 26.06.2023 ప్రచురణ)