పాపం పసివాడు

తపస్వి మనోహరం • 01 May 2023 • 👁 6 views
పాపం పసివాడు
*****
*పాపం పసివాడు*
------------------------
(మినీ కథ)

(నేను రాసిన ఈ కథ, 2023, మే నెల *తపస్వి గోదారి ఊసులు* అనే మాసపత్రికలో ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

తన యజమాని రఘుబాబు కేంపుకు వెళ్లడంతో యజమాని కొడుకు రాజాబాబుని
పెరట్లో ఆడిస్తున్నాడు, ఆ ఇంటి పనిమనిషి గంగులు. ఈలోగా హాల్లో ఫోన్ మోగిన శబ్దం కావడంతో ఫోన్ ఎత్తాడు.

"హలో..హలో...గంగులూ ! ఒరే సన్నాసీ! ఎన్ని సార్లు చేసినా ఫొన్ ఎత్తవేం?" అడిగాడు అవతలి వ్యక్తి.

"ఇంతకీ తమరెవరు బాబూ?" అడిగాడు గంగులు.

"నేనురా రఘుబాబుని. మీ అయ్యగారిని!"

"మీరా బాబయ్యా! రాజాబాబుని ఆడిస్తూ పెరట్లో ఉండిపోయానయ్యా! ఈ ల్యాండు ఫోను శబ్దం అక్కడికి వినబడలేదయ్యా"

"సరేకానీ, రేపు రెండో కంటికి తెలియకుండా వాడిని వేసేయమని చెప్పాను. ఆ పని మీదే ఉన్నావా?'

"ఎవర్ని బాబూ? మీ అబ్బాయి రాజాబాబునేనా?" అనుమానంగా అడిగాడు గంగులు.

"ష్...గట్టిగా అరవకు. ఔను వాడినే!"

"ఆ పని మీదే ఉన్నాను బాబయ్యా ! కానీ, అంత కఠినంగా కాకుండా, వేరే విధంగా ఏదైనా .....?" నసిగాడు గంగులు.

"నెమ్మదిగా మాట్లాడి చావు. వాడికి వినబడుతుంది. కొంపదీసి, రేపు మనం చేయబోయే పని గురించి వాడికి కానీ చెప్పేసావేంటీ?" అసహనంగా అడిగాడు
రఘుబాబు.

"చె...ప్ప....లే...దు...బా..బూ.."

"సరేలే! ఆ ఏడుపు ఆపి తగలడు. అసలు ఆ పని నువ్వు చేయగలవా ? లేదా ? లేక ఎవరికైనా పురమాయించమంటావా? నీకు భయమైతే చెప్పు"

"అమ్మగారు పోయేనాటికి ఈ రాజాబాబు మూడేళ్ల కుర్రాడు. ఈ ఐదేళ్ల నుంచి ఈ చేతులతో పెంచాను బాబయ్యా! ఇప్పుడు ఇవే చేతులతో ఆ పని చేయడానికి మనసొప్పడం లేదయ్యా!"

"నాకూ తెలుసురా! ఆ బాధ ఏమిటో? ఓ విషయం గుర్తుంచుకో నువ్వు వాడిని కేవలం పెంచావ్, అంతే! నేను వాడికి కన్నతండ్రిని. నాకు ఉండదా ఆ బాధ ? కానీ కొన్ని కావాలంటే కొన్ని ఒదులుకోక తప్పదు"

"తెలుసు బాబూ! అందరూ అనుకుంటున్నారు, మీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారని. మీ సరదాల కోసమే కదా? బాబును అడ్డు తొలిగించుకుంటున్నారని?"

"ఎక్కువ మాట్లాడకు. ఆ విషయాలు నీకు అనవసరం. నువ్వయితే, కసాయిని నమ్మిన గొర్రెలా, రాజాబాబు అనుమానించడని నిన్ను అడిగాను కానీ, ఒక్క చిటికేస్తే చాలు వంద మంది వస్తారు"

"కోప్పడకండి బాబయ్యా! మీ ఉప్పు తిని బతుకుతున్నవాడిని. మీరు చెప్పినట్టేచేస్తా"

"గుడ్, రేపు ఉదయం వాడు లేవకుండానే పని అయిపోవాలి. అర్ధమయ్యిందా?"

"అలాగే బా....బ.....య్యా"

"ఇంకో సారి చెబుతున్నా! రాజాబాబుకి అనుమానం రాకుండా చూసుకో. లేకపోతే మన ప్లాన్ అంతా వృధా ఔతుంది. ఔనూ, కావలసిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నావా?

"అన్నీ సిద్ధం చేసుకుంటానయ్యా, అలాగే బాబుకి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకుంటా బాబయ్యా........!"

"సర్లే.. ఆ ఏడుపు ఆపు. ఎందుకైనా మంచిది, రేపు సాయంత్రం నేను కేంపు నుంచి తిరిగి వచ్చేవరకూ నువ్వు కూడా ఇంటికి రాకు. మిగతాది నేను చూసుకుంటా. సరేనా ? ఫోన్ పెట్టేయ్"

"అలాగేనయ్యా......." అంటూ ఫోన్ పెట్టేసాడు గంగులు.

***** ***** ***** *****

ఫోన్ మాట్లాడి బయటకు వచ్చిన గంగులుని

"గంగులు తాతా! నా గదిలో ఉన్న ఎక్స్ టెన్షన్ లైన్లో అంతా విన్నాను. నాకు అంతా తెలుసు తాతా! తన సంతోషాలకు అడ్డం వస్తున్నానని నాన్న నన్ను చంపేయమని నీకు చెప్పాడు కదూ?" భయంతో అడిగాడు రాజాబాబు.

"రా....జా......బా....బూ... అంతా వినేసావా బాబూ! నన్ను క్షమించు బాబూ! ఇది ఎవరికీ చెప్పకు బాబూ! నీకు ముందుగా ఏమీ చెప్పలేని అశక్తుడిని. నాన్న గారి మాట కాదనలేక ఈ పాపానికి........."

"పరవాలేదు తాతా! నువ్వు మాత్రం ఏం చేయగలవు? నాన్నకే నా మీద ఇష్టం లేనప్పుడు! అయినా నేను కూడా మా అమ్మ దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నాన్లే"

"బా....బూ....పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టం....." రాజాబాబు చూసే బేల చూపులు చూడలేక కళ్లనీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చాడు గంగులు.

***** ***** ***** *****

మర్నాడు సాయంత్రం,

"అయ్యగారూ! మీరొచ్చి ఎంతసేపు అయ్యింది బాబూ? ఉదయం ఇంట్లో మేమిద్దరం లేకపోవడంతో ఎవరికైనా అనుమానం వచ్చిందాయ్యా ?" రఘుబాబుని అడిగాడు గంగులు.

"నేను మధ్యాహ్నం వచ్చాను. రాగానే వంటావిడ, డ్రైవరూ అడిగారు ఎదో సర్ది చెప్పానులే. సరే! ఏం జరిగిందో నువ్వు చెప్పి తగలడు. టెన్షన్ తో చస్తున్నా! చెప్పిన పని అయ్యిందా? వాడేమైనా ఎదురు తిరిగాడా??"

"జరుగుతున్నది చూసి ముందు కొంచెం బిత్తరపోయాడు బాబూ! మీ రెండో పెళ్లి గురించి అడిగాడు. తర్వాత ఎందుకో మరి, మౌనంగా ఉండిపోయాడు బా..బూ...! అంతే...... రాజాబాబు లేని ఈ ఇల్లు శ్మశానాన్ని తలపిస్తోంది బాబూ........"

"సర్లే, ఏడుపు ఆపు. ఏదో జరిగింది అని అందరికీ అనుమానం వస్తుంది. అయినా, రెండో పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఉంటే ఇన్నాళ్లు ఎందుకు ఆగుతాను? అసలు నీ గారంతోనే వాడు చదువు మానేసి, మొండిగా తయారయ్యాడు. అందుకే హాస్టల్లో వేసేయమన్నది. అది వాడి తండ్రిగా నా బాధ్యత. సరేకానీ, ఇప్పుడే ఆ వార్డెన్ తో మాట్లాడాను. వచ్చే వారం నుంచి పది రోజులు దసరా శెలవులుట. అప్పుడు తెచ్చుకుందాం. సరేనా??" గంగులుని సముదాయించాడు రఘుబాబు.

"ఔనా! ఎంత చల్లటి వార్త చెప్పారు బాబూ!" అంటూ మురిసి పోయాడు గంగులు.

***** **శుభం** *****