*****
*వంశాంకురం*
==========
(సామాజిక కథ)
(పూర్తిగా మహిళలచే నిర్వహించబడుతున్న
*విమల సాహితి* అనే సాహిత్య వారపత్రికకి నేను రాసిన ఈ *వంశాంకురం* అనే కథ 21.05.2023 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"ఓయ్, కోడలు పిల్లా! వచ్చే ఏడాదికి ఓ పండంటి అబ్బాయిని కని నా చేతికివ్వాలి. తెలిసిందా?" ఇంట్లోకి వస్తున్న కొత్త కోడలితో నవ్వుతూ చెప్పింది ప్రసూన.
"ఔను సుకన్యా! చనిపోయిన మా నాన్న మళ్లీ నీ కడుపున పుట్టాలి" మూడేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మరదలితో చెప్పింది సుజాత.
వీరి మాటలను నవ్వుతూ వింటూ ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది కొత్త పెళ్లి కూతురు సుకన్య తన భర్త సందీప్ తో.
"ఇదిగో అమ్మాయ్, నవ్వులాటకు కాదు. నిజంగానే చెబుతున్నాను. ఎందుకంటే మీ మామగారూ వాళ్లూ ముగ్గురు అన్నదమ్ములు. మిగతా ఇద్దరికీ అబ్బాయిలు పుట్టలేదు. మా అదృష్టం బాగుండి మీ ఆయన పుట్టాడు. ఇప్పుడు మీకు అబ్బాయి పుడితేనే మన కటకం వారి వంశం నిలబడుతుంది. లేకపోతే కటకం వారి వంశం అటక ఎక్కినట్లే" అసలు విషయం బయటపెట్టింది ప్రసూన.
"అలాగే అత్తయ్య గారూ, మాకు అబ్బాయి పుట్టాలని ఆశీర్వదించండి" భర్తతో సహా అత్తగారి కాళ్లమీద పడింది సుకన్య.
"శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. వంశాభివృద్ధిరస్తు" అంటూ మనస్పూర్తిగా ఆశీర్వదించింది ప్రసూన.
***** ***** ***** *****
ప్రసూన ఆశీర్వాద ఫలితమో లేక ఆ వంశీకుల అదృష్టమో తెలియదు కానీ, ఏడాది కల్లా పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చింది సుకన్య.
మూడవ నెలలో జరిగిన బాలసాల రోజున తన భర్త పేరు నవనీతరావు పేరు కలసి వచ్చేలా, తన మనవడికి నవీన్ అని పేరు పెట్టుకుంది ప్రసూన.
ఆ రోజు రాత్రి తమ గదిలో చంటిబిడ్డకు పాలిస్తున్న భార్య వద్దకు వచ్చిన సందీప్,
"సుక్కూ! మన నవీన్ గాడిని చూసిన తరువాత నాకు ఓ ఆలోచన వచ్చింది. వీడికి ఓ చెల్లెల్ని తోడుగా ఇస్తే ఎలా ఉంటుందంటావ్?" సుకన్య ముంగురులు సవరిస్తూ గోముగా అడిగాడు సందీప్.
"ఏమిటండీ ఇలాంటి ఆలోచనలు?" చిలిపిగా కసురుకుంది సుకన్య.
"అలా కాదోయ్, మరి ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్లే అంటారు కదా? అందుకే అడిగాను" పిల్లడిని లాలిస్తూ చెప్పాడు సందీప్.
"ఏమండీ, మీ నాన్నగారు చనిపోయారు కాబట్టి అబ్బాయి పుడితే మీ నాన్న పుట్టినట్టే అన్నారు. అలాగే మన అదృష్టం బాగుండి వీడు పుట్టాడు. మీ వంశవృక్షం కూడా నిలబడింది. ఇప్పుడు మీ అమ్మగారు బాగానే ఉన్నారు కదా? మరి అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్లే అంటారేమిటి?" అమాయకంగా అడిగింది సుకన్య.
"అయ్యో పిచ్చి సుక్కూ. దాని అర్థం అది కాదు. ఉదాహరణకు మా అమ్మ ఉండడం వలన నేను, నీ ద్వారా ఈ నవీన్ భూమి మీద పడ్డాము. ఆ విధంగా మీరు అమ్మలు అయ్యారు. మీరే లేకపోతే మేము లేము. అందుకే ఒకింట్లో పుట్టిన అమ్మాయి, వేరే ఇంట్లో అమ్మ అయ్యి, వారి వంశాన్ని వృద్ధి చేస్తుంది. నేను స్వార్థపరుడిని కాదు. అందుకే నా వంశమే కాదు, ఇతరుల వంశాభివృద్ధి కోరుకునేవాడిని. అందుకే ఇంకో అమ్మాయిని...." సుకన్య ను దగ్గరకు లాక్కుని అడిగాడు సందీప్.
"అలాగే, మరి దొరగారు కోరుకుంటే నేనెందుకు కాదంటాను" భర్త కౌగిలిలో చేరుతూ చెప్పింది సుకన్య.
***** ***** ***** *****
ఓ సంవత్సర కాలం గిర్రున తిరిగింది. మళ్లీ సుకన్య గర్భం దాల్చింది.
ఆ రోజు సుకన్యకు పురిటి నెప్పులు మొదలు కావడంతో హాస్పిటల్లో జాయిన్ చేసారు.
సాయంత్రం ఆఫీసు నుంచి హడావుడిగా హాస్పిటల్ కు వచ్చిన సుదీప్ తో
"ఏమండీ, మీ కోరిక తీరలేదు. మళ్లీ మీ నాన్నగారే పుట్టారు" కొంచెం బాధగా చెప్పింది సుకన్య.
"అయ్యో, అలాగా ? సరే దాని గురించి ఆలోచించకు. ఇంకో సారి ప్రయత్నిద్దాం. అవసరం అయితే, డాక్టర్ సలహా కూడా తీసుకుందాం" చెబుతున్న భర్త వంక వింతగా చూస్తూ ఉండిపోయింది సుకన్య.
***** ***** ***** *****
ఆ రోజు రెండో కుర్రాడి మూడవ పుట్టినరోజు. ఆ ఉదయాన్నే భార్యని, ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు బయలుదేరిన సందీప్ ఓ విశాలమైన భవనం ముందు కారు ఆపాడు.
"ఏమిటండీ, ఇక్కడికి తీసుకుని వచ్చారు?" భర్త చేస్తున్న పని ఏమిటో అర్థం కాక అయోమయంగా అడిగింది సుకన్య.
"మాట్లాడకుండా నాతో రా!" భార్యను, పిల్లలను తీసుకుని లోపలికి బయలుదేరాడు సందీప్.
***** ***** ***** *****
ఓ రెండు గంటల తరువాత, అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత..
తనను పెంచబోయే తల్లిదండ్రులు సుకన్య, సందీప్ లు, అలాగే ఇద్దరు అన్నలూ వెంటరాగా ఆ అనాథ ఆశ్రమం నుంచి తన ఇంటికి బయలుదేరింది ఓ ఆరు నెలల పాపాయి, భవిష్యత్తులో వేరే వంశాంకురానికి కాబోయే అమ్మ.
తన భర్త కోరిక ఈ విధంగా తీరినందుకు, ఓ అనాథ బిడ్డకు కుటుంబం ఏర్పరచినందుకు మనసులో సందీప్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆనందంగా ఆ చంటి పిల్లను గుండెలకు హత్తుకుంది సుకన్య, పిల్లలిద్దరూ కేరింతలు కొడుతున్న ఆ చంటి దానిని ముద్దు చేస్తుండగా.
***** **శుభం** *****