అత్యాశకు పోతే

మనస్వి • 04 Mar 2023 • 👁 6 views
అత్యాశకు పోతే
*****

*అత్యాశకు పోతే*
===========
. (హాస్య కథ)

(నేను రాసిన ఈ మినీ హాస్యకథ కొత్తగా ప్రారంభించిన మనస్వి అనే అంతర్జాల పత్రిక వారి కోరిక మేరకు పంపడం జరిగింది. ఇది మార్చి 4, 2023 న ఆ పత్రికలో ప్రచురితమైనది)


రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"నాన్నా! జానెడంత ఉన్న ఆ విమానంలో అంత మంది ఎలా కూర్చుంటారు?" ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని చూపిస్తూ తండ్రిని అడిగాడు ఆరేళ్ళ ఆశారావు.

కొడుక్కి అర్థమయ్యేలా వివరించాడు ఆ తండ్రి. ఎలాగైనా జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని ఆ రోజే నిశ్చయించుకున్నాడు ఆశారావు.

***** ***** ***** *****

ఇది జరిగిన పదిహేనేళ్ల తర్వాత అతని కోరిక తీరే అవకాశం వచ్చింది. నగరంలో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్ లో ఓ సంస్థ వారు వంద రూపాయలకే హెలికాప్టర్ లో సిటీ టూర్ అని ప్రకటించారు. వెంటనే ఆ అవకాశం వదలుకోలేక టికెట్ కొనుక్కుని వేచి చూడసాగాడు ఆశారావు.

కాసేపటికి సాంకేతిక లోపం వలన ఆ రైడ్ కేన్సిల్ చేసినట్టు నిర్వాహకులు ప్రకటించడంతో నీరుగారిపోయాడు ఆశారావు.

***** ***** ***** *****

మళ్లీ ఇంకో పది సంవత్సరాలు తరువాత అతను పనిచేస్తున్న ఆఫీసు మేనేజ్మెంట్ తన సిబ్బందిని ఉచితంగా విమానంలో డిల్లీకి తీసుకుని వెళ్లే ప్లాన్ చేసారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ ట్రిప్ కేన్సిల్ అవడంతో ఆశారావుకు నిరాశ తప్పలేదు.

***** ***** ***** *****

ఓ ఐదు సంవత్సరాలు తర్వాత తన స్నేహితుడు కంగార్రాజుతో కలిసి ఓ క్రికెట్ మేచ్ చూడడానికి వెళ్లాడు ఆశారావు. ఆట మధ్యలో బేట్మెన్ కొట్టిన బంతి ఉత్సాహంగా ఆట చూస్తున్న ఆశారావు డిప్ప మీద పడింది.

ఆ దెబ్బకి ఓ రెండు క్షణాలు మైకంలోకి వెళ్ళిపోయాడు ఆశారావు. మెలకువ వచ్చిన అతనికి

"కమాన్.. అర్జంట్..ఆ ఎయిర్ అంబులెన్స్ పిలవండి" అని కంగారుగా అనడం వినిపించి,

"భగవంతుడా! విమానం ఎక్కాలనే నా కోరికను ఈ విధంగా తీర్చావా తండ్రీ!" అని మనసులో అనుకుంటూ, విమానం కోసం ఆశగా చూస్తూ కాసేపు శవంలా నటిస్తూ ఉండిపోయాడు ఆశారావు.

ఈలోగా కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్ రావడం, ఇతడిని అందులోకి ఎక్కించడమూ క్షణాల్లో జరిగిపోయాయి.
బహుశా ఎయిర్ పోర్టు వరకూ ఈ అంబులెన్స్ లో తీసుకుని వెళ్తున్నారేమోనని సమాధాన పడ్డాడు శవంలా నటిస్తున్న ఆశారావు.

కాసేపటి తరువాత

"సిస్టర్! ఎయిర్ అంబులెన్స్ అంటే ఏమిటి?" నర్సుని అడిగాడు, ఆశారావుకి సహాయంగా వచ్చిన కంగార్రాజు.

"AIR అంబులెన్స్ అంటే All India Radio వాళ్ల అంబులెన్స్. ఈ స్టేడియం పక్కనే రేడియో స్టేషన్ ఉంది...." చెప్పుకుపోతున్న నర్స్ మాటలు విని ఈసారి నిజంగానే స్పృహ కోల్పోయాడు ఆశారావు.

ఈలోగా

"ఒరేయ్ ఆశారావు.. నీకో మెసేజ్" అంటూ మెసేజ్ అలర్ట్ రావడంతో

"సార్, పేషెంట్ డిస్టర్బ్ అవుతాడు. ముందు ఆ ఫోన్ స్విచ్చాఫ్ చేయండి" అని సిస్టర్ చెప్పడంతో ఆశారావు ఫోన్ స్విచ్చాఫ్ చేసిన కంగార్రాజు

"సిస్టర్! వీడు స్పృహలోకి ఎప్పుడు వస్తాడు?" అడిగాడు.

"బహుశా ఓ గంట పైగా పట్టవచ్చు" నాడి చూసి చెప్పింది సిస్టర్.

పాపం, అత్యాశకు పోయిన ఆశారావుకి ఓ విషయం తెలియదు. అదేంటంటే
తన చేజేతులా ఓ అవకాశం వదలుకున్నాడని.

ఆ వచ్చిన మెసేజ్ లో ఇలా ఉందని!

"డియర్ ఆశారావు,
నైస్ జెట్ అనే మా విమానయాన సంస్థ నిర్వహించిన క్విజ్ పోటీలో విజేతగా నిలిచిన మీకు వైజాగ్ టు బెంగుళూరు రానూ పోనూ టిక్కెట్లు కేవలం 800 రూపాయలకే అందిస్తున్నాము. మీ అంగీకారాన్ని ఓ అరగంటలో తెలియచేయండి. ఆ తర్వాత ఈ ఆఫర్ వర్తించదు. గమనించగలరు"

***** **సమాప్తము** *****