పీనాసి పాణి

మనస్వి • 09 Feb 2023 • 👁 7 views
పీనాసి పాణి
*****

*పీనాసి పాణి*
==========
(హాస్యకథ)

(నేను రాసిన ఈ హాస్య కథ మనస్వి అనే అంతర్జాల పత్రికలో 2023 ఫిబ్రవరి 9, న ప్రచురితమైనది)


రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్


పినికే సారంగపాణి, ఉరఫ్ పీనాసిపాణి. అతనికి ఆ పేరు వెనుక ఓ పెద్ద కథే ఉంది.
మరింకెందుకు ఆలస్యం. కథలోకి నడవండి.

***** ***** ***** *****

పినికే విశ్వనాధం, పార్వతీ దంపతులకు చాలా కాలానికి ఓ మగబిడ్డ పుట్టేడు. ఆ కుర్రాడికి సారంగపాణి అని నామకరణం చేసారు.

ఆ రోజు, ఆరో నెల వచ్చిన ఆ కుర్రాడికి అన్నప్రాశన వేడుక జరుగుతోంది.

"విశ్వనాధం గారూ, అబ్బాయిని తీసుకు రండి. అన్నీ వస్తువులు సిద్ధం చేస్తున్నా ! చూద్దాం, ఏ వస్తువు ముట్టుకుంటాడో ?" అంటూ పంతులు గారు, భగవద్గీత పుస్తకం, పెన్ను, అరటి పండు, డబ్బులు అన్నీ నేల మీద నీటుగా సర్దారు, వేడుకలో భాగంగా !

తల్లి ఒడిలోంచి నెమ్మదిగా ఆ వస్తువులు వైపు పాక్కుంటూ వచ్చిన మన హీరో, షడన్ గా రూటు మార్చి, లెఫ్ట్ టర్న్ తీసుకుని, కొంచెం దూరంగా దేవుని వద్ద వెలుగుతున్న దీపంకుంది దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న మామిడాకుతో వెలుగుతున్న ఆ దీపాన్ని ఆర్పేసాడు.

"అయ్యయ్యో అపచారం" అని ఒకరు,
"అపశకునం" అని మరొకరు, ఇలా ఎవరికి తోచినట్టుగా వారు గుసగుసలాడు కుంటున్నారు.

ఇంతలో పంతులు గారు కల్పించుకుని,
"చూడండమ్మా ! పిల్లలు చేసే పనులకు పాపపుణ్యాలు అంటవు. ఏమండోయ్ విశ్వనాధం గారూ ! ఇక నుంచి మీ వాడి పేరు పినికే సారంగపాణి కాదు, పీనాసి పాణి" అన్నారు ఓ తులం ముక్కుపొడిని గుండెల్లోకి పంపిస్తూ.

"అదేవిటీ, పంతులు గారూ ! అలా అనేసారు ?" ఆదుర్దాగా అడిగాడు విశ్వనాధం.

"ఔను నాయనా, వీడు రాబోయే రోజుల్లో చాలా పెద్ద పిసినారి అవుతాడు. ఎందుకంటే, ఇక్కడ ఇంత వెలుతురు ఉండగా, అనవసరంగా ఈ దీపం ఎందుకు? అని దానిని ఆర్పేసాడు. నేనైతే వీడిని పీనాసిపాణి అనే పిలుస్తాను" అంటూ ముద్దుగా, సారంగపాణిని దగ్గరకు తీసుకున్నారు పంతులు గారు, తనకు వచ్చిన దక్షిణ డబ్బులు వాడికి అందకుండా జాగ్రత్తపడుతూ !!

***** ***** ***** *****

ఇతని పిసినారి తనం తెలిసిన వారెవ్వరూ ఇతనికి పిల్లనివ్వడానికి కానీ ఉద్యోగం ఇవ్వడానికి కానీ ముందుకు రాలేదు.

మొత్తం మీద విశ్వనాధం కాళ్ళావేళ్ళా పడి, తనకు తెలిసిన ఒక చిన్ననాటి స్నేహితుని ఒప్పించి, అతని కూతురుతో తన కొడుకు పెళ్లి జరిపించాడు.

అలాగే, తన కొడుకు చేత ఓ చిన్న కిరాణా కొట్టు పెట్టించాడు.

పెళ్లి అయ్యి, కొత్త కాపురం పెట్టిన పీనాసి పాణి, ఓ రోజు భార్య సంపదతో కలిసి గుడికి వెళ్ళాడు. తను తెచ్చిన పూజ సామాను పళ్ళెంలో పెట్టి, సంపద చేత ఓ పది రూపాయల దక్షిణ అందులో వేయించాడు. పూజ ముగించిన పూజారి గారు,

"నాయనా, మీరేం ఇచ్చారు ?" అని అడిగేరు.

"రెండు అరటి పండ్లు, కొబ్బరికాయ, పది రూపాయలు"

"ఇదిగో తీసుకో నాయనా !" అంటూ ఒక అరటిపండు, ఓ కొబ్బరి చెక్క చేతిలో పెట్టారు.

"మరి ఐదు రూపాయలు ?"

"ఏ ఐదు రూపాయలు నాయనా ??" ఆశ్చర్యంగా అడిగారు పంతులు గారు.

"అదేనండీ, మేము రెండు అరటిపండ్లు ఇస్తే ఒకటి వెనక్కి ఇచ్చేసారు. అలాగే కొబ్బరి కూడా ఓ చెక్క ఇచ్చేసారు. మరి పది రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు వెనక్కి ఇవ్వరా ??" అంటూ వితండవాదం లేవదీసాడు.

ఆ దెబ్బకి బిత్తరపోయిన పంతులు గారు, ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు, మిగతా జనాన్ని చెడగొట్టడానికి అనుకొని మారు మాట్లాడకుండా ఐదు రూపాయలు పీనాసి పాణి చేతిలో కుక్కి, సంపదతో రహస్యంగా,

"అమ్మా ! నీకు భక్తి కావాలంటే, నువ్వు ఒక్క దానివే రా ! దయచేసి ఇతనితో మటుకు రాకు !" అని కంట నీళ్ళు పెట్టుకుంటూ వేడుకున్నాడు.

తన భర్త పిసినారి తనం యొక్క విశ్వరూపాన్ని మొదటి సారి చూసింది సంపద.

***** ***** ***** *****

పది రోజుల తరువాత అలాంటి సంఘటనే మరొకటి చూసింది సంపద.

ఓ రోజు ఉదయం,

"సంపదా ! మధ్యాహ్నం భోజనం వండకు. బయట చేద్దాం ! " అని చెప్పి షాపుకు వెళ్ళాడు పీనాసి పాణి.

అతను వచ్చే టైముకి ఫుల్ గా మేకప్పయి కూర్చుంది సంపద.

ఏదో పెద్ద హొటల్ కి తీసుకుని వెళ్తాడని ఊహించుకున్న సంపదకు, తనను పీనాసి పాణి, వాళ్ళ స్నేహితుని ఇంటికి తీసుకుని వెళ్ళడం, అది కూడా ఆ స్నేహితుని అమ్మమ్మ పెద్ద దినం భోజనానికి తీసుకువెళ్ళడంతో కోపం తారాస్థాయికి చేరుకుంది.

ఇలా అతని విపరీత పిసినారి చేష్టలను చూసి, ఏమీ చేయలేక గుండె రాయి చేసుకుంది సంపద.

***** ***** ***** *****

ఓ రోజు సంపద ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంటికి ఆమె పిన్ని కొడుకు సుభాష్ వచ్చేడు. మాటల మధ్యలో,

"బావగారూ, మీ పీనాసితనం గురించి లోకం కోడై కూస్తోంది. ఇంకా, పిల్ల జల్లా లేరు కదా ? హాయిగా ఎంజాయ్ చేయండి కొన్నాళ్ళు" అని సలహా ఇచ్చాడు.

"పుట్టబోయే పిల్లల కోసం ఇప్పటి నుంచి కూడా బెట్టకపోతే ఎలాగయ్యా ? అందుకే ఖర్చులు తగ్గిస్తున్నా ! దీనిని పీనాసితనం అంటే ఎలాగయ్యా ?"

"సరే‌ బావగారూ, మీరు ఖర్చు తగ్గించుకో నక్కరలేకుండా ఆదాయం పెంచుకునే మార్గం ఒకటుంది, చెప్పమంటారా ?"

"చెప్పవయ్యా బాబూ !! అంతకంటే ఏం కావాలి ?"

"ఏం లేదు బావగారూ, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, త్వరలో గవర్న మెంట్ 600 రూపాయల నోటు ప్రింట్ చేస్తోంది. ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియదు. చాలా రహస్యం. అయితే, దానికి సంబంధించిన దొంగనోట్లు కూడా అప్పుడే తయారైపోయాయి, ఏ మాత్రం తేడా కనిపెట్టలేనంతగా !"

"ఏమిటి ? ఇది నిజమే ??" ఆశగా అడిగాడు పీనాసి పాణి.

"కావాలంటే చూడండి, నేను ఓ 15,000 ఖర్చుపెట్టి ఇప్పుడే ఓ 50 నోట్లు తీసు కున్నాను. ఇందులో 15,000 లాభం. అయితే, మనం మటుకు అసలు నోట్లు చలామణిలోకి వచ్చే వరకూ కొంచెం ఆగాలి" అంటూ ఆ కొత్త నోట్లు చూపించాడు సుభాష్.

"ఔనూ, నీకు ఈ నోట్లు ఎవరిద్వారా వచ్చేయి ?"

"బొంబాయిలో తెలిసిన ఓ వ్యక్తి తాలూకు ఏజెంట్ ద్వారా వచ్చేయి. మీకూ కావాలంటే చెప్పండి"

"కావాలయ్యా ! ఇదిగో 15000. మీ అక్కకి తెలియనివ్వకు" అంటూ ఎంతో ఆశతో డబ్బు చేతిలో పెట్టేడు పీనాసి పాణి.

"అలాగే, బావగారూ ! ఓ పని చేద్దాం ! నేను సాయంత్రం తెచ్చుకుంటా !! అందాకా నా నోట్లు మీరు తీసుకోండి. కానీ, అసలు నోట్లు వచ్చేవరకూ వీటిని బయటకు తీయకండి" అని చెప్పి బయటకు నడిచాడు సుభాష్.

***** ***** ***** *****

ఓ వారం తర్వాత

"ఏమయ్యా, సుభాషూ ! వారం అయ్యింది. మరి గవర్నమెంట్ నుంచి 600 నోటు గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఏం చేద్దాం ??" ఆందోళనగా అడిగాడు పీనాసి పాణి.

"ఔను, బావగారూ ! నేనూ అదే అనుకుం టున్నా ! ఆ బొంబాయి వాడు ఫోన్ ఔట్ ఆఫ్ ఆర్డర్ వస్తోంది. ఆ ఏజెంట్ అయితే పత్తా లేడు. ఓ పని చేద్దాం ! సాయంత్రం ఓ సారి మన సెంటర్లో ఉన్న దేవాళా హొటల్లో కలుద్దాం. అక్కడికి రండి" అని ఫోన్ పెట్టేసాడు సుభాష్.

***** ***** ***** *****

సాయంత్రం, ఆ హొటల్లో బావ, బావమరిది ఇద్దరూ టిఫిన్ తిని, బిల్లు చెల్లిచడం కోసం కౌంటర్ దగ్గర నిలబడ్డారు.

"రేయ్, ఈ సార్లు బిల్లు ఎంత ?" అడిగాడు ఓనరుడు.

"మూడు వందలు అన్నా !!" చెప్పాడు సర్వారాయుడు.

వెంటనే, జేబులోంచి ఓ 600 నోటు తీసి ఇచ్చాడు సుభాష్.

ఆ నోటును అటు తిప్పి, ఇటు తిప్పి చూసి, ఓ సారి వీళ్ల వంక అనుమానంగా చూసి, గల్లా పెట్టెలో వేసుకున్నాడు ఓనర్.

పీనాసిపాణి, సుభాష్ మొహాలు మతాబాల్లా వెలిగిపోయాయి.

"ఏవండోయ్, బిల్లు మూడు వందలే. మాకు ఇంకో మూడు వందలు వస్తాయి" అన్నాడు సుభాష్.

"ఓ, సారీ, మరచి పోయా ! ఇదిగో తీసుకోండి" అంటూ పెళపెళలాడుతున్న ఓ 300 నోటు అతని చేతిలో పెట్టాడు.

"ఇదేటి ? ఈ నోటు ఎప్పుడొచ్చిందీ ??" ఆశ్చర్యంగా అడిగాడు పీనాసిపాణి.

"ఈ 600 నోటుతో పాటే ఇదీ వచ్చింది" వెటకారంగా చెప్పాడు ఓనరుడు.

"మీకు ఈ నోటు ఎవరిచ్చారు ??" అడిగాడు సుభాష్

"ఎవడో బొంబాయి వాడు అంటకట్టేడు ఓ పది నోట్లు"

"మాకూ ఇచ్చాడు కొన్ని నోట్లు. ఔనూ ! ఈ నోట్లు మారతాయంటారా ??"

"నోట్లు మారడం కాదు, ముందు మన షేపులు మారిపోతాయి పోలీసులకు తెలిస్తే !" అంటూ ఆ నోట్లు చించేసాడు ఓనరుడు.

బిల్లు చెల్లించి, బయటపడ్డారు ఇద్దరూ !

***** ***** ***** *****

"బావగారూ ! మోసపోయాను. దయచేసి మీరు మా అక్కకి చెప్పకండి. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు" ఘొల్లు మని ఏడ్చాడు సుభాష్.

"నాదీ, అదే పరిస్థితయ్యా మగడా ! నువ్వు ఏడ్చావు. నేను ఏడవలేను. అంతే తేడా!"
మనసులో రోదించేడు పీనాసిపాణి.

***** ***** ***** *****

మూడు రోజుల తర్వాత

"సంపదా ! సాయంత్రం షాప్ కట్టేసి, పెందరాళే వస్తాను. రెడీగా ఉండు. సినిమాకి పోదాం !" హుషారుగా చెప్పాడు పీ.పా.

"నాకు తెలుసు. మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకుని వెళ్లి, వాళ్ళ టీవీలో చూపించేస్తారు సినిమా !అంతేకదా ?"

"ఛ..ఛ...కాదోయ్ ! ఇదిగో చూడు అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు. నా స్వంత డబ్బులతో కొన్నాను."

"ఏమండీ...ఏమైంది మీకు ? ఏమిటీ మార్పు" అంటూ పీనాసిని అంటుకు పోయింది సంపద.

"అప్పుడే ఏం చూసేవ్ ? ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ! " అని మనసులో అనుకున్నాడు పూర్తిగా మారిపోయిన సారంగపాణి.

***** ***** ***** *****

నాలుగు రోజుల తర్వాత

"అక్కా ! ఇదిగోనే బావ వద్ద తీసుకున్న 15000 రూపాయలు" అంటూ ఆమె చేతిలో పెట్టాడు సుభాష్, మొత్తం జరిగింది అంతా ఆమెకు చెప్పి.

"థాంక్స్ రా తమ్ముడూ ! నేను చెప్పగానే బావగారికి బుద్ధి వచ్చి, పిసినారి తనం పోయేలా చేసినందుకు. ఔనూ, ఆ బొంబాయి వాడెవరు, హోటల్ ఓనర్ ఎవరూ ? ఈ నోట్లు ప్రింటింగ్ కి ఎంత ఖర్చయ్యిందీ ?"

"అసలు బొంబాయి వాడెవడూ లేడు. పేరు వాడేనంతే ! హొటల్ ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్. ఆయనకు మొత్తం అంతా చెప్పి, ఓ 300 నోటు కూడా ప్రింట్ తీసి ఇచ్చా. ఇక ఖర్చు అంటావా ? సాఫ్ట్ వేర్ సాయంతో ఆ నోట్లు డిజైన్ చేసి, పేపర్ మీద ప్రింట్ తీసా. ఓ వెయ్యి ఖర్చు అయ్యింది. అంతే !" సింపుల్ గా చెప్పాడు సుభాష్.

"థాంక్స్ రా ! నీ మేలు మర్చిపోను"

"కరెక్టుగా చెప్పాలంటే, థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, బావగారికి, నా మాటలు నమ్మినందుకు" అంటూ నవ్వుతూ శెలవు తీసుకున్నాడు సుభాష్.

***** ***** శుభం ***** *****