అప్పా రావూ..

మనస్వి • 02 Mar 2023 • 👁 7 views
అప్పా రావూ..
*****
"అప్పా!.. రావూ?"
============
(మినీ హాస్యకథ)

(నేను రాసిన ఈ హాస్య కథ 'మనస్వి' అనే అంతర్జాల వార పత్రికలో ది. 02.03.2023 న
ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్


పెళ్లిచూపుల సమయంలో, తనకు కాబోయే భార్య దేవితో మాటల మధ్యలో చెప్పాడు అప్పారావు "తనకు పాటలు అంటే ఇష్టమని". అదే తన కొంప ముంచుతుందని, పాపం ఆ సమయంలో ఊహించలేదు అప్పారావు.

***** ***** ***** *****

పెళ్లి అయిన తరువాత, కాపురానికి వచ్చిన దేవి, ఆ మర్నాడు ఉదయం, నిద్ర పోతున్న అప్పారావుని లేపుతూ...

" *తెల్లవార వచ్చే తెలియక నా సామి* ,
మళ్ళీ పడుకున్నావేటీ, లెగూ!" అంటూ తన బొంగురు గొంతుకతో పాడడం మొదలెట్టింది.

కంకరరాళ్ళ మీద ఎడ్లబండి వెళ్తున్న శబ్దాలు లాంటివి వినబడడంతో ఉలిక్కిపడి లేచిన అప్పారావు,

"ఇప్పుడు మనం రోడ్డు మీద ఎందుకున్నాం? ఆ ఎడ్ల బండి శబ్దాలు ఏమిటి ?" భయంతో వణికిపోతూ అడిగాడు.

"పోదురూ, మీది మరీ ఎటకారం. నాలాగే మీకు కూడా పాటలంటే ఇష్షం అని, మన పెళ్లి చూపులు సమయంలో మీరే చెప్పారు కదా!. అందుకే సరదాగా మేలుకొలుపు పాట పాడేను" సిగ్గుపడుతూ చెప్పింది దేవి.

పెళ్ళి చూపులలో నోరు జారిన ఫలితంగా, అదిగో అలా మొదలైంది.... అప్పారావుకి నర(క)గానయాతన. ఇక అప్పటినుండి మొదలయ్యాయి అతనికి కష్టాలు.

***** ***** ***** *****

ఏదైనా పని మీద బయటికి వెళ్తూంటే..
" *ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట, ఏ ఊరూ వెళ్తారు ఏదీ కానీ వేళా* " అంటూ పాడడం,

దేవీ, ఆకలేస్తోందే, టిఫిన్ పెట్టు అంటే...
" *ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తూంటే* .." అంటూ టిఫిన్ చేయలేదని పరోక్షంగా చెపుతూ...పాడడం

పోనీ పొగిడితే వదిలేస్తుందేమో అనుకొని,
"ఈ రోజు నువ్వు చాలా బావున్నావు దేవీ"" అంటే,

" *ఎంత బాగా అన్నావు, ఎవ్వరు నేర్పిన మాటరా, వేలెడంత లేవు గానీ వేదంలా విలువైన మాట* " అంటూ అతని పొట్టి తనాన్ని దెప్పి పొడుస్తూ...పాడడం

ఈ బాధ పడలేక మంచం మీద ముసుగు తన్ని పడుకుంటే, అతని పక్కన చేరి,...
" *రంగమ్మా, మంగమ్మ ఏం పిల్లడూ
పక్కనే ఉన్న గానీ పట్టించుకోడూ* .." అంటూ తనని కించపరచడం లాంటివి చేస్తూ, తన బొంగురు గొంతుకతో ఖాళీ డబ్బాలో గులకరాళ్లు వేస్తే వచ్చే శబ్దాలు కన్నా దారుణంగా పాడడం లాంటివి ఇక సహించలేక పోయాడు అప్పారావు.

***** ***** ***** *****

ఈ గానహింస భరించలేని అప్పారావు అరడజను సార్లు ఆత్మహత్య వివిధ రూపాల్లో చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, సతీసావిత్రి ముందు ఓడిపోయినట్లే, దేవి ముందు కూడా ఓడిపోయి, పాపం అప్పారావుని ఆరుసార్లూ కూడా ప్రాణాలతో వదిలేసాడు, కనీస కనికరం లేని ఆ యమధర్మరాజు

ఇక ఆఖరి ప్రయత్నంగా, ఓ రోజు తన అక్క దగ్గరకు వెళ్లి, తన కష్టాలు అన్నీ చెప్పుకొన్న అప్పారావు , "అప్పా!... రావూ? ఒకసారి మా ఇంటికి వచ్చి, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించవూ ?" అంటూ వేడుకున్నాడు.

"అయ్యో, భలేటోడివిరా నువ్వు! దీనికి నేను రావడమెందుకు ? ముల్లుని ముల్లుతోనే తీయాలి" అంది పెద్ద అనుభవజ్ఞురాలిలా.

"అర్ధమయ్యిందే అప్పా, అంటే నేను కూడా పాటలు నేర్చుకుని పాడాలంటావ్. అంతేనా? అయినా ఇవన్నీ పల్లవుల కాలం నాటి పాత ఐడియాలే బాబూ !" ఘొళ్లుమన్నాడు అప్పారావు.

"నీకు అంతా కంగారేరా సన్నాసీ, ఏదీ కూడా పూర్తిగా విని చావవు" అని కసురుకుని ఏం చెయ్యాలో వివరంగా చెప్పింది అప్పారావప్ప.

***** ***** ***** *****

ఆ రోజు తెల్లవారుజామున ఓ వంద కీచురాళ్ళు తన చెవిలో ఒకేసారి గానకచేరీ పెట్టిన శబ్దాలకి ఉలిక్కిపడి లేచిన దేవి, తన తల దగ్గర నిలబడి ఉన్న అప్పారావుని చూసి, "ఏమిటండీ, ఎక్కడినుంచి ఈ కీచురాళ్ళ గోల" అని అడిగింది.

"అయ్యో దేవీ! అది , కీచురాళ్ళ గోల కాదు. నేనే
" *దేవీ శ్రీదేవీ, మొరలాలింప పాలింప నన్నేలరావే* " ....అనే పాట వయొలిన్ మీద వాయిస్తున్నా" మెలికలు తిరుగుతూ చెప్పాడు అప్పారావు.

"ఏమిటీ, ఆ వాయింపులో అంత అర్ధముందా ??" మొదటి సారి చావు తప్పిన దానిలా మొహం పెట్టి అడిగింది.

"ఇప్పడేం చూసావ్ ? ఇహ ముందు చూడు. నీ పాటకు నా కీచురాళ్ళతో సారీ, అదే నా వాయులీనం తో సమాధానం చెప్తా" రెచ్చగొడుతూ చెప్పాడు అప్పారావు, బిత్తరపోయి చూస్తున్న దేవితో!

కాసేపటికి,

కంటిలో నలకపడి కన్నీరు కారుస్తున్న అప్పారావు దగ్గరకు వచ్చిన దేవి,

" *ఎందులకీ కన్నీరు ఎందుకలా ఉన్నారు* " అని పాడుతూ అడగగానే వెంటనే గదిలోకి వెళ్లి, వయొలిన్ తెచ్చి, కీచురాళ్ళకి పని చెప్పాడు అప్పారావు.

"ఏమిటండీ ఆ రొదకి అర్థం?" అమాయకంగా అడిగింది దేవి, చెవిలోంచి కారుతున్న రక్తాన్ని, వేలుతో తుడుచుకుంటూ.

"ఓ , అదా, .. అది " *ఎందుకంటే ఏమి చెప్పను, అందుకేనని ఎలా చెప్పను* " అనే పాట వాయిస్తున్నా. అయ్యో అర్ధం కాలేదా ? సరేకానీ, ఇదే ఆఖరి సారి చెబుతున్నా, విను. ఇక ఇప్పటి నుంచి నువ్వు పాటలతో అడిగిన వాటికి నేను నోటితో చెప్పను. ఈ వయొలిన్ తో సమాధానం చెబుతా. అది ఏమిటో నువ్వే కష్టపడి అర్థం చేసుకోవాలి తెలిసిందా ? ఇదిగో ఇప్పుడు విను. సరే, ఇందాకటి నీ ప్రశ్నకి సమాధానంగా, ఇంకో పాట వాయిస్తున్నా" అంటూ వాయింపు మొదలెట్టాడు.

పాట అయిపోయిన తరువాత ఎదురుగా దేవి కనబడకపోవడంతో కంగారు పడ్డ అప్పారావు , ఆమె తన కాళ్ళ వద్ద స్పృహ తప్పిపోవడం గమనించాడు.

కాసేపటికి స్పృహలోకి వచ్చిన దేవి "యాండీ, మీకు కోపం వస్తే కర్రతో నా వీపు మీద నాలుగు వాయించండి, అంతేకానీ ఆ కమాను తో వయొలిన్ మీద వాయించకండి. మీకు పుణ్యం ఉంటుంది మహాప్రభో! పుణ్యం ఉంటుంది" అంది రెండు చెవుల్లోంచి కారుతున్న రక్తాన్ని, చీర కొంగులతో తుడుచుకుంటూ.

"అది కాదు, నువ్వు పాటలుతో మాట్లాడినట్లే , నేను కూడా వయొలిన్ తో మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా. అన్నీ సర్దుకుంటాయి. కొన్నాళ్ళు ఓపిక పట్టు" ధైర్యం చెప్పాడు అప్పారావు.

"మీ ఓపిక దేవుడెట్టుకెల్లా. ఇక మీరు వాయించవద్దు. నేను కూడా పాటలు పాడి మిమ్మల్ని ఇబ్బందీ పెట్టను. ముందు ఆ కమాను పక్కన పెట్టండి, కమాన్!" అంటూ అప్పారావుని ప్రేమగా దగ్గరకు తీసుకుంది దేవి.

తన అక్క ఇచ్చిన సలహా పనిచేసినందుకు, మనసులో ఆమెకు కృతజ్ఞతలు చెపుతూ, చేతిలోని కమాను, వయొలిన్ పక్కన పెట్టాడు అప్పారావు.

అంతవరకూ వయొలిన్ మీద ఉన్న కమాను, అప్పారావు, దేవి జంటను చూసి, సిగ్గుతో పక్కకు జరిగింది.

*****. ***శుభం***. *****