ఎవరి బాధలు వారివి

మనస్వి • 16 Feb 2023 • 👁 6 views
ఎవరి బాధలు వారివి
*****
*ఎవరి బాధలు వారివి*
================
(మినీ కథ)

(నేను రాసిన ఈ హాస్య కథ మనస్వి అనే అంతర్జాల పత్రికలో 2023 ఫిబ్రవరి 16, న ప్రచురితమైనది)


రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

ఒకే కాలనీలో ఉంటున్న ఆ నలుగురూ ఆ సాయంత్రం ఇవినింగ్ వాక్ కోసం బయటకు వచ్చారు.

"అక్కా! మా యజమానితో చచ్చే చావు వచ్చిందే" ముందు నడుస్తున్న సోనీతో చెప్పింది రాణి.

"అంతగా ఏం చేస్తున్నాడే?" అనుమానంగా అడిగింది సోనీ.

"నా వైపు అదోరకంగా చూస్తాడే! ఆ చూపులు భరించలేక పోతున్నా" చెప్పింది రాణి.

"మా ఇంట్లో రివర్స్. మా ఓనర్ మంచివాడే కానీ, వాళ్లావిడకే నేనంటే ఇష్టం ఉండదు. నన్ను ఏదో వంక పెట్టి తిడుతూ ఉంటుంది" చెప్పింది సోనీ.

"మా ఇంట్లో మరీ దారుణం. వాళ్ళు తినగా ఏమైనా మిగిలితేనే‌ నాకు పెడతారు. ఒక్కోసారి ఆకలితో మలమలా మాడిపోతూ ఉంటా" ధీనంగా చెప్పింది విన్నీ.

"మా ఇంట్లో అయితే మా సేటు కొడుకు ఒకడున్నాడు. ఒట్టి ఆకతాయి. ఎవరూ లేని సమయం చూసి గిల్లేసి పోతుంటాడే. వెధవ కోతి చేష్టలు వాడూనూ" సిగ్గుపడుతూ చెప్పింది షర్మీ.

"నన్ను వీధి గదిలో పడుకోమంటారు, ఓ దుప్పటి ఉండదు, పాడూ ఉండదు, నడుం పడిపోతోంది. పైగా దోమల బాధ ఒకటి" చెప్పింది రాణి.

"నాదీ అదే సమస్య చెల్లీ! మొన్న ఇలాగే తెలియక సోఫాలో కూర్చుంటే ఎంత గొడవ పెట్టేసారో?" చెప్పింది సోనీ.

"నాకైతే ఒక్కో సారి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి పారిపోదామా అనిపిస్తుంది" చెప్పింది విన్నీ.

"నాకూ అలాగే అనిపిస్తుంది అక్కా! కానీ, మన యజమానులు బాగా డబ్బులు, పలుకుబడి ఉన్నోళ్లు, మనం ఎక్కడున్నా పోలీసుల సాయంతో ఓ గంటలో మనల్ని వెతికి పట్టుకుని మళ్లీ తెచ్చేస్తారు అని ఆగిపోయా అక్కా!" కంట నీరు పెట్టుకుంటూ చెప్పింది షర్మీ.

***** ***** ***** *****

"ఏమండీ పరిమళ గారూ! చీకటి పడుతోంది, ఇంక ఇళ్లకు వెళ్దామా? ఈరోజు ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి" అడిగింది ప్రమీల.

"వెళ్దామండీ! నేను కూడా ఈపూట పూరీలు చెయ్యాలి" చెప్పింది పరిమళ.

"ఔనౌను, మా అబ్బాయికి రేపు పరీక్ష ఉంది, దగ్గర కూర్చోపెట్టుకుని చదివించాలి. నేనూ బయలుదేరతా" చెప్పింది గౌరి.

"ఔను, నేనూ ఓ కథకు ముగింపు రాసి, రేపు ఉదయం లోగా పోటీకి పంపాలి" చెప్పింది రమాదేవి.

***** ***** ***** *****

"హూ! బయలుదేరండే. ఈ రోజుకు చెప్పుకున్న ఈ కష్టాలు చాలు. మిగతావి రేపు చెప్పుకుందాం" అంటూ కుయ్ కుయ్ మని శబ్దం చేస్తూ తమ యజమానురాళ్ల వెంట తోకలు ఊపుకుంటూ బయలుదేరాయి రాణి, సోనీ, విన్నీ, షర్మిలు.

***** **సమాప్తము** *****