మొహమాటం

విశ్వ భారత్ • 21 Jul 2024 • 👁 6 views
మొహమాటం
*****
*మొహమాటం*
===========
(మినీ కథ)

(నేను రాసిన ఈ కథ విశ్వ భవిష్యత్తు అనే దినపత్రికలో 21.07.2024 న ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"ఏమేవ్! వచ్చే సోమవారం నా ఫ్రెండ్ మల్లికార్జున్ గృహప్రవేశంట. ఫోన్ చేసి చెప్పాడు. కానుకగా ఓ రెండు వేలు చదివిద్దాం అనుకుంటున్నా"

"మీకేమైనా మతిపోయిందా? అంత డబ్బెందుకు? బట్టలు పెడదాం చాలు"

"అవి కొనడానికైనా డబ్బులు కావాలి కదా?"

"కొనడమెందుకండీ? మనింట్లో ఉన్నాయిగా?"

"ఔనేవ్, బాగా జ్ఞాపకం చేసావు. మొన్న మీ చెల్లాయ్ పెట్టిన ఫాంటూ, షర్టు గుడ్డలు ఇచ్చేద్దామా?"

"భలేవారే, అవి ఖరీదైన గుడ్డలు. కావాలంటే మీ తమ్ముడు పెట్టిన ఆ చవక గుడ్డలు ఇచ్చేయండి. అవేమైనా కుట్టించుకునేలా ఉన్నాయా?"

"అలాగే ! మరి ఆవిడకి చీర ఏం చేద్దాం? పోనీ మీ తమ్ముడు పెట్టిన చీర ఇచ్చేద్దామా?"

"అయ్యో పుట్టింటి వారు పెట్టినది అలా ఇంకొకరికి ఇవ్వకూడదండీ!"

"పోనీ మా చెల్లాయ్ పెట్టిన ఆ సాదా చీర?"

"రామరామ, ఆడపడుచు ఆప్యాయంగా ఇచ్చిన చీర. అదెలా ఇస్తా? "

"సర్లే... ఇంకా టైముందిగా! ఏదో ఒకటి చేద్దాంలే....ఔనూ...ఇదేమిటి? మా మల్లికార్జున్ గాడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు.......
హలో... ఆ...చెప్పరా మల్లీ! నీకు వందేళ్లు, నీ గురించే అనుకుంటున్నాం........ ఏమిటి?...ఔనూ!...ఔనా ?...సరే, అలాగే! పెట్టేయ్ ఫోన్"

"ఏమిటిట..ఆ ఔనూ...ఔనా ?...సరే లకి అర్థం?"

"ఏమీలేదే, మనం వాడికి బట్టలు, ఆవిడకి చీర పెడతాము కదా? వాటి కుట్టుకూలి ఫేంటూషర్టులకి 800, జాకెట్టుకి 300, ఇతరత్రా ఓ 400 వెరసి 1500 అవుతాయిట. అందుకే వాటి బదులు ఓ రెండు వేలు కేష్ ఇచ్చేయమంటున్నాడే"

"అంత మొహమాటం లేకుండా అడిగేసాడా? ఔనూ.... కిందటేడాది మన గృహప్రవేశానికి అతను ఏమిచ్చాడు?"

"బట్టలే పెట్టాడే"

"ఎవరైనా అలాగే పెడతారు. అలా అయితే ఓ పని చేద్దాం"

"ఏం చేద్దాం?"

"ఆ డబ్బు మీ మల్లికార్జునకి ఇచ్చే బదులు ఆ సొమ్ముతో శ్రీశైలం వెళ్లి ఆ మల్లికార్జునుడిని దర్శించుకుందాం. పుణ్యం పురుషార్ధం రెండూ కలిసొస్తాయ్"

"ఆ.....???"

***** **శుభం** *****