*****
*వాయిదాల వామనరావు*
============
(సామాజిక కథ)
(నేను రాసిన ఈ కథ విశ్వ భవిష్యత్తు అనే దినపత్రికలో ది. 19.07.2024 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
వేదుల రాజారావు దంపతుల ఏకైక కుమారుడు వామనరావు. ఎప్పటికైనా ఓ సొంతిల్లు ఏర్పరుచుకోవాలనేది అతని చిన్ననాటి కల. అతని యుక్త వయసులోనే తండ్రి మరణించడంతో తల్లి బాధ్యత అతని మీద పడింది. అంతే, సొంతింటి కల కలగానే మిగిలిపోయింది.
చదువు అయిపోగానే ఓ చిన్న ఉద్యోగంలో కుదురుకున్న అతనికి సుశీలతో వివాహం అయ్యింది. ఓ నాలుగు సంవత్సరాలు తరువాత ఓ రోజు
"ఏమండీ, నెలసరి ఖర్చులు ఆదాచేసి కొంత సొమ్ము దాచాను. చూసారుగా? నా మెడలో మంగళసూత్రం తప్ప ఏమీ లేదు. ఈ సొమ్ముతో ఏవైనా బంగారు నగలు చేయించుకుంటానండీ. అవైతే ఎప్పుడైనా అవసరంలో ఆదుకుంటాయి కూడా!" వామనరావుని అడిగింది సుశీల.
"చూడు సుశీ! ఆభరణాలు చేయించుకుంటే బాగానే ఉంటుంది కానీ, అజాగ్రత్తగా ఉంటే అవి దొంగల పాలవుతాయి కదా ? అందుకే ఇంకొన్నాళ్లు ఇలాగే పొదుపు చేసి, ఆ డబ్బుతో ఓ చిన్న స్థలం కొనుక్కుందాము. ఓ స్థిరాస్తి అమరుతుంది, అదైతే ఎవరూ దొంగిలించలేరు కూడా" భార్యకు నచ్చచెబుతూ, సొంతింటి కలకు మళ్లీ పునాది వేసాడు వామనరావు.
ఆ తరువాత కొన్నాళ్ళకు, తను పుట్టి పెరిగిన రాజమండ్రిలోనే చిన్న స్థలం కొని అందులోనే ఓ రెండు గదుల ఇల్లు కట్టుకున్నాడు వామనరావు.
***** ***** ***** *****
ఆ ఇంటిలోనే వామనరావు దంపతులకు ఇద్దరు కొడుకులు జన్మించారు. వారికి కష్టపడి చదువులు చెప్పించాడు వామనరావు. తరువాత వారికి ఉద్యోగాలు రావడమూ, తదుపరి వివాహాల కూడా జరగడంతో పెద్ద కొడుకు రాజేందర్ హైదరాబాద్ లోనూ, రెండో వాడు శివరామ్ పూణేలోనూ స్థిరపడ్డారు.
ఓ ఎనిమిది సంవత్సరాల క్రితం వామనరావు భార్య మరణించింది. పిల్లలు తమతో వచ్చేయమని గోల పెట్టినా వామనరావు మాత్రం దానిని సున్నితంగా తిరస్కరించి ఆ ఇంట్లోనే ఉండిపోయాడు.
***** ***** ***** *****
కొద్ది రోజుల తర్వాత ఆ రోజు ఉదయం,
"హలో... హలో..రజితా! నేను సరళక్కను మాట్లాడుతున్నాను. ఈ విషయం తెలుసా? మావయ్య గారిని మళ్లీ హాస్పిటల్లో పెట్టారుట, ఆయన క్లోజ్ ఫ్రెండ్ మురళీ గారు ఇప్పుడే ఫోన్ చేసారు. మీ బావగారు ఆఫీసుకి వెళ్లారు, శెలవు పెట్టి వస్తానని! మరి మీరూ బయలుదేరుతున్నారా?" తన తోడికోడల్ని అడిగింది సరళ.
"ఔనక్కా! ఆయన మాకూ ఫోన్ చేసి చెప్పారు. జనం కోసమైనా మళ్లీ ఇంకో సారి బయలుదేరక తప్పదు కదా! మీరు ఉండేది హైదరాబాద్ లో మీకు రాజమండ్రి దగ్గరే. కానీ మేము పూణే నుంచి రావాలంటే ఒకటిన్నర రోజు ప్రయాణం. ఏమిటో ఆ ముసలాయన ఆ ఇల్లు వదలి రారు. మనకేమో ఈ ప్రయాణాలు తప్పవు" విసుక్కుంటూ చెప్పింది రజిత.
"అత్తయ్య గారు పోయారు కదా, ఒక్కరూ అక్కడ ఏముంటారు రమ్మంటే అది తన ఇల్లు అనీ, తన ప్రాణం అందులోనే పోవాలనీ ఏవో సెంటిమెంట్ కబుర్లు చెప్పి, మొండికేసి రానంటారు. సరే కానీ, మీరు ఇప్పుడే బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి. అందరమూ కలసి మా కారులో రాజమండ్రి వెళ్దాము" ప్రోగ్రాం చెప్పి, ఫోన్ పెట్టేసింది సరళ.
***** ***** ***** *****
ఆ మర్నాడు సాయంత్రానికి రాజమండ్రి చేరుకున్న వామనరావు కుటుంబ సభ్యులు, నేరుగా అతను ఉన్న హాస్పిటల్ కు చేరుకున్నారు.
"ఏంటి బాబాయ్! ఏం జరిగింది? నాన్న ఎలా ఉన్నాడు?" గుమ్మంలోనే ఎదురుపడిన మురళిని ఆదుర్దాగా అడిగాడు రాజేందర్.
"నిన్న ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంకి వెళ్ళి, కళ్లు తిరిగి అక్కడే పడిపోయాడురా. సమయానికి పనిపిల్ల అక్కడే ఉంది కాబట్టి, పక్కింట్లో ఉన్న నాకు కబురు చేసింది. వెంటనే ఇదిగో ఇక్కడకి తీసుకుని వచ్చి జాయిన్ చేసాం. కంగారు ఏమీ లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. బీపీలో హెచ్చుతగ్గులు అంతే. రేపు డిస్చార్జ్ చేస్తారుట. అడుగో మీ నాన్న, చూసి రండి" జరిగిన విషయం చెబుతూ హాస్పిటల్లో వామనరావు ఉన్న వార్డు వద్దకు తీసుకుని వచ్చాడు మురళి.
***** ***** ***** *****
మర్నాడు మధ్యాహ్నం వామనరావును ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు అతని కుమారులు. ఆరోజు సాయంత్రం
"నాన్నా! మా మాట విని ఈ ఇల్లు అద్దెకు ఇచ్చి, నా వద్దకూ లేదా తమ్ముడు వద్దకు వచ్చి ఉండు. ఇంతవరకూ కష్టపడింది చాలు. నీకూ ఆరోగ్యం బాగా లేదు. ఒంటరిగా ఏముంటావు? మా మాట విను నాన్నా!" తండ్రిని ప్రాధేయపడ్డాడు పెద్ద కొడుకు రాజేందర్.
"ఔను నాన్నా! అన్నయ్య చెప్పింది నిజం. నువ్వు మా దగ్గర ఉంటే నీకూ మాకూ కూడా బాగుంటుంది. లేకపోతే ఇలా ప్రతీసారీ రావడం అంటే మాకూ కొంచెం కష్టంగా ఉంటోంది. కొంచెం అర్థం చేసుకో నాన్నా" అన్నగారికి వంత పాడాడు శివరామ్.
"ఒరే అబ్బాయిలూ! మీ మాట కాదు అంటున్నందుకు ఏమీ అనుకోకండి. ఈ ఇంటికి చాలా చరిత్ర ఉంది. అంతేకాదు, మీ అమ్మ కూడా ఇక్కడే తనువు చాలించింది. అందుకే నేను కూడా నా ఆఖరి రోజులు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లోనే గడపాలని నిశ్చయించుకున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ఏదైనా కావాలంటే మా మురళి గాడు ఉన్నాడు. మీరు రేపు బయలుదేరండర్రా" ఒంట్లో కొంచెం నీరసంగా ఉన్నా, చెప్పాల్సింది కరాకండీగా చెప్పాడు వామనరావు.
"ఏంటి బాబాయ్! నాన్న పట్టుదల. పోనీ నీ మాట వింటాడు కదా? నువ్వయినా నాన్నను ఒప్పించు" మురళిని బతిమాలారు అన్నదమ్ములు.
"ఒరే ఈ సారికి మీ నాన్న మాట కాదనకుండా వాడి ఇష్ట ప్రకారమే కానివ్వండి. వాడిని విశ్రాంతి తీసుకోనివ్వండి. అలా వీధి గదిలో కూర్చుని మాట్లాడుకుందాం రండి" అంటూ నడిచాడు మురళి.
***** ***** ***** *****
"ఒరే! మీరు అడగడంలో తప్పు లేదు కానీ మీ నాన్న ఈ ఇల్లు వదిలి రాడురా. ఎందుకంటే, నగలు అంటే ఎంతో ఇష్టపడే మీ అమ్మను ఒప్పించి, ఆమె దాచిన సొమ్ముకు అదనంగా తాను చిట్టీలు పాడి, వాటి వాయిదాలు సక్రమంగా చెల్లిస్తూ ఎంతో ఇష్టంతో, కష్టపడి కట్టుకున్న ఇల్లు రా ఇది. అందుకే దీని మీద వాడికి అంత ప్రేమ" అసలు విషయం చెప్పాడు మురళి, వీధి గదిలో ఉన్న కుర్చీలో కూర్చుని.
"నాన్నేంటి? ఎవరైనా అంతే కదా బాబాయ్? ఇంటి కోసం బేంకు నుంచి అప్పు చేసి, వాయిదాలు చెల్లిస్తారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది?" సందేహంగా అడిగాడు శివరామ్, కుర్చీలో కొంచెం ముందుకు జరిగి.
"కరెక్టేరా. కానీ మీ నాన్న విషయం వేరురా. వాడి జీవితం అంతా వాయిదాలతో ముడి పడి ఉంది. అందుకే వాడిని మేము వేదుల వామనరావు అని కాకుండా సరదాగా వాయిదాల వామనరావు అని పిలిచేవాళ్లం" సరళ ఇచ్చిన కాఫీ గ్లాసు అందుకుంటూ చెప్పాడు మురళి.
"ఔనా బాబాయ్, ఈ విషయాలు నాన్న ఎప్పుడూ చెప్పనేలేదు. నువ్వయినా చెప్పు" కాఫీ తాగుతూ అడిగాడు రాజేందర్.
"ఒరే మీ బామ్మ ఓ సారి చెప్పింది, మీ నాన్న పుట్టడం కూడా వాయిదాలు మీదే పుట్టాడుట. అంటే ఆవిడకు నెప్పులు మొదలవ్వడం, వెంటనే మంత్రసాని రావడం, నెప్పులు ఆగిపోవడం. ఇలా రెండు రోజులు జరిగిన తర్వాత మీ నాన్న పుట్టాడుట. అలాగే చదువులో కూడా సబ్జెక్టులు ఉండిపోవడం, వాటిని వాయిదాలు మీద రాయడం, పాస్ అవ్వడం. అంతెందుకు మీ నాన్న పెళ్లి కూడా ఏవో అడ్డంకులు వచ్చి రెండు సార్లు వాయిదా పడింది. అలాగే మీ చదువులు కూడా బేంకు నుంచి అప్పుచేసి వాయిదాలు తీరుస్తూ చదివించాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదిరా అబ్బాయిలూ! మీ నాన్న వాయిదాల కథ" కాఫీ గ్లాసు కింద పెడుతూ చెప్పాడు మురళి.
"అయితే ఆనవాయితీ తప్పకుండా ఈసారి కూడా మావయ్య గారి ఆఖరి ప్రయాణం వాయిదా పడిందన్న మాట" మూతి ముడుచుకుని చెప్పింది రజిత, వింటున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా.
వామనరావు, మురళి చెప్పిన తరువాత, వేరే మార్గం లేక, మర్నాడు భార్యలతో కలిసి తమ ఊళ్లకు బయలుదేరారు రాజేందర్, శివరామ్ లు.
***** ***** ***** *****
వాయిదాలు వేయకుండా కాలచక్రం ఓ ఆరు నెలలు వేగంగా కదిలిపోయింది. ఓరోజు ఉదయం
"ఒరే రాజేందర్! నేనురా బాబాయ్ ని. మీరు అర్జంటుగా బయలుదేరి వచ్చేయండి. మీ నాన్న ఇక లేడు. తమ్ముడికి కూడా చెప్పు. మిగతా వివరాలు ఇక్కడకి వచ్చిన తర్వాత చెబుతాను. ఈలోగా ఇక్కడ ఏర్పాట్లు నేను చూస్తాను" విషయం చెప్పి, ఏడుస్తూ ఫోన్ పెట్టేసాడు మురళి.
విమానాలు పట్టుకుని ఆ సాయంత్రానికి రాజమండ్రి చేరుకున్నారు రాజేందర్, శివరామ్ కుటుంబ సభ్యులు.
"ఏం జరిగింది బాబాయ్? అసలు ఎలా పోయారు?" గాజు పెట్టెలో, పూలదండల మధ్య నిశ్శబ్దంగా పడుకున్న తండ్రిని చూస్తూ అడిగారు కొడుకులు ఇద్దరూ.
"ఈ ఉదయం కూరల మార్కెట్ కి వెళ్తోంటే వెనుకనుంచి వచ్చిన కారు గుద్దేసిందిట. అక్కడే స్పాట్ డెడ్. పోలీసులకు మీరు ఓ కంప్లైంట్ ఇస్తే, ఆ డ్రైవర్ మీద కేసు పెడతారుట" అసలు విషయం చెప్పాడు మురళి.
"నాన్నను బలి తీసుకున్న ఆ డ్రైవర్ ని ఊరికే వదలకూడదు. కేసు పెడదాం బాబాయ్. ఆ ఏర్పాట్లు ఏవో చూడు" ఆవేశంగా చెప్పాడు రాజేందర్.
"కానీ, ఆ డ్రైవర్ ఓ సారి మీతో మాట్లాడతాడుట. మీ కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకసారి బయటకు రండి రా" అంటూ హాలులో మూగి ఉన్న బంధువులను తప్పించుకుంటూ వారిని బయటకు తీసుకుని వచ్చాడు మురళి.
***** ***** ***** *****
"ఏమయ్యా! నీకు ఎవడు ఇచ్చాడు డ్రైవింగ్ లైసెన్స్? అలా మనుషుల మీదనుంచి ఎక్కించేస్తావా?" మురళీబాబాయ్ పరిచయం చేసిన డ్రైవర్ తో ఆవేశంగా అన్నాడు శివరామ్.
"సార్, నా తప్పులేదు. నాన్నగారే నడుస్తూ నడుస్తూ షడన్ గా కళ్లు తిరిగి, నా కారు కింద పడిపోయారు. బహుశా బీపీ వలన అయ్యుండొచ్చు. అంతే తప్ప నేను కావాలని గుద్దేయలేదు. నన్ను నమ్మండి సార్. కొత్త కారు, వాయిదాల మీద కట్టేట్టుగా మొన్ననే లోన్ తీసుకుని కొన్నాను. మీరు కేసు పెడితే, వాయిదాలు తీర్చడం కష్టం అవుతుంది. అంతే కాదు నా కుటుంబం కూడా రోడ్డున పడుతుంది" కాళ్లు పట్టుకున్నంత పని చేసాడు డ్రైవర్.
"అయితే, మురళి బాబాయ్ చెప్పినట్లు ఇక్కడ కూడా నీకు ఈ వాయిదా ఆనవాయితీ తప్పలేదా నాన్నా ?" అని మనసులో అనుకుంటూ
"ఒక్క నిమిషం ఉండు. ఆలోచించుకుని చెబుతాం" అని టాక్సీ డ్రైవర్ కి చెప్పి, "నువ్వు కూడా లోపలికి రా బాబాయ్" అంటూ తండ్రి పార్ధీవ దేహం ఉన్న గదిలోకి దారి తీసాడు రాజేందర్.
అనుకోకుండా, తండ్రి మొహంలోకి చూసిన రాజేందర్ కు
"ఒరే వాయిదాల మీద కట్టిన ఈ ఇంటి మీద నాకు ఎంత ప్రేమో, అలాగే వాయిదాల మీద కారు తీసుకున్న ఆ డ్రైవర్ కి కూడా దాని మీద అంత ప్రేమా ఉంటుందిరా! పాపం, అతడిని ఇబ్బంది పెట్టకండి. అంతే కాదు ఇప్పుడు మీరు కేసు పెడితే కోర్టు వేసే కొన్ని వాయిదాలకు మీరు కూడా రావలసి ఉంటుంది కదా ? అవసరమా? ఇంకోసారి ఆలోచించండి" అని తండ్రి తన వైపు చూస్తూ చెబుతున్నట్టు అనిపించి
"ఓకే బాబాయ్, కేసూ వద్దు గీసూ వద్దు. ఆ ఏర్పాట్లు ఏవో నువూ చూడు. సరే కానీ! మరి ఇప్పుడు నాన్నని తీసుకుని వెళ్లడానికి వైకుంఠ రథం ఏర్పాటు చేసావా?" అడిగాడు శివరామ్.
"అబ్బే రాత్రి అవుతోందిగా, ఇంక ఈ రోజు కుదరదురా, రేపు ఉదయాన్నే" చెప్పాడు మురళి.
"అంటే.???? మళ్లీ వాయిదానా???" ఒకేసారి మనసులో అనుకున్నారు రాజేందర్, సరళ, శివరామ్, రజితలు, గాజు పెట్టెలో ప్రశాంతంగా పడుకున్న వామనరావు కళ్ళు, వీరి వంక అభావంగా చూస్తుండగా!
***** **సమాప్తము** *****