*****
*వైరాగ్యం*
=======
(మినీ కథ)
(నేను రాసిన ఈ మినీ కథ "విశ్వభారత్" అనే దినపత్రికలో ది. 28.04.2023 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
అరవై ఏళ్ల వెంకయ్య హఠాత్తుగా మరణించాడు. అది చూసి రోదిస్తున్న అతని తండ్రి ఎనభై ఏళ్ల సూరయ్యను ఆపడం ఎవరివల్లా కాలేదు.
మూడు రోజుల వరకూ ముద్ద ముట్టలేదు ముసలాయన.
నలుగురూ చెబితే నాలుగో రోజు కొంచెం ఎంగిలి పడ్డాడు.
ఐదవ రోజు విస్తరిలో ఉన్న వంకాయ కూర వైపు విచిత్రంగా చూసాడు.
ఆరవ రోజు వంకాయ వేపడం చూసి మండిపడ్డాడు.
ఏడవ రోజు వడ్డించిన వంకాయ పచ్చిపులుసుని విసురుగా పక్కకు నెట్టాడు. ఎనిమిదో రోజు వంకాయ పచ్చడి చూసి "రోజూ వంకాయ ఏమిట్రా మీ మొహం మండా!" అని కేకలేసాడు.
తొమ్మిదో రోజు వంకాయ కారం కూర చూసి "ఒరే మిమ్మల్ని తగలెయ్యా! వంకాయనైనా మార్చండి లేదా వంటాయననైనా మార్చండి" అని రుసరుసలాడాడు.
పదోరోజు వంట చూడకుండానే పరమపదించాడు. ఇంతకీ సూరయ్య చనిపోయింది "వెంకయ్య మీద బెంగతోనా? లేక వంకాయ మీద భయంతోనా?" అని బుర్రలు బద్దలుకొట్టుకున్నారు బంధువులు.
ఆ తరువాత తెలిసింది, తన కొడుక్కి ఎంతో ఇష్టమైన వంకాయని ప్రతీరోజూ ఏదో రూపంలో వండడం, దానిని మిగతా అందరూ లొట్టలేసుకుంటూ తినడం చూసి, ఆ ముసలి ప్రాణం తట్టుకోలేక పోయిందని.
***** **శుభం** *****