*****
*ఆదర్శం*
========
(మినీ కథ)
(నేను రాసిన ఈ కథ విశ్వభారత్ అనే దినపత్రికలో ది. 17.03.2023 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
ఆ రోజు అరవై ఏళ్ల అరవిందరావు ఉద్యోగ బాధ్యతలు నుంచి విరమిస్తున్న రోజు. ఆ సాయంత్రం ఏర్పాటు చేసిన సభలో,
"అరవింద్ గారూ! ఎటువంటి మచ్చ లేకుండా నలభై ఏళ్లు ఉద్యోగం చేసారు. దీనికి ప్రేరణ ఎవరు?" అడిగాడు కంపెనీ మేనేజర్.
"మా నాన్నగారే. ఆయన జీవితమే నాకు ఆదర్శం" చెప్పాడు అరవిందరావు.
"క్రమశిక్షణకు మీరు మారుపేరు. ఇది ఎలా సాధ్యమయ్యింది సార్?" అడిగాడు అకౌంటెంట్.
"మా నాన్న చెప్పిన నీతి వాక్యాలు, నేను ఇప్పటికీ ఫాలో అవుతాను. ఆయనే నాకు ఆదర్శం" తండ్రి గొప్పతనం గురించి చెప్పాడు అరవిందరావు.
తరువాత ఓ ఇద్దరి ప్రసంగాలు, ఆ తరువాత అల్పాహారంతో ఆ సమావేశం ఆనందంగా ముగిసింది.
***** ***** ***** *****
"నాన్నా! అమ్మా, నువ్వూ నలభై ఏళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డారు. ఇంక కష్టపడింది చాలు, రేపు మాతో పాటు వచ్చేయండి. హాయిగా మనవడితో ఆడుకుంటూ విశ్రాంతి తీసుకుందురుగాని" రాత్రి ఇంట్లో భోజనాలు చేస్తూ తండ్రిని ఆప్యాయంగా అడిగాడు, ఈ వేడుక చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన కొడుకు సుధాకర్.
"ఔనండీ మావయ్యగారూ! మీ అబ్బాయి చెప్పింది వాస్తవం. ఓ సారి ఆలోచించండి" వేడుకుంది కోడలు స్వప్న.
"ఏమీ అనుకోకండి. ఒంట్లో ఊపిరున్నంత వరకూ మేము ఈ ఇంట్లోనే ఉంటాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి" కరాకండిగా చెప్పాడు అరవిందరావు భోజనం వద్ద నుంచి లేస్తూ.
***** ***** ***** *****
"మీకేమైనా బుద్ధుందా? కొడుకు కోడలు కళ్లకు అద్దుకుని చూసుకుంటాం రమ్మంటే ఏమిటీ పట్టుదల?" రాత్రి మంచమీద పడుకున్న భర్తను ఆవేశంగా అడిగింది భార్య.
"చూడు సుశీలా! వాళ్లు ఒక ఏడాది పాటు మనల్ని నెత్తిన పెట్టుకొని చూస్తారు. ఆ తరువాత కొన్నాళ్ళకి పాలు తెచ్చేవాడిని, ఆ తరువాత పనిమనిషిని మాన్పిస్తారు. నెమ్మదిగా మన తిండి మీద, ప్రయాణాల మీద, ఆఖరికి వచ్చే పెన్షన్ మీద కూడా వాళ్ల పెత్తనం చెలాయిస్తారు. ఇప్పుడు చెప్పు నీకు ఏ జీవితం కావాలో?" సూటిగా అడిగాడు అరవిందరావు.
"అర్ధమయ్యింది! గతంలో, రిటైర్ అయిన తర్వాత మన వద్దకు వచ్చేసిన మీ తల్లిదండ్రులను మనం ఎలా చూసామో, వీళ్లూ మనల్ని అలా చూస్తారనే కదా మీ అనుమానం?" సందేహంగా అడిగింది.
"ఔను! అందుకే, ఈ విషయంలో మాత్రం మా నాన్నను నేను ఆదర్శంగా తీసుకోను" చెబుతున్న భర్తను ఆప్యాయంగా అల్లుకుపోయింది సుశీల.
***** ***** ***** *****
మర్నాడు,
తల్లిదండ్రులను స్వలాభానికి వాడుకోవాలనుకున్న తన పాచిక పారనందుకు నిరాశగా ఇంటిమొహం పట్టాడు సుధాకర్, భార్యా కొడుకుతో కలసి.
***** **శుభం** *****