*****
*రాగమాలిక*
==========
(కథానిక)
(నేను రాసిన ఈ సామాజిక కథ *విశ్వభారత్* అనే దినపత్రికలో ది.11.06.2023న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"చాలామందికి ఓ సందేహం వస్తుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలని? నన్ను అడిగితే, బ్రహ్మచారుల్లా ఉండకుండా, వివాహం చేసుకోవాలనే చెబుతాను. ఎందుకంటే, సంసారి కాని వాడు సన్యాసి కాలేడని ఓ నానుడి ఉంది. సంసార జీవితంలో అన్ని బాధ్యతలు నెరవేర్చిన తరువాత మాత్రమే సన్యాసం స్వీకరించిన ఎంతోమంది మహానుభావులను మనం చూసాము. అందువలన బ్రహ్మచారుల్లా ఉండకుండా....." నాగపూర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవచనాలు చెబుతున్నారు విధ్యారణ్యస్వామి. వాటిని ఆసక్తిగా వింటున్నాడు రాఘవ.
ఈ మాటలతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన రాఘవ, 'అయితే, పెళ్లి చేసుకోకుండా నేను తప్పు చేసానా?' అని మదనపడుతూ ఓ సారి పాతిక సంవత్సరాలు నాటి తన గతాన్ని నెమరేసుకున్నాడు.
***** ***** ***** *****
"ఒరే రాఘవా! నీ స్నేహితులు అందరూ హాయిగా పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. నా మాట విని మా తమ్ముడు కూతుర్ని చేసుకోరా. మన వంశం నిలబెట్టరా!" కొడుకును బతిమాలుతోంది అతని తల్లి కమల.
"అమ్మా! నా మనసు ఏమీ బాగా లేదు. దయచేసి పెళ్లి గురించి నన్ను ఇబ్బంది పెట్టవద్దు" తల్లిని బతిమాలుతూ చెప్పాడు రాఘవ.
"ఏంట్రా రాఘవా! నీ మూర్ఖత్వం? నువ్వు ప్రేమించిన ఆ పిల్ల నిన్ను కాదని ఎవడో బాగా డబ్బులు ఉన్నవాడిని చేసుకుని వెళ్లిపోయి అప్పుడే ఏడాది కావస్తోంది. నువ్వు మాత్రం ఇంకా ఆ పిల్ల నామస్మరణే చేస్తూ, మనసు పాడుచేసుకుని అసలు పెళ్లే చేసుకోను, పెళ్లి సంబంధాలు చూడవద్దు అంటున్నావు. నా మాట కొంచెం విను నాయనా!" కొడుకును బతిమాలుతోంది అతని తల్లి కమల.
"అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా వింటాను, ఒక్క పెళ్లి విషయం తప్ప. నా మనసులో ఆమెకు తప్ప మరొకరికి స్థానం లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టవద్ధు" విసుక్కుంటూ చెప్పాడు రాఘవ.
"తండ్రి లేని పిల్లవాడివని గారంగా పెంచితే మంచి శాస్తి చేసావు నాయనా. అయినా ఆ పిల్ల మనసులో నువ్వు లేనప్పుడు ఇంకా ఆమెనే పట్టుకుని వేళ్లాడడం ఏమిట్రా పిచ్చి పీనుగా? హూ..ఇంకా ఎన్నాళ్లో నాకు ఈ చాకిరీ. ఇంక నా శేష జీవితం ఎలా ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి" కూరలు తరుగుతూ ఆవేదనతో చెప్పింది కమల.
"నేను ఉన్నంతవరకూ నీకు ఏ లోటూ రానీయనమ్మా. నువ్వు తప్పుకో, ఆ కూరలు నేను తరుగుతాను" తల్లికి నచ్చచెప్పాడు రాఘవ.
"నువ్వు ఉన్నంత వరకూ సరే, మరి నేను పోయిన తరువాత నీ జీవితం ఎలాగా అనేదే నా బాధరా! వయసు మీద పడిన తర్వాత పక్కన తోడు ఎవరూ లేకపోతే అప్పుడు తెలుస్తుందిరా నీకు, ఆ లోటు ఏమిటో!" ముక్కు చీదుతూ చెప్పింది.
"ఏం పరవాలేదు. హాయిగా ఏ బాధ్యతలు లేకుండా ఘోటక బ్రహ్మచారిలా బతికేస్తా. నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకు" తల్లిని సముదాయిస్తు చెప్పాడు రాఘవ.
"నిన్ను ఇంక ఆ భగవంతుడే కాపాడాలి" మనసులో గొణుక్కుంది కమల.
ఆ తరువాత రెండేళ్లకే తన తల్లి మనోవ్యాధితో మరణించడం, తను ఉద్యోగరీత్యా కాకినాడ నుంచి ఈ నాగపూర్ రావడం జరిగింది.
భక్తులందరూ "గోవిందా గోవిందా" అని చేస్తున్న నామస్మరణతో గతంలోంచి బయటకు వచ్చిన రాఘవ అందరితో పాటూ తనూ లేచి బయటకు నడిచాడు.
***** ***** ***** *****
గుడి నుంచి బయటకు వస్తున్న రాఘవను
"ఏమండీ స్వామిజీ వెళ్లిపోయారా?" అప్పుడే ఖరీదైన కారులోంచి దిగిన ఓ మధ్యవయస్కురాలు అడిగింది.
ఒంటినిండా నగలతో, పచ్చని పట్టు చీరలో పెద్ద ముత్తైదువులా ఉన్న ఆమెను చూస్తూ
"ఔనండీ, ఇప్పుడే వెళ్లారు. మళ్లీ రేపు వస్తారు" చెప్పాడు రాఘవ.
"అయ్యో! ఆయనను దర్శించుకుందామని హడావుడిగా వచ్చాను. పోనీ లెండి రేపు ఉంటారు కదా? రేపు వస్తాను" సంతోషంగా చెప్పింది ఆమె.
ఆమెను నఖశిఖపర్యంతం చూసి,
"మీరు... మీరు.. నువ్వు..నువ్వు రాగమాలిక కదూ?" ఆశ్చర్యం, ఆనందం కలిసిన గొంతుతో అడిగాడు రాఘవ.
"ఔను. మీరు......?" రాఘవను చూస్తూ అడిగింది ఆమె.
"అప్పుడే పాతికేళ్లు అయ్యింది కదా! నన్ను గుర్తు పట్టి ఉండక పోవచ్చు. నేను మిమ్మల్ని ప్రేమిం......" చెప్పబోతూ ఆగాడు రాఘవ.
"ఓ....జ్ఞాపకం వచ్చింది. నువ్వు రాఘవ కదూ? ఔనూ, ఈ ఊర్లో ఎందుకున్నావు? నీ భార్య రాలేదా?.........." ప్రశ్నల వర్షం కురిపించింది మాలిక.
"ఉద్యోగరీత్యా ఇక్కడ ఉన్నాను. మన ప్రేమ విఫలమైన తరువాత నేను వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం ఒంటరి జీవితం. అయితే నువ్వూ ఇక్కడే ఉంటున్నావా?" ఆనందంగా అడిగాడు రాఘవ.
"అబ్బే ఏదో పని మీద......" చెప్పబోతున్న ఆమెను
"మాలికా! త్వరగా రావాలి. ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఉంది" కారులో ఉన్న వ్యక్తి పిలవడంతో
"ఆ ....వస్తున్నానండీ. సరే రాఘవా! రేపు వస్తా , గురువుగారిని కలుసుకోవడానికి" హడావుడిగా చెప్పి, కారులో రివ్వున వెళ్లి పోయిన ఆమె వైపు ఆనందంగా చూస్తూ ఉండిపోయాడు రాఘవ.
***** ***** ***** *****
ఇంటికి చేరిన రాఘవ మనసు మనసులో లేదు. తల్లి చెప్పిన మాటలు వింటే తనకు ఈ ఒంటరితనం తప్పి, హాయిగా మాలికలా తను కూడా పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండేవాడు. ఇందాక ప్రవచనంలో గురువు గారు చెప్పిన మాటలు కూడా పూర్తిగా యధార్ధం. తనే మూర్ఖంగా ప్రవర్తించి తల్లి మనసు కష్టపడటమే కాకుండా, తన జీవితాన్ని కూడా వృధా చేసుకున్నాడు.
రాత్రంతా ఇలాంటి ఎడతెగని ఆలోచనలతో గడిపి మర్నాడు ఉదయానికి ఓ నిశ్చయానికి వచ్చాడు రాఘవ, 'ఇప్పటికీ మించి పోయింది లేదు, ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో హాయిగా స్థిరపడాలని!
***** ***** ***** *****
మర్నాడు సాయంత్రం యధాప్రకారం గురువు గారి ప్రవచనాలు వినడానికి వెళ్లిన రాఘవ కళ్లు రాగమాలిక రాక కోసం ఎదురు చూస్తున్నాయి.
ఆమె రాకపోవడంతో నిరాశగా కూర్చుండి పోయాడు. ఏదో అనుమానం వచ్చి ఓ సారి ఆడవారికి కేటాయించిన స్థలంలో చూసాడు. అక్కడ కూడా కనపడకపోవడంతో ప్రవచనాలు వింటూ ఉండిపోయాడు.
ప్రవచన కార్యక్రమం పూర్తి అయిన తరువాత
తన వివాహం గురించి రాగమాలిక కు చెబుదామని ఎంతో ఆశతో ఎదురు చూసిన రాఘవ, ఆమె కనబడకపోవడంతో బరువెక్కిన గుండెతో ఇంటి దారి పట్టాడు.
గుడి నుంచి బయటకు వెళ్లిపోతున్న రాఘవ
"ఓయ్, రాఘవా! కాసేపు ఆగు. ఏమిటా కంగారు?" అన్న గొంతుక వినబడి వెనక్కి తిరిగి చూసాడు. స్త్రీలకు కేటాయించిన స్థలం నుంచి వస్తున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాఘవ
"మాలికా, నువ్వా? ఈ వేషం ఏమిటి? ఆ కట్టూ బొట్టూ ఏమయ్యాయి? అసలు ఏమి జరిగింది?" ఆందోళనగా అడిగాడు.
"ఇదే నా అసలు రూపం. ఆయన పోయి పదేళ్లు అయ్యింది. మాకు పిల్లలు లేరు. నిన్ను కాదని డబ్బున్న అతడిని పెళ్లి చేసుకున్నాను. తరువాత తెలిసింది అతనికి లేని వ్యసనం లేదని. సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. చివరికి రోగాలతో మరణించాడు. నీ ప్రేమ తిరస్కరించినందుకు భగవంతుడు నాకు తగిన శిక్ష వేసాడు" కళ్లు తుడుచుకుంటూ చెప్పింది రాగమాలిక.
"మరి నిన్న నిండు ముత్తైదవులా ఎందుకు వచ్చావు?" అనుమానంగా అడిగాడు రాఘవ.
"ఓ ఆదా? నీకు తెలుసు కదా? నాకు కొంచెం నాటకాల పిచ్చి ఉందని. నిన్న ఇక్కడి తెలుగు సంఘాల కోరికపై ఓ నాటకం వేసాము. అందులో ఓ ముత్తైదవు పాత్ర నాది. గురువుగారిని కలుసుకోవడానికి, నాటకం అయిపోగానే హడావుడిగా అదే మేకప్ తో వచ్చేసాను" రాఘవ వంక ప్రేమగా చూస్తూ చెప్పింది మాలిక.
"మరి ఆ కార్లో వచ్చినాయన?" అనుమానం వచ్చి అడిగాడు రాఘవ.
"ఆయన ఇక్కడి తెలుగు సంఘం సెక్రటరీ. కళాకారులంటే గౌరవం ఉన్న కోటీశ్వరుడు" అసలు విషయం చెప్పింది మాలిక.
"అంటే ఇప్పుడు నువ్వు ఒంటరివన్న మాట" ఆసక్తితో అడిగాడు రాఘవ.
"ఔను. ఈ పదేళ్ల నుంచి ఒంటరితనమే. అది మరచిపోవడానికే ఏదో ఇలా నాటకాలు మీద దృష్టి పెట్టాను" కంటనీరు తుడుచుకుని చెప్పింది మాలిక.
"అయితే ప్రస్తుతం మనం ఇద్దరమూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామన్న మాట. మాలికా! నేను ఉన్నంతవరకూ నువ్వు ఒంటరివి కాదు. నీకు అభ్యంతరం లేకపోతే నన్ను నీ వాడిగా స్వీకరించు. నువ్వు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉన్నావు. కావాలంటే చూడు. మన ఇద్దరి పేర్లూ కలిసేలా గతంలో నేను వేయించుకున్న పచ్చబొట్టు" అంటూ గుండెల మీద 'రాఘమాలిక' అని ఉన్న పచ్చబొట్టు చూపించాడు.
సంభ్రమాశ్చర్యాలకు లోనైన ఆమె కాసేపటికి తేరుకుని
"రాఘవా! నన్ను క్షమించు" అంటూ అతని గుండెల మీద వాలిపోయి ఆ పచ్చబొట్టును ముద్ధు పెట్టుకుంది.
"ఏయ్ పిచ్చీ! లే, అందరూ చూస్తున్నారు. త్వరగా నడు. గురువుగారికి మన విషయం చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం!" అంటూ ఆమెను పొదివి పట్టుకుని వేగంగా స్వామీజీ వైపు కదిలాడు రాఘవ.
***** ***** ***** *****
వీరి కథ అంతా విన్న విధ్యారణ్యస్వామి
"చూడండి ఆ భగవంతుడే మిమ్మల్ని ఇలా మళ్లీ కలిపాడు. ఇది భగవతేచ్ఛ. లేకపోతే ఎప్పుడో పాతిక సంవత్సరాలు క్రితం ఎక్కడో విడిపోయిన మీరు, ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయంలో కలుసుకోవడం అంతా దైవనిర్ణయం. నాయనా! ముందు ఆమె నుదుట ఈ బొట్టు పెట్టు" అంటూ కుంకుమ రాఘవ చేతికి ఇచ్చారు.
నుదుట కుంకుమ బొట్టు పెడుతున్న రాఘవను చూస్తూ కంటనీరు కారుస్తున్న మాలికను చూసిన స్వామి
"చూడమ్మా! గతం గతః. పాత జీవితం మరచిపో'. ఇప్పటికీ నిన్నే గుండెల్లో పెట్టుకుని ప్రేమించే రాఘవ దొరకడం నీ అదృష్టం. కలకాలం సుఖంగా ఉండండి. ధీర్ఘాయుష్మాన్ భవ. ధీర్ఘ సుమంగళీ భవ. గుడి మూసే సమయం అయినట్టుంది. వెళ్లి దేవుని దర్శించుకుని రండి" ఆ నవ దంపతులను ఆశీర్వదిస్తూ చెప్పారు స్వామీజీ.
కొత్త జీవితానికి శుభ సూచకంగా గుడిగంటలు గణగణ మోగుతుండగా, ఒకరి చేయి ఒకరు పట్టుకుని గుడిలోకి ప్రవేశించారు రాఘవా మాలికలు.
***** **శుభం** *****