తోడికోడళ్ళు (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(5/3/2023 తపస్వీ మనోహరం వార పత్రికలో ప్రచురితం )
అన్నపూర్ణమ్మ , రాజమ్మ ఇద్దరూ తోడికోడళ్ళు. దురదృష్టవశాత్తూ వాళ్ళిద్దరికీ జీవితం పూర్తిగా అనుభవించకుండానే భర్తలు గతించారు. ఆశ్చర్యంగా ఇద్దరికీ పిల్లలు లేరు. ఇద్దరూ వాళ్ళ చెల్లెళ్ల పిల్లలను దత్తతకు తీసుకున్నారు. భర్తలు వాళ్ళకు తెలియకుండా ఎక్కడో కృష్ణ లంక దగ్గర కొన్న స్థలాలను ఎవరో ద్వారా తెలుసుకుని వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఇద్దరి పెంపుడు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యిందని పించారు. ప్రస్తుతం ఆ తోడికోడళ్ళిద్దరూ వాళ్ళ భర్తలు వదిలేసిన జాయింట్ ప్రోపర్టీకి చెందిన పది గదులు గల ఒక పాత డాబా ఇంట్లో కూతుళ్లను, వాళ్ళ పిల్లలను పెట్టుకుని ఉంటున్నారు.
ఇద్దరి అల్లుళ్లూ కూడా పక్క ఊళ్ళో ఉన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పని చేస్తూ వారానికొకసారి ఇంటి మొహం చూస్తూ ఉంటారు. వాళ్ళ కెందుకో వెలిసి పోయి బీటలు బారిన ఆ పురాతనమైన ఇంట్లో ఉండటానికి మనసొప్పదు. ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో సౌకర్యాలు ఉన్న ఇంకో ఇల్లు కొనుక్కుందాం అన్నా ఆ తోడికోడళ్ళిద్దరూ పడనివ్వడం లేదు. పాత దైనా పడిపోవడానికి సిద్దంగా ఉన్నా కూడా మొగుళ్లు ఎంతో ప్రేమగా అప్పచెప్పి వెళ్ళిపోయిన ఆ ఇంటిలోనే చచ్చే అంతవరకు పడి ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. . .
రానూ రానూ సరి సమానంగా పంచుకున్న ఆ పాత డాబా ఇంట్లోని వాటాల మీద వాళ్ళిద్దరికీ వాళ్లకిద్దరికీ అంతులేని మమకారం పెరిగిపోయింది. అల్లుళ్ళవి ప్రైవేట్ స్కూళ్ళల్లో అంతంత జీతాలు మాత్రమే అవ్వడంతో ఇద్దరూ చెరో రెండు గదులూ ఉంచుకుని మిగిలిన వాటాను అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు.
మూర్తీభవించిన మూర్ఖత్వంతో కూడిన చాదస్తం ఇద్దరిలో సరి సమానంగా జీర్ణించుకుపోవడం వల్ల పై పెచ్చు ఆ పాత ఇళ్లే ప్రాణంగా పెట్టుకుని జీవిస్తున్న వాళ్ళిరువురూ అద్దెకు వచ్చిన వాళ్ళకు అనేక నిబంధనలు పెట్టసాగారు.
"ఇంట్లో ఏ గదిలోనూ మేకులు కొట్ట రాదు. గోడలు పెచ్చులు రేగి ఉండకూడదు. . ఎక్కడా బూజులు కనపడకూడదు. వంట ఇంట్లో కట్టెల పొయ్యి ఉపయోగించి గోడలన్నీ మసి బారనియ్యకూడదు. చిన్న పిల్లలు ఉంటే గోడలమీద కలర్ పెన్సిళ్లతో బొమ్మలు కానీ, గీతలు కానీ గియ్యరాదు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు చాకలి పద్దులు, ఇతర లెక్కలకు గోడలు ఉపయోగించ రాదు. ఈ నిబంధనలను అతిక్రమించినదో పెనాల్టీ కింద ఒక నెల అద్దె అదనంగా ఇవ్వడానికి సిద్దంగా ఉండాలి. ఇంటి ఓనర్ ఎప్పటికప్పుడు అద్దె కుంటున్న వాళ్ళ ఇళ్లను ఆకస్మిక తనిఖీ చెయ్యడానికి అధికార ముంటుంది. మాటికి మాటికి ఎందుకొస్తున్నారు అని పెద్ద వాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎదురు ప్రశ్నలు వేయరాదు. ఇక పోతే నీళ్ళ సంగతి. ఇంట్లో బోర్ ఉన్నా బాగా అవసరమైతే తప్ప నీళ్ళు వాడ రాదు. బోరు పాడైతే అద్దెకున్న వాళ్ళే సొంత ఖర్చుతో బాగు చేయించకోవలెను. దొడ్లో ఉన్న పాత నూతిలోంచి నీళ్ళు తోడుకుని ఎప్పటికప్పుడు నిలవ చేసుకోవాలి. రాత్రిళ్ళు కొంతవరకు ఈ పద్దతికి సడలింపు ఉంటుంది." ఇవీ ఆ తోడుకొడళ్ళు ఇద్దరూ వాళ్ళ ఇంట్లోకి అద్దెకొచ్చే వాళ్ళకు విధించే కఠిన నిబంధనలు.
ఆ ఊళ్ళో, ముఖ్యంగా ఆ కాలనీలో ఇల్లు అద్దెకు దొరకడం చాలా కష్టం. దొరికినా భరించలేని అద్దెలు ఉంటాయి. అందుకే చచ్చినట్టు తప్పనిసరైన పరిస్తితులలో అన్నపూర్ణమ్మ, రాజమ్మ పెట్టే ఏ పనికిమాలిన నిబంధనలు అయినా ఒప్పుకుని ఆ ఇళ్ళల్లో చేరుతూ ఉంటారు. తోడికోడళ్ళు పెట్టే వేధింపులు భరించలేక వారానికొకసారి వచ్చే వాళ్ళ అల్లుళ్లతో అద్దె కుంటున్న వాళ్ళు మొరపెట్టుకునే ప్రయత్నం చెయ్యబోతే ఆ అల్లుళ్లు " అయ్యా క్షమించాలి. ఈ ఇంట్లో మాకే స్వతంత్రం లేదు. మా మాట నెగ్గదు. వాళ్ళ తలనొప్పి పడలేక వారానికొకసారి తప్పని సరైన పరిస్తితులలో , మా కుటుంబాన్ని చూడటానికి వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళి పోతున్నాం. .." అంటూ వాళ్ళ గోడు చెప్పుకుని తప్పించుకుంటూ వస్తున్నారు ఆ అల్లుళ్లు.
అన్నపూర్ణమ్మ, రాజమ్మ గారి ఇల్లు అడ్రెస్ తెలుసుకోవడం చాలా సులువు. ఆ వీధిలో సున్నపు సంస్కారాలు లేకుండా ఎన్నో ఏళ్లుగా వర్షాలకు పాచిపట్టి పోయిన ఒకే ఒక ఇల్లు ఏదైనా వుందంటే మరి దాన్ని గుర్తు పట్టడం ఏమంత కష్టం ? .
ఒకానొక దుర్ముహూర్తం వేళ ఖర్మ కాలి రాఘవరావు గారు అనే స్కూల్ మాస్టారు తన నలుగురు పిల్లలతో , ఎనభై ఏళ్ల ముసలి తల్లితో ఎన్నో ఇళ్ళు కాళ్ళు అరిగిపోయేటట్టుగా తిరిగాక అన్నపూర్ణమ్మ ఇంటిమీద మనసు పారేసుకున్నాడు. తన లాంటి పెద్ద కుటుంబానికి అనుందులోనూ ఆర్ధికంగా అంతగా బలంగా లేని వాడు ఇంతకన్నా మంచి ఇల్లు, అందంగా ఉండే ఇల్లు వెతుక్కోవడం సాహసోపేతమైన చర్య అని తెలిసిన వాడై బయట తగిలించి ఉన్న . . అద్దె బోర్డు చూసి తలుపు తట్టగానే లోపలనుండి తోడికోడళ్ళిద్దరూ తమ నిబంధనల చిట్టాతో తలుపు తీశారు. తోచీ తోచనమ్మ తోడు కోడలు పుట్టింటికెళ్ళి కూర్చున్న సామెతగా రాజమ్మ తన తోడుకొడలికి ఏవేవో పాత పౌరానిక సినిమా కబుర్లు చెపుతూ కాలక్షేపంగా ఉంటూ ఉంటుంది. . ఎవరైనా రాగానే అప్పటికప్పుడు నిబంధనల కాయితాలు కనపడకపోతే వచ్చిన వాళ్ళు "నువ్వు మాకు అవన్నీ ముందే చెప్పలేదుగా?" అని నిబంధనలు అతిక్రమిస్తారు అని వాళ్ళిద్దరూ ఆ కాయితాలని జాకెట్టుకు పిన్నీసుతో గుచ్చుకుని రెడీ గా ఉంటారు.
గుమ్మం బయట అచేతనంగా నిలబడి అటూ ఇటూ దిక్కులు చూస్తున్న రాఘవరావు మాస్టారుని చూసి "రండి బాబూ . ఇల్లు అద్దెకు కావాలా ? ముందు ఈ కాయితాలలో రూల్స్ చదివాక అందుకు మీకు ఇష్టమైతేనే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం " అంది తోడుకొడళ్లలో ఒకరైన అన్నపూర్ణమ్మ ఆ కాయితాలు తన చేతిలోనే ఉంచుకుని. .
" ఇదేమిటి తల్లీ. ఇలా మీరు తలుపు తట్టీ తట్టగానే నిబంధనలు అంటూ ఏకరువు పెడుతూ ఉంటే ఇక మీ ఇంటికి అద్దెకు ఎవరు వస్తారు చెప్పండి . కాస్త కూర్చోపెట్టి మంచినీళ్లు ఇచ్చి తీరిగ్గా మీ నిబంధనలు గురించి మాట్లాడితే అవతల వాళ్ళకు ఇష్టం వుంటే చేరుతారు. లేకపోతే లేదు .." అన్నాడు రాఘవరావు చిరాకుగా మొహం పెట్టి .
"అయ్యో అలా అంటారేమిటండీ బాబూ ? అసలు ఈ కాలనీలో అంత తేలిగ్గా ఇళ్ళు దొరుకుతాయనా మీ ఉద్దేశ్యం ? మా రూల్స్ పక్కన పెట్టండి. ఎంత అద్దేనా ఇచ్చి చేరడానికి క్యూ కట్టి సిద్దంగా ఉంటారు. అయినా నేను అంత తేలిగ్గా ఎవరికి పడితే వాళ్ళకు ఇస్తానుటండీ ? వాళ్ళ సంప్రదాయం చూడాలి ? వాళ్ళ ఆర్ధిక పరిస్తితి చూడాలి ? కుటుంబంలో పిల్లా పీచూ ఎంతమంది ఉంటారో చూడాలి . బంధువులు తాకిడి ఏమైనా ఉంటుందా అని కనుక్కోవాలి. అప్పటికీ మేము సంతృప్తి పడితేనే ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాకనే కేవలం ఇల్లు చూడనిస్తాను. ఆ తర్వాతే మిగిలిన సంగతులన్నీను. మిమ్మల్ని చూస్తూంటే పెద్ద మనిషిలాగా ఉన్నారు. పర్వాలేదు లెండి. . ముందు ఈ కాయితాలు చూడండి బాబూ. ప్రతివాడికీ చెప్పిందే చెప్పి నోరు నెప్పి పుడుతోంది . .. త్వరగా చూడండి. ఇంకా మీ వెనకాల ఎవరేనా ఇల్లు అద్దె కోసం వచ్చి ఎదురు చూస్తున్నారో ఏమిటో ? " అంటూ హడావిడి చేసేసింది అన్నపూర్ణమ్మ. .
"బాగానే ఉంది అక్కయ్యగారు. ఇంతకీ అసలు ఎన్నాళ్లనుండి మీ ఇల్లు ఖాళీగా ఉంటోంది ? మీరు గుమ్మంలోనే నిలబెట్టి ఇన్ని రూల్స్ చెపుతూ ఉంటే అసలు ఎవరేనా మీ ఇంటికి అద్దెకొస్తారా అని నా అనుమానం " అన్నాడు రాఘవరావు వెనక్కి వెళ్లిపోవడానికి సిద్దమవుతూ.
"అయ్యో అంత కోపం అయితే ఎలాగండీ. మంచీ చెడూ తెలుసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకు ఇల్లు ఇచ్చేయ్యమంటారా ? నాకు మగ దిక్కు లేదు. కూతుళ్లతో ఉంటున్నాం. అల్లుళ్లు దూరంగా ఉంటున్నారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ మేమే చూసుకోవాలి. . ఏ జాగ్రత్తలూ తీసుకోకపోతే రేపు ఏ దొంగ వెధవలో ఇల్లు కావాలని వచ్చి అదను చూసి నా పీక పిసిగి ఇంట్లో ఉన్న సామానులు , నగలూ దోచుకు పోతే నాకు ఇక దిక్కు ఎవరు ? మీకు కోపం వచ్చినా పర్వాలేదు. నా జాగ్రత్త నేను పడాలి కదా. అందుకే ఎవరికి పడితే వాళ్ళకు నా ఇల్లు ఇవ్వడం లేదు. అయితే మిమ్మల్ని చూస్తే కాస్త కావలసిన వాళ్ళులా అనిపిస్తున్నారు. అందుకే ఇంత తీరిగ్గా మాట్లాడుతున్నాను. కోపగించుకోకండి ఏదైనా పొరపాటుగా మాట్లాడితే .." అంది అన్నపూర్ణమ్మ.
"ఏం పర్వాలేదమ్మా. మీరు అసలు విషయం చెప్పాక ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది. మీరు , మీ పద్దతులు చాలా వరకు కరెక్టే. కానీ మీ రూల్స్ కు అసలు ఎవరేనా ఒప్పుకుంటారా ? మీకు తోడుగా ఎవరేనా బంధువులను తెచ్చి పెట్టుకోలేకపోయారా ? ఇలా ఎన్నాళ్లు భయపడుతూ వచ్చిన వాళ్ళను అదరగొడుతూ ఒంటరిగా రోజులు లాక్కొస్తారు ? మీరు ఏమీ అనుకోకపోతే మా కుటుంబం మీకు చాలా అనువైనది. ఈ ఇంట్లో చేరితే మాత్రం మిమ్మల్ని మా ఇంట్లో వాళ్ళ లాగా మా సొంత మనిషిలాగా చూసుకుంటాం. మా ఆవిడను చూశాక ఒక రెండు రోజులు ఆవిడతో మాట్లాడాకా మీకే తెలుస్తుంది మేమెటువంటి వాళ్ళమో? మీరు , మీ నిబంధనల ప్రకారం మీరు చెప్పినట్టు నడుచుకోకపోతే మీకు ఒక నెల పెనాల్టీ కట్టి వెళ్ళి పోతాం సరేనా . రేపు మంచి రోజు . రేపే వచ్చే చేరిపోతాం. మీరు ఇల్లు శుభ్రం చేసి ఇవ్వక్కరలేదు. ఆ గొడవలేవో మేమే పడతాం" అని నెల రోజులుగా వెతుకుతున్నా ఒక్క ఇల్లు కూడా దొరకక పూర్తి నిరాశ నిస్పృహ తో ఉన్న రాఘవరావు ఆఖరుకు అన్నపూర్ణమ్మ పెట్టిన అన్ని నిబంధనలకు ఒప్పుకుని ఆ మర్నాడే ఆ ఇంట్లో చేరిపోయాడు.
ఇంట్లో చేరిన ఒక నెల రోజులకే అన్నపూర్ణమ్మ పెట్టాల్సిన టార్చర్ అంతా పెట్టేసింది. ఎందుకైనా మంచిదని రాఘవ రావు ఇంటావిడ తయారు చేసిన నిబంధనల తాలూకు లిస్ట్ ఒక జిరాక్స్ తీయించి పెట్టుకుని రాత్రి పడుకునే ముందు తీరిక చేసుకుని ఎప్పుడూ చదువుకునే ఆంజనేయ దండకంతో పాటు దాన్ని కూడా మొదలు నుండి చివరి కంటా ఒకటి రెండు సార్లు చదువుకుని ఎటునుండి ఏ సమస్య వస్తుందో నని భయపడుతూ సాధ్యమైనంత వరకు పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ వచ్చినా ఇంట్లో పిల్లల వల్లో, భార్య వల్లో అన్నపూర్ణమ్మ చేత మాటలు పడాల్సి వస్తూనే ఉంది.
ఆ రోజు అన్నపూర్ణమ్మ పదిహేను సంవత్సరాల వయసు గల ముద్దుల మనవడు స్కూలు నుండి ఇంటికి రాక పోవడంతో ఆ ముసలావిడకు ఆందోళనతో బీపీ పెరిగిపోయి వీధిలో కనపడిన వాళ్లందరినీ మా మనవడిని ఎవరేనా చూసారా బాబూ ? అంటూ అడగడం దానికి వాళ్ళు" అసలు మీ మనవడు ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు . ఊరికే మా దారిన మమ్మల్ని పోనియ్యక అందరినీ ఆపేసి అడిగే బదులు అలా నాలుగు వీధులు తిరిగి రారాదూ?అయినా మీ మనవడు ఎక్కడికి పోతాడు ? పదిహేను ఏళ్ళు అంటున్నావు. తాడులా పెరిగి ఉంటాడు వస్తాడులే .... " అనే వాళ్ళు తప్ప ఆవిడ ఘోష వినే వాళ్ళే లేరు. అటువంటి సమయంలో రాఘవరావు ఆవిడను అర్ధం చేసుకుని "అక్కయ్య గారు . మీరేమీ కంగారు పడకండి. మీ మంచి మనసుకు భగవంతుడు మీకు మంచే చేస్తాడు. మీ మనవడు ఎక్కడున్నా వెతికి నేను మీకు క్షేమంగా అప్పగిస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. " అంటూ భరోసా కలిపించాడు.
"ఏమిటో తమ్ముడు గారు. ఎప్పుడూ ఇలా జరగలేదు. మా అల్లుడికి తెలిసిందంటే నేను వాడిని సరిగ్గా చూసుకోవడం లేదని తిడతాడు. నాకు పొద్దున్న నుండి గుండెల్లో ఒకటే దడగా ఉంది. చీకటి పడిపోయే అంతవరకు ఎక్కడుంటాడు అంటారు ? వాడికి ఏమీ కాదుగా ...మీ నోటితో చెప్పండి .ముసలి దాన్ని నేను ఎక్కడికని వెళ్ళి వెతకగలను ? నాకు తెలిసీ నేను ఎప్పుడూ ఎవరినీ బాధ పెట్టలేదు. భగవంతుడు నాకే ఇలా ఎందుకు చేశాడో ?" అంటూ ఏడుపు లంకించుకుంది.
రాత్రి పదిన్నరకు రాఘవరావు అన్నపూర్ణమ్మ మనవడిని వెతికి పట్టుకుని రిక్షాలో ఇంటికి తీసుకు వచ్చాడు. " అక్కయ్య గారు . ముందు ఆ మంచం వాల్చండి. పిల్లాడికి రెస్ట్ కావాలి. అసలేం జరిగిందో నేను చెపుతాను. కంగారు పడి ఏడవకండి.ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకుని వస్తారు ఏమయ్యిందో నని. నిదానంగా వినండి. ఇవాళ స్కూల్లో క్లాసులు లేవని మీ మనవడు మిగిలిన కుర్రాళ్లతో పాటు కాలవలో ఈత కొట్టడానికి వెళ్ళి ప్రమాద వశాత్తు ములిగి పోయి చేతులు ఆడిస్తూ ఉంటే ఎవరో చూసి రక్షించి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి పిల్లాడికి సంబంధించిన వాళ్ళు ఎవరేనా వస్తారేమో నని చూస్తూంటే అది నా కళ్ల బడి దగ్గరే ఉన్న డాక్టర్ కు చూపించి తీసుకు వస్తున్నాను . ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. పిల్లాడు దడుచుకున్నట్టున్నాడు. రెండు రోజులు స్కూలుకు పంపకండి. ఈ రెండు రోజులు నేను వాడికి ఇంట్లో పాఠాలు చెపుతాను. .. మీరు చెప్పినట్టే మీ మంచితనమే పిల్లాడిని కాపాడింది. సాధ్య మైనంతవరకు మీరు మంచిగా ఉంటూ ఇతరుల ఇబ్బందులను , సమస్యలను మీవిగా భావించండి. ...అదే మీకు శ్రీరామ రక్ష "అంటూ రాఘవరావు అన్నపూర్ణమ్మలో మార్పు తేవడానికి ప్రయత్నం చేశాడు.
** ** **
కొన్ని సంఘటనలు ఎంత కఠినమైన హృదయాలనైనా మార్చి వేస్తాయి. ఇప్పుడు అన్నపూర్ణమ్మలో ఎంతో మార్పు వచ్చింది. చీటికీ మాటికీ అద్దెకుంటున్న వాళ్ళను ఇబ్బంది పెట్టడం మానేసింది. వాళ్ళతో ప్రేమగా మసులుకుంటూ తన పనులు కూడా కానిచ్చుకుంటోంది. ఆవిడలో మార్పు చూశాక ఆమె తోడుకోడలు రాజమ్మ కూడా అనూహ్యంగా తన పద్దతిని మార్చుకుని అందరిలో మంచి తోడికోడళ్ళుగా పేరు సంపాదించుకున్నారు .
ఆ ఇంటికి ఎవరు అద్దెకొచ్చినా ఆరునెలలు కూడా పట్టున ఉండలేని పరిస్తితులలో రాఘవ రావు ఆ తోడికోడళ్ళతో ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికి ఆరేళ్లు హాయిగా లాగించేశాడు *******
సమాప్తం