*****
*స్వర్ణకనకం*
==========
(మినీ కథ)
(నేను రాసిన ఈ మినీ కథ విశ్వభారత్ అనే దినపత్రికలో ది. 13.01.2023 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"ఏమేవ్ ! అలా స్వర్ణ వాళ్ల కూరల దుకాణం వరకూ వెళ్లి వస్తా" సంచీ తీసుకుని బయటకు వెళ్తూ చెప్పారు పరంధామం గారు.
"ఏమిటీ ? ఈ మధ్య రెండు నెలల నుంచి ఆ పేరు అలా కలవరిస్తున్నారు ? వారానికి కనీసం రెండుసార్లు అయినా ఆమె దర్శనం చేసుకుంటున్నారు?" నిష్టూరంగా అడిగింది కనకం.
"ఆ అమ్మాయి కొట్టు పెట్టుకోవడానికి ఓ యాభై వేలు ఇచ్చేననే కదా నీ కోపం ?" అడిగారు పరంధామం గారు.
"ఆమె, మీ ఊరమ్మాయి. భర్త పోవడంతో పదేళ్ల కూతురిని తీసుకుని, ఏదైనా పని కల్పించమని మన ఇంటికి రెండేళ్ల క్రితం వచ్చింది. మీరు డబ్బిచ్చి, వీలువెంబడి తీర్చమన్నారు. నా అనుమానం అది కాదు"
అసహనంగా చెప్పింది కనకం.
"మరి, ఇంకా ఏమిటి నీ అనుమానం ?" సంచీ పక్కన పెట్టి అడిగారు పరంధామం గారు.
"మీ ఇద్దరూ తరచూ ఏదో రహస్యంగా మాట్లాడుకోవడం మన పనిమనిషి చాలా సార్లు చూసిందిట. అది మీకు, ఆమెకు కూడా మంచిది కాదు. ఈ రోజు నుంచి కూరలకోసం మీరు వెళ్ళకండి. నేనే వెళ్లి తెచ్చుకుంటాను" విసురుగా చెప్పింది కనకం.
"సరే, నీ ఇష్టం" సంచీ ఆమెకు ఇస్తూ చెప్పారు పరంధామం గారు.
భర్త వైపు అనుమానంగా చూస్తూ విసురుగా బయటకు నడిచింది కనకం.
***** ***** ***** *****
తన దుకాణం వద్దకు వచ్చిన కనకాన్ని,
"ఏంటమ్మా ! కూరగాయలకి మీరొచ్చారు ? అయ్యగారికి ఒంట్లో బాలేదా ?" నీరసంగా అడిగింది స్వర్ణ.
"ఆయనకేం బాగానే ఉన్నారు. రోగ మొచ్చింది నాకే !" కూరగాయల లిస్ట్ ఇస్తూ వెటకారంగా చెప్పింది కనకం.
"తెలుసమ్మా ! అయ్యగారు చెప్పారు. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త" అంటూ సర్దిన కూరలసంచీ తన కూతురుకి ఇచ్చి,
"ఒసే లక్ష్మీ, అమ్మగారిని ఇంటిదగ్గర దిగబెట్టిరా !" అంటూ పురమాయించింది స్వర్ణ.
***** ***** ***** *****
ఇంటికి వెళ్తూ, స్వర్ణ కూతురిని
"లక్ష్మీ, మా అయ్యగారు మీ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారే ?" ఆశక్తిగా అడిగింది కనకం.
"ఏవో చాలా విషయాలు మాట్లాడుకుంటారమ్మా. కానీ చాలా సార్లు 'స్వర్ణా, నీ ఆరోగ్యం జాగ్రత్త, మందులు జాగ్రత్తగా వాడు' అని చెబుతారమ్మా !" అమాయకంగా చెప్పింది లక్ష్మి.
"మీ అమ్మ బాగానే ఉందిగా. దానికేం మాయరోగం ?" కోపంగా అడిగింది కనకం.
"మా అమ్మ ఆర్నెళ్లక్రితం ఎవరికో కిడ్నీ దానం ఇచ్చిందిటమ్మా ! అప్పటినుంచి నీరసంగా ఉంటోంది. ఇవన్నీ మొన్న మా మావయ్యతో చెబుతోంటే చాటుగా విన్నాను" చెప్పింది లక్ష్మి.
"ఔనా!..." అంటూ వడివడిగా ఇంటి వైపు నడిచింది కనకం.
***** ***** ***** *****
ఇంటికి వచ్చిన కనకం,
"ఏమండీ ! సూటిగా అడుగుతున్నా ! నాకు ఆర్నెళ్లక్రితం కిడ్నీ ఆపరేషన్ కు కిడ్నీదానం చేయడానికి మనవాళ్ళు ఎవరూ ముందుకు రాకపోతే, ఎవరో పుణ్యాత్ములు దానం చేసారన్నారు. ఆ దానంచేసింది స్వర్ణేనా ?" కూరల సంచీ అరుగు మీద పడేసి భర్తను నిలదీసింది కనకం.
"ఔను స్వర్ణే! తను అంటే నీకు కోపమని, ఈ దానం విషయం నీకు చెప్పవద్దని కోరింది. అయినా, ఇప్పుడవన్నీ ఎందుకు ? నువ్వు బాగానే ఉన్నావు కదా?" ఆశ్చర్యపోతూ అడిగారు పరంధామంగారు.
"ఇప్పుడే అంతా తెలిసిందండీ !..... నన్ను క్షమించండి. చెప్పుడు మాటలు విని మీ ఇద్దరినీ అపార్ధం చేసుకున్నాను. ఇక, నాకు ప్రాణభిక్ష పెట్టిన స్వర్ణని మన బిడ్డలా చూసుకుందామండీ !" అంటూ పరంధామం గారి కాళ్ళమీద పడింది కనకం.
"పేర్లకు తగ్గట్టుగానే మీ ఇద్దరి మనసులూ...బంగారమే!" ఆప్యాయంగా భార్యను దగ్గరకు తీసుకొని చెప్పారు పరంధామంగారు.
**** ***** ** శుభం ** ***** ****