రచయిత్రి

తపస్వీ మనోహరం • 28 May 2023 • 👁 14 views
రచయిత్రి ( మినీ హాస్య కథ )
.
రచన: జీడిగుంట నరసింహ మూర్తి
(తపస్వీ మనోహరం 28/5/2023 వార పత్రికలో ప్రచురితం )
"రచయిత్రి గాయిత్రి గారితో మాట్లాడొచ్చా ?" అడిగాడు కొత్తగా సినిమా తియ్యబోతున్న సుబ్బారావు ఆ ఇంటి దగ్గర ఆగి. .
" లేదండీ. గాయత్రి గారు ప్రస్తుతం ఇంట్లో లేరు. సిటీలోని నాగయ్య కళామందిరంలో ఆమెకు సన్మానం ఉంటే వెళ్లారు . నేను ఆమె అసిస్టెంట్ ని. రేపు ఫోన్ చేసి రండి " అంది సన్నగా నవ్వుతూ కొద్దిగా తెరిచి ఉంచిన తలుపు సందులోంచి ..
"ఎప్పుడు అడిగినా సన్మానంలో ఉన్నారు అని జవాబు వస్తోంది. చూస్తూంటే ఈవిడ కథలకు చాలా డిమాండ్ ఉండి ఉంటుంది. ఒక వేళ ఈవిడ దగ్గర కథ తీసుకుంటే ఆవిడ డిమాండ్ చేసే అంత డబ్బు తను ఇచ్చుకోగలడా ?. సరే రేపు ఒకసారి ప్రయత్నిద్దాం !" అనుకుంటూ వెను తిరిగాడు సుబ్బారావు.
"హల్లో సార్. ఒక్క నిమిషం. మీతో మాట్లాడి అలా పంపించానో లేదో ఇంతలో గాయత్రి గారినుండి ఫోన్ వచ్చింది. . సన్మానం అయిపోయిందిట. పదినిమిషాల్లో వస్తున్నారుట. మీ పనేదో పూర్తి చేసుకుని వెళ్లరాదూ ? అంది అసిస్టెంట్ తలుపు సందులోంచి ఓరగా చూస్తూ. .
సుబ్బారావుకు అర్ధమయ్యింది ఏమిటంటే సినిమా వాళ్ళ కథల డిపార్ట్మెంట్ అసోసియేషన్ మెంబర్ ట గాయత్రి. ఏ సినిమా తియ్యాలన్నా అసోసియేషన్ నుండే కథలు తీసుకోవాలి అని ఒక రూల్ ఉందిట. అదేమీ లేకపోతే తనే బోళ్ళన్ని కథలు వ్రాశాడు. వాటినే సినిమాలు తీయొచ్చు. కానీ అసోసియేషన్ అందుకు చస్తే ఒప్పుకోదు.
ఆ పదినిమిషాలు అక్కడ ఉండటం కష్టం అనిపించింది. గాయత్రి వచ్చే అంత వరకు ఆమె అసిస్టెంట్ పూర్తిగా తలుపు తెరిచి కూర్చోమనేనా అనలేదు. . అందుకే ఇప్పుడే వస్తానని చెప్పి పక్కనే ఉన్న కిళ్ళీ బడ్డీలోకి వెళ్లి సిగరెట్టు కాల్చుకుని పది నిమిషాలలో గాయత్రి ఇంటికి వచ్చాడు. లోపలినుండి అసిస్టెంట్ వచ్చి కూర్చోమంది. అప్పటికి గాయత్రి ఇంకా రాలేదు. కానీ ఇంట్లో టేబుల్ మీద చాలా కథలు ఉన్నాయి.
"సార్ . ఆవిడొచ్చినా కథల గురించి చర్చించేది ఏమీ లేదు. కథలు ఆల్రెడీ రాసినవి ఇక్కడే పెట్టి వెళ్లారు. ఒకసారి చూసుకుని ఓకే చేసేస్తే పేమెంట్ గురించి ఏదో రకంగా నేను మేనేజ్ చేస్తాను "అంది గాయత్రి అసిస్టెంట్.
చివరకు కధ , పేమెంట్ ఓకే అయ్యింది.
"పర్వాలేదే. గాయత్రి గారి పేమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను. కథ కూడా ఇంత త్వరగా ఓకే అవుతుందని అనుకోలేదు ...." అన్నాడు సుబ్బారావు పదివేల రూపాయల కట్ట ఆమె చేతిలో పెడుతూ. .
"నేనూ అనుకోలేదు. పని ఇంత సులువుగా అయిపోతుందని. " అని మనసులో అనుకుంది గాయత్రి గారి అసిస్టెంట్. అప్పుడప్పుడు రచయిత్రి గాయత్రి లేనప్పుడు ఆవిడ పేరుతో రచనలు చేసేసి డబ్బు సంపాదించే గాయత్రి డూప్ రచయిత్రి గంగోత్రి .