వెనక గది

ప్రతిలిపి, తపస్వి • 👁 9 views
వెనక గది
వెనక గది

హైదరాబాద్ శివారు ప్రాంతం
మంచుదుప్పటి కప్పుకున్నట్లు శీతాకాల వాతావరణం చల్లగా ఉంది.

“ఆదిత్య, యూనియన్ లీడర్తో మాట్లాడి నీకు క్వార్టర్ ఇప్పించే పూచీనాది.”  అన్నాడు మహేష్. పాడుపడినట్లున్న పెద్దఇంటి గేటుతాళం పగలుకొడుతూ,
ఇంటిచుట్టూ పిచ్చిమొక్కలు చెత్తతో నిండిపోయి వుoది.

మహేష్ వెనకే మౌనంగా నడిచారు ఆదిత్య, నిత్య ఆరేళ్ల కూతురు రుత్వి.

తలుపుకున్న తాళం పగలగొట్టి తలుపు తెరిచాడు మహేష్.

ఒక్కసారిగా ఇంట్లో నుంచి గబ్బిలాలు గుంపుగా బయటికివచ్చి భయంకరంగా అరుస్తూ వాళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ తలమీద కాళ్ళతో కొడుతూ వెళ్ళిపోయాయి. భయంతో కెవ్వుకెవ్వున అరిచింది నిత్య. ఆదిత్య ఠక్కున రుత్వి తలమీద చేతులు అడ్డుపెట్టాడు.

“గంగవ్వ ఇల్లంతా శుభ్రం చేసివెళ్ళు” అని చెప్పాడు మహేష్, గేటు దగ్గరే నిలబడి శూన్యంలోకి చూస్తున్న గంగవ్వను పిలిచి.

ఏం మాట్లాడకుండా తలవూపి లోపలికి వెళ్ళిపోయింది గంగవ్వ.

“సరేరా మళ్లీ కలుద్దాం” అని వెళ్లిపోయాడు మహేష్

పాప చేయిపట్టుకుని ఇద్దరు గుమ్మం లోపలికి అడుగు పెట్టారు.

ఒళ్లంతా జలధరించినట్లయి ఉలిక్కిపడ్డారు.
ఏదో శక్తి నిద్రలేచినట్లు నక్కల అరుపులు, తీతుపిట్టల శబ్దాలు బయకరంగా వినిపించాయి.

“ఆదిత్య” అంది భయంభయంగా,  అతని చేయి పట్టుకుని,

“భయపడకు అడవిప్రాంతంలో ఇవన్నీ మామూలే” అన్నాడు.

బూజుపట్టిన ఇంటిని భయంగా చూస్తున్న నిత్యను చూసి నవ్వుకున్నాడు ఆదిత్య.
‘గోడ మీద “బల్లి”ని చూసి గడగడా వణికిపోయేది నిత్య. ఇంతెత్తు మనిషివి గోడ మీద  చిన్న బల్లిని చూసి, భయపడుతున్నావా?’ అని నవ్వేవాడు.

“ఆదిత్య ఏంటి ఆలోచిస్తున్నావ్?” అంది

“నువ్వు బల్లిని చూసి భయపడి చిందులేయటం గుర్తొచ్చింది.” అన్నాడు నవ్వుతూ.

“అప్పుడంటే ఏదో చిన్నవయసు, ఇప్పుడు నాకేం భయంలేదు.” అంది పౌరుషంగా.

“అదిగో బల్లి” అన్నాడు

“ఎక్కడ?” అని కంగారుగా అతని వెనుక దాక్కుంది.” పకపక నవ్వాడు ఆదిత్య.

ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇల్లంతా శుభ్రం చేశారు గంగవ్వతో కలిసి.

‘ఒళ్లంతా స్పోటకపు మచ్చలతో ఉన్న గంగవ్వను చూస్తే భయంగా అనిపించింది, ఆదిత్యకు చెప్తే నవ్వుతాడని ఊరుకుంది.’

“రుత్వి ఎక్కడా?” అంది నిత్య

“రుత్వి” అని పిలుస్తూ ఇల్లంతా వెతికి ఎక్కడా కనపడకపోయేసరికి బయటకు పరిగెత్తారు.
‘అయ్యో ఈ చీకట్లో ఎక్కడికెళ్ళిపోయిందీ పిల్ల అసలే కొత్తప్రాంతo’ అని భయపడుతూ ఇంటి చుట్టూ వెతికారు.

“గంగవ్వ పాపను చూసావా?” అని అడిగాడు ఆదిత్య. ఏ స్పందన లేకుండా మౌనంగా తనపని తాను చేసుకుoటున్న గంగవ్వ దగ్గరకు వెళ్లి.

ఎడమ చేతిని ఎత్తి ఇంటి వెనకకు వెళ్ళే గుమ్మం వైపు చూపించింది.

అటువైపు పరిగెత్తారు. ఇంటి వెనక గోడకానుకుని మరో గదిలా ఉంది. కానీ వాళ్లకు ఆగది లోపలికి వెళ్ళటానికి తలుపు ఎక్కడా కనిపించలేదు. గది ముందు అరుగు మీద పడుకుని ఉంది రుత్వి.

పాపని ఎత్తుకుని లోపలికి వచ్చాడు ఆదిత్య.

అదురుతున్న గుండెలను అదుముకుంటూ సోఫాలో కూర్చుoది నిత్య.

“రుత్వి అక్కడ పడుకున్నావ్ ఏంటమ్మా?” అని అడిగాడు ఆదిత్య..

“నన్ను ఎవరో పిలిచారు డాడీ అందుకే అటు వెళ్ళాను.” అంది మత్తుగా.

“నిత్య, రుత్వికి స్నానం చేపించి, భోజనo పెట్టు పొద్దున్నుంచి జర్నీలో అలసిపోయి అక్కడే పడుకుంది.” అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళాడు ఆదిత్య.
3:12 నిముషాలకు ఆగిపోయివున్న గడియారం సరిచేసి గోడకు తగిలించి, మరుసటి రోజు ఆఫీస్కి కావాల్సిన ఫైల్స్ చూసుకుంటున్నాడు ఆదిత్య.

“మమ్మీ నేను అక్కడ పడుకున్నప్పుడు నాకు ఒక డ్రీమ్ వచ్చింది.” అని చెప్పింది రుత్వి అన్నం తినిపిస్తున్న నిత్యతో.

“ఏమి కల వచ్చింది”

“అందరూ నన్ను రాణి అని పిలుస్తున్నారు. ఆంటీ నాకు జోలపాట పాడింది.” అని చెప్పింది.

“నిత్య నా ఫైల్ ఎక్కడ అని పిలిచాడు.”

తినిపించడం పూర్తిచేసి నీళ్ళతో మూతితుడుస్తూ
“సరే డాడీ పిలుస్తున్నారు. పద నిన్ను కూడా నిద్రపుచ్చుతాను అని లేచింది.”

“ఊఊఊఉ….” అని ఏవో శబ్దాలు వినిపించాయి.
గోడల మీద నీడల ప్రత్యక్షమైమాయమయ్యాయి.

భయంతో ఓ క్షణం ఆగి ఆదిత్య మళ్ళీపిలవటంతో గబగబా లోపలికి వెళ్ళిపోయింది.
               ……………………..

అర్ధరాత్రి 3:12 నిముషాలు, పాప ఉలిక్కిపడి లేచి నడుచుకుంటూ వెనకగుమ్మం వైపు నడవటం మొదలుపెట్టింది.

నిత్యకు మెలకువ వచ్చి, “రుత్వి ఎక్కడికి వెళ్తున్నావ్” అని పిలిచింది గాభరాగా”

వినిపించనట్లు వెళ్ళిపోతున్న రుత్విను చూసి భయంతో ఆదిత్యను నిద్రలేపిoది.

“కొత్తఇల్లు వాష్రూమ్కి వెళ్ళాలేమో, తీసుకుని వెళ్ళు” అన్నాడు విసుగ్గా ఆదిత్య.

రుత్విని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళింది. అక్కడ తను టాప్ విప్పకుండా నీళ్లు వాటంతటవే వస్తున్నాయి.
భయంతో ‘కెవ్వున’ అరిచి పాపని ఎత్తుకుని బయటకు వచ్చేసింది నిత్య.

“నిత్య రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నీ భయంతో నా నిద్రచెడగొడుతున్నావ్” అన్నాడు చిరాగ్గా ఆదిత్య.
                ………………….

ఆఫీసుకు వెళ్తూ టైమ్ చూశాడు 3:12 కి ఆగిపోయివుంది. ‘ఈ గడియారం రోజు ఎందుకు అదే సమయానికి ఆగిపోతుంది.’ అని ఆలోచిస్తూ మళ్ళీ టైం సెట్ చేసి పెట్టి. ఆఫీస్కి వెళ్తూ
“నిత్య, రుత్వి ఎక్కడా?” అన్నాడు.

“ఎప్పుడు చూసినా వెనుక గదిగోడ దగ్గరే ఆడుతుంది.” అంది వంటగదిలో నుంచి.

“రుత్వి” అన్నాడు అక్కడికి వెళ్లి,

వినిపించుకోకుండా ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు తనకు తానే మాట్లాడుకుంటుంది .

రెండుసార్లు “రుత్వి” అని దగ్గరకు వెళ్ళి పిలిచినా పలకలేదు.

ఆమె రెండు భుజాలు పట్టుకుని కుదుపుతూ “రుత్వి” అన్నాడు గట్టిగా.

ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చి అయోమయంగా చూస్తుంది.

రుత్విను లోపలికి తీసుకురావటానికి ఎత్తుకున్నాడు.
వెనక నుంచి “ఊఊఊఉ…..” అని భయంకరమైన శబ్దాలు వినిపించాయి.

గోడదగ్గర నీడల్లా కనిపించాయి. ఒక్కక్షణం ఉలిక్కిపడినా. పాపను తీసుకుని లోపలికి వచ్చేసాడు.

“రుత్వి! అక్కడ ఏమి చేస్తున్నావు.” అని అడిగాడు.

“నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను” అంది

“ఎవరూ కనిపించలేదు” అన్నాడు.

“నువ్వొచ్చినప్పుడు వెళ్ళిపోయారు.” అంది.

“ఆదిత్య ఇక్కడ రోజు ఏవో వింత శబ్దాలు, గుసగుసలు, మూలుగులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. నీడల్లా కనిపిస్తున్నాయి నాకు భయంగా ఉంది” అంది నిత్య.

“ప్రమాదం వెళ్లిపోండి ఇక్కడి నుంచి వెళ్లిపోండి” అంది గంగవ్వ.

“నిత్యా, నువ్వు రుత్విను తీసుకుని బెడ్ రూమ్లోకి వెళ్ళు  జాగ్రత్తగా ఉండు. ఇప్పుడే వచ్చేస్తాను అని హడావిడిగా బయటికి వెళ్లిపోయాడు.” ఆదిత్య
                 …………………..

“మహేష్, అసలేం జరుగుతుందా ఇంట్లో” అన్నాడు కోపంగా ఆదిత్య.

“నాకు తెలియదు రా, ఇక్కడ ఎవరూ ఆ ఇంటి గురించి మాట్లాడరు. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉంటుంది వాడుకోవచ్చు అని మన మేనేజర్ సలహా ఇస్తే తాళం పగలగొట్టాను. అన్నాడు.

ఇంతలో నిత్య దగ్గరనుంచి కాల్ వచ్చింది.
                  …………………

హడావిడిగా ఇంటిలోపలికి వస్తూ,
“ఏమైంది?” అన్నారు పాపనెత్తుకొని కూర్చుని ఏడుస్తున్న నిత్యను చూసి ఆదిత్య, మహేష్.

“రుత్వి నేను కలిసి బెడ్రూమ్లో పడుకున్నాము. మెలకువ వచ్చి చూస్తే నా పక్కనలేదు.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునివుంది, ఎవరో తినిపిస్తునట్లు అన్నంముద్ద రుత్వి నోటిలోకి వెళ్తుంది. రుత్వి అని అరిచాను గట్టిగా. ఎవరో లాగినట్టు వెళ్లి గోడకు తగిలిపడిపోయింది. అప్పటినుంచి రుత్వి స్రృహలోలేదు” అంది ఏడుస్తూ.

“చెప్పానా? ఆలస్యం వద్దు, పక్క ఊరు వెళ్ళండి జ్ఞానంబను కలవండి.” అంది గంగవ్వ.

హఠాత్తుగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎవరో విసిరినట్లు గాల్లోకి ఎగిరి  గంగవ్వ మీదకు దాడి చేశాయి.

“నా గురించి పట్టించుకోవద్దు పాపను కాపాడండి.” అని అరిచింది గంగవ్వ.

వాళ్ళ ముగ్గురిని బయటికి తీసుకువెళ్లి తలుపు గెడపెట్టారు ఆదిత్య, మహేష్.
లోపల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి.

రీతును, గంగవ్వను హాస్పిటల్లో జాయిన్ చేసి, జ్ఞానాంబ అడ్రస్ తీసుకుని, “నిత్య!  నువ్వు ఇక్కడేఉండు” అని చెప్పి,
“మహేష్ నాతోరా” అని చెప్పి తీసుకునివెళ్ళాడు ఆదిత్య.
             ……………………

“ఈవిడ జ్ఞానాంబ, వీడికి మంత్రతంత్ర విద్యలు కూడా తెలుసు” అన్నాడు పెద్దబొట్టు ఎర్రచీర కట్టుకుని రుద్రాక్షమాల పట్టుకుని మంత్రజపం చేస్తున్న పెద్దావిడను చూపిస్తూ అక్కడ పని చేస్తున్న వ్యక్తి.

“ఎవరు బాబు”అంది కళ్ళుతెరిచి.

“మెత్తగూడెం పెద్దింటి గురించి తెలుసుకోవటానికి వచ్చాను.” అన్నారు.

ఆమె కన్నులు మూసుకుని మౌనంగా మంత్రజపంలో మునిగిపోయింది.

అమ్మా... నా రీతూకి ఆరేళ్లు. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు కోమాలో ఉంది. దయచేసి, మీరే మాకు సహాయం చేయాలి” అన్నాడు ఆదిత్య బాధగా.

“ప్రమాదం, దుష్టశక్తులు నిద్రలేచాయి.” అంది కళ్ళు మూసుకుని.

“అమ్మ! దుష్టశక్తులు ఎవరు? మా అమ్మాయికి ఏమైంది? చెప్పండి!”


“40 ఏళ్ల క్రితం కథ, ఆ ఇల్లు ఒకప్పుడు ఆనందం నిలయం. మానస ఆమె భర్త వసంత్ ఇద్దరు పిల్లలు వీణా, రాణిలతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు.

నేను,  మానస ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేసేవాళ్ళం. నాకు అతీతశక్తులు గురించి తెలుసుకోవటం ఆసక్తి,  దానికి సంబంధించిన పుస్తకాలను  సేకరించేదాన్ని. మానస అవేమీ ఉండవని తీసిపారేసేది.

కానీ ఓ రైలు ప్రమాదం ఆమె ఆలోచనలను మార్చేసిoది. 
ఓ రాత్రి, మానస కుటుంబం పండగ సెలవులకు వేములవాడ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. రాణి తాతతో కలిసి B12 భోగీలో కూర్చుంది. అర్ధరాత్రి దాటింది, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. 3:12 గంటలకు, ఎదురుగా వచ్చిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రైలును ఢీకొంది. ఆప్రమాదంలో రెండు రైళ్లు చల్లాచెదురుగా పడిపోయాయి. B12 భోగిలో ఉన్నవారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు. నుజ్జునుజ్జయిన రాణి బాడీని మానసకు చూపకుండానే పాతిపెట్టారు వసంత్.

మానస, రాణి మరణాన్ని తట్టుకోలేకపోయింది. చివరిచూపైనా దక్కలేదని ఏడుస్తూ పిచ్చిదానిలా మారింది.

“చివరిగా నా కూతురును ఒక్కసారి  చూస్తాను, నీకు ఆత్మలు గురించి తెలుసుకదా నాకు సహాయం చేయమని  నన్ను బ్రతిమిలాడింది.

నేను వాటిమీద ఆసక్తితో పుస్తకాలు చదువుతాను అంతే, నాకు ఆ విద్య తెలియదు అని నచ్చచెప్పి పంపేదాన్ని.
అయినా రోజు వచ్చి నాతో గొడవపెట్టుకునేది. ఆది మనవల్ల కాదు  రాణితో రుణానుబంధం అంతే ఆశను వదులుకో అని నేను వసంత్ ఎంత చెప్పినా వినలేదు.

ఒక రోజు మా ఇంటికి వచ్చి నా దగ్గర ఉన్న చనిపోయిన వారిని చూడటం ఎలా అనే పారానార్మల్ పుస్తకాన్ని నాకు చెప్పకుండా తీసుకునివెళ్ళింది.

చనిపోయిన కూతురు ఆత్మనైనా కలల ద్వారా చూడాలనే తపనతో, మొండిపట్టుపట్టి  భర్తను, కూతురిని ప్రయోగానికి ఒప్పించింది.
ఆ పుస్తకంలో శరీరాన్ని వదిలివెళ్లటం వరకే వుంది.  కానీ శరీరంలోకి తిరిగిరావడంలేదు.
కూతుర్ని చూడాలనే ఆరాటంలో క్షుణ్ణంగా తెలుసుకోకుండానే, శరీరాన్ని విడిచివెళ్లే మంత్రాలు మాత్రం బాగా వంటపట్టించుకుని, ఆమె భర్త, కూతురితో కలిసి గంగవ్వ సహాయంతో ఇంటివెనక స్టోర్రూమ్‌లో పూజ ప్రారంభిoచి మంత్రాలు చదవటం మొదలుపెట్టారు. ఆత్మల శరీరాన్ని విడిచి వెళ్ళాయి. వెనక్కి రావడం అసాధ్యమై అక్కడే చిక్కుకుపోయాయి. వాళ్ళలో చలనం లేకపోవడంతో, గంగవ్వ భయంతో బయటకు పరుగెత్తి పోలీసులకు చెప్పింది.

పోలీసులు శరీరాలను బంధువులకు అప్పగించారు. మంత్రశక్తితో వెనక గది తలుపుమూసి గోడకట్టేశారు.” పూజగదిలో పుస్తకాన్ని చూసిన క్షణమే, మానస చేసిన ఘోరమైన పొరపాటు నాకు స్పష్టంగా అర్థమయిoది.
ఒకరకంగా వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారనే చెప్పొచ్చు” అంది.

“ఇప్పుడు ఏమి చేయాలి” అన్నాడు మహేష్.

“మీ అమ్మాయి రుత్వి, రాణీ ఒకే వయసు, ఒకటే నక్షత్రం యాదృచకమే అయినా, వాళ్ల ఆత్మలు రీతును రాణిగా భావిస్తూ... ఆమెను తమలో కలుపుకోవాలని చూస్తున్నాయి.” అంది అక్కడ వెలిగించిన దీపం రెపరెపలాడింది.

“రుత్విను రక్షించుకోవటం ఎలా? అన్నాడు కంగారుగా ఆదిత్య.          
                ……………….

జ్ఞానాంబ సూచనతో, శాంతి హోమo ఏర్పాటు చేశారు.  పాప పక్కనే సృహలేకుండా ఉంది.
వేదమంత్రాలు గదంతా మార్మోగుతున్నాయి.  గోడల నీడల్లో ఉన్న మానస, వసంత్, వాణి ఆత్మలు హోమం మంటకు, మంత్రాలకు ప్రత్యక్షమయ్యాయ్యి, ఆపకుండా గట్టిగా చదువుతూనే వున్నారు. మoత్రాలహోరుకు తట్టుకోలేక తాము వెళ్లిపోయే సమయం ఆసన్నమైందని వాటికి అర్థమయింది. ఇంతలో రుత్విలో చలనం వచ్చింది నెమ్మదిగా కళ్ళుతెరిచి ‘అమ్మా’ అంది.

రాణిలా కనిపంచిన రీతు ‘అమ్మా’ అన్న పిలుపుకు కళ్ళనిండా తృప్తిగా చూసుకుంటూ,  మూడు ఆత్మలు మబ్బులా మారి అనంతవాయువులో కలిసిపోయాయి.    

గడియారం ముళ్ళు 3:13 కు కదిలింది.  

      …………సమాప్తం……………
                             ✍️ అంజనీ దేవి శనగల