"నీడ వెనుక నిజం!''(కథ)
(జులై - 2026 "రవళి" అంతర్జాల మాసపత్రికలో ప్రచురితం)
మనసంతా కుటుంబసమస్యలతో చికాకుగా, అల్లకల్లోలంగా ఉంది.
''మనసు బాగుండనపుడు ఏదైనా ఆధ్యాత్మిక ప్రసంగం ఏకాగ్రతగా విను నాయనా...'' అని అమ్మ చెప్పినమాటలు చెవుల్లో మార్మోగసాగాయి.
బల్లమీద కరపత్రం మరోసారి చదివి టౌన్ -హాల్ వైపు నడిచాను.
''శ్రీ శారదాంబాపీఠం శిష్యురాలు , ఆధ్యాత్మిక ప్రవచనకర్త '' సాధనామాత '' వారి ఆధ్యాత్మిక ప్రసంగం సాయంత్రం 7గంటలకు ప్రారంభం . అభిరుచిగలవారందరికీ ఇదేమా సాదర ఆహ్వానం''
గేటుముందుకట్టబడిన బేనర్ చదివి లోపలికి అడుగుపెట్టాను. ఏ హడావుడి లేకపోవడం చూసి నిర్లిప్తంగా లోపలకు అడుగుపెట్టాను.
విచిత్రంగా హాలు హాలంతా ప్రశాంతంగా ఉంది. దాదాపు అన్నికుర్చీలు నిండిపోయాయి. ముందుకు వెళ్లి మూడవవరుసలో చివరి కుర్చీ ఖాళీగా ఉంటే అందులో స్థిరపడ్డాను. పీఠంకార్యకర్తలు కుంకుమవర్ణం దుస్తులలో ప్రతీ రెండువరుసలకు అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి పర్యవేక్షిస్తున్నారు.
కుర్చీలలో కూర్చున్నవారు అప్పటికే కళ్ళుమూసుకుని ధ్యాననిమగ్నులై ఉన్నారు. నేను మనసు ప్రశాంతతకోసం కళ్ళు మూసుకున్నాను.
''మాత వేంచేస్తున్నారు. అందరూ నిశ్శబ్దం పాటించమని మనవి. పాటించలేనివాళ్ళు వెంటనే సభనువిడిచి వెళ్లిపోవచ్చు.'' అన్న మాటలు వినిపించిన అనంతరం తెరతొలగింది. ఒక నలుగురైదుగురు సెల్ఫోన్స్ చేతుల్తో పట్టుకుని వేగంగా బయటికి వెళ్లిపోయారు.
అప్పటికే మాత 'సభావేదిక' మీద ఆసీనులై ఉన్నారు.
ప్రశాంతంగా పాలపుంత నక్షత్రాలలా మెరిసిపోతున్న ఆమె కళ్ళు తేజోవంతమైన స్పటికకాంతిని విరజిమ్ముతున్నాయి.
సభాప్రాంగణాన్ని కనుచూపుమేర పరిశీలించిన ఆమె మధురమైన స్వరంతో శ్లోకం ఇలా పాడారు. ఆతరువాత ఆమె ప్రసంగం చాలా లోతుగా కలతచెందిన హృదయాలకు నవనీతామృతపు పూతను పూస్తున్నట్టుగా కొనసాగింది.
"అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా।
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః॥".
ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే "అజ్ఞానం అనే చీకటితో గుడ్డివారికి, జ్ఞానం అనే కాటుకను పూసే సన్నటి పుల్లతో కళ్ళు తెరిపించిన గురువుకు నమస్కారం. ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించిన ఆ శారదామాతకు నా హృదయపూర్వక ప్రణామములు.
జ్ఞానం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఆత్మవిశ్వాసం మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అత్యంత విలువైన గుణం. మనలోని సామర్థ్యాలపై నమ్మకం పెరిగినప్పుడు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అపజయాలకు భయపడడు, వాటిని విజయానికి దారి చూపే పాఠాలుగా భావిస్తాడు. ఈ గుణం మన ఆలోచనలను నిర్మాణాత్మకంగా మార్చి, క్రమశిక్షణ, పట్టుదల వంటి లక్షణాలను పెంపొందిస్తుంది.
కాబట్టి ఆత్మవిశ్వాసం జీవితం మొత్తం ముందుకు నడిపే పునాది. మన విజయానికి ఇది తొలి అడుగు....''
ఇలా అరగంట కొనసాగిన ఆమె ప్రసంగం మనసుపెట్టి ఏకాగ్రతతో వినడంతో తన్మయత్వంలో ములిగిపోయాననే చెప్పాలి.
కార్యకర్తలు వరుసలలో కూర్చున్నవారికి ప్రసాదంగా పటికబెల్లం, కుంకుమ సాచెట్లు ఇవ్వడం ప్రారంభించి నాకూ ఇచ్చారు.
ఇంతలో వెనుకనుంచి ఎవరో నాభుజం తట్టారు.
ఎవరా అని అటుతిరిగి చూసాను. ఆయనకూడా శ్రీ శారదాంబాపీఠం కార్యకర్తే.
''స్వామీ . నాతో ఒకసారి బయటకు వస్తారా?'' అన్నారు. ఎందుకో అర్ధంకాని నేను ఆయనను అనుసరించాను.
హాలు దాటి బయటకు వచ్చాక ఆయన తన కండువా చాటునుంచి ఒక కవరు నా చేతిలో పెడుతూ... ''మీపేరు శ్రీరామ్...కదా'' అన్నాడు. అవునని తల ఊపాను.
''ఇందాకా ఎవరో స్త్రీమూర్తి మీకు ఈ కవరు అందించడానికి వచ్చారు. ఇలాంటివి ఇక్కడ కుదరదు అని చెప్పాను.''అయితే కార్యక్రమం అయిపోయాకా ఆయనకు ఇవ్వండి.'' అని పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయారు. ప్రసాదం తీసుకున్నారుగా..ఓం శ్రీ శారదామాతాయైనమః'' అనేసి వెళ్ళిపోయారు.
ఈ ప్రాంగణానికి వచ్చి, నాకు కవరు ఇమ్మని చెప్పి వెళ్ళిపోయింది ఎవరబ్బా ?
అని మనసులో అనుకున్న నేను ఇంటికి క్షేమంగా చేరుకుని, బట్టలు మార్చుకుని, కాళ్లుచేతులు కడుక్కుని 'శారదామాత'కు నమస్కరించుకుని కవరు చింపాను.
మడతలు విప్పిన కాగితాలపై ముత్యాలు పేర్చినట్టుగా పరుచుకున్న అక్షరాలవెంట నాకళ్ళు పరుగెత్తడం ప్రారంభించాయి.
''నువు ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తావని నాకు తెలుసుబావా. గుర్తున్నానా? దసరా నవరాత్రులలో నువ్వు దీక్షలో ఉండగా 'అమ్మ నన్ను దిక్కులేనిదానిగాచేసి వెళ్లిపోయింది బావా...ఒక్కర్తినీ బ్రతకాలంటే భయంగా ఉంది' అని ఏడుస్తూ ఫోన్ చేసాను. 'రాలేని స్థితిలో ఉన్నాను. బ్రతకగలను అనే ఆత్మవిశ్వాసం పెంచుకుని బ్రతుకు. హు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నదానివి. నాలుగో మగవాడిని చేసుకుని వాడి బ్రతుకుకూడా బండలుచేయకు.నీమీద నీకు కనీసనమ్మకం ఉంటే 'లోకానికి అమ్మ'లా బతికి చూపించు. సాధన ఉంటే సాధించలేనిది లేదు. మనిషిగా పుట్టినందుకు ఇప్పటినుంచైనా జన్మసార్ధకం చేసుకునే ప్రయత్నం చేయి. నువ్వు చేయగలవు. చేయలేకపోతే ఎలా బ్రతకాలనుకున్నావో అలా బ్రతికేయ్ .'' అని నిర్మొహమాటంగా చెప్పి ఫోన్ పెట్టేసావు.
నీ దృష్టిలో నేనొక ఒళ్ళు తిమ్మిరిదానినికదూ . ఒక్కసారి నా జీవితాన్ని నీదగ్గర చర్వితచరణం చేసుకుంటాను బావా.ప్లీజ్!
మా అమ్మకున్న అయిదుగురు ఆడపడుచులకు ఏకైక తమ్ముడు మానాన్న. అతిగారాబంచేసి అప్రయోజకుడిగా పెరిగిన మానాన్నకి మీనాన్నగారు పోస్టల్ లో చిన్నఉద్యోగం వేయించారు. ఆ ఉద్యోగం ఉందికదాని మా అమ్మనిచ్చి పెళ్ళిచేసాడు మాతాత. నేను పుట్టిన వెంటనే నాన్నకి పోస్ట్-మాన్ ప్రమోషన్ వచ్చిందని కాలుకిందపెట్టకుండా పెంచారు నన్ను. అయితే అమ్మ ఆడపడుచులందరి తొమ్మిదిమంది మగపిల్లలందరిలో అమ్మకి నువ్వంటే ఎంతో ఇష్టం.అందరిలోనూ చాలాబాగా చదువుతావని, ఆటల్లోనూ,పాటల్లోనూ మొదటిస్థానంపొందేతంట హుషారుగా చలాకీగా ఉంటావని నాకు జ్ఞానంవచ్చినప్పటినుంచి నీగురించే నూరిపోసింది. ఎంతగా అంటే,,, నీ ప్రతీ పుట్టినరోజున వైశాఖబహుళచతుర్ధినాడు నాన్నతో పోట్లాడి మీఇంటికి తీసుకువచ్చేదాన్ని ...గుర్తుందా..
నీ అందం, చదువు, సంగీతం, సాహిత్యం, నాటకాల్లో నీ నటన, ముఖ్యంగా పెద్దలపట్ల నీవినయం,విధేయత, నీ గౌరవం ... ఇవన్ని నిన్ను నా మనసులో కైలాసశిఖరంమీద నిలబెట్టాయి. నా మనోబృందావనంలో నువ్వే నా కృష్ణుడివి. ఉద్యోగరీత్యా ఉమ్మడికుటుంబంనుంచి బయటకువచ్చేసాక అమ్మకున్న సినిమాపిచ్చి, అమ్మమీద నాన్నకున్న నమ్మకంతోకూడిన అతిప్రేమ ...నామీద చూపించిన గారాబం ఇవన్నీ నాకు చదువు అబ్బకుండా చేసాయి. వయసుపెరుగుతున్నకొద్దీ నీమీద ప్రేమ,నామనసులో మంచినీళ్ళచెరువులో గుర్రపుడెక్కలా పెరిగిపోయింది.అందుకే నీ ప్రతీపుట్టినరోజుకి నడివేసవికాలంలో క్రమంతప్పకుండా ప్రయాణం పెట్టించేసేదాన్ని.
అమ్మ, నాన్న నాకు పెళ్ళిచేసి,అల్లుడిని ఇల్లరికం తెచ్చుకునే సంబంధాలు చూసి, ఏడవతరగతి వరకు చదివిన నాకు పౌరోహిత్యం కుర్రాడికి ఇచ్చి పెళ్ళిచేశారు. నిన్ను పెళ్ళిచేసుకోవడానికి ఏ విధమైన అర్హత లేని నేను ఎదురుచెప్పలేక తలవంచాను. అయితే వాడు సంసారానికి పనికిరాడు అని మొదటిరాత్రి తెలిసాకా అమ్మ నన్ను కొంతకాలం వేచి చూడమంది. కానీవాడు తన అసమర్ధతని కప్పిపుచ్చుకోవడంకోసం తాగివచ్చి నన్ను కొట్టేవాడు. అమ్మ , నాన్న విడాకులు ఇప్పించేశారు. అయితే నాబతుకు అలా అయిపోయిందని నాన్న మనోవేదనతో మరణించాడు. అమ్మకి నేను, నాకు అమ్మ అయిపోయాం. నాన్న పెన్షన్ తో గుట్టుగా ఓగదిలో బ్రతకడం మొదలుపెట్టాము. ఎం.ఆర్.ఓ.ఆఫీసులో పనిచేసే పెద్దత్తకొడుకు శంకరంబావ అపుడపుడు రాత్రిపూట మా ఇంటికి వచ్చి ఉండిపోయేవాడు. ఒకరాత్రి నేను నిద్రలోఉండగా నన్ను లోబరుచుకున్నాడు. నేను ఏడవబోతే వెయ్యిరూపాయలు నాచేతుల్లోపెట్టాడు. నేను వచ్చినప్పుడల్లా నాకు కావలసింది ఇచ్చి, నీకు కావలసింది తీసుకో అన్నాడు.అపుడే బ్రతకడానికి ఒక మార్గం తెలిసింది.
''ఇప్పుడైనా చదువుమీద దృష్టి పెట్టి నేర్చుకో ''అని అమ్మ నన్ను కంప్యూటర్ కోర్సులో చేర్పించింది. అక్కడచేరిన నెలరోజులతర్వాత మన కులంకానివాడు ఒకనాడు ''నిన్ను ప్రేమిస్తున్నాను. నా భార్య చనిపోయింది.నిన్నుపోషించుకునే డబ్బు నాకు ఉంది కానీ ఉద్యోగం లేదు. నిన్ను మహారాణిలా చూసుకుంటాను.'' అన్నాడు. అమ్మతో చెప్పాను. అమ్మ అతనితో మాట్లాడింది. అతను మాదగ్గరకు వచ్చిఉండే పక్షంలో అయితేనే వివాహం చేస్తానని ఒప్పుకుంది. అతను సరే అన్నాడు. అతనితో పెళ్లి అయింది. ఒకనెల నమ్మకంగా ప్రవర్తించాడు.నేను గర్భవతిని అయ్యాను .
ఇవన్ని తెలిసి శంకరంబావ రావడం మానేసాడు. ఫోన్ చేసి 'ఎలా ఉన్నావే?' అని మాత్రం అపుడపుడు అడిగేవాడు.
అమ్మ 'ఇంటికి మగదిక్కు నువ్వే... మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నాయనా...'అని పెన్షన్ డబ్బులు నామొగుడు చేతిలో పెట్టింది. అంతే...వాడిచేతిలో ఇద్దరం చిక్కుకుపోయామని గ్రహించడానికి ఎంతోసమయం పట్టలేదు. అమ్మని డబ్బుతెమ్మని కొట్టడం, తాగేసి వచ్చి నాకు రాత్రి నరకం చూపించడం...ఈ నరకం తప్పించమని భగవంతుని ప్రార్ధించని క్షణం లేదు.నాకు బాబు పుట్టాడు. వాడికి మూడోనెల వచ్చింది.
ఏ దేవుడు మామొరవిన్నాడో తెలీదు...వాడు వాళ్ళఊరు వెళ్తూ ఘోరమైన బైక్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు.
ఇది తట్టుకోలేకపోయిన అమ్మకి పక్షవాతం వచ్చేసింది. ఇంటి ఓనర్ నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేసేయమన్నాడు. కాళ్ళమీదపడి బతిమాలితే తనని నేను ఎవరికీ తెలియకుండా ఉంచుకోవాలి అని షరతు పెట్టాడు. శంకరంబావ అడిగితే ఓనర్ నన్ను పెళ్ళిచేసుకున్నాడు అని అబద్ధం చెప్పాను. సరిగ్గా మరో రెండునెలల్లో దసరాల్లో అమ్మ చనిపోయింది.
దాంతో ఇంటిఓనర్ నన్ను ఇంట్లోంచి గెంటేసాడు.
దిక్కులేనినేను బాబుతో ఆకలికి తట్టుకోలేక అడుక్కుంటూ ఒక కాన్వెంట్ కు వెళ్లాను. నా జాలికధవిని దేవుడిలా ఆయజమాని నాకు ఆయాగా ఉద్యోగం ఇచ్చారు.
ఈలోకంలో మగవాళ్ళందరూ ఒకేలా ఉండరు అని అపుడే అర్ధమైంది.
ప్రస్తుతసమాజంలో ఆడైనా, మగైనా మనిషిగా బ్రతకాలంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలో కొన్ని వందల సాక్ష్యాలు చూపిస్తూ పెంచిన నా కొడుకుకు 10సంవత్సరాలు దాటగానే 'మనధర్మం పాటిస్తూ వేదం నేర్చుకో నాయనా...అని నచ్చచెప్పి వేదపాఠశాలలో చేర్పించేసాను. 16 సంవత్సరాలువచ్చాకా నీజీవితం ఎలామలుచుకుంటావో నీఇష్టం.బహుశా నీకు ఇక ఈ అమ్మ కనిపించకపోవచ్చు.''అని చెప్పేసాను.
ఒకసారి నువు శంకరంబావకు ఫోన్ చేసి నేను ఎలా ఉన్నానని , వీలయితే నా ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగావట...ఫోన్లో నీస్వరం విని మళ్ళీ ప్రాణంపోసుకున్నాను.. పిల్లవాడి చదువుకి నువ్వు అపుడపుడు డబ్బులు పంపిస్తే, వాడి చదువు పూర్తయ్యాకా తీసుకునేలా ఆడబ్బు పిల్లవాడిపేరున బ్యాంక్లో వేసి బుక్ వాడికే అప్పగించేసాను.
నేను ఏ మగవాడిజీవితం బండలు చేయలేదు బావా...నా జీవితం మీజాతిమగవాళ్ళే ఛిద్రం చేసేసారు. నిన్ను అనుక్షణం తలుచుకుంటూ ఆత్మస్థయిర్యంతో నిలబడ్డాను. శారదాపీఠం మాతఆశ్రయం పొంది 'నేను కూడా మీలా ప్రవచించే స్థాయికి ఎదిగిలేలా శిక్షించండి '' అని ప్రార్ధించాను.
నన్ను మనస్ఫూర్తిగా విశ్వసించిన మాత పరిపూర్ణ సహకారంతో ఆధ్యాత్మిక సాధన చేసాను. ఆమె సమాధి చెందిన అనంతరం జీవాత్మను ఆపరమాత్మతో మమేకంచేసి 'ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక అమ్మగా' బ్రతుకుతున్నాను బావా. ఇప్పటికైనా అర్ధమయ్యానా బావా నేనుఎవరో!''
'అర్ధమైంది సాధనా! నిన్ను బాధించిన మా మగవాళ్లందరినీ,... నాతో సహా క్షమించమ్మా సాధనా.'
నా హృదయపులోతుల్లో ఆమె ''నీడవెనుక నిజం '' కెరటాలుగా ప్రారంభమై...ఉరుకుతూ ...పెల్లుబుకుతూ!
సమాప్తం