"పరగడుపు " (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(జూన్ 23-29 ఉషా అంతర్జాల వార పత్రికలో నా కథ )
ఎన్నో హోటళ్లలో అల్పాహారం, భోజనం తిన్న రామ్మూర్తికి ఒక్క సారి కూడా సంతృప్తిని కలిగించలేదు. ఏ హోటల్లోనూ ఎవరూ సరిగ్గా ప్రమాణాలు పాటించడం లేదని ఎన్నో సార్లు గొంతు చించుకుని కనపడిన ప్రతి వాళ్ళ దగ్గరా ధ్వజం ఎత్తేవాడు. . కుడితి లాంటి సాంబారుతో ఐసు గడ్డల లాంటి ఇడ్లీలు తినలేక ఊళ్ళో ఏవైనా కొత్త హోటళ్ళు వెలిసాయేమో అని అన్వేషణ మొదలు పెట్టాడు.
రెండు మూడు కొత్త హోటళ్ళు అతని దృష్టికి వచ్చి మొదట్లో గొప్పగా తోరణాలు కట్టి ఆరంభం చేసినా భోజనం విషయం కొచ్చేసరికి చాలా హోటళ్ళలో లాగానే ఎప్పుడు చూసినా గోరు చిక్కుడు కాయ కూరే. ఎప్పుడో ఒకసారి క్యారెట్ ఉండేది. “కూరల మార్కెట్లో ఆ రోజు ఏది రేటు తక్కువుంటుందో అదే ఆ పూట హోటల్లో ప్రత్యక్షం అవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఏ హోటల్ వాడైనా ఎప్పుడైనా బంగాళా దుంపల ఉల్లి కారం, ఆనపకాయ టమోటా వేసి చేసిన కూర , ఉల్లి పాయ పులుసు , పెసర పప్పు పచ్చడి ఇవి చేసి విస్తరిలో వెరైటీగా వడ్డిస్తే వాళ్ళ సొమ్మేమేనా పోతుందా ? అంతమాత్రానికే హోటళ్లు దివాళా తీస్తాయా ? అసలు ఈ పదార్ధాలు కావాలని అడిగే వాడేనా లేకపోయి ఉండాలి . లేదా ఆ హోటళ్లలో వంట వండే వాళ్ళకు వంటల మీద కనీస అవగాహన అయినా లేకపోయి ఉండాలి. అంటే గొడవ పెట్టుకుంటారు కానీ విపరీతంగా డబ్బు మూలుగుతోందని ఏ అనుభవం లేకపోయినా చాలామంది హోటల్ వ్యాపారంలోకి దిగిపోతూ ఉంటారు” అనుకుంటూ ఎన్నోసార్లు తన స్వగతంలో అనుకునే వాడు రామ్మూర్తి.
చాలా సార్లు అతన్ని ఇంకో అనుమానం కూడా వేధించుకు తింటూ ఉండేది. హోటళ్లలో ఆకుకూర పప్పు తిన్నప్పుడల్లా అసలు ఆ ఆకు కూరలు ఒక్కసారైనా కడుగుతున్నారా ? అని. . అధవా కడిగినా అవే నీళ్ళల్లో మళ్ళీ మళ్ళీ కడుగుతారు తప్ప నీళ్ళు మార్చడం అంటూ ఉండదు.” సార్ మీరు వీడియోల్లో చూడటం లేదా ? మురికి కాలవల్లో కూడా కడిగేస్తూ ఉంటారు. సిటీలో నీళ్ళ సమస్య ఎక్కువ కదండీ. తిన్న కంచాలు సరిగ్గా కడిగితే అదే గొప్ప “ అని ఒక హోటల్లో కొన్నాళ్ళు పని చేసి బయటకు వచ్చిన రామ్మూర్తికి తెలిసిన ఒక సర్వర్ చెపుతూ ఉంటే అతనికి గుండాగినంత పనయ్యింది.
రామ్మూర్తి ఒక రోజు ఇద్దరు ముగ్గురు మిత్రులతో కొత్తగా ప్రారంభించిన హోటల్కు వెళ్ళాడు.
“ సార్! మీరు మార్కెటింగ్లో పని చేశానని చెపుతున్నారు కదా. అప్పుడప్పుడు మీ సలహాలు మాకు కావాలి. ..” అన్నాడు హోటల్ యజమాని నవ్వుని పులుముకుని.
“ డానిదేముంది కానీ మా సలహాలు ఎవరు పాటిస్తారు ఈ రోజుల్లో . అయితే నాదో ముఖ్యమైన సలహా ఏమిటంటే చాలా మంది హోటళ్ల మీద కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కానీ సర్వర్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఏ ఒక్క సర్వర్ కు కూడా సరైన డ్రస్ ఉండడు. ఎప్పుడూ మడ్డి కట్టిపోయి ఉంటున్నారు. . వాళ్ళకు సరైన జీతాలు , వేళకి టిఫిన్ ఇస్తూ ఉంటే ఎంతో నమ్మకంగా పనిచేస్తారు. నేను చెప్పిన మొదటి సలహాను మీరు దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తే బయట నుండి వచ్చే కస్టమర్లకు మీ హోటల్ మీద మంచి ఇంప్రెషన్ పెరుగుతుంది. జనాలు పెరుగుతారు ..” అన్నాడు రామ్మూర్తి అక్కడే తచ్చాడుతున్న ఒకళ్ళిద్దరు సర్వర్లను చూసి. . అయితే రామ్మూర్తి సలహా ప్రొప్రయిటర్ విన్నాడో లేదో కానీ అయిష్టంగా మొహం పెట్టి క్యాష్ చూసుకునే పనిలో పడ్డాడు.
హోటళ్ల గురించి ఇంతగా నోరు పారేసుకుంటే వాళ్ళ ఉసురు తగిలినా తగలొచ్చు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం నయం అన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే వాళ్ళకు తెలియదు. రేట్లు చూస్తూంటే స్టార్ హోటళ్లకు మించి పోయి ఉంటున్నాయి. కొన్ని హోటళ్ళలో కాఫీ ఒకటే ఆర్డర్ ఇస్తే సర్వర్లు ఆ కష్టమర్ మొహం కూడా చూడరు. ఎంతో ఖర్చు పెట్టి తినే వాడికి బాధ ఉండదా ? అడిగే హక్కు లేదా ?
వాళ్ళ ఉసురు తగిలితే తగలనీ . మన అన్వేషణ ఆగకూడదు. ఇది రామ్మూర్తి నినాదం.
చాలా కాలం క్రితం రామ్మూర్తి వేరే ఊళ్ళో ఉన్నప్పుడు సందు సందులో భోజనం మెస్ లు ఉండేవి . అరిటాకు వేసి కంది పొడి, గోంగూర పచ్చడి , చల్ల పులుసో, ముక్కల పులుసో లేకుండా భోజనం ఉండేది కాదు. రోజుకు ఒక వెరైటీ చేసే వాళ్ళు. రెగ్యులర్ గా కూపన్లు తీసుకుని భోజనం చేసే వాళ్ళు రేపు భోజనం లో ఏ వెరైటీ, మెనూ ఉంటుందో అని కలలు కంటూ ఉండే వాళ్ళు. ఇప్పుడు అన్నీ కలలు గా మిగిలి పోయాయి. అటువంటి మెస్ లు మచ్చుకు ఒక్కటి కూడా కనపడటం లేదు. తిండికి సంబంధించిన ఆలోచనలతో రామ్మూర్తి బుర్ర వేడెక్కిపోయేది.
రామ్మూర్తి ఉంటున్న ఊరికి కొత్తగా ఎన్నారై ఎమ్మెల్లేగా గెలిచినప్పుడు ఒక రోజు ఆయన దర్శనం చేసుకుని ఆ ఊళ్ళో హోటళ్ల పరిస్థితి గురించి వివరంగా చెప్పి ఒకటో రెండో మంచి హోటళ్లు తీసుకు రమ్మని వేడుకున్నాడు . ఆయన గారు అదేదో సాధ్యం కాని కోరిక అడుగుతున్నట్టు మొహం పెట్టాడు.
మరోసారి రామ్మూర్తి తన అన్నదమ్ములతో ఆ ఊళ్ళో మారు మూలన ఉన్న హోటల్ కు వెళ్ళి నప్పుడు అక్కడ దృశ్యాలు చూసినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. ఆ హోటల్లో రోడ్డు మీద ఆడుక్కునే వాళ్ళను కూడా తీసుకొచ్చి ప్లేట్లు , ఆకులు తీయించడం , వడ్డన కు కూడా వాళ్ళను ఉపయోగించుకుంటూ ఉండటం చూశాక విస్తరిలోనే డోక్కునే పరిస్థితి వచ్చింది. కొన్ని హోటళ్లు వర్కర్స్ కు జీతాలు తప్పించుకోవడానికి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నట్టు ఎవరో చెపితే మొదట తను నమ్మ లేదు. ఆ రోజు ప్రత్యక్షంగా చూశాక ఒక రకంగా జీవితం మీద విరక్తి పుట్టింది.
ఆ రోజు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో ఒకాయన చచ్చిపోయాదని అన్ని హోటళ్లు మూసేశారు. . అసలే ఒక పక్క భార్య పురిటికని వాళ్ళ ఊరు వెళ్ళడం , ఈ లోపు ఎప్పుడూ రామ్మూర్తి ఇంట్లో అడుగుబెట్టని ఒక చుట్టం సడన్ గా ఇంటికి రావడంతో రామ్మూర్తి బిక్క మొహం వేయాల్సి వచ్చింది. . భార్య తన కెప్పుడూ వంట నేర్పలేదు. అయితే తనకు రుచులను ఆస్వాదించడం మాత్రం బాగా తెలుసు. తనే ఊళ్ళ మీద పడి తింటూ ఉంటే ఈ చుట్టం అడ్డంగా తగిలాడు. . ఇక ఆ రోజు హోటళ్ల కోసం వెతుకుతూ ఉంటే రోడ్డు మీద ముష్టి వాళ్ళతో పని చేయించుకుంటున్న నాంచారయ్య హోటలే దిక్కు అయ్యింది. వెనక వైపు నుండి తలుపులు తెరిచి ఉంచడంతో గుండె దిటవు చేసుకుని లోపలకు జొరపడ్డారు . అవును మరి క్షుద్భాధ అటువంటిది.
భోజనం అయ్యాక రామ్మూర్తి చుట్టం అన్నాడు “ ఈ హోటల్లో భోజనం బహు బేషుగ్గా ఉంది. ఈ మాత్రం హోటళ్ళు మా ఊళ్ళో లేనే లేవు “ అంటూ బ్రేవుమని తేన్చాడు.
అవును కొత్త ఒక వింత అన్నట్టు ఎప్పుడో ఒకసారి ఆవురావురు మని ఆకలి మీద ఆ హోటల్ లోకి వెళ్తే ఎవరికైనా అమృతాన్ని సేవించినట్టే ఉంటుంది మరి. ఆ చుట్టం అటునుండే అటు బస్సు ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు.
రామ్మూర్తికి మటుకు కడుపులో కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్ లో సిమెంట్, రాళ్ళు వేసి తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటే ఎలాగో అలా బలవంతాన నిలదొక్కుకుని ఇంటికొచ్చి పడ్డాడు.
“హతవిధీ! భార్యలు పుట్టింటి కెళ్ళి నప్పుడు వంట రాని మగవాళ్లకు ఇంతటి ఘోరమైన శిక్ష అనుభవించక తప్పదా ?” అసలు మగ వాళ్ళందరూ మంచో చెడో ప్రతి వాడూ చేతులు కాల్చుకోవాలి. కనీసం అన్నమైనా వండుకో గలిగితే ఏ పచ్చళ్ళో వేసుకుని తినేయొచ్చు. పూర్తిగా హోటళ్ల మీద ఆధారపడే దుస్థితి తప్పుతుంది. ..” అనుకున్నాడు . .
ఇంతలో భార్య పుట్టింటినుంచి ఫోను. తల్లికి, పుట్టిన పిల్లాడికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో రావడం మరో నెలరోజులు పడుతుందని దాని సారాంశం.
ఎప్పటికప్పుడు ఈ హోటళ్ళ చుట్టూ తిరగడం ఎలా తప్పుతుందిరా బాబూ అనుకునే రామ్మూర్తికి చచ్చినట్టు మరో నెలరోజుల పాటు హోటళ్ళ మొహం చూడకుండా కుదరలేదు. పైపెచ్చు అవే ఇప్పుడు తనున్న స్థితిలో కడుపు చూసి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ తల్లిలా అనిపించాయి **
సమాప్తం